Skip to main content

ఎనీటైం చదువుకు.. e-విద్యా వేదికలు

టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా విద్యా విధానాన్ని సమూలంగా మార్చేస్తోంది. ఇంటర్నెట్.. ఈ-లెర్నింగ్ అనే అద్భుతాన్ని నేటితరం ముందు ఆవిష్కరిస్తోంది. ఫలితంగా శరవేగంగా అత్యాధునిక డిజిటల్ క్లాస్‌రూమ్‌ల వైపు అడుగులుపడుతున్నాయి.
పాఠశాల విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్య, వైద్య విద్య, పోటీ పరీక్షలు.. ఇలా ప్రతి విభాగానికి సంబంధించిన సమాచారం చిటికెలో లభిస్తుండటంతో అందరూ ఆన్‌లైన్ చదువుల వైపు ఆకర్షితులవుతున్నారు. తదనుగుణంగానే నాణ్యమైన, కచ్చితమైన సమాచారం
అందించేందుకు అనేక ఎడ్యుకేషన్ పోర్టల్స్ పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని కొన్ని ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్స్ గురించి తెలుసుకుందాం..

ఎన్‌పీటీఈఎల్ (NPTEL) :
ఇంజనీరింగ్, సైన్స్, హ్యుమాని టీస్‌కు సంబంధించిన విషయాలను ఆన్‌లైన్ ద్వారా నేర్చుకునేందుకు ఉపయోగపడే పోర్టల్.
వెబ్‌సైట్: www.nptel.ac.in

వర్చువల్ ల్యాబ్స్ (Virtual Labs) :
సైన్స్, ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించిన అంశాలను ప్రాక్టికల్‌గా (కాలేజీ ల్యాబ్‌లో చేసే ప్రయోగాలు ఆన్‌లైన్‌లో చేయవచ్చు) నేర్చుకోవడానికి ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది.
వెబ్‌సైట్: www.vlab.co.in

టాక్ టు టీచర్ (Talk to Teacher) :
ఈ పోర్టల్‌ను హెచ్‌ఆర్‌డీ నేతృత్వంలో ఐఐటీ-బాంబే నడిపిస్తోంది. సాంకేతిక, ఉన్నత విద్యకు సంబంధించిన ముఖ్య అంశాలను ఈ పోర్టల్ ద్వారా నేర్చుకోవచ్చు. తరగతి గదిలో టీచర్ బోధిస్తుంటే కలిగే అనుభూతిని కలిగిస్తుంది.
వెబ్‌సైట్: www.aview.in

స్పోకెన్ ట్యుటోరియల్ (Spoken Tutorial) :
ఆన్‌లైన్ ద్వారా సాఫ్ట్‌వేర్ కోర్సులు నేర్చుకోవడానికి ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది.
వెబ్‌సైట్: www.spoken-tutorial.org

ఇ-యంత్ర (E-Yantra) :
రోబోటిక్స్ గురించి సమగ్ర అధ్యయనం కోసం ఈ పోర్టల్ బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులు, అధ్యాపకులు రోబోటిక్స్ గురించి అనేక కొత్త విషయాలను నేర్చుకోవచ్చు.
వెబ్‌సైట్: www.e-yantra.org

డిజిటల్ లైబ్రరీ ఇన్‌ఫ్లిబ్‌నెట్ (Digital Library Inflibnet) :
యూజీసీ-ఇన్ఫోనెట్ ప్రోగ్రామ్‌లో భాగంగా దీన్ని ప్రవేశపెట్టారు. ఇందులో యూనివర్సిటీ, కాలేజీ లైబ్రరీలకు అవసరమైన అన్ని విభాగాలకు సంబంధించిన జర్నల్స్ ఉంటాయి. యూజీసీ ద్వారా యాక్సెస్ పొందిన వర్సిటీలు, కాలేజీలు ఈ డిజిటల్ లైబ్రరీలోని జర్నల్స్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు.
వెబ్‌సైట్: www.inflibnet.ac.in


ఫోస్సీ (Fossee) :
Free and Open Source Software in Education (FOSSEE).. విద్యలో నాణ్యతను పెంచడం, సాఫ్ట్‌వేర్ టూల్స్ కోసం ఇతరులపై ఆధారపడకుండా చేయడం దీని ప్రధాన ఉద్దేశం. కొత్తగా వచ్చిన, పాత సాఫ్ట్‌వేర్ టూల్స్‌ను అకడమిక్, రీసెర్చ్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పరచిన అంశాలు ఈ పోర్టల్‌లో లభ్యమవుతాయి.
వెబ్‌సైట్: www.fossee.in

పెడగాజీ ప్రాజెక్ట్ (Pedagogy Project) :
బోధనా పద్ధతులు (టీచింగ్ మెథడ్స్), బోధనా నైపుణ్యాల (టీచింగ్ స్కిల్స్) పరిశోధనలకు సంబంధించి అధ్యాపకులు, నిపుణుల అభిప్రాయాలు, వారు అనుకరించిన పద్ధతులు, అనుభవాలు రివ్యూల రూపంలో ఈ పోర్టల్‌లో లభ్యమవుతాయి.
వెబ్‌సైట్: www.ide.iitkgp.ernet.in

ఎస్‌వోఎస్ టూల్స్ (SOS Tools) :
ఇంజనీరింగ్, సైన్స్, సోషల్ సైన్స్, మేనేజ్‌మెంట్ విభాగాలకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ టూల్స్, ఓపెన్ సోర్స్ టూల్స్, సిమ్యులేషన్ టూల్స్ ఈ పోర్టల్ ద్వారా పొందొచ్చు. వీటిలో కొన్ని చాలా ఖరీదైనవిగా, ఏడాదికి ఒకసారి రెన్యువల్ చేయించుకునేవిగా ఉంటాయి.
వెబ్‌సైట్: www.sos-tools.org

స్వయం (SWAYAM) :
స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ యాస్పైరింగ్ మైండ్స్ (స్వయం) అనే సమాచార, సాంకేతిక వేదికను యూజీసీ ఏర్పాటు చేసింది. ఇందులో తొమ్మిదో తరగతి నుంచి పీజీ వరకు రెండువేల ‘మూక్స్’ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో వీడియో లెక్చర్స్, రీడింగ్ మెటీరియల్, సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌లు, క్విజ్‌లు, సందేహ నివృత్తికి ‘చర్చలు’ అందుబాటులో ఉంటాయి.
వెబ్‌సైట్: www.swayam.gov.in

ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ఉపయోగాలు...
  • నైపుణ్యాలు పెంచుకోవచ్చు.
  • అవసరమైన అంశాలను తేలిగ్గా నేర్చుకోవచ్చు.
  • సమయం ఆదా చేసుకోవచ్చు. ఒత్తిడి తగ్గించుకోవచ్చు.
  • నాణ్యమైన మెటీరియల్ పొందొచ్చు.
  • ఎప్పుడైనా, ఎక్కడినుంచైనా నేర్చుకోవచ్చు.
  • ఇంటరాక్షన్‌కు అవకాశం.
  • ఉద్యోగులకు మరింత అనుకూలత.
  • ఆర్థిక భారం తగ్గుతుంది.
  • శిక్షణ కేంద్రాల చుట్టూ తిరగనవసరం లేదు.
Published date : 14 Dec 2017 05:36PM

Photo Stories