Skip to main content

ఈ ప్రభుత్వ స్కూళ్లలో నామమాత్రపు ఫీజుతో.. నాణ్యమైన చదువుకు అవకాశం!

చిన్న నాటి నుంచే.. పిల్లలకు యాక్టివిటీ బేస్డ్‌ లెర్నింగ్‌.. మూస ధోరణి చదువులకు భిన్నంగా వినూత్న బోధన.. నామ మాత్రపు ఫీజులతోనే..నాణ్యమైన చదువులు.. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలకు కేరాఫ్‌..

కేంద్రీయ విద్యాలయాలు (కేవీలు)!! వీటిలో ప్రవేశం పొందితే.. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు నిశ్చింతగా చదువుకోవచ్చు. తాజాగా 2021–22 విద్యా సంవత్సరానికి కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో.. కేవీల ప్రత్యేకతలు, ప్రవేశ విధానాలపై ప్రత్యేక కథనం..

కేంద్రీయ విద్యాలయాలు.. దాదాపు ఆరు దశాబ్దాల క్రితం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఏర్పాటైన విద్యా సంస్థలు. అప్పటి నుంచి మారుతున్న విద్యా విధానాలకు అనుగుణంగా బోధనలోనూ మార్పులు తీసుకొస్తూ.. వైవిధ్యతకు కేరాఫ్‌గా నిలుస్తున్నాయి కేవీలు. అందుకే.. తల్లిదండ్రులు వీటిల్లో తమ పిల్లలకు ప్రవేశం లభించాలని కోరుకుంటారు.

తొలుత రక్షణ శాఖ ఉద్యోగుల పిల్లల కోసం..
కేంద్రీయ విద్యాలయాలను తొలుత దేశంలోని వివిధ ప్రాంతాల్లో దేశ భద్రత విధులు నిర్వహిస్తున్న రక్షణ శాఖ ఉద్యోగుల పిల్లల చదువుల కోసం ఏర్పాటు చేశారు. మొదట వీటిని సెంట్రల్‌ స్కూల్స్‌గా పిలిచేవారు. ఆ తర్వాత వీటినే కేంద్రీయ విద్యాలయాలుగా పేరు మార్చారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉన్న వీటిని పర్యవేక్షించేందుకు కేంద్రీకృత విధానాన్ని అమలు చేస్తున్నారు. కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ అనే పేరుతో ప్రత్యేక పర్యవేక్షణ సంస్థను సైతం నెలకొల్పారు.

అందరికీ అందుబాటులోకి..
తొలుత దేశ రక్షణ, భద్రత దళాల ఉద్యోగుల పిల్లల చదువుల కోసం ఏర్పాటు చేసిన కేవీలు.. ఇప్పుడు అన్ని వర్గాల వారికీ ప్రవేశం కల్పించే విధంగా విధానాలు అమలు చేస్తున్నారు. దీనికి సంబం ధించి పలు ప్రాథామ్యాల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నారు.

అయిదు కేటగిరీలుగా..
కేంద్రీయ విద్యాలయాల్లోకి విద్యార్థులను ఎంపిక చేసే క్రమంలో.. ప్రస్తుతం ప్రాధాన్యత క్రమంలో అయిదు కేటగిరీలుగా పేర్కొని.. దానికి అనుగుణంగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. అవి..

  • బదిలీౖయెన, బదిలీకాని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ పిల్లలు.
  • కేంద్ర ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి సంస్థలు, పబ్లిక్‌ సెక్టార్‌ అండర్‌ టేకింగ్స్, ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌ ఆఫ్‌ ది ఇండియన్‌ గవర్న్‌మెంట్‌కు సంబంధించి బదిలీౖయెన, బదిలీకాని ఉద్యోగుల పిల్లలు.
  • బదిలీౖయెన, బదిలీకాని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు.
  • రాష్ట్ర ప్రభుత్వ స్వయంప్రతిపత్తి సంస్థలు, పబ్లిక్‌ సెక్టార్‌ అండర్‌ టేకింగ్స్, రాష్ట్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌కు సంబంధించి బదిలీౖయెన,బదిలీకాని ఉద్యోగుల పిల్లలు. ్ఠఠీ పై కేటగిరీలకు చెందని ఇతర వర్గాల పిల్లలు.

ఎంపికలో ప్రాధాన్యం.. ఇలా

  • తల్లిదండ్రులకు ఒకే ఆడపిల్లగా ఉన్న విద్యార్థినికి, రాష్ట్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌లు/సీబీఎస్‌ఈలతోపాటు జాతీయ/రాష్ట్రస్థాయి క్రీడల్లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
  • స్పెషల్‌ ఆర్ట్స్‌లో రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో గుర్తింపు పొందిన విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు ప్రాధాన్యం ఉంటుంది.

ఆన్‌లైన్‌ విధానంలో ఎంపిక..
ఒకటో తరగతిలో ప్రవేశాలకు ఎంపిక ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్‌ పోర్టల్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా గరిష్టంగా మూడు కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా లాటరీ విధానంలో విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ లాటరీ విధానంలో సైతం ప్రాధాన్యతల వారీ విధానాలను అనుసరిస్తున్నారు. రెండో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు.. ఆఫ్‌లైన్‌ విధానంలో ప్రవేశ ప్రక్రియ జరుగుతుంది. సంబంధిత విద్యాలయాల్లో వీరు దరఖాస్తు చేసుకోవాలి.

వయో పరిమితి..
కేవీల్లో మార్చి 31వ తేదీని కటాఫ్‌ తేదీగా నిర్దేశించి.. ఆ తేదీ నాటికి విద్యార్థులకు వారు ప్రవేశం కోరుకుంటున్న తరగతుల వారీగా ఉండాల్సిన కనిష్ట, గరిష్ట వయో పరిమితులను నిర్దేశించారు.

  • ఒకటో తరగతి: 5–7ఏళ్లు
  • రెండో తరగతి: 6–8ఏళ్లు
  • మూడో తరగతి: 7–9ఏళ్లు
  • నాలుగో తరగతి: 8–10ఏళ్లు
  • ఐదోతరగతి: 9–11ఏళ్లు
  • ఆరోతరగతి: 10–12ఏళ్లు
  • ఏడో తరగతి: 11–13ఏళ్లు
  • ఎనిమిదో తరగతి: 12–14ఏళ్లు
  • తొమ్మిదో తరగతి: 13–15ఏళ్లు
  • పదోతరగతి: 14–16ఏళ్లు
  • పీడబ్ల్యూడీ విద్యార్థులకు రెండేళ్ల వయోసడలింపు ఉంటుంది.

రిజర్వేషన్‌:

  • ఎస్సీలకు 15 శాతం సీట్లు
  • ఎస్టీలకు 7.5 శాతం సీట్లు
  • పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 3 శాతం సీట్లు కేటాయిస్తారు.

తొమ్మిదో తరగతికి.. ప్రవేశ పరీక్ష
రెండో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఎలాంటి ప్రవేశ పరీక్షలు లేకుండా.. విద్యార్థుల మెరిట్, అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నారు. తొమ్మిదో తరగతిలో ప్రవే శానికి మాత్రం అడ్మిషన్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్నారు. మూడు గంటల వ్యవధిలో వంద మార్కులకు జరిగే ఈ అడ్మిషన్‌ టెస్ట్‌లో హిందీ,ఇంగ్లిష్,మ్యాథ్స్, సోషల్‌సైన్స్, సైన్స్‌ సబ్జెక్ట్‌ల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 33శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఆ తర్వాత సంబంధిత కేంద్రీయ విద్యాలయ అధికారులు.. మెరిట్‌ జాబితా రూపొందించి, కేటగిరీల వారీగా ప్రాధాన్యత క్రమంలో ప్రవేశాలు కల్పిస్తారు.

ఒత్తిడి లేని విద్య..
పిల్లలను బడికి పంపించడం అనేది తల్లిదండ్రులకు పెద్ద సవాలు అనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఒకటో తరగతి పిల్లల విషయంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు ఉత్సాహంగా స్కూల్‌కు వెళ్లే విధంగా కేవీల్లో విద్యా విధానం అమలవుతోంది. ముఖ్యంగా కొత్తగా చేరే పిల్లలు స్కూల్‌ వాతావరణానికి అలవాటుపడేలా చేసేందుకు ఆరు వారాల వ్యవధితో ‘స్కూల్‌ రెడీనెస్‌ ప్రోగ్రామ్‌’ను రూపొందించాయి. ఈ ప్రోగ్రామ్‌ పూర్తయిన తర్వాత టీచర్లు విద్యార్థుల్లో కింది దృక్పథాల్లో ఆశించిన ఫలితాలు వచ్చాయా లేదా అనే విషయాలను పరీక్షిస్తారు. అవి..

  • పరిసరాలను అర్థం చేసుకోవడం
  • ఆత్మవిశ్వాసం
  • పరిశీలన
  • పరస్పర సంబంధాలు
  • వర్గీకరణ
  • ప్యాట్రన్‌లను అర్థంచేసుకొని, అనుకరించగలగడం
  • భావవ్యక్తీకరణ
  • అవగాహన∙క్రియేటివ్‌ స్కిల్స్‌. దీంతోపాటు ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ఐదు పాయింట్ల సూచీని పాటిస్తున్నారు.

నామ మాత్రపు ఫీజులు..
వినూత్న పద్ధతిలో బోధన విధానాలు అమలుచేస్తున్న కేవీలు.. నామ మాత్రపు ఫీజులను వసూలు చేస్తున్నాయి. అడ్మిషన్‌ ఫీజు రూ.25, విద్యాలయ వికాస నిధి (రూ.500), ట్యూషన్‌ ఫీజు వంటివి ఉంటాయి. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు అన్ని ఫీజులు కలిపి నెలకు రూ.500–600, ఆరు నుంచి పదోతరగతి విద్యార్థులకు రూ.1000లోపు అవుతుంది. బాలికలు, ఎస్సీ, ఎస్టీలకు, కేవీ ఉద్యోగుల పిల్లలకు ట్యూషన్‌ ఫీజు మినహాయింపు ఉంటుంది.

కేవీ 2021–22 ప్రవేశాలు– ముఖ్యసమాచారం..

  • ఒకటో తరగతికి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ తేదీలు: ఏప్రిల్‌ 1, 2021–ఏప్రిల్‌ 19, 2021.
  • ఒకటో తరగతికి ఎంపికైన విద్యార్థుల మొదటి జాబితా వెల్లడి: ఏప్రిల్‌ 23, 2021.
  • ఒకటో తరగతికి ఎంపికైన విద్యార్థుల రెండో జాబితా వెల్లడి: ఏప్రిల్‌ 30, 2021.
  • ఒకటో తరగతికి ఎంపికైన విద్యార్థుల మూడో జాబితా వెల్లడి : మే 5, 2021
  • లెఫ్ట్‌ ఓవర్‌ సీట్లకు సంబంధించి ఎంపిక జాబితా: మే 3 నుంచి మే 5 వరకు
  • ఆఫ్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ విధానంలో 2వ తరగతి నుంచి(ఇంటర్‌ ఫస్టియర్‌ మినహా): ఏప్రిల్‌ 8–ఏప్రిల్‌ 15, 2021.
  • 2వ తరగతి నుంచి జాబితా వెల్లడి: ఏప్రిల్‌ 19, 2021.
  • 2వ తరగతి నుంచి ప్రవేశాల తేదీలు: ఏప్రిల్‌ 20–ఏప్రిల్‌ 27
  • పదకొండో తరగతి మినహా అన్ని తరగతులకు ప్రవేశాలకు చివరి తేదీ: మే 31, 2021
  • ఇంటర్‌ ప్రథమ సంవత్సరం రిజిస్ట్రేషన్‌: ఇప్పటికే కేవీల్లో చదువుతున్న విద్యార్థులు ఫలితాలు వచ్చిన పదిరోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. వీరికి పదోతరగతి ఫలితాలు వచ్చిన ఇరవై రోజుల్లోగా ఎంపిక జాబితా విడుదల చేస్తారు.
  • కేవీ విద్యార్థులు కాని వారు సీబీఎస్‌ఈ ఫలితాలు వచ్చిన 30 రోజుల్లోగా ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ను ఖరారు చేసుకోవాలి.
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://kvsangathan.nic.in/academic/admission-guidelinesxw
  • ఒకటో తరగతి ఆన్‌లైన్‌ దరఖాస్తు వెబ్‌సైట్‌: https://kvsonlineadmission.kvs.gov.in/index.html
Published date : 15 Apr 2021 05:45PM

Photo Stories