Skip to main content

ఐఐఎంల్లో ‘పీహెచ్‌డీ’కి అర్హతలు, దరఖాస్తు విధానం, ఉద్యోగ అవకాశాలు ఇలా..

మేనేజ్‌మెంట్ కోర్సుల విద్యార్థులు సాధారణంగా పీజీ చదువుకే పరిమితమవుతుంటారు. ఎంబీఏతోనే కార్పొరేట్ కంపెనీల్లో కొలువులు సొంతం చేసుకొని.. ముందుకుసాగుతుంటారు. కానీ.. మేనేజ్‌మెంట్ విభాగంలో పీజీ తర్వాత పీహెచ్‌డీ కూడా పూర్తిచేసుకుంటే..
విభిన్న రంగాల్లో ఉన్నత స్థానాల్లో దూసుకుపోవచ్చు. ప్రధానంగా ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎంలు) క్యాంపస్‌ల్లో డాక్టోరల్ కోర్సు ద్వారా.. ఎంఎన్‌సీల్లో, బోధన రంగంలో అత్యున్నత హోదాల్లో కొలువు దీరొచ్చు! రూ.లక్షల వేతనం అందుకోవచ్చు!! ప్రస్తుతం ఐఐఎంల్లో 2020 విద్యా సంవత్సరానికి మేనేజ్‌మెంట్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ల దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. ఐఐఎంల్లో పీహెచ్‌డీకి అర్హతలు, ప్రవేశ విధానం, ఆర్థిక ప్రోత్సాహకాలు, భవిష్యత్తు అవకాశాల గురించి తెలుసుకుందాం...

డాక్టోరల్ ప్రోగ్రామ్స్ :
ఐఐఎంలు అందిస్తున్న పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. కనిష్టంగా నాలుగేళ్లు, గరిష్టంగా అయిదేళ్ల వ్యవధిలో ఉండే ఈ డాక్టోరల్ కోర్సు పూర్తి చేసుకుంటే.. సంబంధిత స్పెషలైజేషన్ ఆధారంగా సంస్థల్లో ఉన్నత శ్రేణి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా కార్పొరేట్ రంగంలో సొంతగా కన్సల్టెంట్స్‌గా ఫ్రీలాన్స్ విధానంలో సేవలందించొచ్చు. అదే విధంగా అధ్యాపక వృత్తిలో ప్రవేశించి ప్రముఖ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ స్థాయిలో రూ.లక్షల వేతనం అందుకోవచ్చు.

అర్హతలివే..
ఐఐఎంలు అందించే పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకునేందుకు ప్రధాన అర్హత.. మేనేజ్‌మెంట్ పీజీ (ఎంబీఏ, పీజీ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ తదితర). తాజాగా ఐఐఎం చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నిబంధనల్లో సడలింపు ఇస్తున్నాయి. పీజీ డిగ్రీ లేదా, పీజీ డిప్లొమా, లేదా బ్యాచిలర్ డిగ్రీ తర్వాత సీఏ/ఐసీడబ్ల్యుఏ/సీఎస్ కోర్సులు పూర్తి చేసుకున్న వారు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తోంది.
  • బీటెక్ అభ్యర్థులు ప్రస్తుతం నేరుగా ఐఐఎంల్లో పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. నాలుగేళ్ల వ్యవధిలో ఉండే బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల ఉత్తీర్ణులతోపాటు ఆయా కోర్సుల చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు.
  • అభ్యర్థుల అర్హతలకు అనుగుణంగా పీహెచ్‌డీ పూర్తి చేయాల్సిన కనిష్ట, గరిష్ట వ్యవధులను ఐఐఎంలు నిర్ణయిస్తున్నాయి. ఉదాహరణకు ఐఐఎం-అహ్మదాబాద్.. పీజీ, పీజీ డిప్లొమా కోర్సులతో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మూడేళ్లలోనే పీహెచ్‌డీని పూర్తి చేసుకునే వీలు కల్పించింది. అలాగే బీటెక్ లేదా నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకుంటే.. పీహెచ్‌డీ పూర్తి చేసేందుకు కనిష్ట వ్యవధి నాలుగేళ్లుగా నిర్ణయించింది. ఐఐఎం కోల్‌కత, బెంగళూరు, కోజికోడ్.. ఇలా దేశంలోని దాదాపు అన్ని ఐఐఎంలు ఇలాంటి విధానం అమలు చేస్తున్నాయి.
టెస్ట్ స్కోర్లు :
  • ఐఐఎంల్లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు.. క్యాట్, జీమ్యాట్/జీఆర్‌టీల్లో నిర్దేశిత స్కోర్ సాధించాలి. లేదా యూజీసీ-నెట్, యూజీసీ-జేఆర్‌ఎఫ్‌కు ఎంపికవ్వాలి.
  • యూజీసీ జేఆర్‌ఎఫ్ అర్హత ఆధారంగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు... పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో తాము దరఖాస్తు చేసుకునే స్పెషలైజేషన్ ఆధారంగా సంబంధిత సబ్జెక్ట్‌లో యూజీసీ జేఆర్‌ఎఫ్‌లో ఉత్తీర్ణత సాధించాలి. ఉదాహరణకు..ఎకనామిక్స్ స్పెషలైజేషన్‌తో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే.. బిజినెస్ ఎకనామిక్స్ లేదా డెవలప్‌మెంట్ ఎకనామిక్స్ లేదా ఎకనామిక్స్ సబ్జెక్ట్‌లలో యూజీసీ నెట్‌లో ఉత్తీర్ణత సాధించాలి.
  • విదేశీ విద్యార్థులకు జీమ్యాట్ లేదా జీఆర్‌ఈ స్కోర్లు తప్పనిసరి.
మలిదశ ఎంపిక :
ఐఐఎం పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌కు వచ్చిన దరఖాస్తులను ముందుగా ఆయా ఇన్‌స్టిట్యూట్‌ల అడ్మిషన్స్ కమిటీ పరిశీలిస్తుంది. అభ్యర్థులు పేర్కొన్న రీసెర్చ్ స్పెషలైజేషన్, దానికి సంబంధించి జతపర్చిన థీసిస్‌లపై సంతృప్తి చెందితే.. సదరు అభ్యర్థులకు ఐఐఎంల నుంచి మలిదశ ఎంపిక ప్రక్రియకు పిలుపు వస్తుంది. ఈ దశలో రాత పరీక్ష లేదా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ సమయంలో ప్రొఫెసర్ల కమిటీ.. అభ్యర్థుల్లో వాస్తవ ఆసక్తిని పరిశీలించి తుది జాబితా రూపొందిస్తుంది. ఒక్కో క్యాంపస్‌లో గరిష్టంగా అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య 30. కాబట్టి పీహెచ్‌డీలోకి అభ్యర్థుల ఎంపికకు అకడమిక్ పర్సంటేజ్‌లు, టెస్ట్ స్కోర్లే కాకుండా.. రిఫరెన్స్ లెటర్స్, ప్రొఫైల్స్ వంటివి కీలకంగా మారుతున్నాయి.

ఆర్థిక ప్రోత్సాహం..
ఐఐఎంల్లో పీహెచ్‌డీ కోర్సుకు ఎలాంటి ఫీజులు వసూలు చేయరు. అంతేకాకుండా ప్రోగ్రామ్‌కు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన ఆర్థిక ప్రోత్సాహం అందుతోంది. ఆయా క్యాంపస్‌ల విధానాలను అనుసరించి రూ.30వేల నుంచి రూ. 35 వేల వరకు ప్రతి నెల ఫెలోషిప్ లభిస్తుంది. దీనికి అదనంగా కాంటింజెన్సీ గ్రాంట్, కాన్ఫరెన్స్ టూర్ వ్యయాలు(ట్రావెల్ గ్రాంట్స్), రీసెర్చ్‌కు అవసరమైన ఇతర మౌలిక వసతులకు సంబంధించిన ఖర్చులకు సరిపడే మొత్తాలు, ఉచిత హాస్టల్ సదుపాయం, లేదా హెచ్‌ఆర్‌ఏ అందిస్తున్నాయి.

ఉన్నత స్థాయి ఉద్యోగాలు...
ఐఐఎంలలో పీహెచ్‌డీ పూర్తి చేసుకున్న ప్రతిభావంతులకు బహుళ జాతి సంస్థల్లో, సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉన్నతస్థాయి ఉద్యోగాలు లభిస్తున్నాయి. చీఫ్ స్ట్రాటజిక్ ఆఫీసర్, చీఫ్ పీపుల్ ఆఫీసర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వంటివి సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా ఒక సంస్థలో ఉద్యోగం చేస్తూ పీహెచ్‌డీలో ప్రవేశం పొంది.. దాన్ని పూర్తి చేసుకున్న వారికి మాతృ సంస్థలోనే అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వంటి హోదాలు స్వాగతం పలుకుతున్నాయి. సదరు పీహెచ్‌డీ ఉత్తీర్ణులు సొంతంగా కన్సల్టింగ్ సంస్థలు, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ సంస్థలను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది.ఇటీవల కాలంలో అధ్యాపకుల కొరత కారణంగా..ఐఐఎంల్లో పీహెచ్‌డీ పూర్తిచేసిన అభ్యర్థులకు సదరు ఇన్‌స్టిట్యూట్‌లే అసోసియేట్ ప్రొఫెసర్‌లుగా నియమించుకుంటున్నాయి. వీరికి సగటున నెలకు లక్షన్నర వరకూ వేతనం లభిస్తోంది.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
వచ్చే విద్యా సంవత్సరం(2020-21)కు సంబంధించి ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


ఐఐఎం క్యాంపస్‌లు..
అవి అందిస్తున్న పీహెచ్‌డీ ప్రోగ్రామ్ స్పెషలైజేషన్స్...
ఐఐఎంఅహ్మదాబాద్:
స్పెషలైజేషన్స్: అగ్రికల్చర్, బిజినెస్ పాలసీ, ఎకనామిక్స్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, మార్కెటింగ్, ఓబీ, పర్సనల్ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్, ప్రొడక్షన్ అండ్ క్వాంటిటేటివ్ మెథడ్స్, పబ్లిక్ సిస్టమ్స్
దరఖాస్తుకు చివరి తేదీలు:జనవరి 23, 2020
వెబ్‌సైట్: www.iima.ac.in


ఐఐఎం బెంగళూరు:
స్పెషలైజేషన్స్: డెసిషన్ సెన్సైస్, ఎకనామిక్స్ అండ్ సోషల్ సెన్సైస్, ఎంట్రప్రెన్యూర్‌షిప్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, మార్కెటింగ్, ఆర్గనైజేషనల్ బిహేవియర్ అండ్ హెచ్‌ఆర్‌ఎం, ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ పాలసీ, స్ట్రాటజీ
దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 13, 2020
వెబ్‌సైట్: www.iimb.ac.in

ఐఐఎం లక్నో:
స్పెషలైజేషన్స్: అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్, బిజినెస్ ఎన్విరాన్‌మెంట్, డెసిషన్ సెన్సైస్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, హెచ్‌ఆర్‌ఎం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సిస్టమ్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్, స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్
దరఖాస్తుకు చివరి తేదీ:జనవరి 31, 2020
వెబ్‌సైట్: www.iiml.ac.in

ఐఐఎం కోజికోడ్:
స్పెషలైజేషన్స్: ఎకనామిక్స్; ఫైనాన్స్, అకౌంటింగ్ అండ్ కంట్రోల్; ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సిస్టమ్స్, మార్కెటింగ్, ఓబీ అండ్ హెచ్‌ఆర్‌ఎం, క్వాంటిటేటివ్ మెథడ్స్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్, స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్
దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 15, 2020
వెబ్‌సైట్: www.iimk.ac.in

ఐఐఎం కోల్‌కత:
స్పెషలైజేషన్స్: ఎకనామిక్స్, ఫైనాన్స్ అండ్ కంట్రోల్, హెచ్‌ఆర్‌ఎం, ఎంఐఎస్, మార్కెటింగ్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్, ఓబీ, పబ్లిక్ పాలసీ అండ్ మేనేజ్‌మెంట్, రీజనల్ డెవలప్‌మెంట్, సోషియాలజీ, స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్
దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 20, 2020
వెబ్‌సైట్: www.iimcal.ac.in

ఐఐఎం ఇండోర్:
స్పెషలైజేషన్స్:
కమ్యూనికేషన్, ఎకనామిక్స్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ అండ్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్, ఓబీ అండ్ హెచ్‌ఆర్‌ఎం, స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్
దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 20, 2020
వెబ్‌సైట్: www.iimidr.ac.in

ఐఐఎం రాయ్‌పూర్:
స్పెషలైజేషన్స్
: బిజినెస్ పాలసీ అండ్ స్ట్రాటజీ, ఎకనామిక్స్ అండ్ బిజినెస్ ఎన్విరాన్‌మెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, మార్కెటింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సిస్టమ్స్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్
దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 20, 2020
వెబ్‌సైట్: www.iimraipur.ac.in

ఐఐఎం రోహ్‌తక్:
స్పెషలైజేషన్స్
: ఎకనామిక్ అండ్ పబ్లిక్ పాలసీ, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, హెచ్‌ఆర్‌ఎం అండ్ ఓబీ, ఎంఐఎస్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ అండ్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్, స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్
దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 31, 2020
వెబ్‌సైట్: www.iimrohtak.ac.in

ఐఐఎం రాంచీ:
స్పెషలైజేషన్స్
:అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, ఎకనామిక్స్, జనరల్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, ఓబీ అండ్ హెచ్‌ఆర్‌ఎం, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్, స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్
దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 29, 2020
వెబ్‌సైట్: www.iimranchi.ac.in

ఐఐఎం ఉదయ్‌పూర్:
స్పెషలైజేషన్స్
: ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, ఓబీ అండ్ హెచ్‌ఆర్‌ఎం
దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 9, 2020
వెబ్‌సైట్: www.iimu.ac.in

ఐఐఎం షిల్లాంగ్:
స్పెషలైజేషన్స్
: ఎకనామిక్స్ అండ్ పబ్లిక్ పాలసీ, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ అండ్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్, ఓబీ అండ్ హెచ్‌ఆర్‌ఎం, స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్, సస్టెయినబిలిటీ అండ్ సీఎస్‌ఆర్ అండ్ ఎథిక్స్
దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 27, 2020 (ఆఫ్‌లైన్ విధానంలో జనవరి 30, 2020)
వెబ్‌సైట్: www.iimshillong.ac.in

ఐఐఎం త్రిచీ:
స్పెషలైజేషన్స్
:ఎకనామిక్స్ అండ్ పబ్లిక్ పాలసీ, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, మార్కెటింగ్, మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ ఐటీ, ఓబీ అండ్ హెచ్‌ఆర్‌ఎం, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ అండ్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్, స్ట్రాటజీ
దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 20, 2020
వెబ్‌సైట్:www.iimtrichy.ac.in

ఐఐఎం కాశీపూర్:
స్పెషలైజేషన్స్: ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ అండ్ డెసిషన్ సెన్సైస్; ఓబీ అండ్ హెచ్‌ఆర్‌ఎం; మార్కెటింగ్; ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సిస్టమ్స్; బిజినెస్ పాలసీ అండ్ స్ట్రాటజీ; ఎకనామిక్స్ అండ్ బిజినెస్ ఎన్విరాన్‌మెంట్; బిజినెస్ కమ్యూనికేషన్
వెబ్‌సైట్: www.iimkashipur.ac.in

గమనిక: మిగతా ఐఐఎంలు మరికొద్ది రోజుల్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించనున్నాయి.
Published date : 21 Dec 2019 02:22PM

Photo Stories