Skip to main content

భవిష్యత్ విధాత.. భారత రాజ్యాంగం!

ఆధునిక ప్రపంచ రాజ్యాంగాల్లోకెల్లా భారతదేశ రాజ్యాంగం ఎంతో విశిష్టమైంది. భారత రాజ్యాంగం అనేక చారిత్రక పరిణామాల నుంచి ఆవిర్భవించింది. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ రూపొందించింది. ఎంతో మంది మేధావులు, రాజనీతిజ్ఞులు రాజ్యాంగ పరిషత్‌గా ఏర్పడి జరిపిన చర్చల ఫలితంగా రాజ్యాంగం రూపొందింది. భారతదేశంలో పటిష్టమైన సంక్షేమ రాజ్యాన్ని, విశిష్టమైన శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల ఏర్పాటుకు రాజ్యాంగం పునాదులు వేసింది. రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 66 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2015 నవంబర్ 26న ‘రాజ్యాంగ దినోత్సవం’ జరుపుకొన్నాం. ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగం రూపకల్పన, గత ఆరు దశాబ్దాలకుపైగా దేశంలో రాజ్యాంగం అమలవుతున్న తీరుతెన్నులపై టీఎస్‌పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యులు, ఉస్మానియా లా కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి.బి.రెడ్డి గ్రూప్స్ అభ్యర్థుల కోసం సాక్షికి ప్రత్యేకంగా అందిస్తోన్న విశ్లేషణాత్మక కథనం..
రాజ్యాంగ నిర్మాణం జరిగిందిలా
భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ రూపొందించింది. రాజ్యాంగ పరిషత్‌కు 1946లో ఎన్నికలు జరిగాయి. రాజ్యాంగ పరిషత్‌లో మొత్తం సభ్యుల సంఖ్య 389. రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం 1946 డిసెంబర్ 9న జరిగింది. రాజ్యాంగ పరిషత్‌కు తాత్కాలిక స్పీకర్‌గా సచ్చిదానంద సిన్హా వ్యవహరించారు. 1946 డిసెంబర్ 11న జరిగిన సమావేశంలో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్‌ను రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అంతర్జాతీయంగా పేరొందిన న్యాయవాది బెనగల్ నర్సింగరావును రాజ్యాంగ పరిషత్ ముఖ్య సలహాదారుగా నియమించారు. 1946 డిసెంబర్ 13న జవహర్‌లాల్ నెహ్రూ చారిత్రాత్మక ‘లక్ష్యాల తీర్మానాన్ని(ఆబ్జెక్టివ్ రెజల్యూషన్)’ రాజ్యాంగ పరిషత్‌లో ప్రవేశపెట్టారు. భారతదేశాన్ని ఒక సార్వభౌమాధికార, స్వతంత్ర, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా రూపొందించమని రాజ్యాంగ పరిషత్‌కు విన్నవించారు. నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాల తీర్మానం రాజ్యాంగ తత్వానికి, ఆదర్శాలకు, లక్ష్యాలకు మూలం. ఇది ప్రవేశికకు ప్రధాన ఆధారం. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రచనకు 22 కమిటీలను నియమించింది. ఈ కమిటీల్లో అత్యంత ముఖ్యమైంది రాజ్యాంగ రచనా కమిటీ(డ్రాఫ్టింగ్ కమిటీ). ఇది 1947 ఆగస్టు 29న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో ఏర్పాటైంది. అల్లాడి కృష్టస్వామి అయ్యర్, ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, సయ్యద్ సాదుల్లా, డాక్టర్ కె.ఎం.మున్షి, బి.ఎల్.మిత్తర్, డి.పి.ఖైతాన్ సభ్యులు. తర్వాత మరో సభ్యుడిగా ఎన్.మాధవరావును కమిటీలోకి నామినేట్ చేశారు. డి.పి.ఖైతాన్ మరణంతో ఏర్పడిన ఖాళీని టి.టి.కృష్ణమాచారితో భర్తీ చేశారు. డ్రాఫ్టింగ్ కమిటీ మొదటి సమావేశం 1947 ఆగస్టు 30న జరిగింది. ముసాయిదా కమిటీ రెండు డ్రాఫ్ట్‌లను తయారు చేసింది. రాజ్యాంగ ముసాయిదాను 1948 ఫిబ్రవరి 21న ప్రచురించారు. ఈ రాజ్యాంగ ప్రతిపై 7635 సవరణలు ప్రతిపాదించగా, 2473 సవరణలు ఆమోదం పొందాయి. రాజ్యాంగ పరిషత్ ఈ ముసాయిదాను 114 రోజులు పరిశీలించి 1949 నవంబర్ 26న ఆమోదించింది. మొత్తమ్మీద రాజ్యాంగ రచనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది.
రాజ్యాంగం అనేది ప్రతి దేశంలో అత్యున్నత చట్టం. మన దేశంలో కూడా రాజ్యాంగం అత్యున్నత చట్టం. రాజ్యాంగం ద్వారానే రాజ్యంలో శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థలకు అధికారాలు సంక్రమిస్తాయి. ప్రజలకు సైతం వారి ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛలు రాజ్యాంగం ద్వారానే లభిస్తాయి. అందుకే రాజ్యాంగాన్ని దేశ భవిష్యత్ విధాతగా పేర్కొంటారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి 1946 నుంచి 1949 వరకు దాదాపు 60కి పైగా సమావేశాలు జరిగాయి. వాటిలో రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగ పరిషత్ సభ్యులు, ముసాయిదా కమిటీ సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ముగింపు ఉపన్యాసంలో మాట్లాడుతూ.. ‘మనం ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. రాజ్యాంగంలో కొన్ని విషయాలకు ప్రస్ఫుటంగా అధికరణలు ఉండకపోవచ్చు. కానీ రాజ్యాంగం జయ, అపజయాలు దాన్ని అమలు చేసే వారిపై ఆధారపడి ఉంటాయి. మనం ఎన్నుకునే వారు నిజాయతీ, నైతికత, సామర్థ్యం కలిగిన వారైతే.. లోపభూయిష్టమైన రాజ్యాంగాన్ని కూడా క్రమపద్ధతిలో పనిచేయించగలుగుతారు. ఇలాంటి లక్షణాలు లేకుంటే ఎంతటి మహోన్నత రాజ్యాంగమైనా దేశాన్ని సక్రమంగా నడిపించలేదు’ అని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

రాజ్యాంగం ఎలా పని చేసింది?!
గత 6 దశాబ్దాల కాలంలో రాజ్యాంగం ఎలా పని చేసింది, రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశానికి అనుగుణంగానే పనిచేసిందా?! మారుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత రాజ్యాంగ స్వరూపాన్ని పరిశీలిస్తే.. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత దాని పనితీరును మూడు దశలుగా వివరించవచ్చు.

1) 1950-1973
ఈ దశలో రాజ్యాంగాన్ని అమలు చేసే స్థానాల్లో ఉన్నవారందరూ రాజనీతి కోవిదులు. సహజ వనరులను ప్రజలందరికీ సమానంగా పంచాలనేది వీరి ఉద్దేశం. జమీందార్లు, ఇనాందార్లు మొదలైన భూస్వాముల వద్ద నుంచి లక్షలాది ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలనే ఉద్దేశంతో దానికి సంబంధించిన చట్టాన్ని ఆర్టికల్ 31ఏలో చేర్చారు. ఈ ఆర్టికల్ ద్వారా మధ్యవర్తుల నుంచి భూమి సేకరించి భూమిని ఇచ్చిన వారికి నష్టపరిహారం చెల్లించే ఏర్పాటు చేశారు. భూసేకరణ చేసే సమయానికి ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కు. కాబట్టి ఆయా ప్రైవేట్ వ్యక్తులు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉండటంతో ఆర్టికల్ 31బిని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చారు. ఇందులో భూసంస్కరణలకు సంబంధించిన చట్టాలను పొందుపర్చారు. తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చిన అంశాలపై ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోందని కోర్టును ఆశ్రయించడానికి వీల్లేదు. దీనికి న్యాయ సమీక్ష నుంచి మినహాయింపునిచ్చారు. ఈ 23 ఏళ్లలో రాజకీయ వ్యవస్థ చురుగ్గా పని చేసిందని చెప్పవచ్చు. న్యాయవ్యవస్థ కొన్ని కేసుల్లో ప్రభావవంతమైన తీర్పులు ఇచ్చినప్పటికీ.. సంప్రదాయిక (conservative) ధోరణిలో పనిచేసింది. 1967లో గోలక్‌నాథ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ.. రాజ్యాంగంలో పొందుపరచిన ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్‌కు లేదని పేర్కొంది. అయితే 1971లో ఇందిరా గాంధీ ప్రభుత్వం 24వ రాజ్యాంగ సవరణ చేస్తూ.. పార్లమెంట్‌కు రాజ్యాంగంలోని ఏ అంశాన్నైనా సవరించే అధికారం ఉందని, పార్లమెంట్ అధికారంపై పరిమితులు లేవని స్పష్టం చేసింది. 1973లో కేశవానంద భారతి కేసు తీర్పులో 13 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం.. రాజ్యాంగంలో ఏ అంశాన్నైనా సవరించే అధికారం పార్లమెంట్‌కు ఉందని తెలిపింది. కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చడానికి వీల్లేదని తీర్పునిచ్చింది. భారతదేశ చరిత్రలో ఇది సాహసోపేతమైన తీర్పుగా చెప్పవచ్చు.

2) 1973-1992
1973లో ఇందిరా గాంధీ ఎన్నికను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. దీంతో అప్పటి ప్రభుత్వం రాజ్యాంగపరమైన హోదాలో ఉన్న వ్యక్తికి (ఉదాహరణ: రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రి మొదలైన వారు) సంబంధించిన ఎన్నికను న్యాయ సమీక్షాధికారం నుంచి మినహాయించాలని 39వ రాజ్యాంగ సవరణ చేస్తూ 329ఎను చేర్చారు. కానీ 1975లో ఇందిరా నెహ్రూ గాంధీ వర్సెస్ రాజ్ నరైన్ కేసులో.. సుప్రీంకోర్టు ఈ రాజ్యాంగ సవరణను కొట్టివేసింది. సమన్యాయ సిద్ధాంతం, న్యాయ సమీక్షాధికారం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని తీర్పునిచ్చింది. 1975 జూన్ 25న ఇందిరా గాంధీ ప్రభుత్వం ఆర్టికల్ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని విధించింది. ఆ సమయంలో దేశంలో చాలా అకృత్యాలు జరిగాయి. 1976లో ఏడీఎం జబల్‌పూర్ వర్సెస్ శుక్లా కేసులో.. జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు ఆర్టికల్ 359 ప్రకారం అన్ని ప్రాథమిక హక్కులు సస్పెండ్ అవుతాయని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కానీ జస్టిస్ హెచ్.ఆర్.ఖన్నా మిగతా న్యాయమూర్తుల అభిప్రాయంతో విభేదిస్తూ, ఈ తీర్పును నిరసించారు. రాజ్యాంగం ప్రకారం సంక్రమించే హక్కుల్లో జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు ముఖ్యమైనవని, వీటిని కూడా హరిస్తే మనిషి జీవించడం వ్యర్థమని ఖన్నా పేర్కొన్నారు. 1976లో ఇందిరా గాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ చేసింది. ఈ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల కంటే ఆదేశిక సూత్రాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి, వాటికి ఆధిక్యత కల్పించే ప్రయత్నం చేసింది. కానీ మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రాథమిక హక్కులకు, ఆదేశ సూత్రాలకు మధ్య ఉన్న సమతౌల్యం అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపమని పేర్కొంది. అన్ని ప్రాథమిక హక్కుల మీద అన్ని ఆదేశ సూత్రాలకు ఆధిక్యతనిచ్చే ప్రయత్నాన్ని కొట్టివేసింది. 1981లో మొదటి న్యాయమూర్తుల బదిలీ కేసుకు సంబంధించి ఎస్పీ గుప్తా వర్సెస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కేసులో.. ఉన్నత న్యాయస్థానాల్లో నియామకాలు చేపట్టే ముందు రాష్ట్రపతి సుప్రీంకోర్టును, సంబంధిత రాష్ట్ర హైకోర్టును సంప్రదించడం అంటే వారి అభిప్రాయాన్ని తెలుసుకోవడమేనని, వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చని తీర్పునిచ్చింది.
మండల్ కమిషన్ నివేదిక- కోర్టు తీర్పు
వెనుకబడిన తరగతులను వర్గీకరించి రిజర్వేషన్లు కల్పించడానికి జనతా పార్టీ ప్రభుత్వం 1979లో మండల్ కమిషన్‌ను నియమించింది. బి.పి.మండల్ నేతృత్వంలోని ఈ కమిషన్ దేశంలో 3700కుపైగా కులాలను వెనుకబడిన కులాలుగా గుర్తించింది. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల వారికి కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫారసు చేస్తూ.. 1980లో తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. 1989లో అధికారంలోకి వచ్చిన వి.పి.సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ నివేదికను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి వ్యతిరేకంగా దేశంలో ఆందోళనలు జరిగాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. 1993లో ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో.. సుప్రీంకోర్టు వెనుకబడిన తరగతులకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగబద్ధమేనని తీర్పునిచ్చింది. అలాగే క్రిమీలేయర్ అనే సిద్దాంతాన్ని ప్రతిపాదించింది. క్రిమీలేయర్ పరిధిలోకి వచ్చే వెనుకబడిన వర్గాల వారిని గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు అప్పగించింది. వారిని రిజర్వేషన్లకు అనర్హులుగా పరిగణించాలని సూచించింది. ఈ విధంగా సామాజిక న్యాయం అనే భావన మండల్ కమిషన్ తీర్పులో ప్రస్ఫుటమైంది.

3) 1993 నుంచి నేటి వరకు
సుప్రీంకోర్టు జడ్జీల నియామక ప్రక్రియలో.. రాష్ట్రపతి, ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించే విషయంపై సుప్రీంకోర్టు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసింది. 1982లో మొదటి జడ్జీ కేసులో తీర్పు ప్రకారం సంప్రదించడం అంటే కేవలం అభిప్రాయాన్ని తెలుసుకోవడమే. వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. కానీ 1993 రెండో జడ్జీ కేసు తీర్పులో.. సంప్రదింపు అంటే సమ్మతి (Concurrence) అనే అర్థాన్ని సుప్రీంకోర్టు చెప్పింది. అలాగే 1998లో మూడో జడ్జీ కేసులో.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహాతో పాటు, నలుగురు సీనియర్ న్యాయమూర్తులను(కొలీజియం) కూడా సంప్రదించాలని పేర్కొంది. దీంతో కొలీజియం వ్యవస్థ మరింత పటిష్టమైంది. తాజాగా సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్ట్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా నాలుగో జడ్జీల కేసు తీర్పులో.. 99వ రాజ్యాంగ సవరణ చట్టం 2014ను, నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ (ఎన్‌జేఏసీ) చట్టం 2014ను కొట్టివేసింది. న్యాయ నియామకాల వ్యవస్థలో రాజకీయ జోక్యం సరికాదని, న్యాయ వ్యవస్థ స్వతంత్రమైందని ధర్మాసనం పేర్కొంది. ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తులను నియమించే అధికారం సుప్రీంకోర్టుకు ఉండటం రాజ్యాంగ మౌలిక స్వరూపమని పేర్కొంది.
ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి విధించే అధికారం కేంద్రానికి ఉంది. గత ప్రభుత్వాలు రాజకీయ కారణాలతో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాయి. 1994లో ఎస్.ఆర్.బొమ్మైవర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆర్టికల్ 356 దుర్వినియోగం చాలా వరకు తగ్గిందని చెప్పవచ్చు. మరో ముఖ్య తీర్పు.. 2007లో వచ్చిన ఐ.ఆర్. కోయిల్హో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసు తీర్పు. ఈ కేసులో 1973 ఏప్రిల్ 24 (కేశవానంద భారతి కేసు తీర్పు అనంతరం) తర్వాత తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చిన చట్టాలు కూడా న్యాయ సమీక్షాధికార పరిధిలోకి వస్తాయనీ, వాటిని కోర్టుల్లో ప్రశ్నించవచ్చని న్యాయస్థానం తీర్పునిచ్చింది. 2015లో రామ్‌సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీర్పునిస్తూ .. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ సిఫారసులకు వ్యతిరేకంగా జాట్‌లను ఓబీసీల్లో చేర్చడాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ దశలో న్యాయ వ్యవస్థ క్రియాశీలత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. పర్యావరణ పరిరక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడటం, ఆర్టికల్ 356 దుర్వినియోగాన్ని అరికట్టడం తదితర తీర్పులు కనిపిస్తాయి. శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఎను కొట్టివేయడం దీనికి ఉదాహరణ. ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకాలను తమ పరిధిలోనే ఉంచుకోవడం సుప్రీంకోర్టు సాహసోపేతతీర్పుగా పేర్కొనవచ్చు. 2015 అక్టోబర్ తీర్పు రెండు విపరీత ధోరణులకు తావిచ్చింది. రాజ్యాంగం ప్రకారం ఏ వ్యవస్థకు కూడా రాజ్యాంగానికి మించిన ఔన్నత్యం లేదు. ఔన్నత్యం, ఆధిపత్యం(supremacy) అనేది కేవలం రాజ్యాంగానికి మాత్రమే ఉంటుంది. ఈ విషయాన్ని విస్మరించి వ్యవస్థలు తమ అధికార పరిధిని విస్తరించుకుంటున్నాయి. దీనిపై గతంలో చర్చ జరిగినప్పుడు బి.ఆర్.అంబేద్కర్ మాట్లాడుతూ.. ‘కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయ వ్యవస్థకు స్వతంత్రత అవసరమే. కానీ స్వతంత్రత పేరుతో ఒక సామ్రాజ్యంలో మరో సామ్రాజ్యాన్ని సృష్టించకూడదు’ అని అన్నారు. రాజ్యాంగ రచనా కమిటీలో కీలక సభ్యుడైన అల్లాడి కృష్ణస్వామి అయ్యర్.. ‘ఈ దేశ రాజ్యాంగ భవిష్యత్తు సుప్రీంకోర్టు ఇచ్చే దిశా నిర్దేశాలపై ఆధారపడి ఉంటుంది. సుప్రీంకోర్టు తన విధులు నిర్వర్తిస్తున్నప్పుడు సామాజిక, ఆర్థిక, రాజకీయ ధోరణులను కూడా దృష్టిలో ఉంచుకోవాలి’ అని పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రజల నుంచి వచ్చింది. ప్రతి ఒక్కరు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. రాజ్యాంగం ద్వారానే అధికారం స్వీకరిస్తారు. రాజ్యాంగం పేరిటే విధులు నిర్వహిస్తారు. కాబట్టి రాజ్యాంగానికి ఔన్నత్యం ఆపాదించాలి కానీ వ్యవస్థలకు కాదు!!
Published date : 30 Nov 2015 05:32PM

Photo Stories