IT Refund Scam Messages : ఇవి తెలుసుకోండి.. లేదంటే మీ ఖాతాలోని డబ్బులు గోవిందా గోవిందా..!
రిటర్న్స్ దాఖలు ముగియడంతో రీఫండ్ ప్రక్రియ కూడా షురూ అయింది. దీంతో తమ ఐటీఆర్ వెరిఫికేషన్ పూర్తయిన రీఫండ్ ఎపుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు చాలా మంది. దీన్నే అవకాశంగా తీసుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతారు. ఫేక్ మెసేజ్‌లతో పన్ను చెల్లింపుదారులు మభ్యపెట్టి, వారి ఖాతాలను ఖాళీ చేస్తున్న కొత్త స్కామ్ తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఐటీ రీఫండ్ మెసేజ్‌లపై అప్రమత్తంగా ఉండాలని పీఐబీ హెచ్చరించింది. ఈ మెసేజ్ వెనుక ఉన్న అసలు కథ కమామిష్ష ఏమిటో ఒకసారి చూద్దాం..
స్కాం ఇలా..
ఇటీవల కాలంలో చాలా మందికి ఈ తరహా మెసేజ్ లు వచ్చాయి “Dear Sir, You have been approved for an income tax refund of ₹15,490/-, the amount will be credited to your account shortly. Please verify your account number 5XXXXX6755. If this is not correct, please update your bank account information by visiting the link below’’ ఇలాంటి మెసేజ్ వచ్చిందా? ఐటీ విభాగం నుంచి వచ్చిందని బావించి వెంటనే తప్పులో కాలేసారో, భారీ నష్టాల్ని మూటగట్టుకోవాల్సి ఉంది.ఆదాయ పన్ను రీఫండ్ కు అనుమతి లభించింది. ఈ రీఫండ్ డైరెక్టుగా రావాలంటే.. బ్యాంక్ ఖాతాను అప్ డేట్ చేసుకోవాలి అంటే మనల్ని బురిడీ కొట్టిస్తారు. ఆ మెసేజ్ ను నమ్మి, వారు అడిగిన వివరాలను ఇవ్వకండి. ఎందుకంటే ఇది సైబర్ నేరస్తుల కొత్త ఎత్తుగడ.
వాస్తవానికి ఇలాంటి సందేశాలేవీ ఐటీ విభాగం పంపదు. ఇది నకిలీ మెసేజ్ అని, సైబర్ నేరస్తుల కొత్త తరహా మోసమని గుర్తించాలని పీఐబీ ఫాక్ట్ చెక్ ట్వీట్ చేసింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
రీఫండ్ ఎలా వస్తుందంటే..?
ఐటీ రీఫండ్ అర్హత ఉన్న పన్ను చెల్లింపుదారులకు, సంబంధిత (వాలిడేషన్ సమయంలో ఇచ్చిన) బ్యాంక్ ఖాతాకు ఆ రీఫండ్ మొత్తం జమ అవుతుంది. బ్యాంక్ వివరాలను అప్ డేట్ చేయమని కానీ, బ్యాంక్ ఖాతా వివరాలను తెలపమని కానీ, ఓటీపీ, పిన్, పాస్ వర్డ్ వంటి రహస్య, వ్యక్తిగత వివరాలను వెల్లడించమని కానీ కోరుతూ ఐటీ విభాగం ఎలాంటి సందేశాలను పంపించదు అనేది గమనించాలి.
రీఫండ్ ఎపుడు వస్తుందంటే..?
ఆదాయపు పన్ను వాపసు స్వీకరించడానికి పట్టే సమయం పూర్తిగా ఆదాయపు పన్ను శాఖ అంతర్గత ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, మీరు మీ రిటర్న్‌ను ఇ-ధృవీకరించిన తర్వాత 90 రోజులు. కానీ 7 నుండి 120 రోజులు పడుతుంది. రీఫండ్ ప్రక్రియను వేగవంతం చేసేలి ఆదాయపు పన్ను శాఖ ఫిబ్రవరి 2021న కొత్త రీఫండ్ ప్రాసెసింగ్ సిస్టమ్‌ను అమలు చేసింది.
ఇలా చెక్ చేసుకోవాలి..?
యూజర్ ID, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ/ఇన్కార్పొరేషన్ తేదీ , క్యాప్చాతో ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్‌కి లాగిన్ అయ్యి, రీఫండ్ స్టాటస్‌ను చెక్ చేసుకోవచ్చు.