Skip to main content

మొక్కలు - ఉపయోగాలు

జీవుల మనుగడకు అవసరమైన ఆక్సిజన్, ఆహారాన్ని మొక్కలు అందిస్తున్నాయి. ఔషధాలు, కలప, అలంకరణ వస్తువులు, నూనె, వనస్పతి తదితరాల కోసం మనం వృక్షాల మీదే ఆధారపడుతున్నాం.
మొక్కలు - ఆహారం:  మనం నిత్యం తీసుకునే ఆహారం మొక్కల నుంచి లభిస్తోంది.ఆహారంగా ఉపయోగించే వరి, గోధుమ, జొన్న, సజ్జ, బార్లీ, మొక్కజొన్న లాంటి ధాన్యాలు పోమేసి కుటుంబ మొక్కల నుంచి; కంది, పెసర, మినుము, శనగ, బీన్స్ మొదలైన పప్పుధాన్యాలు లెగ్యూమినేసి కుటుంబ మొక్కల నుంచి లభిస్తాయి. బియ్యం పైపొరలో విటమిన్ బి1 అధికంగా లభిస్తుంది. జెనెటిక్ ఇంజనీరింగ్ విధానం ద్వారా రూపొందించిన గోల్డెన్ రైస్‌లో విటమిన్-ఎ పుష్కలంగా లభిస్తుంది. పప్పు ధాన్యాల్లో శరీర నిర్మాణానికి అవసరమైన ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. దుంపల్లో కార్బోహైడ్రేట్లు, ఎండు ఫలాల్లో ఫై, ఆకుకూరల్లో క్యాల్షియం, ఐరన్ లాంటి పోషకాలు అధికంగా ఉంటాయి. చెరుకులో తీపిదనం ఎక్కువగా ఉండే ఫ్రక్టోజ్; మామిడి, బొప్పాయి లాంటి ఫలాల్లో విటమిన్-ఎ; ఉసిరి, నిమ్మజాతి, జామ ఫలాల్లో విటమిన్-సి అధికంగా లభిస్తాయి. వీటితోపాటు ఆహారంగా తీసుకునే ఫలాలు..
 1) బెర్రి - టమాట, వంకాయ, అరటి.
 2) ఫోమ్ - ఆపిల్.
 3) పెపో - దోస, గుమ్మడి.
 4) హెస్పరీడియం  - నిమ్మ, బత్తాయి.
 5) డ్రూప్ - మామిడి, కొబ్బరి.
 6) కార్సిరూలస్ - వరి, మొక్కజొన్న.
 7) క్రీమోకార్ప్‌ - ధనియాలు.
 8) ఫిగ్స్‌ - మర్రి, మేడి.
కలప, గృహోపకరణాలు
ఇంటి నిర్మాణానికి, ఫర్నీచర్, అలంకరణ వస్తువులు, సంగీత వాయిద్యాలు, వంట చెరకు కోసం మొక్కల భాగాలను ఉపయోగిస్తారు.
టేకు, మహాగని, వేప, తుమ్మ, రోజ్‌వుడ్ తదితర వృక్షాల కలపను వివిధ అవసరాలకు ఉపయోగిస్తారు. ఎర్ర చందనాన్ని సంగీత వాయిద్యాల తయారీకి, రోజ్‌వుడ్‌ను ఫర్నీచర్ తయారీకి ఉపయోగిస్తారు.
మొక్కలు - అలంకరణ: ఫెర్న్, క్రోటాన్ లాంటి పుష్పించని మొక్కలను; మల్లె, బంతి, చేమంతి, గులాబీ, పిట్యూనియా, గన్నేరు, నైట్ క్వీన్, డే కింగ్, మందార లాంటి అనేక పుష్పాలను అలంకరణ కోసం పెంచుతున్నారు. నైట్‌క్వీన్ మొక్కలు సువాసన వెదజల్లుతాయి. మనీప్లాంట్, క్రోటాన్ లాంటి మొక్కలను నీడలో పెంచుతారు.
మొక్కలు - ఔషధాలు: అధర్వణ వేదంలో ఔషధ మొక్కల గురించి ప్రస్తావించారు. కొన్ని మొక్కల్లో ఔషధ లక్షణాలు ఉంటాయి. వీటిని వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు. వేపను హెర్బల్ డాక్టర్ ఇన్ ఇండియా అని పిలుస్తారు. తులసి నుంచి కాంపర్ అనే ఔషధం లభిస్తుంది. లావెండర్ నుంచి సుగంధ తైలాలు లభిస్తాయి. డిజిటాలిస్ నుంచి లభించే డిజిటాలిన్ గుండె జబ్బులను నయం చేస్తుంది. ఆట్రోపా బెల్లడోనా నుంచి ఆట్రోపిన్ లభిస్తుంది. బాధను తగ్గించడానికి, కంటి పరీక్షల్లో దీన్ని ఉపయోగిస్తారు.
కొన్ని మొక్కల్లో లభించే ఆల్కలాయిడ్‌లు ఔషధాల తయారీలో ఉపయోగపడతాయి. సింఖోనా మొక్క బెరడు నుంచి లభించే క్వినైన్ మలేరియా వ్యాధిని నయం చేస్తుంది. నల్లమందు మొక్క కాయల నుంచి లభించే మార్ఫిన్ నొప్పిని తగ్గించి నిద్రను కలగజేస్తుంది. సర్పగంధి వేరు నుంచి లభించే రిసర్పిన్ జీర్ణకోశ వ్యాధిని తగ్గిస్తుంది. వేప నుంచి లభించే నింబిన్, నింబిడిన్ అనేవి చర్మ సంబంధ వ్యాధులను నయం చేస్తాయి. వేప నుంచి ఎయిడ్స్ ను నయం చేసేందుకు వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్నారు. దతూర పత్రాల నుంచి లభించే స్టృమోనియం ఆస్తమాను నయం చేస్తుంది. కలబంద నుంచి తయారు చేసే ఔషధం పైల్స్‌ను తగ్గిస్తుంది. పెన్సిల్లియం క్రైసోజినం అనే శిలీంధ్రం నుంచి పెన్సిలిన్‌ను తయారు చేస్తారు. దీన్ని యాంటిబయాటిక్‌గా ఉపయోగిస్తారు. పసుపు యాంటిబయాటిక్‌గా పనిచేస్తుంది. ఇది అల్సర్, కామెర్లు, చర్మ సంబంధ వ్యాధులను నయం చేస్తుంది. కాల్చిసిన్ అనే ఆల్కలాయిడ్ గౌట్, రూమాటిసం లాంటి వ్యాధులను తగ్గిస్తుంది. ఫెరులా మొక్క వేర్ల నుంచి లభించే ఇంగువ జీర్ణకోశ సంబంధ, దగ్గు, ఆస్తమా లాంటి వ్యాధులను నయం చేస్తుంది. అశ్వగంధ వేర్లు దగ్గు, రూమాటిసం, అల్సర్ల నివారణకు ఉపయోగపడతాయి. పంటి నొప్పి, నేత్ర సంబంధ వ్యాధులను అల్లం, శొంఠి నయం చేస్తాయి. సరసపరిల్లా చర్మ, నాడీ సంబంధ రుగ్మతలను తగ్గిస్తుంది. ఇది స్మైలాక్స్ నుంచి లభిస్తుంది. దాల్చిన చెక్క డయేరియా, డయాబెటీస్‌ను తగ్గిస్తుంది. ఎపిడ్రా నుంచి లభించే ఏపిడ్రిన్ ఆల్కలాయిడ్ జలుబు, ఆస్తమా లాంటి వ్యాధులను నయం చేస్తుంది. ప్లాస్టర్స్ తయారీకి అట్రోపా నుంచి లభించే అట్రోపిన్ తోడ్పడుతుంది. కుంకుమ పువ్వు కీలం, కీలాగ్రాలు నాడీ, మూత్ర సంబంధ వ్యాధులను నయం చేస్తాయి.
మొక్కలు - పారిశ్రామిక రంగం
పేపర్ తయారీలో సైపరస్ పల్ప్‌ను ఉపయోగిస్తారు. టేకు, మైఖేలియా చెట్ల నుంచి ఫ్లైవుడ్ తయారు చేస్తారు. పెన్సిల్‌ను జునిపెరస్ మొక్కల నుంచి తయారు చేస్తారు. క్రికెట్ బ్యాట్లను సాలిక్స్, పాపులస్ చెట్ల నుంచి తయారు చేస్తారు. హాకీ స్టిక్‌లను మల్బరీ, డాల్‌బర్జియా  వృక్షాల నుంచి తయారు చేస్తారు. బిలియర్డ్ క్యూస్‌ను ఏసర్ మొక్కల నుంచి తయారు చేస్తారు. సబ్బుల తయారీలో కానుగ, కాండిల్స్ తయారీలో మదుకా(ఇప్ప), పామాయిల్ తయారీలో ఇలేయిస్ ఉపయోగపడుతున్నాయి. మునగ, అకేసియా(తుమ్మ) చెట్ల నుంచి జిగురు తయారు చేస్తారు. వార్నిష్, పెయింటింగ్‌లలో ఉపయోగించే రెసిన్లను ఫైనస్ మొక్కల నుంచి తయారు చేస్తున్నారు. టానిన్స్‌ను ఔషధాల తయారీకి, తోళ్ల శుద్ధికి ఉపయోగిస్తారు. ఉదా: తంగేడు, తుమ్మ, బాదం, సిరాను క్వెర్కస్ టానిన్స్ నుంచి తయారు చేస్తారు. లేటెక్స్ అనే పదార్థం నుంచి రబ్బరు తయారు చేస్తారు. ఉదా: హీవియా, ఫైకస్. అద్దకం పరిశ్రమలో ఇండిగో రంగు ఇండిగో ఫెరా నుంచి, పసుపు రంగు కుంకుమ పువ్వు నుంచి, బ్యూటియా నుంచి ఆరెంజ్ - పసుపు అద్దకాలు లభ్యమవుతాయి. కొన్ని మొక్కల నుంచి నేరుగా రసాయనిక పదార్థాలు తయారవుతాయి. నిమ్మ నుంచి ఆస్కార్బిక్ ఆమ్లం, చింత పండు నుంచి టార్టారిక్ ఆమ్లం లభిస్తాయి. వీటితోపాటు కొన్ని నీలి ఆకుపచ్చ శైవలాలు నత్రజని స్థాపనలో తోడ్పడి పంట దిగుబడిని పెంచుతాయి. నాస్టాక్, అనబినా, రైజోబియం, బ్యాక్టీరియా నత్రజని స్థాపనలో ఉపయోగపడుతున్నాయి. కొన్ని రకాల ఎరువులను క్రిసాంథియం(పైరిథ్రిన్) నుంచి, మరికొన్ని జీవ ఎరువులను బ్యాక్టీరియాల నుంచి తయారు చేస్తున్నారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సృష్టించిన కొత్తరకం మొక్కలు మానవ సంక్షేమానికి ఎంతగానో తోడ్పడుతున్నాయి. ఉదా: బీటీ పత్తి, గోల్డెన్ రైస్ లాంటి మొక్కలను జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా, మరికొన్నింటిని కణజాల వర్థనం ద్వారా రూపొందించారు.
జనుము, గోంగూర, అలోవిరా, కొబ్బరి తదితర మొక్కల నుంచి నార లభిస్తుంది. పత్తి నుంచి లభించే కేశాల్లో సెల్యూలోజ్ ఎక్కువగా ఉంటుంది. పొంగామియా (కానుగ), జట్రోపా మొక్కల నుంచి బయోడీజిల్‌ను తయారు చేస్తున్నారు.
Published date : 06 Oct 2015 03:40PM

Photo Stories