Skip to main content

ఇంటర్‌తోనే టీచర్‌గా స్థిరపడే సదావకాశం.. డీఈఈసెట్ 2020 నోటిఫికేషన్ విడుదల.. చివరి తేది ఇదే..

ఇంటర్మీడియెట్ తర్వాత ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకునేవారికి చక్కటి మార్గం.. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (డీఈఈసెట్-2020).
 ఈ పరీక్షలో అర్హత సాధిస్తే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డి.ఇఎల్.ఇడి.), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డి.పి.ఎస్.ఇ.) కోర్సుల్లో చేరొచ్చు. వీటిని పూర్తి చేయడం ద్వారా ప్రాథమిక పాఠశాలల్లో విద్యా బోధన రంగంలో ప్రవేశించొచ్చు. ప్రభుత్వ పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్‌జీటీ) పోస్టులకు పోటీ పడొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో డీఈఈసెట్- 2020.. పరీక్ష విధానం, అర్హతలు, ప్రిపరేషన్ గెడైన్స్ గురించి తెలుసుకుందాం..

పరీక్ష విధానం..
డీఈఈసెట్‌ను ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నపత్రంలో పార్ట్-1, పార్ట్-2, పార్ట్-3 అనే మూడు విభాగాలు ఉంటాయి. పార్ట్- 1లో 10 మార్కులకు, పార్ట్- 2లో 30 మార్కులకు, పార్ట్-3లో 60 ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు ఎంచుకున్నదాన్ని బట్టి ప్రశ్నపత్రం తెలుగు/ఉర్దూ/తమిళం / ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది.

పార్ట్-1
ఈ విభాగంలో జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ ఆప్టిట్యూడ్ నుంచి 10 మార్కులకు 10 ప్రశ్నలు ఇస్తారు.

పార్ట్-2
ఈ విభాగంలో తెలుగు మీడియం విద్యార్థులకు జనరల్ ఇంగ్లిష్ నుంచి 10 ప్రశ్నలు, జనరల్ తెలుగు నుంచి 20 ప్రశ్నలు ఇస్తారు. ఇంగ్లిష్ మీడియం అరుుతే జనరల్ ఇంగ్లిష్ నుంచి 20 ప్రశ్నలు, జనరల్ తెలుగు/ఉర్దూ నుంచి 10 ప్రశ్నలు ఉంటారుు. ఉర్దూ మీడియం వారికి జనరల్ ఇంగ్లిష్ నుంచి 10 ప్రశ్నలు, జనరల్ ఉర్దూ నుంచి 20 ప్రశ్నలు ఇస్తారు.

పార్ట్-3
ఈ విభాగంలో మ్యాథమెటిక్స్ నుంచి 20, ఫిజికల్ సెన్సైస్ నుంచి 10, బయలాజికల్ సెన్సైస్ నుంచి 10, సోషల్ స్టడీస్ నుంచి 20 చొప్పున ప్రశ్నలు ఇస్తారు.

అర్హతలు..
  • కనీసం 50 శాతం(ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు 45 శాతం) మార్కులతో ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత. ఈ కోర్సుల చివరి సంవత్సరం విద్యార్థులూ పరీక్ష రాయొచ్చు. ప్రవేశాల నాటికి ఉత్తీర్ణత సాధించాలి.
  • వయసు: 2020 సెప్టెంబర్ 1 నాటికి 17 ఏళ్లు నిండాలి. గరిష్ట వయోపరిమితి లేదు.
ప్రిపరేషన్..
  • టీచింగ్ ఆప్టిట్యూడ్‌లో ఉపాధ్యాయ వృత్తి, తరగతి గది నిర్వహణ, పాఠశాల వాతావరణం, బోధన సామర్థ్యం తదితర అంశాల నుంచి ప్రశ్నలుంటాయి.
  • జీకే అండ్ కరెంట్ అఫైర్స్‌లో భాగంగా క్రీడలు, అవార్డులు, రాజకీయ పరిణామాలు, ఆర్థిక, రక్షణ, భౌగోళిక పరమైన అంశాలపై ప్రశ్నలుంటాయి. మార్కెట్లో లభించే ఏదైనా ఒక ప్రామాణిక పుస్తకం చదివితే సరిపోతుంది.
  • ఇంగ్లిష్‌కు సంబంధించి ఆర్టికల్స్, ప్రిపొజిషన్‌‌స, పార్‌‌ట్స ఆఫ్ స్పీచ్, టెన్సెస్; సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్సెస్; డెరైక్ట్-ఇన్‌డెరైక్డ్ స్పీచ్ తదితర అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి.
  • తెలుగులో సంధులు, ఛందస్సు, సమాసాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, రచయితలు-రచనలు తదితర అంశాలపై దృష్టిసారించాలి.
  • మ్యాథమెటిక్స్, ఫిజికల్ సెన్సైస్, బయలాజికల్ సెన్సైస్, సోషల్ స్టడీస్‌లలో పదో తరగతి స్థాయి అంశాలను చదవాలి.
  • పాత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేయాలి. ఏయే అంశాలకు వెయిటేజీ ఎక్కువగా ఉందో గమనించాలి.
  • పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నందున వీలైనన్ని ఎక్కువ మాక్ టెస్టులను ప్రాక్టీస్ చేయాలి.
సీట్ల కేటాయింపు..
  • రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్ (డిస్ట్రిక్ట్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్)లు, ప్రైవేటు అన్‌ఎయిడెడ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్(మైనారిటీ, నాన్ మైనారిటీలతో సహా)లు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డి.ఇఎల్.ఇడి.), డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్(డి.పి.ఎస్.ఇ.)కోర్సులను అందిస్తున్నాయి.
  • వీటిలో ఎక్కడ చేరాలన్నా డీఈఈ సెట్ రాయాల్సిందే.
  • డీఈఈసెట్‌లో అర్హత పొందాలంటే.. పరీక్షలో కనీసం 35శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీస మార్కుల నిబంధన లేదు.
  • పరీక్షలో ర్యాంకు సాధించిన అభ్యర్థులకు రిజర్వేషన్లు అనుసరించి కౌన్సెలింగ్ ద్వారా సీట్లు కేటాయిస్తారు.
  • పభుత్వ డైట్ కళాశాలల్లో వంద శాతం, ప్రైవేటు అన్‌ఎయిడెడ్ నాన్ మైనారిటీ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్, ప్రైవేటు అన్‌ఎయిడెడ్ మైనారిటీ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో 80 శాతం సీట్లు కన్వీనర్ కోటాలో కేటగిరీ ‘ఎ’ కింద భర్తీ చేస్తారు. 20 శాతం సీట్లను కేటగిరీ ‘బి’లో ఆయా విద్యాసంస్థలే భర్తీ చేస్తాయి.
  • మొత్తం సీట్లలో 85 శాతం సీట్లు స్థానికులకు కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం సీట్లకు అందరూ పోటీపడవచ్చు.
ముఖ్యమైన సమాచారం..
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఫీజు చెల్లింపునకు, దరఖాస్తులకు చివరి తేది: 2020 జూన్ 05
  • డీఈఈసెట్ తేది: తర్వాత ప్రకటిస్తారు.
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://deecet.cdse.telangana.gov.in
Published date : 28 May 2020 01:01PM

Photo Stories