Skip to main content

స్థానిక ప్రభుత్వాలు - అధ్యయన క‌మిటీలు

బ్రిటిష్ వారి పాలనకు ముందు భారత దేశంలోని గ్రామాలన్నీ స్వయం సమృద్ధితో ఉండేవి. అగస్త్యుని ప్రజాపాలనా సూత్రాలు దేశంలోని పాలనా వ్యవస్థను వివరిస్తున్నాయి. కౌటిల్యుని అర్థశాస్త్రంలో గ్రామిక, గ్రామకూటలాంటి గ్రామాధికారుల సమాచారం ఉంది. లార్డ్ రిప్పన్ 1882 మే 18న స్థానిక సంస్థల మాగ్నాకార్టాను విడుదల చేశారు. ఇతడ్ని స్థానిక స్వపరిపాలనా పితామహుడిగా పేర్కొంటారు. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను రాజస్థాన్‌లోని ‘నాగౌర్’ జిల్లాలో 1959 అక్టోబర్ 2న భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించారు.
బౌద్ధమతం వెల్లివిరిసిన కాలంలోనే భారతదేశంలో స్థానిక సంస్థలు ఉండేవని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అభిప్రాయపడ్డారు. అగస్త్యుని ప్రజాపాలనా సూత్రాలు మన దేశంలోని పాలనా వ్యవస్థను వివరిస్తున్నాయి. కౌటిల్యుని అర్థశాస్త్రంలో గ్రామిక, గ్రామకూటలాంటి గ్రామాధికారుల గురించి వివరించారు. మెగస్తనీస్ తన ఇండికా గ్రంథంలో పాటలీపుత్ర నగరంలోని మున్సిపల్ ప్రభుత్వం గురించి సమగ్రంగా పేర్కొన్నారు. చోళుల కాలంలో స్థానిక స్వపరిపాలనా స్వర్ణయుగంగా సాగింది. షేర్షా కాలంలో రాష్ట్రాన్ని సర్కారు (జిల్లాలు)గా విభజించారు.

బ్రిటిష్ వారి పాలనకు ముందు మన దేశంలోని గ్రామాలన్నీ స్వయం సమృద్ధితో ఉండేవి. ఈస్టిండియా కంపెనీ కాలం(1687)లో తొలిసారిగా మద్రాస్‌లో మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. 1726లో ముంబై, కోల్‌కతా నగరాల్లో మేయర్ బోర్డ్ లను ఏర్పాటు చేశారు. 1793లో మద్రాస్, ముంబై, కోల్‌కతా నగరాల్లో వేర్వేరుగా మున్సిపల్ పరిపాలనను ప్రారంభించారు. 1870లో లార్‌‌డ మేయో ఆర్థిక వికేంద్రీకరణ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

లార్డ్ రిప్పన్ తీర్మానం
లార్డ్ రిప్పన్ 1882 మే 18న స్థానిక సంస్థల మాగ్నాకార్టాను విడుదల చేశారు.ఇతడ్ని స్థానిక స్వపరిపాలనా పితామహుడిగా పేర్కొంటారు. రిప్పన్ తీర్మానం రాజకీయ విజ్ఞానానికి, వికాసానికి దోహదపడింది.

రిప్పన్ తీర్మానంలోని ప్రధానాంశాలు
  • స్థానిక సంస్థలను ఏర్పాటు చేసి విద్యావంతులైన భారతీయుల సేవలను వినియోగించుకుని, వారికి స్వపరిపాలన ద్వారా కొంత తృప్తిని కలిగించాలి.
  • స్థానిక ప్రభుత్వ ప్రాంతం తాలుకా (డివిజన్) లేక తహసీల్ (మండలం)గా ఉండాలి.
  • స్థానిక సంస్థల్లో అనధికారిక సభ్యులు ఎక్కువ సంఖ్యలో ఉండాలి.
  • అన్ని ప్రాంతాల్లో సభ్యుల ఎన్నిక ప్రత్యక్ష పద్ధతి ద్వారా నిర్వహించాలి.
  • సభ్యుల ఎన్నికకు అన్ని ప్రాంతాల వారు పాల్గొనాలి.
  • స్థానిక సంస్థలకు అవసరమయ్యే ఆర్థిక వనరులను ప్రభుత్వం సమకూర్చాలి.
  • ప్రముఖులైన సభ్యులను బోర్డ్ సభ్యులుగా, అధ్యక్షులుగా నియమించాలి.
  • స్థానిక సంస్థల్లో బాగా పనిచేసేవారికి రావు బహుదూర్, ఖాన్ బహుదూర్ బిరుదులను ప్రదానం చేయాలి.
1907లో సర్ చార్లెస్ అధ్యక్షతన నియమించిన రాయల్ కమిషన్ ఆర్థిక వికేంద్రీకరణ అంశాల ద్వారా స్థానిక సంస్థలను అభివృద్ధి చేయడానికి కొన్ని సూత్రాలను సూచించింది. 1919 మాంటెగు చెమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం స్థానిక సంస్థల ప్రగతికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొంది. స్థానిక స్వపరిపాలనా అంశాన్ని 1919 మాంటెగు చెమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం -(ట్రాన్‌‌సఫర్‌‌డ, బదిలీ)లో చేర్చారు. మహాత్మాగాంధీ గ్రామ రాజ్యం రావాలని గ్రామాల ద్వారా అభివృద్ధి సాధించాలని, ప్రతీ గ్రామం రిపబ్లిక్‌గా అవతరించాలని సూచించారు. గాంధీజీ ఆశయం మేరకు రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లోని నాలుగో భాగంలోని 40వ అధికరణం గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి గ్రామీణాభివృద్ధి చేయాలని సూచిస్తుంది. రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్డ్‌లోని ఐదో అంశం స్థానిక స్వపరిపాలను వివరిస్తుంది. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో టి.టి.కృష్ణమాచారి కమిటీ సిఫార్సు మేరకు సమాజాభివృద్ధి పథకాలను రూపొందించారు.

సామాజిక అభివృద్ధి కార్యక్రమం (సీడీపీ)
గ్రామీణ ప్రజల ఆర్థిక, సాంస్కృతిక అభివృద్ధి కోసం 1952 అక్టోబర్ 2న 55 బ్లాకుల్లో మొదటిసారిగా సామాజికాభివృద్ధి విధానాన్ని ప్రవేశ పెట్టారు. 70,000 జనాభాకు ఒక బ్లాక్ ఏర్పాటు చేశారు. సామాజికాభివృద్ధి విధానం ద్వారా పశుపోషణ, ప్రాథమిక విద్య, ఆరోగ్యం, గృహవసతి, కుటీర పరిశ్రమలు, సమాచార సౌకర్యం, స్త్రీ, శిశు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. వీటి అమలు కోసం ఒక్కో బ్లాక్‌కు బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (బీడీవో)ను నియమించారు. ఈ పథకం ద్వారా వ్యవసాయం, సహకార రంగాలనూ అభివృద్ధి చేశారు. ఈ కార్యక్రమ ప్రచారానికి 10 గ్రామాలకు ఒక గ్రామ సేవక్ అధికారిని నియమించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వమే నిధులు సమకూరుస్తుంది.

జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం
సామాజికాభివృద్ధి కార్యక్రమాన్ని విస్తరించి 1953 అక్టోబర్ 2న 1700 బ్లాక్‌ల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగం అభివృద్ధి, నూతన వంగడాల రూపకల్పన గ్రామీణ ప్రజల వికాసం కోసం ఈ కార్యక్రమాన్ని విస్తరించారు.

బల్వంతరాయ్ మెహతా కమిటీ
ప్రణాళిక ప్రాజెక్ట్‌ల సంఘం వారు సామాజిక అభివృద్ధి పథకం, జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం అమలు తీరును అధ్యయనం చేయడానికి 1957 జనవరిలో బల్వంత్‌రాయ్ మెహతా కమిటీని నియమించారు. ఈ కమిటీ తన నివేదికను 1957 నవంబర్‌లో సమర్పించింది. ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, ప్రజల భాగస్వామ్యం అనే అంశాలతో పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫార్సు చేసింది. ఈ కమిటీ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫార్సు చేసింది.

సిఫార్సులు:
  • బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ గ్రామస్థాయిలో గ్రామ పంచాయతీ, మధ్యస్థాయిలో పంచాయతీ సమితి, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్‌లను సిఫార్సు చేసింది.
  • గ్రామ పంచాయతీ వ్యవస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలి.
  • జిల్లా పరిషత్, పంచాయతీ సమితీలకు పరోక్షంగా ఎన్నికలు నిర్వహించాలి.
  • అభివృద్ధి కార్యక్రమాలన్నీ పంచాయతీరాజ్ సంస్థల ద్వారానే నిర్వహించాలి.
  • పంచాయతీరాజ్ సంస్థలకు అధికార వికేంద్రీకరణ జరగాలి.
  • పంచాయతీ సమితికి కార్య నిర్వహణాధికారాలు కల్పించాలి.
  • జిల్లా పరిషత్‌లకు సలహా, పర్యవేక్షణ అధికారాలు కల్పించాలి.
  • పంచాయతీరాజ్ సంస్థలకు ప్రణాళికా, అభివృద్ధికి సంబంధించిన అన్ని కార్యకలాపాలు అప్పగించాలి.
బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ సిఫార్సులను జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌డీసీ) 1958 ఏప్రిల్‌లో ఆమోదించింది. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను అమలు చేసిన మొదటి రాష్ర్టం ‘రాజస్థాన్’. ఆ రాష్ర్టంలోని ‘నాగౌర్’ జిల్లాలో 1959 అక్టోబర్ 2న భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభించారు. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన రెండో రాష్ర్టం ఆంధ్రప్రదేశ్. పశ్చిమ బెంగాల్‌లో నాలుగంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది. అన్ని రాష్ట్రాల్లో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. ఒడిశా, హర్యానా, అసోం, తమిళనాడు రాష్ట్రాల్లో రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది. గోవా, సిక్కిం, త్రిపుర, కేరళ, జమ్మూకశ్మీర్‌లో ఒక అంచె పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది. మహారాష్ర్ట, కర్ణాటక, గుజరాత్, పశ్చిమ బెంగాల్‌లో జిల్లా పరిషత్‌లకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. బిహార్, ఉత్తరప్రదేశ్‌లో పంచాయతీరాజ్ వ్యవస్థకు తగిన ప్రాధాన్యం లేదు.

అశోక్ మెహతా కమిటీ
పంచాయతీరాజ్ వ్యవస్థను అధ్యయనం చేయడానికి ఆనాటి జనతా ప్రభుత్వం 1977 డిసెంబర్‌లో అశోక్ మెహతా అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ 1978 ఆగస్టులో 132 సిఫార్సులతో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
సిఫార్సులు:
  • రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫార్సు చేసింది
  • జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్, కొన్ని గ్రామాలతో కలిపి మండల పంచాయతీ ఏర్పాటు చేయాలి.
  • 15,000 నుంచి 20,000 జనాభా ఉన్న కొన్ని గ్రామాల సముదాయాన్ని మండల పంచాయతీగా ఏర్పాటు చేయాలి.
  • జిల్లా స్థాయిలో అధికార వికేంద్రీకరణ జరగాలి.
  • జిల్లా పరిషత్ కార్యనిర్వాహణ అధికారాలు కలిగి ఉండాలి.
  • పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా పోటీ చేయాలి
  • జిల్లా పరిషత్ అధ్యక్షులు ప్రత్యక్షంగా, పరోక్షంగా కానీ ఎన్నిక కావాలి
  • పంచాయతీరాజ్ సంస్థలలోని అన్ని పదవులకు కాల పరిమితి ఐదేళ్లుగా నిర్ణయించాలి
  • న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేయాలి.
  • నిధుల కోసం స్వయంగా పన్నులు వసూలు చేసుకునే అధికారం పంచాయతీరాజ్ సంస్థలకు ఉండాలి.
  • పంచాయతీరాజ్ సంస్థలు ఖర్చు చేసిన నిధులపై సామాజిక తనిఖీ నిర్వహించాలి
  • పంచాయతీరాజ్ వ్యవస్థల కోసం రాష్ర్టం లో ప్రత్యేకంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిని నియమించాలి.
  • ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి.
అశోక్ మెహతా కమిటీ సిఫార్సులను 1979లో జరిగిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించి కొన్ని మార్పులతో ఆమోదించారు. ఈ కమిటీ సిఫార్సుల ప్రకారం కొన్ని మార్పులతో కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లలో పంచాయతీరాజ్ వ్యవస్థను అమలు చేశాయి. మండల పరిషత్‌ను ప్రవేశపెట్టిన తొలిరాష్ర్టం కర్ణాటక, 1985 అక్టోబర్, 2న రామకృష్ణా హెగ్డే ఈ వ్యవస్థను ప్రారంభించారు. మండల వ్యవస్థను ప్రవేశపెట్టిన రెండో రాష్ర్టం ఆంధ్రప్రదేశ్. 1986 జనవరి, 13న సంక్రాంతి రోజు ఎన్.టి.రామారావు దీన్ని ప్రవేశపెట్టారు.

గమనిక:
ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ మండలాలను మాత్రం 1985లోనే ప్రారంభించారు.

దంత్‌వాలా కమిటీ (1978)
బ్లాక్‌స్థాయి ప్రణాళికీకరణపై ఒక నివేదికను సమర్పించడానికి ఈ కమిటీని ఏర్పాటు చేశారు.
సిఫార్సులు:
జిల్లాస్థాయి ప్రణాళిక వికేంద్రీకరణ జరగాలి. జిల్లా కలెక్టర్ ముఖ్య భూమిక పోషించాలి. సర్పంచ్‌లను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలి.

సి.హెచ్. హనుమంతరావు కమిటీ
జిల్లా ప్రణాళికలపై ఒక నివేదికను సమర్పించడానికి 1984లో సి.హెచ్. హనుమంతరావు అధ్యక్షతన ఒక అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు.
సిఫార్సులు:
  • జిల్లా స్థాయిలోని అన్ని అభివృద్ధి, ప్రణాళికా రచన గ్రామీణ సంక్షేమం తదితర కార్యకలాపాల్లో కలెక్టర్ సమన్వయకర్తగా వ్యవహరించాలి.
  • ప్రత్యేక జిల్లా ప్రణాళికా సంఘాన్ని సంబంధిత జిల్లా కలెక్టర్ లేదా ఒక మంత్రి అధ్యక్షతన ఏర్పాటు చేయాలి.
  • జిల్లా ప్రణాళికా బోర్డులను ఏర్పాటు చేయాలి.
జి.వి.కె.రావు కమిటీ
  • గ్రామీణాభివృద్ధి సాధనకు ఉండాల్సిన సంస్థాగత ఏర్పాట్ల అధ్యయనం కోసం ప్రణాళిక సంఘం 1985లో జి.వి.కె. రావు అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
కమిటీ సూచనలు
  • విధాన రూపకల్పన అమలుకు జిల్లా ప్రధాన యూనిట్‌గా ఉండాలి.
  • నిర్ణీత గడువులోగా పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలి.
  • పంచాయతీరాజ్ సంస్థలకు ఎక్కువ వనరులను అందుబాటులో ఉంచాలి.
  • పేదరిక నిర్మూలన కోసం చేపట్టే పథకాల అమల్లో పంచాయతీరాజ్ సంస్థలు చురుకైన పాత్ర పోషించాలి.
  • ప్రజాస్వామ్య వికేంద్రీకరణలో జిల్లా పరిషత్ ప్రముఖ పాత్ర వహించాలి.
  • రాష్ర్టస్థాయిలో కొన్ని ప్రణాళిక బాధ్యతలను జిల్లా ప్రణాళిక బోర్డులకు అప్పగించాలి.
  • జిల్లా అభివృద్ధి అధికారి పేరుతో ఒక పదవిని సృష్టించాలి. ఇతనికి జిల్లా పరిషత్‌కు చెందిన ముఖ్య కార్యనిర్వాహక బాధ్యతలు అప్పగించాలి.
  • అభివృద్ధి కార్యక్రమాల్లో కలెక్టర్ పాత్రను తగ్గించాలని ఈ కమిటీ సిఫార్సు చేసింది.
ఎల్.ఎం.సింఘ్వీ కమిటీ
  • రాజీవ్ గాంధీ కాలంలో 1986లో పంచాయతీరాజ్ సంస్కరణల కోసం ఎల్.ఎం. సింఘ్వీ కమిటీని నియమించారు.
కమిటీ సిఫారసులు
  • పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించాలి. రాజ్యాంగ సవరణలు చేసి వీటిని రాజ్యాంగబద్ధం చేయాలి.
  • కొన్ని గ్రామాలను కలిపి న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేయాలి.
  • గ్రామ పంచాయతీలకు ఆర్థిక వనరులు కల్పించాలి.
  • పంచాయతీరాజ్ సంస్థలు, ఎన్నికలు, రద్దు మొదలైన అంశాలు పరిశీలించడం కోసం ‘జ్యూడిషియల్’ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి.
  • రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 64వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ సంస్థలకు, 65వ రాజ్యాంగ సవరణ ద్వారా నగర పాలక సంస్థలకు రాజ్యాంగ బద్ధత కల్పించాలని భావించింది. కానీ ఆ సవరణలు ఆమోదం పొందలేదు.
పి.కె. తుంగన్ కమిటీ
  • కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పి.కె. తుంగన్ నాయకత్వంలో 1987లో ప్రధాని రాజీవ్ గాంధీ.. మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థకు స్వయం సమృద్ధి కల్పించి, దేశం అంతటా వర్తించే పంచాయతీరాజ్ వ్యవస్థను రూపొందించాలనే లక్ష్యంతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు.
73వ రాజ్యాంగ సవరణ
  • పంచాయతీరాజ్ చట్టం కోసం లోక్‌సభలో 1991లో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఆ సమయంలో పి.వి.నరసింహారావు ప్రధానిగా ఉన్నారు.
  • పంచాయతీరాజ్ వ్యవస్థపై ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లును 1992 డిసెంబర్ 22న లోక్‌సభ, డిసెంబర్ 23న రాజ్యసభ ఆమోదించాయి.
  • 17 రాష్ట్రాలు ఈ బిల్లును ఆమోదించాయి. 1993 ఏప్రిల్ 20న రాష్ర్టపతి ఈ బిల్లుపై సంతకం చేశారు.
  • 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 1993లో నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని రాజ్యాంగబద్ధం చేశారు. రాజ్యాంగంలోని 9వ భాగంలో.. 11వ షెడ్యూల్లో ఆర్టికల్ 242(ఎ) నుంచి ఆర్టికల్ 243 ఎ(ఓ) వరకు వీటిని పొందుపర్చారు
  • నూతన పంచాయతీరాజ్ చట్టం 1993 ఏప్రిల్ 24న అమల్లోకి వచ్చింది.
  • ఆర్టికల్ 243 పంచాయతీల గురించి వివరిస్తుంది.
  • ఆర్టికల్ 243(ఎ) ప్రకారం గ్రామసభ, ఆర్టికల్ 243(బి) ప్రకారం ప్రతి రాష్ర్టంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంటుంది.
  • ఆర్టికల్ 243(సి) పంచాయతీ నిర్మాణం, ఎన్నికల గురించి తెలుపుతుంది.
  • ఆర్టికల్ 243(డి) ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలి. మహిళలకు 1/3వ వంతు స్థానాలు కేటాయించాలి.
  • మహిళలకు 243(ఇ) ప్రకారం పంచాయతీల కాలపరిమితి ఐదేళ్లు.
  • ఆర్టికల్ 243(హెచ్) ప్రకారం రాష్ర్టపతి, శాసనసభ చేసిన చట్టం ఆధారంగా పన్నులను వసూలు చేసే అధికారం పంచాయతీలకు ఉంటుంది.
  • ఆర్టికల్ 243(ఐ) ప్రకారం రాష్ర్ట ఆర్థిక సంఘాన్ని, ఆర్టికల్ 243(కె) ప్రకారం రాష్ర్ట ఎన్నికల సంఘాన్ని.. గవర్నర్ ఏర్పాటు చేస్తారు.
  • గ్రామంలోని ఓటర్లతో గ్రామసభ ఏర్పాటు చేయాలి.
  • అన్ని రాష్ట్రాలు కచ్చితంగా మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
  • గ్రామాల్లో గ్రామ పంచాయతీ, మధ్యస్థాయిలో పంచాయతీ సమితిలు, జ్లిలా స్థాయిలో జిల్లా పరిషత్ ఏర్పాటు చేయాలి.
  • పంచాయతీరాజ్ సంస్థలకు పోటీ చేయడానికి కావాల్సిన కనిష్ట వయస్సు 21 ఏళ్లు.
  • ఏదైనా ఒక రాష్ర్టంలో 20 లక్షల కంటే తక్కువ జనాభా ఉంటే రెండో అంచె పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు.
  • 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ అమల్లో లేని రాష్ట్రాలు...
    జమ్మూ కశ్మీర్, నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం; మణిపూర్‌లోని కొండ ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్, గుర్కా హిల్ కౌన్సిల్ ప్రాంతం.
  • 2000లో 83వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 243(ఎం)ను చేర్చి అరుణాచల్ ప్రదేశ్‌లో ఎస్సీలకు రిజర్వేషన్లు తొలగించారు.
  • ఆంధ్రప్రదేశ్‌లో నూతన పంచాయతీరాజ్ చట్టం 1994 మే 30న అమల్లోకి వచ్చింది.
  • 1994 నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పంచాయతీరాజ్, మున్సిపాలిటీలలో ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 8 శాతం, బీసీలకు 33 శాతం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించారు.
  • పంచాయతీరాజ్ సంస్థలకు 11వ షెడ్యూల్లో 29 అధికారాలు కల్పించారు. వీటిపై పంచాయతీరాజ్ సంస్థల అధికార పరిధి ఉంటుంది.
11వ షెడ్యూల్లోని ముఖ్యాంశాలు
  • వ్యవసాయం, భూ సంస్కరణలు, చిన్న తరహా సాగునీటి పథకాలు- చేపల పెంపకం, సామాజిక అడవులు, తాగునీటి వసతి, రోడ్లు, బీపీఎల్ పథకాలు, వైద్యం, గ్రంథాలయాలు, ప్రజాపంపిణీ వ్యవస్థ, కుటుంబ పరిరక్షణ, సామాజిక ఆస్తుల పర్యవేక్షణ, పారిశ్రామిక శిక్షణ- స్త్రీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు.

గ‌తంలో అడిగిన ప్రశ్నలు

1. స్థానిక స్వపరిపాలనా సంస్థలకు, వాటికి సంబంధించి 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు అన్వయించని రాష్ట్రాలు?
ఎ) గోవా, జమ్మూకశ్మీర్, పుదుచ్చేరి
బి) ఢిల్లీ, గోవా, మిజోరాం, మేఘాలయ
సి) మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం
డి) మణిపూర్, నాగాలాండ్
Published date : 25 Sep 2015 02:59PM

Photo Stories