Skip to main content

మానవ హక్కుల కమిషన్లు.. విధులు

మానవ ప్రగతికి దోహదం చేసే పరిస్థితులే హక్కులు. సమాజ ఆమోదం పొంది, చట్టబద్ధమైనప్పుడే అవి అర్థవంతమవుతాయి. జాతి, మత, కుల, లింగ, ప్రాంతీయ తేడాలతో సంబంధం లేకుండా మానవులందరికీ హక్కులు వర్తిస్తాయి. వ్యక్తి గౌరవాన్ని (ఔన్నత్యాన్ని) పెంపొందించడానికి హక్కులు అవసరం. ఇవి మానవ నాగరికతకు నూతన ప్రమాణాలు.
ఐక్యరాజ్యసమితి 1948లో మానవ హక్కుల చార్టర్‌ను ఆమోదించింది. ఇందులో పొందుపరచిన ముఖ్య హక్కులు.. వాక్ స్వాతంత్య్రం, స్వేచ్ఛగా సంచరించే హక్కు, పనిహక్కు, తగిన విశ్రాంతి పొందే హక్కు, సామాజిక భద్రతహక్కు, విద్యా హక్కు, జీవించేహక్కు, మతస్వాతంత్య్ర హక్కు, శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు, సంఘాలుగా ఏర్పడే హక్కు తదితరాలు. ఈ హక్కులను భారత రాజ్యాంగ పీఠికలో ప్రస్తావించిన అంశాలు ప్రతిబింబిస్తాయి. మన రాజ్యాంగంలో మూడో భాగంలో పొందుపరచిన ప్రాథమిక హక్కులు... ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ఆమోదించిన, మానవ హక్కుల చార్టరులో 2-21 ప్రకరణల్లోని అంశాలతో ఏకీభవిస్తాయి. అదే విధంగా నాలుగో భాగంలో ప్రస్తావించిన ఆదేశసూత్రాలు ఐక్యరాజ్యసమితి చార్టరులోని 22-28 ప్రకరణలకు అనుగుణంగా ఉన్నాయి.
మానవ హక్కులు వ్యక్తులకు, సమాజానికి, రాజ్యానికి మధ్య సరిహద్దులాఉంటాయి. తోటి వ్యక్తులు, సమాజం, ముఖ్యంగా ప్రభుత్వ వ్యవస్థల నుంచి (రాజ్యం) సగటు మనిషిని మానవ హక్కులు కాపాడుతాయి. ప్రజాస్వామ్యం ప్రాచుర్యంలోకి రావడంతో మానవులంతా సమానమనే భావనకు ప్రాధాన్యం పెరిగింది. ప్రతి సమాజంలో కొన్ని వర్గాలకు చెందిన వారు చారిత్రక, సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక కారణాల వల్ల వెనుకబడి ఉంటారు. వీరు మిగిలిన వారితో సమానంగా రాజ్యం, సమాజం అందించే సదుపాయాలను (హక్కులను) అనుభవించలేరు. దీనికి తోడు ఆధునిక కాలంలో శక్తివుంతమైన వ్యవస్థగా రూపొందించిన ఉద్యోగిస్వామ్యం సమాజానికి సేవ చేయడానికి బదులు, ఆ నెపంతో సగటు పౌరుని హక్కులను తన అధికార దుర్వినియోగం ద్వారా కాలరాస్తోంది. ఈ నేపథ్యంలో సాధారణ పౌరుని కనీస హక్కులను కాపాడటానికి స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించే యంత్రాంగం అవసరమైంది; అదే మానవ హక్కుల కమిషన్.

జాతీయ మానవ హక్కుల కమిషన్
దేశంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ 1993లో పని చేయడం ప్రారంభించింది. ఇది ‘మానవ హక్కుల రక్షణ చట్టం-1993’ నిబంధనల మేరకు పనిచేస్తుంది. దీన్ని 2006లో సవరించారు. ఇదే చట్టప్రకారం రాష్ట్ర స్థాయిలో కూడా మానవహక్కుల కమిషన్ ఏర్పాటుకు అవకాశం ఏర్పడింది. కమిషన్ అధ్యక్షులుగా పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యవహరిస్తే మిగిలిన నలుగురు సభ్యుల్లో ఒకరు పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి, మరొకరు పదవీ విరమణ చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మిగిలిన ఇద్దరు మానవ హక్కుల పరిరక్షణ కార్యకలాపాల్లో అనుభవం ఉన్న వ్యక్తులు. వీరితోపాటు జాతీయ షెడ్యూల్డు కులాల కమిషన్ అధ్యక్షులు, జాతీయ షెడ్యూల్డు తెగల కమిషన్ అధ్యక్షులు, జాతీయ అల్పసంఖ్యాక వర్గాల కమిషన్ అధ్యక్షులు, జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షులు-పదవీ రీత్యా(ఎక్స్‌అఫీషియో) సభ్యత్వం కలిగి ఉంటారు. వీరిని రాష్ట్రపతి నియుమిస్తారు. ప్రధానమంత్రి అధ్యక్షతన, లోక్‌సభ స్పీకర్, హోంశాఖ మంత్రి, లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతిపక్ష నాయకులు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ సభ్యులుగా ఉన్న కమిటీ సిఫార్సుల మేరకు కమిషన్ సభ్యులను నియమిస్తారు. పదవీకాలం ఐదేళ్లు లేదా 70 సంవత్సరాల వయసు వచ్చేంతవరకు (ఏది ముందైతే అది). సభ్యులు వయో పరిమితికి లోబడి రెండోసారి ఎంపిక కావచ్చు. వీరిని తొలగించే విధానం యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ సభ్యులను తొలగించే ప్రక్రియను పోలి ఉంటుంది. ప్రస్తుతం కమిషన్‌కు తాత్కాలిక ఛైర్‌పర్సన్‌గా జస్టిస్ సిరియాక్ జోసెఫ్ ఉన్నారు.

కమిషన్ విధులు
  • మానవ హక్కుల ఉల్లంఘన లేక ఉల్లంఘనను నివారించడంలో ప్రభుత్వోద్యోగి విఫలమైనపుడు,కమిషన్ తనంతట తానుగా లేదా, ఫిర్యాదు ఆధారంగా విచారణ జరపడం.
  • కోర్టు అనుమతితో మానవహక్కుల ఉల్లంఘనకు సంబంధించిన కేసులో కమిషన్ కక్షిదారునిగా చేరడం.
  • రాష్ట్ర ప్రభుత్వానికి తెలియచేసి, జైళ్లను, ఇతర నిర్బంధగృహాలను సందర్శించి, తనిఖీ చేయడం. అక్కడ ఉన్న వారికి కనీస వసతులు కల్పనపై విచారించడం, అవసరమైన సూచనలివ్వడం.
  • మానవ హక్కుల పరిరక్షణకు రాజ్యాంగంలో పొందుపరచిన అంశాలను, చట్టపరమైన నిబంధనలను నిరంతరం సమీక్షిస్తూ, వాటి సమర్థ అమలుకు తగు సూచనలివ్వడం.
  • మానవ హక్కులను అనుభవించడంలో ఎదురవుతున్న అంశాలను (ఉగ్రవాద చర్యలతో సహా) సమీక్షించి వాటిని తొలగించడానికి తగు సూచనలివ్వడం.
  • మానవహక్కుల పరిరక్షణకు రూపొందించిన అంతర్జాతీయ ఒప్పందాలను సమీక్షించి,అవసరమైన సిఫార్సులు చేయుడం.
  • మీడియా, ఇతర ప్రసార సాధనాల ద్వారా సమాజంలో మానవ హక్కులపై చైతన్యం కలిగించడం.
  • మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలను ప్రోత్సహించడం.
  • మానవ హక్కుల పరిరక్షణకు అవసరమైన ఇతర చర్యలు తీసుకోవడం.
అధికారాలు: మానవహక్కుల రక్షణ చట్టనిబంధనల ప్రకారం.. స్వీకరించిన అభియోగాలను విచారించడానికి కమిషన్‌కు సివిల్ న్యాయస్థాన అధికారాలుంటాయి.
ఆ మేరకు:
  • సాక్షులను హాజరవమని ఆదేశించడం
  • అవసరమైన అధికార పత్రాలను సేకరించడం
  • ఆధారాలు సేకరించడం
  • ప్రభుత్వ కార్యాలయం/న్యాయస్థానం నుంచి అధికార పత్రాలను సేకరించడం
  • సాక్షులు/పత్రాలను పరిశీలించడం, కమిషన్లు జారీ చేయడం. ఇతర విషయాలను పరిశీలించడం
విచారణ ప్రక్రియ
కమిషన్ తాను స్వీకరించిన ఫిర్యాదులను విచారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవసరమైన సమాచారాన్ని కోరుతుంది. నిర్ణీత వ్యవధిలో సంబంధిత పాలనా యంత్రాంగం నుంచి తగిన స్పందన లభించకపోతే, స్వయంగా విచారణ చేపడుతుంది. విచారణ తర్వాత, కమిషన్ తీసుకునే చర్యలు..
  • మానవ హక్కుల ఉల్లంఘన ప్రభుత్వ ఉద్యోగి నిర్లక్ష్య వైఖరి వల్ల సంభవించిందని కమిషన్ అభిప్రాయపడితే.. సంబంధిత ఉద్యోగిపై చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది.
  • హైకోర్టు/సుప్రీంకోర్టును అవసరమైన ఉత్తర్వులు (రిట్స్) జారీ చేయమని కోరుతుంది.
  • బాధితులకు తగిన నష్టపరిహారం అందించమని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది.
  • సాయుధ బలగాలు మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లు అభియోగాలు వచ్చినప్పుడు, కమిషన్ కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన వివరణ కోరుతుంది. దీని ప్రాతిపదికగా సిఫార్సులు చేస్తుంది. వాటి అమలు తీరుపై కేంద్ర ప్రభుత్వం మూడు నెలల్లోపు కమిషన్‌కు నివేదికను సవుర్పించాలి.
కమిషన్ స్వీకరించని అభియోగాలు
  • ఏడాది కంటే ఎక్కువ కాలం క్రితం సంభవించిన సంఘటనల మీద ఫిర్యాదులు
  • న్యాయస్థాన పరిధిలో ఉన్న అంశాలు
  • స్పష్టత లేని, ఆకాశరామన్న ఫిర్యాదులు
  • ఉద్యోగ పని షరతులకు సంబంధించిన విషయాలు
  • ప్రాముఖ్యంలేని అంశాలు
కమిషన్ దృష్టికి వచ్చిన ఫిర్యాదులు
1. పోలీసులకు సంబంధించి:
  • బాధితుల ఫిర్యాదుల మీద చర్యలు తీసుకోవడానికి నిరాకరించడం
  • తప్పుడు కేసులు బనాయించడం
  • నిర్బంధంలో ఉన్నప్పుడు హింసించడం
  • ప్రజల అక్రమ నిర్బంధం
  • ఇతర హింసలు
  • నిర్ భంధంలో మరణాలు
  • ఎన్‌కౌంటర్‌లు
  • ఖైదీలను హింసించడం, కనీస వసతులు కల్పించకపోవడం
2. షెడ్యూల్డ్ కులాలు, తెగల వారిపై అత్యాచారాలు
3. వెట్టిచాకిరీ, బాలకార్మిక వ్యవస్థ
4. మతపరమైన హింసలు
5. బాల్య వివాహాలు
6. వరకట్న చామలు, వేధింపులు
7. లైంగిక వేధింపులు
8. మహిళలపై అత్యాచారం

కమిషన్ ఇప్పటివరకు చొరవ తీసుకొన్న విషయాలు
  • పౌరహక్కుల పరిరక్షణకు చర్యలు
  • ఉగ్రవాద నివారణ చట్ట సమీక్ష
  • పోలీసు ప్రధాన కార్యాలయాల్లో మానవహక్కుల విభాగం ఏర్పాటు
  • నిర్బంధ మరణాలు,అత్యాచారాల నిరోధానికి చర్యలు
  • పోలీసు, జైళ్ల వ్యవస్థలో సంస్కరణలకు సిఫార్సులు
  • జైళ్లను, మానసిక రోగుల ఆస్పత్రులను సందర్శించడం
  • అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు సూచనలు
  • సంచార తెగల హక్కుల పరిరక్షణ వితంతు సంక్షేవుం
  • సాయుధ బలగాలకు, పోలీసు ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, విద్యార్థులకు మానవహక్కుల పరిరక్షణలో అవగాహన కల్పించడం.
  • స్వచ్ఛంద సేవా సంస్థలకు మానవహక్కుల పరిరక్షణలో తగిన సహకారాన్ని అందించడం.
  • మానవహక్కుల మీద విస్తృత అధ్యయనాలు చేయడం
  • వార్షిక నివేదికలు రూపొందించడం
రాష్ట్ర మానవహక్కుల కమిషన్లు
రాష్ట్రాల్లో కూడా మానవహక్కుల కమిషన్లు ఏర్పడ్డాయి. మానవహక్కుల పరిరక్షణ చట్టం (1993) నిబంధనల మేరకు పదవీ విరమణ చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కమిషన్‌కు అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. పదవీ విరమణ చేసిన హైకోర్టు న్యాయమూర్తి/జిల్లా న్యాయమూర్తి (కనీసం ఏడేళ్ల అనుభవం), మానవహక్కుల పరిరక్షణలో అనుభవమున్న వ్యక్తులను కమిషన్ సభ్యులుగా గవర్నర్ నియమిస్తారు. ముఖ్యవుంత్రి అధ్యక్షునిగా, విధానసభ స్పీకర్, హోంశాఖ వుంత్రి, విధానసభ ప్రతిపక్ష సభ్యులతో ఏర్పడిన కమిటీ సిఫార్సుల మేరకు కమిషన్ సభ్యులను నియమిస్తారు. రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్‌లో పొందుపరచిన రాష్ట్ర, ఉవ్ముడి జాబితాలోని అంశాలకు సంబంధించి మానవహక్కుల ఉల్లంఘన ఘటనలన్నీ దీని పరిధిలోకి వస్తాయి. కమిషన్ విధి విధానాలు జాతీయు కమిషన్ విధివిధానాలను పోలి ఉంటాయి. సభ్యులను తొలగించే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంది. సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతితో, రాష్ట్ర ప్రభుత్వం, మానవహక్కుల న్యాయస్థానాలను ఏర్పాటు చేయవచ్చు. ఇవి ప్రత్యేక న్యాయస్థానాలు. కేసులను వాదించడానికి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించవచ్చు.
 
కమిషన్ల పనితీరు
బాధ్యతారహితంగా వ్యవహరించే పాలనా యుంత్రాంగాన్ని, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను, జవాబుదారీతనం చేయడంలో కమిషన్లు కొంత మేరకు విజయవంతమైనప్పటికీ.. మానవహక్కుల పరిరక్షణ చట్టాన్ని సవరించి, కమిషన్లకు మరిన్ని అధికారాలు అవసరం. అవసరం మేరకు వనరులు (మానవ, ఆర్థిక) లేక కమిషన్లు సతమతమవుతున్నాయి. కమిషన్ల గురించి దేశంలో 90 శాతం ప్రజలకు అవగాహన లేదంటే అతిశయోక్తి కాదు. దీని పరిధిని సాయుధ బలగాలకు విస్తరింప చేయకపోవడం పెద్దలోపం. ఈశాన్య సరిహద్దు రాష్ట్రాల్లో, జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన ప్రధానంగా సైనిక బలగాల వల్లనే జరుగుతోంది. అనేక సందర్భాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కమిషన్లకు సహకరించటం లేదు. చురుకైన పౌర సమాజం, మానవ హక్కుల స్పృహ కలిగిన ఉద్యోగి స్వావ్యుం, రాజకీయు నాయకుల్లో చిత్తశుద్ధి.. ఈ మూడు అంశాలు మానవ హక్కుల కమిషన్లను బలోపేతం చేస్తాయి.
Published date : 12 Dec 2015 12:18PM

Photo Stories