Skip to main content

అంతస్స్రావక వ్యవస్థ

జీవక్రియలను సమన్వయం చేయడంలో అంతస్స్రావక వ్యవస్థ పాత్ర కీలకం. గ్రంథులు, అవి స్రవించే హార్మోన్లను కలిపి అంతస్రావక వ్యవస్థగా పేర్కొంటారు. దీని అధ్యయనాన్ని ‘ఎండోక్రైనాలజీ’ అంటారు. పీయూష గ్రంథి ఇతర అంతస్స్రావ గ్రంథులను తన ఆధీనంలో ఉంచుకుంటుంది. కాబట్టి దీన్ని మాస్టర్ గ్లాండ్ అంటారు. పారాథైరాయిడ్ గ్రంథి మాత్రం పీయూష గ్రంథి నియంత్రణలో ఉండదు. మెలనిన్ చర్మానికి, వెంట్రుకలకు రంగునిస్తుంది. మెలనిన్ లోపిస్తే చర్మం తెలుపు రంగులో ఉంటుంది. ఇన్సులిన్ తక్కువైతే రక్తంలో గ్లూకోజ్ శాతం పెరిగి డయాబెటీస్ మెల్లిటస్ (మధుమేహ వ్యాధి) వస్తుంది.
దేహంలో రెండు రకాల గ్రంథులుంటాయి. అవి..
బహిస్స్రావ గ్రంథులు: వీటి స్రావకాలను ఎంజైమ్‌లు అంటారు.
అంతస్స్రావ గ్రంథులు: వీటి స్రావకాలను హార్మోన్లు అంటారు.
అంతస్స్రావ గ్రంథులు, అవి స్రవించే హార్మోన్లను కలిపి అంతస్స్రావక వ్యవస్థగా పేర్కొంటారు. దీని అధ్యయనాన్ని ‘ఎండోక్రైనాలజీ’ అంటారు. ఎండోక్రైనాలజీ పితామహుడు థామస్ ఎడిసన్. మానవ శరీరంలోని వివిధ భాగాల విధులను సమన్వయం చేయడం అంతస్స్రావక వ్యవస్థ ముఖ్యవిధి. హార్మోన్లు శరీరం లోపల జరిగే మార్పులను నెమ్మదిగా నియంత్రిస్తాయి. ఈ హార్మోన్లను రసాయనిక రాయబారులు అంటారు. ఇవి రక్తం లేదా శోషరసంలోకి విడుదలవుతాయి. అనంతరం లక్ష్య అవయవాల్లోకి చేరి వాటిపై ప్రభావం చూపుతాయి. తొలిసారి గుర్తించిన హార్మోన్ సెక్రిటిన్. ఇది ఆంత్రమూలం నుంచి విడుదలై క్లోమ, పైత్యరసాల స్రావకాన్ని ప్రేరేపిస్తుంది. గాస్ట్రిన్, సొమాటోస్టాటిన్ అనేవి స్థానిక హార్మోన్లు. మిగతా హార్మోన్లు రక్తం ద్వారా ప్రయాణించి లక్ష్య అవయవాలపై ప్రభావం చూపుతాయి.
రసాయనికంగా హార్మోన్లను మూడు తరగతులుగా విభజించవచ్చు.
పెప్టైడ్, ప్రోటీన్ హార్మోన్లు: వాసోప్రిస్సిన్, ఆక్సిటోసిన్, పీయూష గ్రంథి, పారాథైరాయిడ్ గ్రంథి, క్లోమ గ్రంథి, రిలాక్సిన్.
అమైనో హార్మోన్లు: అడ్రినలిన్, మెలటోనిన్, థైరాక్సిన్ అమైనో హార్మోన్లు. కాగా థైరాక్సిన్ అయోడినేటెడ్ అమైనో హార్మోన్.
స్టిరాయిడ్స్ హార్మోన్లు: లైంగిక హార్మోన్లు (ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, టెస్టోస్టిరాన్), కార్టిసాల్, ఆల్డోస్టిరాన్. స్టిరాయిడ్‌‌స దేహ నిర్మాణాలను ఉత్తేజపరుస్తాయి. కాబట్టి కృత్రిమ స్టిరాయిడ్లను అథ్లెట్లు అక్రమంగా వాడుతారు.

అంతస్స్రావ గ్రంథులు

పీయూష గ్రంథి
దీనికి పిట్యూటరీ గ్రంథి, మాస్టర్ గ్లాండ్, కింగ్ ఆఫ్ ది గ్లాండ్స్, బ్యాండ్ మాస్టర్ అనే పేర్లు ఉన్నాయి. పీయూష గ్రంథి ఇతర అంతస్స్రావ గ్రంథులను తన ఆధీనంలో ఉంచుకుంటుంది. అందుకే దీన్ని మాస్టర్ గ్లాండ్ అంటారు. పారాథైరాయిడ్ గ్రంథి మాత్రం పీయూష గ్రంథి ఆధీనంలో ఉండదు. పీయూష గ్రంథి మెదడులోని హైపోథాలమస్ కాడకు అంటుకొని ఉండే అతి చిన్న గ్రంథి. దీని బరువు 0.5 నుంచి 1 గ్రాము వరకు ఉంటుంది. ఈ గ్రంధిలో పూర్వ, మధ్య, పర లంబికలు ఉంటాయి. పీయూష గ్రంథి ఉత్పత్తి చేసే హార్మోన్లు..
గ్రోత్ హార్మోన్ (జి.హెచ్): ఇది పెరుగుదలను నియంత్రిస్తుంది. వ్యాయామం చేసే సమయంలో ఎక్కువగా విడుదలవుతుంది. చిన్న పిల్లల్లో ఈ హార్మోన్ ఎక్కువైతే అతి దీర్ఘ కాయత్వం(జైగాంటిజమ్), హార్మోన్ లోపిస్తే మరుగుజ్జుతనం వస్తాయి. పెద్దల్లో ఈ హార్మోన్ ఎక్కువైతే ఆక్రోమెగాళి(చేతులు, కాళ్లు, దవడ ఎముకలు బాగా పెరిగి గొరిల్లా ముఖం వలే కనిపిస్తుంది). ఈ హార్మోన్ లోపిస్తే సైమండ్స్ వ్యాధి (కాచెక్సియా) వస్తుంది.
ల్యుటినైజింగ్ హార్మోన్ (ఎల్.హెచ్): ఈ హార్మోన్ స్త్రీ బీజకోశాల నుంచి ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల విడుదలను ప్రోత్సహిస్తుంది. పురుషుల్లో ముష్కాల నుంచి టెస్టోస్టిరాన్ విడుదలకు తోడ్పడుతుంది.
ఫొలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (ఎఫ్.ఎస్.హెచ్): ఇది స్త్రీలలో అండాల అభివృద్ధి, పురుషుల్లో శుక్రజననాన్ని ప్రోత్సహిస్తుంది.
ప్రోలాక్టిన్: దీన్ని లాక్టోజెనిక్ హార్మోన్/ మాతృత్వ హార్మోన్ అని కూడా అంటారు. ఇది ప్రసవానంతరం పాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.
థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (టి.ఎస్.హెచ్ ): ఇది థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపించి థైరాక్సిన్ విడుదలకు తోడ్పడుతుంది.
మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (ఎమ్.ఎస్.హెచ్): ఈ హార్మోన్ చర్మంలో ఉండే మెలనోసైట్ కణాల నుంచి మెలనిన్ విడుదలకు తోడ్పడుతుంది. మెలనిన్ చర్మానికి, వెంట్రుకలకు రంగునిస్తుంది. మెలనిన్ లోపిస్తే చర్మం తెలుపు రంగులో ఉంటుంది. దీన్ని ఆల్బునిజం అంటారు.ఉదా: అమెరికన్లు, ఆస్ట్రేలియన్లు. మెలనిన్ ఎక్కువైతే చర్మం బాగా నలుపు రంగులో ఉంటుంది. దీన్ని టానింగ్ అంటారు.
ఉదా: టాంజానియా, కెన్యా ప్రజలు.
ఆక్సిటోసిన్ (బర్‌‌తహార్మోన్): ఇది గర్భాశయ కండరాల్లో సంకోచాలు కలిగించి సుఖ ప్రసవానికి తోడ్పడుతుంది. బాలింతల్లో పాల విడుదలకు సహకరిస్తుంది.
వాసోప్రెస్సిన్: దీన్ని అతిమూత్ర నిరోధక హార్మోన్ అంటారు. ఈ హార్మోన్ లోపిస్తే అతిమూత్ర(డయాబెటీస్ ఇన్సిఫిడస్) వ్యాధి వస్తుంది. ఈ రోగి మూత్రంలో గ్లూకోజ్ (చక్కెర) ఉండదు.

థైరాయిడ్ గ్రంథి
ఈ గ్రంథికి అవటు గ్రంథి, ఆడమ్స్ ఆపిల్, హెచ్ గ్రంథి, సీతాకోక చిలుకలాంటి గ్రంథి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇది అతిపెద్ద వినాళగంథి. సుమారు 25 గ్రాముల బరువుంటుంది. మెడలో వాయునాళానికి దగ్గర (స్వరపేటిక కింద) ఉంటుంది. ఇది రెండు లంబికలు కలిగి హెచ్ ఆకారంలో కనిపిస్తుంది. ఈ గ్రంథి థైరాక్సిన్, కాల్సిటోసిన్ హార్మోన్లను విడుదల చేస్తుంది.
  • థైరాక్సిన్ హార్మోన్‌లో ఉండే మూలకం అయోడిన్ (I2).
  • అయోడిన్ మూలకం రక్తంలో ఆక్సిజన్ రవాణాను అధికం చేస్తుంది.
  • థైరాక్సిన్ ఉత్పత్తికి అయోడిన్ అవసరం.
  • సముద్ర కలుపు మొక్కలు (సీ వీడ్‌‌స/ కెల్ఫ్‌లు), చేపలు, రొయ్యలు, పీతల్లో అయోడిన్ అధికంగా ఉంటుంది. ఆహారంలో అయోడిన్ లోపిస్తే థైరాయిడ్ గ్రంథి ఉబ్బి, థైరాక్సిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఈ వ్యాధిని హైపోథైరాయిడిజమ్ లేదా సరళ గాయిటర్, విస్తరించిన అవటు గ్రంథి, అయోడిన్ లోప గాయిటర్ అని అంటారు.
  • అయోడిన్‌ను ఉప్పులో సోడియం అయోడైడ్ రూపంలో కలుపుతారు.
  • అయోడిన్‌కు ఉత్పతనం చెందే లక్షణం ఉంటుంది. కాబట్టి అయోడైజ్‌డ్ సాల్ట్‌ను గాలి చొరబడని ప్యాకెట్లు, డబ్బాల్లో భద్రపరుస్తారు.
థైరాక్సిన్ హార్మోన్ విధులు: శారీరక, మానసిక వికాసానికి తోడ్పడుతుంది. ఆధార జీవక్రియ రేటును పెంచుతుంది. ఒక జీవిలో గది ఉష్ణోగ్రత (27°C) వద్ద విశ్రాంతి సమయంలో జరిగే జీవక్రియ రేటును ఆధార జీవక్రియ రేటు అంటారు. ఇది పెరిగితే శక్తి ఉత్పత్తి జరిగి, ఉష్ణం విడుదలవుతుంది. ఆధార జీవక్రియ రేటును కొలిచే పరికరం ‘స్పైరోమీటర్’. ఏనుగుతో పోల్చినప్పుడు ఎలుకలో ఆధార జీవక్రియ రేటు ఎక్కువ. టాడ్‌పోల్ లార్వా రూపవిక్రియకు ఈ హార్మోన్ తోడ్పడుతుంది. చిన్న పిల్లల్లో థైరాక్సిన్ హార్మోన్ లోపిస్తే క్రిటినిజమ్ (జడవామనుడు) వ్యాధి కలుగుతుంది. పెరుగుదల లోపం, అల్పబుద్ధి, మానసిక మాంద్యం ఈ వ్యాధి లక్షణాలు. స్త్రీలలో ఈ హార్మోన్ లోపంతో రుతు చక్రం క్రమం తప్పుతుంది. పెద్ద వారిలో ఈ హార్మోన్ లోపం వల్ల మిక్సో ఎడిమా వ్యాధి వస్తుంది. ఈ వ్యాధిగ్రస్తుల్లో ఆధార జీవక్రియ రేటు తగ్గి అలసట కలుగుతుంది. పెద్దవారిలో ఈ హార్మోన్ ఎక్కువైతే కనుగుడ్లు వాచి బయటకు పొడుచుకొని వస్తాయి. దీన్ని ఎక్సాప్తాల్మిక్ గాయిటర్ (గ్రేవ్స్ వ్యాధి, హైపర్ థైరాయిడిజమ్) అంటారు.
కాల్సిటోసిన్: ఈ హార్మోన్ రక్తంలో కాల్షియం, ఫాస్ఫేట్‌ల గాఢతను నియంత్రిస్తుంది.

పారాథైరాయిడ్ గ్రంథి
మానవుడిలో నాలుగు పారాథైరాయిడ్ గ్రంథులుంటాయి. ఈ గ్రంథులు థైరాయిడ్ గ్రంథికి పూర్వాంతంలో రెండు, పరాంతంలో రెండు ఉంటాయి. ఈ గ్రంథి స్రవించే హార్మోన్ పారాథార్మాన్. ఈ హార్మోన్ రక్తం, ఎముకల్లో కాల్షియం, ఫాస్ఫరస్ స్థాయిని నియంత్రిస్తుంది. ఫారాథార్మాన్ లోపం వల్ల కండరాలు ఎప్పుడు సంకోచ స్థితిలో ఉంటాయి. దీన్ని ‘టెటానీ’ అంటారు.

క్లోమ గ్రంథి
దీన్ని మిశ్రమగ్రంథి, నాళ వినాళ గ్రంథి, ఆకు లాంటి గ్రంథి అని కూడా అంటారు. ఈ గ్రంథి జీర్ణాశయం కింద ఆంత్రమూలం వంపులో ఉంటుంది. ఇది అంతస్స్రావ గంథుల్లో రెండో పెద్దగ్రంథి. క్లోమగ్రంథి అధ్యయనాన్ని పాంక్రియాలజీ అంటారు.
- క్లోమ గ్రంథిలో రెండు భాగాలుంటాయి.
1) నాళభాగం - క్లోమరసాన్ని స్రవిస్తుంది.
2) వినాళ గ్రంథి భాగం - ఈ భాగంలో లాంగర్ హన్స్ పుటికలుంటాయి. వీటిలో ఆల్ఫా, బీటా కణాలుంటాయి.
బీటాకణాలు: ఇవి ఇన్సులిన్ హార్మోన్‌ను స్రవిస్తాయి.
  • ఇన్సులిన్ ప్రోటీన్ నిర్మిత హార్మోన్.
  • ఇన్సులిన్‌ను కనుగొన్న శాస్త్రవేత్తలు - బాంటింగ్, బెస్ట్.
  • ఈ హార్మోన్ రక్తంలో గ్లూకోజ్ (చక్కెర స్థాయి)ని తగ్గిస్తుంది.
  • ఆరోగ్యవంతమైన వ్యక్తి రక్తంలో గ్లూకోజ్ 80-100 మి.గ్రా / 100 మి.లీ. ఉంటుంది.
  • గ్లూకోజ్‌ను లెక్కించే పద్ధతి మి.గ్రా/డెసీలీటర్.
  • ఇన్సులిన్ లోపిస్తే రక్తంలో గ్లూకోజ్ శాతం పెరిగి డయాబెటీస్ మెల్లిటస్ (చక్కెరవ్యాధి, మధుమేహ వ్యాధి) వస్తుంది. ఈ వ్యాధిగ్రస్తుడి మూత్రంలో గ్లూకోజ్ ఉంటుంది.
  • ఈ వ్యాధి వస్తే ముందుగా కళ్లపై ప్రభావం చూపడం వల్ల అంధత్వం వస్తుంది. తర్వాత హృదయం, మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది.
  • ఈ వ్యాధి వల్ల గాయాలు మానవు. రాత్రిపూట అధికంగా మూత్ర విసర్జన జరుగుతుంది. ఇన్సులిన్ థెరపీ ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు.
  • అధికంగా ఇన్సులిన్ తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పడిపోవటాన్ని ఇన్సులిన్ షాక్ అంటారు. దీంతో మెదడు దెబ్బతిని ప్రాణహానికి దారితీయొచ్చు.
షుగర్ వ్యాధి రకాలు
టైప్-1: ఇది చిన్న పిల్లలు, 20 ఏళ్ల లోపు వారికి వస్తుంది. ఇది క్లోమం క్షీణించి ఇన్సులిన్ స్రవించకపోవడం వల్ల వస్తుంది.
టైప్-2: 25 నుంచి 30 ఏళ్ల మధ్య వారికి వస్తుంది. ఇన్సులిన్ తక్కువగా ఏర్పడటం వల్ల ఈ వ్యాధి వస్తుంది.
  • అప్పుడే పుట్టిన పిల్లలకు జువైనల్ డయాబెటీస్ వస్తుంది.
  • గెస్టేషనల్ డయాబెటీస్.. గర్భిణులకు వస్తుంది.
  • షుగర్ వ్యాధి నియంత్రణకు వాడే భారతీయ మసాల దినుసులు - మెంతులు.
  • రక్తంలో అధికంగా ఉన్న గ్లూకోజ్‌ను గ్లైకోజన్‌గా మార్చి కాలేయంలో నిల్వ ఉంచడానికి ఇన్సులిన్ తోడ్పడుతుంది.
  • మానవుడిలో నిల్వ ఆహారం గ్లైకోజన్ (అనిమల్ స్టార్చ్). ఇది కాలేయం, కండరాల్లో నిల్వ ఉంటుంది.
Published date : 27 Oct 2015 06:10PM

Photo Stories