Skip to main content

ఎడ్యుకేషన్ లోన్స్ కావాలంటే...తెలియాలి రూల్స్ !

సరస్వతీ కటాక్షం లభించినా.. లక్ష్మీ కటాక్షం లేక ఎంతో మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కావాల్సిన పరిస్థితి. నూతన విద్యాసంవత్సరం ప్రారంభమైంది. ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏ వంటి ఉన్నత విద్య కోర్సుల్లో చేరాలంటే.. ఫీజు లక్షల్లోనే! ఉత్తమ విద్యాసంస్థల్లో చేరితేనే విద్యార్థుల భవిష్యత్ కెరీర్ ఆశాజనకంగా ఉంటుంది. అందుకోసం శాయశక్తులా శ్రమించి ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించినా.. సదరు కాలేజీల్లో ఫీజులు సామాన్యులకు ఆర్థిక భారంగా పరిణమిస్తున్నాయి. భారీ ఫీజులను చెల్లించే స్థోమత లేని విద్యార్థులు ఎడ్యుకేషన్ లోన్ కోసం బ్యాంకులను ఆశ్రయించే అవకాశముంది. బ్యాంకులు అకడమిక్ ప్రతిభతోపాటు, సరైన పూచీకత్తు ఉంటే విద్యారుణాలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యారుణాలు పొందడమెలాగో తెలుసుకుందాం...
అర్హతలు..
  • విద్యారుణాల జారీలో బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్లు వేర్వేరు నిబంధనలు అనుసరిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థి చేరబోయే విద్యాసంస్థ గుర్తింపు, లభిస్తున్న విద్య నాణ్యత, అందిస్తున్న కోర్సులు, ప్లేస్‌మెంట్స్ మొదలైన అనేక పరిమితులు ఆధారంగా బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఏఐసీటీఈ, యూజీసీ, ఎంహెచ్‌ఆర్‌డీ, న్యాక్ గుర్తింపు ఉన్న కళాశాలు, కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు రుణాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత లభిస్తుంది. పలు బ్యాంకులు కొన్ని విద్యాసంస్థలతో ముందుగానే ఒప్పందం చేసుకుంటున్నాయి. అలాంటి విద్యాసంస్థలో చేరిన విద్యార్థులకు రుణాల మంజూరు కొంత సులువు అవుతుందని చెప్పొచ్చు.
  • రుణం కోరుకునే విద్యార్థులు ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు లేదా కోర్సులో ప్రవేశానికి నిర్వహించే ఎంట్రెన్స్ టెస్ట్‌లో మెరిట్ ఆధారంగా అడ్మిషన్ పొందాలనే నిబంధనలను పలు బ్యాంకులు అనుసరిస్తున్నాయి.
  • దేశంలోని ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు గరిష్టంగా రూ.15 లక్షల వరకు రుణం మంజూరు చేస్తున్నారు. ఐఐఎంలు, ఐఐటీలు, ఇతర ప్రముఖ విద్యాసంస్థల్లో చేరే విద్యార్థులకు కోర్సును బట్టి ఎక్కువ మొత్తంలో రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయి. ఆయా సంస్థల్లో చేరే విద్యార్థులకు మంచి వేతనాలతో ప్లేస్‌మెంట్స్ వచ్చే అవకాశం ఉండడం వల్ల తిరిగి చెల్లించే సామర్థ్యం ఎక్కువనే అభిప్రాయమే ఇందుకు కారణం.

పూచీకత్తు తప్పనిసరి !
  • ప్రస్తుత నిబంధనల ప్రకారం రూ.4 లక్షల వరకు రుణ మంజూరుకు ఎలాంటి హామీ అవసరం లేదు. కానీ, చాలావరకు బ్యాంకులు రీపేమెంట్ సామర్థ్యాన్ని అంచనా వేస్తూ తల్లిదండ్రుల హామీ, లేదా థర్ట్ పర్సన్ పూచీకత్తు కోరుతున్నాయి. అలాగే రూ.4 లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు రుణం కోరే విద్యార్థులు థర్డ్‌పార్టీ గ్యారెంటీతో రుణాలు పొందొచ్చు. అంతకంటే ఎక్కువ రుణం ఆశించే విద్యార్థులు.. తమ ఆస్తులను పూచీకత్తు కింద పెట్టాలి.
  • అలాగే విద్యార్థి అకడమిక్ ప్రతిభకు కూడా బ్యాంకులు మార్కులు వేస్తున్నాయి. విద్యార్థి ముందునుంచీ మంచి అకడమిక్ రికార్డు కలిగి ఉండాలని కోరుకుంటున్నాయి. అప్పటివరకు చదివిన క్లాస్‌లలో పొందిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. కనీసం 60 శాతం మార్కులు ఉంటేనే వారి దరఖాస్తుల పరిశీలనకు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. రుణం ఇచ్చాక కూడా విద్యార్థుల అకడమిక్ రికార్డును మదింపు చేస్తున్నాయి. సెమిస్టర్, వార్షిక పరీక్షల్లో విద్యార్థులు సరైన ప్రతిభ కనబరిస్తేనే తదుపరి విద్యాసంవత్సరానికి రుణ చెల్లింపు కొనసాగిస్తున్నాయి. లేకపోతే రుణాలు విడుదల చేసే విషయంలో పునరాలోచనలో పడుతున్నాయి.

అప్రమత్తంగా...
విద్యార్థులు లోన్ పొందే క్రమంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆయా బ్యాంకుల వడ్డీ రేట్లు, వడ్డీ రేటు విధానం (ఫిక్స్‌డ్, ఫ్లోటింగ్), రీపేమెంట్ నిబంధనలు, ఇస్తున్న పత్రాలు, ఈఎంఐ విధివిధానాలు మొదలైన వివరాలన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సమాచారాన్ని అన్ని బ్యాంకులు తమ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచుతాయి. అదేవిధంగా ట్యూషన్ ఫీజుతోపాటు నివాస వ్యయం, రవాణా ఖర్చులు, పుస్తకాల ఖర్చు, ల్యాప్‌టాప్ వ్యయం, లేబొరేటరీ పరికరాల ఖర్చులకు కూడా రుణాలు ఇస్తాయి. కాబట్టి విద్యార్థి తమ అవసరాల దృష్ట్యా వీటికి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఫీజు నేరుగా కాలేజీకే...
ఎడ్యుకేషన్ రుణం మంజూరయ్యాక.. అది నేరుగా సదరు విద్యార్థి చేరిన విద్యాసంస్థకే అందుతుంది. విద్యార్థి చేతికి ఇవ్వరు. దశల వారీగా ఉన్న పేమెంట్లు కూడా నిర్దిష్ట సమయంలో కాలేజీ ఖాతాల్లో జమ చేస్తాయి. అందుకోసం విద్యార్థులు సదరు పేమెంట్ కొటేషన్లను ఎప్పటికప్పుడు బ్యాంకుకు అందించాలి. ఇక విద్యార్థులకు కాస్త ఊరటనిచ్చే అంశాల్లో ముఖ్యమైనవి.. రీపేమెంట్ విధానం. విద్యార్థి కోర్సు పూర్తయ్యాక ఉద్యోగంలో చేరిన తర్వాతే ఈఎంఐలు చెల్లించే విధానం అమల్లో ఉంది. కోర్సు పూర్తయ్యాక ఏడాది పాటు ఎలాంటి ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం లేదనే నిబంధన విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేదే!

రుణ మంజూరులో ఉదాసీనత !
ప్రభుత్వాలు ఉన్నతవిద్యకు ఊతమివ్వాలనే కారణంతో పలు పథకాలు ప్రవేశపెడుతున్నా.. విద్యారుణ మంజూరులో బ్యాంకులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఆస్తులను పూచీకత్తుగా చూపిస్తేనే విద్యా రుణం ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. ఆస్తులు కూడా పట్టణ, నగర ప్రాంతాల్లో ఉన్న ఇళ్లు, వాణిజ్య భూములను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నాయి. సాగు భూమిని పూచీకత్తుగా స్వీకరించడం లేదు. ముఖ్యంగా గ్రామీణ యువతకు బ్యాంకులు ముఖం చాటేస్తున్నాయి. ఫలితంగా వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి ఎక్కువ వడ్డీ రేటుకు చదువుకు అయ్యే డబ్బులు సమకూర్చుకోవాల్సి వస్తోందని విద్యార్థులు, తల్లిదండ్రులు వాపోతున్నారు.

కావాల్సిన డాక్యుమెంట్లు...
విద్యా రుణాలకు దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా కొన్ని ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసుకోవాలి. కాలేజీ ప్రవేశ ధ్రువీకరణ పత్రం, అకడమిక్ అర్హతల సర్టిఫికెట్లు, ఆదాయ వివరాలు, అడ్రస్ ప్రూఫ్, బ్యాంకు అకౌంట్ స్టేట్‌మెంట్స్, విదేశీ విద్య అయితే వీసా అప్రూవల్ పేపర్లు, ట్రావెల్ పేపర్లు, జీమ్యాట్/జీఆర్‌ఈ స్కోరు కార్డు మొదలైనవి తప్పనిసరి.

సింగిల్ విండో పోర్టల్ :
విద్యా రుణాలు ఆశిస్తున్న విద్యార్థులు ప్రతి బ్యాంకు మెట్లు ఎక్కి దరఖాస్తు చేసుకునే అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వం... ‘విద్యాలక్ష్మి’ పేరిట సింగిల్ విండో కింద వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఇందులో వివిధ బ్యాంకుల విద్యా రుణాల సమాచారం అందుబాటులో ఉంటుంది. కామన్ ఎడ్యుకేషన్ లోన్ అప్లికేషన్‌తో గరిష్టంగా మూడు బ్యాంకులకు ఒకేసారి దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత దశలో అభ్యర్థులు పేర్కొన్న బ్యాంకులకు ఆ వివరాలు చేరుతాయి. సంబంధిత బ్యాంకులు దరఖాస్తును తొలి దశలో పరిశీలించి ఆమోదిస్తే.. తదుపరి దశలో ఏ బ్రాంచ్‌లో సంప్రదించాలి, ఏ ఏ పత్రాలు తీసుకెళ్లాలి అనే వివరాలను విద్యార్థులకు పంపుతాయి. బ్యాంకులు కూడా విద్యార్థుల దరఖాస్తులను ఈ వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవడం, లోన్‌ప్రాసెసింగ్ స్టేటస్‌ను అప్‌లోడ్ చేసే సౌకర్యం ఉంది. విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉన్నా, ఈ-మెయిల్ ద్వారా వాటిని నివృత్తి చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.vidyalakshmi.co.in
Published date : 14 Jun 2018 02:57PM

Photo Stories