Skip to main content

శ్వాసవ్యవస్థ

మానవ శరీరంలో రేడియోధార్మిక ప్రభావానికి మొదట గురయ్యే అవయవం ఊపిరితిత్తులు. ఉరఃకుహరంలో స్పాంజి మాదిరి స్థితిస్థాపక శక్తి ఉన్న రెండు ఊపిరితిత్తులు ఉంటాయి. కుడి ఊపిరితిత్తి పెద్దదిగా ఉంటుంది. ఇవి 950 గ్రాముల బరువు ఉంటాయి. ఊపిరితిత్తుల చుట్టూ ఉండే రెండు పొరలను ప్లూరా అంటారు. ఊపిరితిత్తుల అధ్యయాన్ని ప్లూరాలజీ/ పల్మనాలజీ అంటారు.
శ్వాసక్రియ అన్ని సజీవకణాల్లో జరిగే జీవక్రియ. ఇందులో ఆహారపదార్థాలు (గ్లూకోజ్) ఆక్సీకరణం చెంది కార్బన్ డై ఆక్సైడ్, నీరు, శక్తి విడుదలవుతాయి. శ్వాసక్రియను కింది విధంగా సూచిస్తారు.
C6H12O6+ 6O2+ 6H2O → 6CO2+ 12H2O + 686 కి.కేలరీల శక్తి
లక్షణాలు:
  • శ్వాసక్రియ ఒక ఆక్సీకరణ క్రియ. దీన్ని దహన క్రియతో పోల్చవచ్చు. శ్వాసక్రియలో శక్తి దశలవారీగా విడుదలైతే, దహన క్రియలో ఒకేసారి విడుదలవుతుంది.
  • శ్వాసక్రియ ఒక శక్తి మోచక చర్య. దీనివల్ల జీవుల్లో శక్తి ఏర్పడుతుంది.
  • శ్వాసక్రియ ఒక విచ్ఛిన్నక్రియ.
  • శ్వాసక్రియలో కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతుంది. ఈ క్రియలో ఆక్సిజన్‌ను గ్రహించవచ్చు లేదా గ్రహించకపోవచ్చు.
  • వైరస్‌లు శ్వాసక్రియ జరపలేవు.
  • అభివృద్ధి చెందిన మొక్కలు, జంతువుల్లో వాయుసహిత శ్వాసక్రియ జరుగుతుంది.
  • అబివృద్ధి చెందని జీవులైన బ్యాక్టీరియా, నీలిఆకుపచ్చ శైవలాలు, ఈస్టు శిలీంధ్రంలో అవాయు శ్వాసక్రియ జరుగుతుంది.
  • మెదడుకు 5 - 7 సెకన్లపాటు ఆక్సిజన్ సరఫరా జరగకపోతే ఆ వ్యక్తి మరణిస్తాడు. ఉరితీసినపుడు మెదడుకు రక్తం ద్వారా ఆక్సిజన్ అందదు. మెడలోని హయాయిడ్ ఎముక విరుగుతుంది. ఈ కారణాల వల్లే మనిషి చనిపోతాడు.
  • మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గినపుడు ఆవలింతలు వస్తాయి.
  • శరీరం మొత్తం బరువులో మెదడు బరువు రెండు శాతం మాత్రమే. కానీ అది శరీరం తీసుకొనే మొత్తం ఆక్సిజన్‌లో 20 శాతాన్ని వినియోగించుకుంటుంది
  • సాధారణ మానవుడు నిమిషానికి 1.5 లీటర్ల ఆక్సిజన్‌ను తీసుకుంటాడు. చిన్న పిల్లలకు నిమిషానికి 3 లీటర్ల ఆక్సిజన్ అవసరం. క్రీడాకారులు నిమిషానికి 4 లీటర్ల ఆక్సిజన్ తీసుకుంటారు.
  • నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ పరిమాణం 4 మి.గ్రా./లీ. కంటే తక్కువ ఉండకూడదు.
  • కృత్రిమ శ్వాసను అందించేందుకు వాడే ఆక్సిజన్ సిలిండర్‌లో నైట్రోజన్, ఆక్సిజన్ మిశ్రమం ఉంటుంది. లేదా 10 శాతం కార్బన్ డై ఆక్సైడ్, 90 శాతం ఆక్సిజన్ (కార్బొజైన్ మిశ్రమం) ఉంటుంది.
  • శ్వాసక్రియలో ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్ వాయువుల మార్పిడి జరుగుతుంది.
  • మానవ శరీరంలో అత్యధికంగా లభించే వాయువు ఆక్సిజన్.
  • ఈస్ట్ అనే శిలీంధ్రం, మొలకెత్తే విత్తనాలు, కండరాల్లో జరిగే శ్వాసక్రియ.
శ్వాసక్రియ- దశలు
శ్వాసక్రియ మూడు దశల్లో జరుగుతుంది. అవి
బాహ్య శ్వాసక్రియ: శ్వాసాంగాల ద్వారా గ్రహించిన ఆక్సిజన్‌ను రక్తంలోకి, రక్తంలోని కార్బన్ డై ఆక్సైడ్‌ను బయటకు పంపడాన్ని బాహ్య శ్వాసక్రియ అంటారు. దీన్నే వెంటిలేషన్ (వాయుప్రసరణం) అని కూడా అంటారు. ఇది శ్వాసక్రియలో మొదటి దశ.
ప్రసరణ దశ: ఈ దశలో రక్తంలోని హిమోగ్లోబిన్ ద్వారా ఆక్సిజన్ శరీరంలోని వివిధ కణాలకు రవాణా అవుతుంది. కార్బన్ డై ఆక్సైడ్ వ్యతిరేక దిశలో రవాణా అవుతుంది. ఇది రెండో దశ.
అంతర శ్వాసక్రియ/ఆక్సీకరణ క్రియ: కణాలు ఆక్సిజన్‌ను గ్రహించి కార్బన్ డై ఆక్సైడ్‌ను విడుదల చేసే క్రియను అంతర శ్వాసక్రియ/కణ శ్వాసక్రియ/శక్తి విడుదల అంటారు. ఇది రక్తం, కణజాలాల మధ్య జరిగే వాయువుల మార్పిడి.

  • శ్వాసక్రియను నిర్వర్తించే కణాంగం మైటోకాండ్రియా. ఇందులో శక్తి నిల్వ ఉంటుంది. కాబట్టి మైటోకాండ్రియాలను కణశక్తి భాండాగారాలు అంటారు.
  • ATPఅనేది అధిక శక్తి బంధాలున్న అణువు. శక్తి ATPల రూపంలో నిల్వ ఉంటుంది. ATPని ఎనర్జీ కరెన్సీ అంటారు.
  • మైటోకాండ్రియాలో శక్తి ఉత్పత్తి అయ్యే ప్రక్రియ ఆక్సీకరణ ఫాస్ఫారిలేషన్.
గమనిక: ఒక గ్లూకోజ్ అణువు వాయుసహిత శ్వాసక్రియలో పూర్తిగా ఆక్సీకరణం చెందినపుడు 36 లేదా 38 ATP అణువులు ఏర్పడతాయని భావించేవారు. కానీ 30 లేదా 32 ATP అణువులు మాత్రమే ఏర్పడతాయని ఇటీవలి పరిశోధనల ద్వారా తేలింది.
శ్వాసక్రియ రకాలు
శ్వాసక్రియ రెండు రకాలు. అవి..
వాయు శ్వాసక్రియ: వాతావరణంలోని ఆక్సిజన్ సహాయంతో గ్లూకోజ్ సంపూర్ణంగా విచ్ఛిన్నం చెందటం.
C6H12O6+ 6O2+ 6H2O → 6CO2+ 12H2O + 686 కి.కేలరీల శక్తి
ఈ ప్రక్రియ ఉన్నత శ్రేణి మొక్కలు, జంతుకణాల్లో జరుగుతుంది.
అవాయు శ్వాసక్రియ: ఆక్సిజన్ లేకుండా గ్లూకోజ్ పాక్షికంగా విచ్ఛిన్నం చెందుతుంది. ఉదా. బ్యాక్టీరియాలు (బాసిల్లస్, క్లాస్ట్రీడియం), నీలిఆకుపచ్చ శైవలాలు (అనబినా, నాస్టాక్).
  • ఈస్ట్ అనే శిలీంధ్రం, మొలకెత్తే విత్తనాలు, కండరాల్లో జరిగే శ్వాసక్రియ.
C6H12O6 →2CO2 + 2C2H5OH (ఇథనాల్) + 2ATP/56 కి.కేలరీ (ఈస్ట్‌లో)
C6H12O6 → 2C3H6 O3 + (లాక్టికామ్లం) + 2ATP/56 కి.కేలరీ(వేగంగా సంకోచించే కండరంలో)

గమనిక:
వేగంగా సంకోచించే కండరాల్లో లాక్టికామ్లం ఏర్పడటం వల్ల కండరాలు త్వరగా అలసిపోవడాన్ని ‘కండర గ్లాని’ అంటారు.
  • అవాయు శ్వాసక్రియనే కిణ్వనం అని అంటారు. కిణ్వన ప్రక్రియను ఉపయోగించి చక్కెర పదార్థాలను సూక్ష్మజీవుల సమక్షంలో పులియబెట్టి ఆల్కహాల్ తయారుచేస్తారు.
  • ఈస్ట్ శిలీంధ్రాల నుంచి వేరుచేసిన ఎంజైమ్ జైమేజ్. ఈస్ట్ పారిశ్రామికంగా అతి ముఖ్యమైంది. దీని లాభాలు..
  • ద్రాక్ష, చక్కెర పదార్థాల నుంచి ఆల్కహాల్ తయారీ.
  • ఇడ్లీ, దోశ పిండి పులియ బెట్టడం.
  • బ్రెడ్, కేక్స్ లాంటి బేకరీ పరిశ్రమల్లో ఈస్ట్‌ను ఉపయోగిస్తారు. బ్రెడ్‌పై రంధ్రాలు ఏర్పడటానికి, బ్రెడ్ మెత్తగా ఉండటానికి అవాయు శ్వాసక్రియలో కార్బన్ డై ఆక్సైడ్ బయటకు రావడమే కారణం. రొట్టెలను బేకింగ్(వేడి) చేయటం వల్ల ఆల్కహాల్ ఆవిరవుతుంది.
శ్వాసక్రియ విధానం
ఊపిరితిత్తులలో జరిగే శ్వాసక్రియనే పుపుస శ్వాసక్రియ అంటారు. ఇది రెండు దశల్లో జరగుతుంది.
1. ఉచ్ఛ్వాసం: వాతావరణం నుంచి గాలిని ఊపిరితిత్తుల్లోకి పీల్చుకోవడాన్నే ఉచ్ఛ్వాసం అంటారు. పీల్చే గాలిలో ఆక్సిజన్ 21 శాతం, కార్బన్ డై ఆక్సైడ్ 0.03 శాతం ఉంటాయి.
2. నిచ్ఛ్వాసం: ఊపిరితిత్తుల నుంచి గాలిని బయటకు పంపడాన్నే నిచ్ఛ్వాసం అంటారు. బయటకు వదిలే గాలిలో ఆక్సిజన్ 16 శాతం, కార్బన్ డై ఆక్సైడ్ 4.4 శాతం ఉంటాయి. పీల్చే, వదిలే గాలిలో నైట్రోజన్ 78.048 శాతం ఉంటుంది. నైట్రోజన్‌కు రంగు, రుచి, వాసన ఉండదు.
  • సముద్ర అంతర్భాగంలో శ్వాసక్రియ కోసం ఆక్సిజన్, నైట్రోజన్ మిశ్రమాన్ని ఉపయోగిస్తారు.
  • మానవునిలో శ్వాసక్రియ ఒక అసంకల్పిత, అనియంత్రిత చర్య.
  • శ్వాసక్రియను మజ్జాముఖం(మెడుల్లా అబ్లాంగేటా) నియంత్రిస్తుంది.
  • శ్వాసక్రియకు పురుషుల్లో డయాఫ్రం (విభాజక పటలం), స్త్రీలలో పక్కటెముకలు సహాయపడతాయి.
  • ఎత్తుకు వెళ్లే కొద్దీ శ్వాసక్రియ వేగం పెరుగుతుంది. అందుకే ఎత్తయిన ప్రాంతాల్లోని జీవుల్లో ఎర్రరక్త కణాలు అధికంగా ఉంటాయి.
మానవుని శ్వాసక్రియ నిర్మాణం:
మానవుని శ్వాసక్రియలో ఏడు భాగాలు ఉంటాయి. అవి ముక్కు (నాసిక), గ్రసని, స్వరపేటిక, వాయునాళం, శ్వాసనాళం, శ్వాసనాళికలు-వాయుగోణులు, ఊపిరితిత్తులు.
  1. ముక్కు (నాసిక): ఇది శ్వాసవ్యవస్థలో మొదటి భాగం. ముక్కు ద్వారా గాలి లోపలికి ప్రవేశిస్తుంది. నాసికలో రెండు నాసికా కుహరాలు ఉంటాయి. నాసికా కుహరాన్ని, అస్యకుహరాన్ని వేరు చేసే మృదులాస్థి నిర్మాణమే అంగిలి. అంగిలి ఉండటం క్షీరదాల ముఖ్యలక్షణం. పాములోని ఘ్రాణ గ్రాహకాన్ని జాకబ్‌సన్ అవయవం అంటారు. ఘ్రాణ గ్రాహకాలు పాములు, ఎలుకలు, కుక్కల్లో ఎక్కువగా అభివృద్ధి చెందాయి. కుక్కల ఘ్రాణ గ్రాహకం మనిషి కంటే 40 రెట్లు ఎక్కువ. అందుకే నేరస్తులను పట్టుకోవడానికి వీటిని ఉపయోగిస్తారు.
  2. గ్రసని: ఇది వాయు, ఆహారమార్గాల కూడలి. గ్రసని కంఠబిలం ద్వారా స్వరపేటికలోకి తెరచుకుంటుంది. కంఠబిలం మీద మృదులాస్థితో ఏర్పడిన ఉపజిహ్వక మూతలా ఉంటుంది. ఆహారం స్వరపేటికలోకి పోకుండా ఇది అడ్డుకుంటుంది.
  3. ధ్వనిపేటిక /స్వరపేటిక: ఇది వాయునాళం మొదటిభాగం. స్వరపేటిక లో ఒక జత స్వరతంత్రులు ఉంటాయి. ఇవి శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి. పురుషుల స్వరపేటిక స్త్రీల స్వరపేటిక కంటే పొడవుగా, మందంగా ఉంటుంది. కాబట్టి పురుషుల స్వరం గంభీరంగా ఉంటుంది. స్వరకోశాల పౌనఃపున్యం తక్కువ ఉండి, కంపనపరిమితి ఎక్కువగా ఉండటం వల్ల మగవారి స్వరం, సింహం గర్జన గంభీరంగా ఉంటాయి.
    • స్వరకోశాల పౌనఃపున్యం ఎక్కువ, కంపనపరిమితి తక్కువగా ఉండటం వల్ల చిన్నపిల్లలు, స్త్రీల గొంతు కీచుగా ఉంటుంది. ధ్వని పౌనఃపున్యం పెరిగితే కీచుమనే శబ్దం వస్తుంది. ఉదా: దోమ, ఈగ.
    • పక్షుల్లో ‘శబ్దని’ వల్ల శబ్దం ఉత్పత్తి అవుతుంది.
  4. వాయునాళం: ఇది గాలి గొట్టం. దీనిలో 'C' ఆకారపు మృదులాస్థి ఉంగరాలు ఉంటాయి. కప్పలో మెడ లేకపోవడం వల్ల వాయునాళం లేదు. పెంగ్విన్ పక్షుల్లో రెండు వాయునాళాలు ఉంటాయి. బొద్దింకలో వాయునాళం శ్వాసక్రియ జరుపుతుంది.
  5. శ్వాసనాళం: వాయునాళం ఛాతిలోకి ప్రయాణించి రెండు శ్వాసనాళాలుగా విడిపోతుంది.
  6. శ్వాసనాళికలు: ప్రతి శ్వాసనాళం ఊపిరితిత్తిలో ప్రవేశించి తిరిగి విభజన చెంది అనేక శ్వాసనాళికలను ఏర్పరుస్తుంది. శ్వాసనాళం, శ్వాసనాళికలు, వాయుకోశ గోణులు కలిసి తలకిందులుగా ఉండే శ్వాసవృక్షాన్ని ఏర్పరుస్తాయి.
  7. ఊపిరితిత్తులు: ఊపిరితిత్తుల అధ్యయాన్ని ప్లూరాలజీ/ పల్మనాలజీ అంటారు. ఇవి 950 గ్రాముల బరువు ఉంటాయి. మానవ శరీరంలో రేడియోధార్మిక ప్రభావానికి మొదట గురయ్యే అవయవం ఊపిరితిత్తులు. ఉరఃకుహరంలో స్పాంజి మాదిరి స్థితిస్థాపక శక్తి ఉన్న రెండు ఊపిరితిత్తులు ఉంటాయి. కుడి ఊపిరితిత్తి పెద్దదిగా ఉంటుంది. ఊపిరితిత్తుల చుట్టూ ఉండే రెండు పొరలను ప్లూరా అంటారు. కుడి ఊపిరితిత్తిలో 3 తమ్మెలు, ఎడమ ఊపిరితిత్తిలో 2 తమ్మెలు ఉంటాయి. రెండు ఊపిరితిత్తుల్లో కలిపి సుమారు 60 కోట్ల వాయుగోణులు ఉంటాయి. వాయుగోణులు ఊపిరితిత్తుల నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణాలు. వాయుగోణుల్లో వాయు మార్పిడి జరుగుతుంది. ఊపిరితిత్తుల్లో శుభ్రపడిన రక్తం, పుపుస సిర ద్వారా ఎడమ కర్ణిక, ఎడమ జఠరికలను చేరి మహాధమని ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా అవుతుంది.
శ్వాసక్రియ రేటు
ఒక నిమిషంలో జరిగే శ్వాసక్రియ వేగాన్ని శ్వాసక్రియ రేటు అంటారు. శ్వాసరేటుని కొలిచే పరికరం స్పైరోమీటర్. అప్పుడే పుట్టిన శిశువుల్లో శ్వాసక్రియ రేటు నిమిషానికి 32 సార్లు, అయిదేళ్లలోపు పిల్లల్లో 26 సార్లు, 25 ఏళ్ల వయసు వారిలో 12 నుంచి 16, యాభై ఏళ్ల వారిలో నిమిషానికి 18 సార్లు ఉంటుంది. కార్బన్ డై ఆక్సైడ్ శ్వాసక్రియ రేటును ప్రభావితం చేస్తుంది. శ్వాసక్రియ రేటును ఆక్సిజన్ ప్రభావితం చేయదు. నిద్రిస్తున్న సమయంలో శ్వాసక్రియ రేటు అతి తక్కువగా ఉంటుంది. వ్యాయామం చేస్తున్నప్పుడు, టెన్నిస్ ఆడుతున్నప్పుడు శ్వాసక్రియరేటు ఎక్కువగా ఉంటుంది. మొక్కల్లో వేగంగా పెరిగే ప్రాంతాల్లో శ్వాసక్రియ రేటు అధికంగా ఉంటుంది.
ఉదా: అగ్రభాగాలు, పుష్ప కోరకాలు, మొలకెత్తే విత్తనాలు మొదలైనవి. నీటిలో కరిగిన చక్కెరను మొక్కలు గ్రహించి శ్వాసక్రియ జరుపుతాయి. కాబట్టి మొక్కకు చక్కెర ద్రావణాన్ని అందిస్తే శ్వాసక్రియ రేటు పెరుగుతుంది. మొక్కకు పిండి పదార్థ ద్రావణం అందిస్తే శ్వాసక్రియ రేటులో మార్పు ఉండదు. పిండి పదార్థాలు నీటిలో కరగవు కాబట్టి మొక్కలు పిండి పదార్థాలను గ్రహించలేవు. తక్కువ ఉష్ణోగ్రత వద్ద శ్వాసక్రియ ఎంజైమ్‌లు క్రియారహితంగా ఉంటాయి. కాబట్టి రిఫ్రిజిరేటర్లలో ఉంచిన పచ్చికాయల్లో శ్వాసక్రియ జరగకపోవడంతో అవి త్వరగా పండవు. శ్వాసక్రియకు కావలసిన అత్యుత్తమ ఉష్ణోగ్రత 25oC నుంచి 35oC. వృక్షాల్లో రాత్రి పూట శ్వాసక్రియ జరిగి కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతుంది. కాబట్టి రాత్రివేళల్లో చెట్ల కింద నిద్రించొద్దు.
ఆక్సిజన్ తప్ప మరేమి లేని మూసి ఉన్న గదిలో ఒక వ్యక్తిని ఉంచితే అతడి నిచ్ఛ్వాస క్రియలో కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతుంది.
  • చెవి, ముక్కు, గొంతు(ఈఎన్‌టీ)లను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘ఓటోరైనో లారింగాలజీ’ అంటారు.
  • కోసిన అరటి, ఆపిల్, వంకాయ ముక్క ల్లోని ఫినాల్స్, ఆక్సిజన్‌తో చర్య జరిపి క్వినోన్స్ గా మారుతాయి. అందుకే అవి గోధుమ రంగులో కనిపిస్తాయి.

శ్వాసాంగాలు

జీవి శ్వాసాంగం శ్వాసక్రియ రకం
ప్రోటోజోవా జీవులు శరీర కుడ్యం (ప్లాస్మా త్వచం) వ్యాపనం (డిఫ్యూషన్)
చేపలు, రొయ్యలు, టాడ్‌పోల్ లార్వా మొప్పలు (గిల్స్) జల శ్వాసక్రియ
రాచ పీత పుస్తకాకార మొప్పలు జల శ్వాసక్రియ
తేలు, సాలీడు పుస్తకాకర ఊపిరితిత్తులు పుపుస శ్వాసక్రియ
కీటకాలు వాయునాళం వాయునాళ శ్వాసక్రియ
వానపాము, జలగ, సాలమండర్, కప్ప చర్మం చర్మశ్వాసక్రియ
సముద్ర తాబేలు అవస్కరం అవస్కర శ్వాసక్రియ
డిప్నాయ్ చేపలు వాయుకోశాలు -
ఉభయ చరాలు, సరీసృపాలు,
పక్షులు, క్షీరదాలు ఊపిరితిత్తులు పుపుస శ్వాసక్రియ
గమనిక: పక్షుల్లో ద్వంద్వ శ్వాసక్రియ(డబుల్ రెస్పిరేషన్) జరుగుతుంది.
గమనిక: పక్షుల్లో ద్వంద్వ శ్వాసక్రియ(డబుల్ రెస్పిరేషన్) జరుగుతుంది.
Published date : 29 Sep 2015 12:13PM

Photo Stories