ఈ ఏడాది జూలై 3న జేఈఈ-అడ్వాన్స్‌డ్-2021.. నిబంధనల్లో మినహాయింపులివే..
ఐఐటీల్లో అడుగుపెట్టి.. కోర్సు పూర్తి చేసుకుని.. కార్పొరేట్ కొలువులు దక్కించుకోవాలని కోరుకునే విద్యార్థులు లక్షల్లోనే! ఇందుకోసం ఎంతో శ్రమకోర్చి.. ఇంటర్ మొదటి సంవత్సరం నుంచే కృషి చేస్తుంటారు. ఇలాంటి వారంతా తమ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయాల్సిన తరుణం ఆసన్నమైంది. కారణం.. జేఈఈ-అడ్వాన్స్‌డ్-2021 పరీక్ష తేదీని ప్రకటించడమే! కేంద్ర విద్యాశాఖ ఈ ఏడాది జూలై 3వ తేదీన.. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష జరుగనుందని ప్రకటించింది. అర్హత నిబంధనల విషయంలో గత ఏడాది మాదిరిగానే పలు మినహాయింపులూ ఇచ్చారు. ఈ నేపథ్యంలో.. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2021 విధి విధానాలు, పరీక్ష తీరుతెన్నులు, మినహాయింపులు, పరీక్షకు సన్నద్ధత తదితర అంశాలపై విశ్లేషణ..
దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి మార్గం.. జేఈఈ-అడ్వాన్స్‌డ్. కరోనా కారణంగా జేఈఈ-అడ్వాన్స్‌డ్-2021 విషయంలో నెలకొన్న సందేహాలను నివృత్తి చేస్తూ.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ఇటీవల జేఈఈ అడ్వాన్స్‌డ్ తేదీని వెల్లడించారు. అధికారిక ప్రకటన ప్రకారం-జేఈఈ-అడ్వాన్స్‌డ్ జూలై 3న జరగనుంది.
నిబంధనల్లో మినహాయింపులు..
జేఈఈ-అడ్వాన్స్‌డ్-2021 విషయంలో విద్యార్థులకు ఉపశమనం కలిగించే విషయం.. అర్హత నిబంధనల్లో మార్పులు చేయడం. ముఖ్యంగా ఇంటర్మీడియెట్‌లో 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలనే నిబంధనను ఈ ఏడాది కూడా తొలగించారు. గత సంవత్సరం కూడా ఈ నిబంధనను తొలగించి.. ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధించిన వారంతా అడ్వాన్స్‌డ్‌కు అర్హులే అని పేర్కొన్న విషయం తెలిసిందే. వాస్తవానికి జేఈఈ-అడ్వాన్స్‌డ్‌కు హాజరు కావాలంటే.. జేఈఈ-మెయిన్‌లో ఉత్తీర్ణతతోపాటు ఇంటర్మీడియెట్ తత్సమాన బోర్డ్ పరీక్షల్లో 75 శాతం మార్కులు సాధించాలి. కరోనా మహమ్మారి నేపథ్యంలో అడ్వాన్స్‌డ్-2020లో 75 శాతం మార్కుల నిబంధన తొలగించారు. ఈ ఏడాది కూడా ఇదే విధంగా మినహాయింపు కల్పించారు.
ఇంకా చదవండి: part 2: 2020లో జేఈఈ-మెయిన్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు సైతం ఈ ఏడు అర్హులే..