Skip to main content

ఐసెట్‌–2020 ప్రిపరేషన్‌ గైడెన్స్‌

ఏపీఐసెట్‌(ఆంధ్రప్రదేశ్‌ ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌)–2020 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఏపీ ఉన్నత విద్యా మండలి తరపున తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. 2020–21 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని కాలేజీల్లో ఎంబీఏ/ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులకు ఏపీ ఐసెట్‌ చక్కటి అవకాశం. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా లేటరల్‌ ఎంట్రీ విధానంలో ఎంసీఏ రెండో ఏడాదిలో చేరే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో.. ఏపీ ఐసెట్‌ 2020కు అర్హతలు, దరఖాస్తు, పరీక్ష విధానం గురించి తెలుసుకుందాం...
అర్హతలు :
ఐసెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులు. చివరి సంవత్సరం చదువుతున్న వారు, ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంబీఏలో ప్రవేశానికి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సరిపోతుంది. కాని ఎంసీఏ కోసం ఇంటర్‌ లేదా డిగ్రీ స్థాయిలో మ్యాథమెటిక్స్‌ చదివి ఉండాలి. లేటర్‌ ఎంట్రీ విధానంలో.. ఎంసీఏ రెండో ఏడాదిలో ప్రవేశం కోరుకునే అభ్యర్థులు బీసీఏ లేదా ఐటీ/సీఎస్‌లో డిగ్రీతోపాటు ఇంటర్మీడియెట్‌ స్థాయిలో మ్యాథమెటిక్స్‌ చదవడం తప్పనిసరి. కనీసం 50 శాతం మార్కులు రావాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులకు కనీసం 45 శాతం మార్కులు వచ్చి ఉండాలి.

పరీక్ష విధానం :
మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో 200 ప్రశ్నలు–200 మార్కులకు ఐసెట్‌ జరుగుతుంది. పరీక్ష సమయం 150 నిమిషాలు. అంటే.. ఒక్కో ప్రశ్నకు నిమిషం కంటే తక్కువ సమయంలో సమాధానం గుర్తించాలి. సిలబస్‌లో మూడు సెక్షన్‌లు ఉంటాయి. సెక్షన్‌ ఏ అనలిటికల్‌ ఎబిలిటీ 75 ప్రశ్నలు–75 మార్కులు; సెక్షన్‌ బీ మ్యాథమెటికల్‌ ఎబిలిటీ 75 ప్రశ్నలు–75 మార్కులు; సెక్షన్‌ సీ కమ్యూనికేషన్‌ ఎబిలిటీ 50 ప్రశ్నలు–50 మార్కులకు పరీక్ష జరుగుతుంది.

సిలబస్‌.. ప్రిపరేషన్‌ :
అనలిటికల్‌ ఎబిలిటీ 75 ప్రశ్నలు :
ఈ విభాగంలో డేటా సఫిషియన్సీ నుంచి 20 ప్రశ్నలు, ప్రాబ్లమ్‌ సాల్వివింగ్‌పై 55 ప్రశ్నలు అడుగుతారు. సీటింగ్‌ అమరిక, సీక్వెన్స్‌ అండ్‌ సిరీస్, వెన్‌ డయాగ్రమ్, బార్‌గ్రాఫ్, పైచార్టులు, డేటాఅనాలసిస్‌ వంటి అంశాలు ఉంటాయి. డేటా సఫిషియన్సీలో.. ప్రాబ్లమ్‌ సాల్వింగ్, సీక్వెన్స్‌ అండ్‌ సిరీస్, నంబర్‌ అండ్‌ ఆల్ఫాబెట్, వరుసలో నంబర్‌ మిస్సింగ్, డేటా అనాలసిస్‌పై ప్రశ్నలు ఎదురవుతాయి. అలాగే టేబుల్స్‌ అండ్‌ గ్రాఫ్స్‌లో.. బార్‌ డయాగ్రామ్స్, పైచార్ట్, వెన్‌ డయాగ్రమ్, పాసేజ్, కోడింగ్‌ అండ్‌ డీకోడింగ్‌పై ప్రశ్నలు వస్తాయి. డేట్, టైమ్, అరేంజ్‌మెంట్‌ విభాగంలో.. కేలండర్స్, క్లాక్‌(సమయం), రక్త సంబంధాలు, వాహనం రాక–పోక, సీటింగ్‌ అమరిక, చిహ్నాలు వివరణ(సింబల్స్‌ ఇంటర్‌ప్రిటేషన్‌) అంశాలు వస్తాయి. ఈ విభాగంలో ప్రశ్నలు అభ్యర్థి తార్కిక, విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని అంచనా వేసేలా ఉంటాయి.
మ్యాథమెటికల్‌ ఎబిలిటీ(75 ప్రశ్నలు) :
  • ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. అవి అర్థమెటికల్‌ ఎబిలిటీ, ఆల్జీబ్రా, జామెట్రికల్‌ ఎబిలిటీ, స్టాటిస్టికల్‌ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
  • అర్థమెటికల్‌ ఎబిలిటీలో.. లాస్‌ ఆఫ్‌ ఇండిసిస్, ఐసీఎం, జీసీడీ, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, ప్రాంతం–వాల్యూమ్, రేషియో అండ్‌ ప్రపోర్షన్, రేషనల్‌ నంబర్స్, పార్టనర్‌షిప్, మెన్సురేషన్, ఆర్డరింగ్, పైప్స్‌ అండ్‌ సిస్టెర్న్స్, మాడ్యులర్‌ ఆర్థమెటిక్, సంఖ్యల విభజన, పర్సంటేజ్, దూరం–పని అంశాలపై ప్రశ్నలు వస్తాయి.
  • ఆల్జీబ్రా, జామెట్రికల్‌ ఎబిలిటీ నుంచి స్టేట్‌మెంట్స్, æట్రూత్‌ టేబుల్స్, వివిధ రూపాల్లో రేఖా సమీకరణం, పురోగమనాలు, త్రికోణమితి, బహుపద, ద్విపద సిద్ధాంతం, మాత్రికల పరిమితి, జ్యామితిపై ప్రశ్నలు అడుగుతారు.
  • స్టాటిస్టికల్‌ ఎబలిటీ నుంచి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, మీన్, మీడియన్, మోడ్, స్టాండర్డ్‌ డీవియేషన్, సహసంబంధం(కోరిలేషన్‌), ప్రాబబిలిటీ నుంచి ప్రశ్నలు ఉంటాయి.

కమ్యూనికేషన్‌ ఎబిలిటీ (50 ప్రశ్నలు) :
ఈ విభాగంలో ఫంక్షనల్‌ గ్రామర్, వొకాబ్యులరీ, బిజినెస్‌ అండ్‌ కంప్యూటర్‌ టెర్మినాలజీ, రీడింగ్‌ కాంప్రెహెన్షన్‌ నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. కాబట్టి అభ్యర్థులు ఇంగ్లిష్‌ రీడింగ్‌ స్కిల్స్‌తోపాటు గ్రామర్, వొకాబ్యులరీపైనా పట్టు పెంచుకోవాలి. ముఖ్యంగా రోజువారీ కమ్యూనికేషన్‌లో ఉపయోగించే పదజాలం గుర్తించాలి. సమాచార మార్పిడిలో, వ్యాపార పరంగా వినియోగించే పదాలు, గ్రామర్‌ను అర్థం చేసుకోవాలి. ప్యాసేజ్‌ను వేగంగా చదివి అర్థం చేసుకోగలిగే నైపుణ్యం పెంచుకోవాలి. ఇందులో ప్రధానంగా పదజాలం, వ్యాపారం, కంప్యూటర్‌ పరిభాష, ఫంక్షనల్‌ వ్యాకరణం, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ అంశాలు చదవాల్సి ఉంటుంది.

ప్రణాళికాబద్ధ ప్రిపరేషన్‌ :
పరీక్షకు సమయం చాలా తక్కువ ఉన్నందున అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా చదవాలి. మైనస్‌ మార్కులు లేకున్నా.. ప్రతి మార్కు ర్యాంకును నిర్ణయిస్తుందన్న సంగతి మరిచిపోరాదు. ముందుగా గత ప్రశ్న పత్రాలను పరిశీలించి ప్రశ్నల స్థాయిని అంచనా వేసుకోవాలి. అందుకుతగ్గ ప్రిపరేషన్‌ కొనసాగించాలి. మాక్‌ టెస్టులు ప్రాక్టీస్‌ చేయాలి. వాస్తవంగా డిగ్రీ పరీక్షల్లో విద్యార్థులు సమయపాలనను పెద్దగా పట్టించుకోరు. కానీ పోటీపరీక్షల్లో మాత్రం టైమ్‌ మేనేజ్‌మెంట్‌ అత్యంత కీలకం. సిలబస్‌పై అవగాహన పెంచుకొని ప్రణాళికతో చదివితే కోరుకున్న కళాశాలలో సీటు లభిస్తుంది.

ముఖ్య సమాచారం :
దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: 2 ఏప్రిల్‌ 2020
రూ.2,000 ఆలస్య రుసుంతో ఏప్రిల్‌ 12 వరకూ; రూ.5,000 ఆలస్య రుసుంతో ఏప్రిల్‌ 20 వరకూ; రూ.10,000 ఆలస్య రుసుంతో ఏప్రిల్‌ 25 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష నిర్వహణ: ఏప్రిల్‌ 27 (ఉదయం 10 నుంచి 12.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు)
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://sche.ap.gov.in/icet

టీఎస్‌ ఐసెట్‌– 2020 సమాచారం:
తెలంగాణ రాష్ట్రంలో 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ/ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌ ఐసెట్‌(తెలంగాణ స్టేట్‌ ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌) 2020కు నోటిఫికేషన్‌ విడుదలైంది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి తరఫున వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించనుంది.
ప్రవేశ పరీక్ష పేరు: తెలంగాణ స్టేట్‌ ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(టీఎస్‌ ఐసెట్‌)–2020
ప్రవేశం కల్పించే కోర్సులు: మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎంబీఏ), మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్‌(ఎంసీఏ).
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
పరీక్ష తేదీలు: మే 20, 21 తేదీల్లో ఆన్‌లైన్‌ విధానంలో ఐసెట్‌ 2020 పరీక్ష జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.650; ఇతరులకు రూ.450.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.03.2020
దరఖాస్తులకు చివరి తేది: 30.04.2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://icet.tsche.ac.in
Published date : 10 Mar 2020 12:55PM

Photo Stories