Skip to main content

బ్రిటిషర్ల కాలంలో చేసిన చట్టాలు

ఆంగ్లేయులు భారతదేశానికి ప్రధానంగా వ్యాపారం కోసం వచ్చినప్పటికీ ఆ తర్వాత క్రమంగా ఇక్కడ పరిపాలనపై పట్టు సాధించారు. ఇందులో భాగంగా అనేక చట్టాలకు రూపకల్పన చేశారు. వైస్రాయ్‌లు, గవర్నర్ జనరల్స్ భారతదేశంలో వివిధ సంస్కరణలు ప్రవేశపెట్టారు. మనదేశంలో ప్రస్తుతం అమలవుతున్న అనేక చట్టాలు ఈ రూపం సంతరించుకోవడానికి బ్రిటిషర్ల కాలంనాటి విధానాలు, ఉద్యమాలు, సంస్కరణలు దోహదం చేశాయి. వీటికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం..
  • మనదేశంలో స్థానిక స్వపరిపాలన చట్టాలను 1880-84లో చేశారు. లార్డ్ రిప్పన్‌ను భారతదేశంలో స్థానిక పరిపాలనా పితామహుడిగా పేర్కొంటారు.
  • లార్డ్ రిప్పన్ ‘ఇల్బర్టు బిల్లు’ను ప్రవేశపెట్టాడు. దీన్ని గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో న్యాయశాఖ సభ్యుడైన ఇల్బర్ట్ రూపొందించాడు. దీని ద్వారా భారతీయ మెజిస్ట్రేట్లకు యూరోపియన్ నిందితులను విచారించడానికి అధికారం లభించింది.
  • లార్డ్ లాన్స్ డౌన్ గవర్నర్ జనరల్ కాలంలో ‘రెండో కర్మాగారాల చట్టం’ అమల్లోకి వచ్చింది.
  • భారతదేశంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను 1866లో ఏర్పాటు చేశారు. దీన్ని లార్డ్ డఫ్రిన్ నెలకొల్పారు.
  • ‘రైతు బాంధవుడు’గా గుర్తింపు పొందిన వైస్రాయ్ లార్డ్ కర్జన్. ఇతడినే ‘డూ క్విక్ వైస్రాయ్’గా పేర్కొంటారు.
  • లార్డ్ కర్జన్ భారతదేశంలో ప్రత్యేక పురావస్తు శాఖను ఏర్పాటు చేశాడు. పురావస్తు శాఖ మొట్టమొదటి డెరైక్టర్ జనరల్‌గా సర్ జాన్ మార్షల్ పని చేశాడు.
  • 1859లో బెంగాల్‌లో భూమిశిస్తు చట్టాన్ని ప్రవేశపెట్టారు.
  • దేశభాషా పత్రికల చట్టాన్ని అమలు జరిపిన గవర్నర్ జనరల్ ‘లార్డ్ లిట్టన్’.
  • లార్డ్ కానింగ్ 1862లో స్వదేశీ సంస్థానాధిపతుల బ్రిటిష్ రాజప్రతినిధులను సామంతులుగా ప్రకటించాడు.
  • విక్టోరియా రాణి 1877లో ‘భారతదేశ చక్రవర్తి’ అనే బిరుదు ధరించారు.
  • 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భవించింది.
  • లార్డ్ కర్జన్ శాశ్వత కౌలు పద్ధతి ద్వారా నిజాం నుంచి బీరార్ ప్రాంతాన్ని వేరు చేసి బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో విలీనం చేశాడు.
  • భూటాన్‌ను ఆక్రమించిన గవర్నర్ జనరల్ ‘జాన్ లారెన్స్’. బ్రిటిష్ ఇండియా, భూటాన్ మధ్య జరిగిన సంధి పేరు ‘సించులా’.
  • లార్డ్ కర్జన్ భారత్‌లో తొలిసారిగా సీఐడీలను ప్రవేశపెట్టాడు. ఇతడు విశ్వవిద్యాలయాల చట్టాన్ని కూడా రూపొందించాడు. 1901లో బెంగాల్‌లోని ‘పూసా’లో ఇంఫిరియల్ అగ్రికల్చరల్ ఇన్‌స్టిట్యూట్ (వ్యవసాయ పరిశోధనా కేంద్రం) నెలకొల్పాడు.
  • 1905లో బెంగాల్‌ను విభజించిన బ్రిటిష్ రాజప్రతినిధి ‘లార్డ్ కర్జన్’. ఇతడి కాలంలోనే ప్రత్యేక రైల్వే బోర్డును నెలకొల్పారు.
  • 1906లో అఖిల భారత ముస్లింలీగ్‌ను స్థాపించారు. ఇదే సంవత్సరం కేంద్ర వ్యవసాయ శాఖను ఏర్పాటు చేశారు.
  • జాతీయ కాంగ్రెస్‌ను, ముస్లింలను సంతృప్తిపరచడానికి బ్రిటిష్ ప్రభుత్వం 1909లో మింటో మార్లే సంస్కరణల చట్టం ప్రవేశపెట్టింది. ఈ సంస్కరణలు ‘విభజించు, పాలించు’ విధానానికి నాంది పలికాయి.
  • 1911లో హార్డింజ్ కాలంలో దేశ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చారు. సుతమతి, కాశీఘట్టం, గోవిందపూర్ గ్రామాల కలయికతో కలకత్తా నగరం ఏర్పడింది.
  • ఇంగ్లండ్ చక్రవర్తి అయిదో జార్జ్ భారతదేశాన్ని 1911లో సందర్శించాడు.
భారతదేశంలో 1773-1857 మధ్యకాలంలో ఈస్టిండియా కంపెనీ వ్యాపార, వ్యవహారాలను నియంత్రించడానికి బ్రిటిష్ పార్లమెంటు కొన్ని చట్టాలను రూపొందించింది. వీటినే ‘చార్టర్ చట్టాలు’ అంటారు.

రెగ్యులేటింగ్ చట్టం-1773
భారతదేశానికి వ్యాపార రీత్యా వచ్చిన ఈస్టిండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి బ్రిటిష్ పార్లమెంట్ చేసిన తొలి చట్టం ఇది. దీన్ని భారతదేశానికి సంబంధించి ‘మొట్టమొదటి లిఖిత చట్టం’గా పేర్కొంటారు. ఈస్టిండియా కంపెనీకి ఈ చట్టం ద్వారా మొదటిసారిగా రాజకీయ, పరిపాలన అధికారాలు సంక్రమించాయి. కంపెనీ వ్యవహారాలను నియంత్రించే ఉద్దేశంతో రూపొందించడం వల్ల దీన్ని ‘రెగ్యులేటింగ్ చట్టం’ అంటారు. దీని ద్వారా బెంగాల్ గవర్నర్ హోదాను ‘గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్’గా మార్చారు. ఇతడికి సలహాలు ఇవ్వడానికి నలుగురు సభ్యులతో కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేశారు. ‘వారన్ హేస్టింగ్స్’ను తొలి గవర్నర్ జనరల్‌గా నియమించారు. కౌన్సిల్‌లో మెజారిటీ ఆధారంగా నిర్ణయాలు తీసుకునేవారు. గవర్నర్ జనరల్‌కు కాస్టింగ్ ఓటు మాత్రమే ఉండేది. 1774లో ఒక ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు సాధారణ న్యాయమూర్తులతో కలకత్తాలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. ‘ఎలిజా ఇంఫే’ సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించాడు.

పిట్స్ ఇండియా చట్టం-1784
రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరించడానికి బ్రిటిష్ పార్లమెంటు ఈ చట్టాన్ని 1784లో ఆమోదించింది. నాటి బ్రిటన్ ప్రధాని ‘విలియం పిట్’ ఈ చట్టాన్ని ప్రతిపాదించారు. దీని ద్వారా ‘బోర్డ్ ఆఫ్ కంట్రోల్’ అనే నూతన విభాగాన్ని ఏర్పాటు చేసి కంపెనీ రాజకీయ వ్యవహారాలను దానికి అప్పగించారు. అప్పటికే ఉన్న కోర్ట్ ఆఫ్ డెరైక్టర్స్ ను వాణిజ్య వ్యవహారాలకే పరిమితం చేశారు. గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలికి ప్రెసిడెన్సీ ప్రాంతాలపై ప్రత్యక్ష నియంత్రణ అధికారాన్ని ఇచ్చారు. కార్యనిర్వాహక మండలి సభ్యుల సంఖ్యను నాలుగు నుంచి మూడుకు తగ్గించారు.

చార్టర్ చట్టం-1793
ఈ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అధికారాలను విస్తృతం చేశారు. కంపెనీ వ్యాపార గుత్తాధిపత్యాన్ని మరో 20 ఏళ్లకు పొడిగించారు. బోర్డు కార్యదర్శిని పార్లమెంటులో కూర్చోవడానికి అనుమతించారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఉద్యోగుల జీతభత్యాల ఖర్చును భారత రెవెన్యూ నుంచి వినియోగించేవిధంగా, యుద్ధ అవసరాలకు మొత్తం రెవెన్యూను మళ్లించే విధంగా మార్పులు చేశారు.

చార్టర్ చట్టం-1813
ఈస్టిండియా కంపెనీ చార్టర్‌ను మరో 20 ఏళ్లు పొడిగించారు. భారతదేశ వర్తకంపై కంపెనీ గుత్తాధిపత్యాన్ని తొలగించి కేవలం పాలనాపరమైన సంస్థగా మార్చారు. పన్నులు విధించడం, అవి చెల్లించని వారిపై చర్యలను తీసుకునే అధికారాన్ని స్థానిక సంస్థలకు ఇచ్చారు. భారతీయులకు మత, విద్యాపరమైన అధ్యయనం కోసం లక్ష రూపాయలతో నిధి ఏర్పాటు చేశారు. సివిల్ సర్వెంట్లకు శిక్షణా సదుపాయాన్ని కల్పించారు. ఈ చట్టం ద్వారా భారత్‌లో వర్తకం చేయడానికి అందరికీ అవకాశం కల్పించారు.

చార్టర్ చట్టం-1833
ఈస్టిండియా కంపెనీ పాలనను మరో 20 ఏళ్లకు పొడిగించారు. బెంగాల్ గవర్నర్ జనరల్ హోదాను ‘ఇండియన్ గవర్నర్ జనరల్’గా మార్చారు. ఈ హోదాలో భారత మొదటి గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్. రాష్ట్ర ప్రభుత్వాల శాసనాధికారాలను రద్దు చేసి కార్యనిర్వాహక మండలి సమేతుడైన గవర్నర్ జనరల్‌కు పూర్తి శాసనాధికారాలు కల్పించారు. భారతీయ శాసనాలను క్రోడీకరించడానికి భారతీయ ‘లా’ కమిషన్‌ను నియమించారు. దీనికి తొలి అధ్యక్షుడు లార్డ్ మెకాలే.

చార్టర్ చట్టం-1853
చార్టర్ చట్టాల్లో చివరిది. అతి తక్కువ కాలం అమల్లో ఉన్న చార్టర్ చట్టం ఇదే. దీని ద్వారా కంపెనీ పాలనను పొడిగించలేదు. ఇకపై ప్రభుత్వ ఉద్యోగుల ఎంపిక కాంపిటేటివ్ పరీక్షల ఆధారంగానే జరుగుతుందని నిర్దేశించారు. గవర్నర్ జనరల్ సాధారణ మండలి అధికారాలను శాసన, కార్యనిర్వాహక విధులుగా విభజించారు. శాసనాలు రూపొందించే ప్రక్రియ కోసం ‘ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్’ను ఏర్పాటు చేశారు. ఇది బ్రిటిష్ పార్లమెంటులా విధులు నిర్వర్తిస్తుంది. అందువల్ల దీన్ని ‘మినీ పార్లమెంట్’గా పేర్కొంటారు. కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో మొదటిసారిగా స్థానిక ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించారు.

భారత రాజ్యాంగ చట్టం-1858
1857 సిపాయిల తిరుగుబాటుతో భారతదేశంలో కంపెనీ పాలన అంతమై చక్రవర్తి (బ్రిటిష్ రాజు/రాణి) పరిపాలన వచ్చింది. బ్రిటిష్ రాణి 1858 నవంబర్ 1న భారత పరిపాలనా అధికారాన్ని నేరుగా చేపడుతూ ఒక ప్రకటన జారీ చేశారు. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా హోదాను వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చారు. ఇతడు బ్రిటిష్ రాణి పేరుపై దేశ పాలన నిర్వహిస్తాడు. మొదటి వైస్రాయ్ చార్లెస్ కానింగ్. ‘భారత రాజ్య కార్యదర్శి’ అనే కొత్త పదవిని సృష్టించారు. ఇతడు బ్రిటిష్ మంత్రివర్గానికి చెందిన వ్యక్తి. అన్ని విషయాల్లో ఇతడిదే తుది నిర్ణయం. ఇతడి కార్యాలయం లండన్‌లోనే ఉండేది. ఇతడికి సహాయంగా 15 మంది సభ్యులతో సలహా మండలి ఏర్పాటు చేశారు. మొదటి కార్యదర్శి చార్లెస్ వుడ్.

కౌన్సిల్ చట్టం-1861
దీని ద్వారా గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుల సంఖ్యను అయిదుకు పెంచి ఒక్కో సభ్యుడికి ఒక్కో అంశంపై అధికారం ఇచ్చారు. సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు. దీనికి నామమాత్రపు అధికారాలు ఇచ్చారు. 1860లో బడ్జెట్ పద్ధతి ప్రవేశపెట్టారు.

కౌన్సిల్ చట్టం-1892
కౌన్సిల్ చట్టం-1861లోని లోపాలను సరిదిద్దడానికి ఈ చట్టం చేశారు. కేంద్ర శాసనసభలో అనధికార సభ్యుల సంఖ్య 10కి తగ్గకుండా 16 కంటే మించకుండా.. రాష్ర్ట శాసనసభల్లో 8 మందికి తక్కువ కాకుండా 20 మందికి మించకుండా నియంత్రించారు. ఈ చట్టం ద్వారా శాసన మండలి అధికారాలను విస్తృతం చేశారు. బడ్జెట్‌పై చర్చించడం లాంటి అధికారాలను కల్పించారు. గవర్నర్/ గవర్నర్ జనరల్ ముందస్తు అనుమతితో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా శాసనసభల్లో ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నలు వేయడానికి సభ్యులకు అవకాశం కల్పించారు.

మింటో-మార్లే సంస్కరణలు-1909
సెంట్రల్, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుల సంఖ్యను, అధికారాలను పెంచారు. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నిక విధానం ప్రవేశపెట్టారు. ముస్లింలకు ప్రత్యేకంగా నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. వైస్రాయ్, గవర్నర్ల కార్యనిర్వాహక మండలిలో తొలిసారిగా భారతీయులకు సభ్యత్వం కల్పించారు. ఈవిధంగా సభ్యత్వాన్ని పొందిన తొలి భారతీయుడు సత్యేంద్ర ప్రసాద్ సిన్హా.

మాంటెగ్-చెమ్స్‌ఫర్డ్ సంస్కరణలు-1919
ఇవి నూతన రాజ్యాంగ సంస్కరణలకు సంబంధించినవి. రాష్ట్రాల్లో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు. ప్రజల ద్వారా ఎంపికైన ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రి మండలికి విద్య, ఆరోగ్యం, పారిశుధ్యం మొదలైన అంశాలపై అధికారం కల్పించారు. వీటిని బదిలీ చేసిన అధికారాలుగా పేర్కొన్నారు. రెవెన్యూ, ఆర్థిక, శాంతి భద్రతలు మొదలైన అంశాలను రేసేర్వ్ డ్ అధికారాల పేరుతో బ్రిటిష్ గవర్నర్ చేతికి ఇచ్చారు. మత ప్రాతినిధ్యాన్ని సిక్కులు, క్రిస్టియన్లు, ఆంగ్లో-ఇండియన్లు, ఐరోపా వారికి కూడా వర్తింపజేశారు. దేశంలో మొదటిసారి కేంద్ర స్థాయిలో ద్విసభా పద్ధతిని ప్రవేశపెట్టారు. ఎగువసభను రాష్ట్రాల మండలి (కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్), దిగువసభను కేంద్ర శాసనసభ (సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ)గా వ్యవహరించారు.

భారత ప్రభుత్వ చట్టం -1935
దీని ప్రకారం అఖిల భారత సమాఖ్య ఏర్పాటుకు నిర్ణయించారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య 3 జాబితాల ప్రకారం అధికార విభజన చేశారు. రాష్ట్రాల్లోని ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దుచేసి కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రతిపాదించారు. కేంద్రంలో పాలనాంశాలను రిజర్వుడు, ట్రాన్స్ ఫర్డ్ అంశాలుగా విభజించారు. ఈ చట్టం ద్వారా బర్మాను భారతదేశం నుంచి వేరు చేశారు. ఒరిస్సా, సింధ్ అనే రెండు కొత్త ప్రావిన్సులను ఏర్పాటు చేశారు. కేంద్రంలో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్రాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్లను ఏర్పాటు చేశారు. భారతదేశంలో విత్త విధానం, రుణ నియంత్రణ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్థాపించారు.

ముఖ్యాంశాలు
  • విలియం బెంటింగ్ మనదేశంలో ఆధునిక విద్యను ప్రవేశపెట్టాడు. లార్డ్ మెకాలే దీనికి సంబంధించి సూచనలు చేశాడు.
  • అఫ్గానిస్తాన్ - పాకిస్తాన్ మధ్య ‘డ్యూరాండ్ సరిహద్దు రేఖ’ను 1892లో లార్డ్ లాన్‌డౌన్ రాజప్రతినిధి కాలంలో నిర్ణయించారు. రెండో హార్డింజ్ రాజప్రతినిధిగా ఉన్న కాలంలో చైనా - భారత్ మధ్య మెక్‌మోహన్ సరిహద్దు రేఖను నిర్ణయించారు.
  • మొదటి ప్రపంచ యుద్ధవీరుల స్మారక చిహ్నంగా ఢిల్లీలో ఇండియాగేట్‌ను నిర్మించారు. ఈ ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ‘లార్డ్ చెమ్స్‌ఫర్డ్’.
  • బ్రిటిషర్లు రూపొందించిన రాజ్యాంగ సంస్కరణ చట్టాలన్నింటిలో భారత ప్రభుత్వ చట్టం 1935 వివరణాత్మకమైంది. ఇందులో 321 ప్రకరణలు, 10 షెడ్యూళ్లు, 14 భాగాలు ఉన్నాయి.
Published date : 02 Dec 2015 04:47PM

Photo Stories