Skip to main content

వేంగి చాళుక్యులు

వేంగి లేదా తూర్పు చాళుక్యులు మొదట పిష్టపురం (పిఠాపురం) తర్వాత పెదవేగి (ఏలూరు) రాజధానిగా తూర్పు తీరాంధ్రను దాదాపు నాలుగున్నర శతాబ్దాలు పాలించారు. రెండో పులకేశి వేంగిని ఆక్రమించి ఆ రాజ్యానికి తన తమ్ముడైన కుబ్జ విష్ణువర్ధనుడిని రాజ ప్రతినిధిగా నియమించాడు.
వేంగి క్రీ.శ.6వ శతాబ్దంలో స్వతంత్ర రాజ్యమైంది. తూర్పు చాళుక్యులు ఆంధ్రదేశాన్ని సుదీర్ఘకాలం పాలించారు. రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్య రాజవంశాల తాకిడి నుంచి ఆంధ్రదేశాన్ని కాపాడారు. చోళులతో వివాహ సంబంధాలు ఏర్పరచుకుని ఆంధ్ర-తమిళ సంస్కృతికి సంధానకర్తలయ్యారు. నెల్లూరు ప్రాంతంలోని ఆటవిక తెగలను బ్రాహ్మణ సంస్కృతిలోకి తెచ్చారు. తెగల ఏకీకరణ వీరి కాలంలోనే జరిగింది.

కుబ్జవిష్ణువర్ధనుడు (క్రీ.శ.624-642)
మొదట పిఠాపురం, ఆ తర్వాత వేంగి (ఏలూరు) రాజధానిగా ఆంధ్రదేశాన్ని 18 ఏళ్లు పాలించాడు. విశాఖపట్నం తామ్రశాసనం, గుంటూరు చేజెర్ల శిలాశాసనం, రెండో పులకేశి వేయించిన కొప్పరం శాసనం కుబ్జ విష్ణువర్ధనుడి విజయాలను వివరిస్తున్నాయి. విశాఖపట్నం నుంచి గుంటూరు మండలం వరకు రాజ్యాన్ని విస్తరించాడు. విశాఖ జిల్లా సర్వసిద్ధి తాలూకా కలవకొండ శాసనం ప్రకారం రాజ్యాన్ని దివిసీమ వరకు విస్తరించినట్లు తెలుస్తోంది. ఇతడు విష్ణు భక్తుడు. ఇతడికి విషమసిద్ధి (కష్టకాలంలో విజయం సాధించినవాడు), మకర ధ్వజుడు, కామదేవుడు, సర్వసిద్ధి, పరమ భాగవత వంటి బిరుదులున్నాయి. కొప్పర శాసనం ప్రకారం కర్మరాష్ట్రం (కమ్మరాష్ట్రం)-గుంటూరు, నెల్లూరు ప్రాంతాలు ఇతడి ఆధీనంలో ఉండేవి. ఇతడి రాణి అయ్యనమహాదేవి విజయవాడలో జైనుల కోసం నుడంబవసతి అనే జైనదేవాలయం నిర్మించినట్లు, గ్రామాలను దానం చేసినట్లు విష్ణువర్ధన-3 వేయించిన ముషినికొండ శాసనం ద్వారా తెలుస్తోంది. ఆంధ్రదేశంలో జైనుల గురించి తెలిపే శాసనం ఇదే.

మొదటి జయసింహ వల్లభుడు
కుబ్జ విష్ణువర్ధనుడికి జయసింహ వల్లభుడు-1, ఇంద్రభట్టారకుడు అనే ఇద్దరు కుమారులున్నారు. జయసింహ వల్లభుడు 33 ఏళ్లు పాలించాడు. ఈయన పల్లవుల ఆధీనంలోని బోయ కొట్టాలను జయించాడు. పెణకపర్రు (కృష్ణాజిల్లా) గ్రామాన్ని బ్రాహ్మణులకు దానం చేశాడు. పిఠాపురం నుంచి వేంగికి రాజధానిని మార్చాడు. విశాఖ జిల్లా యలమంచిలి తాలుకాలో సర్వసిద్ధి నగరాన్ని నిర్మించాడు. విప్పర్ల శాసనం వేయించాడు. ఇతనికి సర్వసిద్ధి (ప్రతి విషయంలోనూ విజయుడు) అనే బిరుదు ఉంది. ఇతడి సోదరుడు ఇంద్రభట్టారకుడు (త్యాగధేనువు అనే బిరుదుంది) ఏడురోజులు మాత్రమే పాలించాడు. ఇతని కుమారుడు రెండో విష్ణువర్ధనుడు 9 ఏళ్లు పాలించాడు. ఈయనకు విషమసిద్ధి, ప్రళయాదిత్యుడు అనే బిరుదులున్నాయి.

మొదటి విజయాదిత్యుడు
రాష్ట్రకూటులను ఎదిరించాడు. ఇతడికి పరమభట్టారక, సమస్త భువనాశ్రయ, త్రిభువనాంకుశుడు అనే బిరుదులున్నాయి.

రెండో విజయాదిత్యుడు
తూర్పు చాళుక్య రాజుల్లో 11వ వాడు. రాష్ట్రకూటరాజు మూడో గోవింద వర్మ ఇత డి సమకాలికుడు. రాష్ట్రకూటులు, కదంబులను జయించాడు. సాతలూరు శాసనం ప్రకారం పశ్చిమ గాంగులు, రట్టలు (రాష్ట్రకూటుల)తో 12 ఏళ్ల పాటు 108 యుద్ధాలు చేశాడు. తన పేరుతో 108 నరేంద్రేశ్వర శివాలయాలు నిర్మించి, నరేంద్ర మృగరాజు (రాజుల్లో సింహం వంటి వాడు) అనే బిరుదును ఆపాదించుకున్నాడు. చాళుక్యరామ, విక్రమధవళ అనే బిరుదులు కూడా ఉన్నాయి. ఇతడు శైవ మతాభిమాని.

గుణగ విజయాదిత్యుడు (మూడో విజయాదిత్యుడు) క్రీ.శ 848-891
తూర్పు చాళుక్య రాజుల్లో అగ్రగణ్యుడు. సుమారు 43 ఏళ్లు పాలించాడు. ఇతడి రాజ్యవిస్తరణ మూడు దశలుగా జరిగింది. మొదట విజయం- రాజ్య విస్తరణతో ప్రారంభమైంది. తర్వాత సామంతులు, ఇతర రాజ్యాలవారు ఇతడి రాజ్యాన్ని ఆక్రమించారు. ఆ తర్వాత రాజ్యవిస్తరణతో తిరిగి పుంజుకున్నాడు. ఆంధ్రదేశంపై ఆధిపత్యం సాధించాడు. ఇతడికి గుణకెనల్లాట (గుణాల్లో గొప్పవాడు), పరచక్రరామ (శత్రువులకు రామబాణం వంటివాడు), త్రిపురామర్త్య - మహేశ్వరుడు (మూడు పట్టణాలకు తిరుగులేనివాడు), వల్లభుడు అనే బిరుదులున్నాయి. తనపై తిరగబడ్డ నెల్లూరు ప్రాంత బోయల (ఆటవిక తెగల)ను తన సేనాపతి పండరంగడిని పంపి అణచివేశాడు. నెల్లూరు, వీరకట్టం, కందుకూరి కోటలను పండరంగడి ద్వారా స్వాధీనం చేసుకున్నాడు. పులికాట్ సరస్సు వరకు రాజ్యాన్ని విస్తరించాడు. అక్కడ పండరంగడు తన పేరుమీద పండరంగం అనే నూతన నగరాన్ని నిర్మించాడు. పండరంగ మహేశ్వరాలయం కూడా అక్కడే నిర్మించాడు. గుణగ విజయాదిత్యుడు తన సేనాని విజయాలను పురస్కరించుకుని కందుకూరు (నెల్లూరు జిల్లా)కు గవర్నర్‌గా నియమించాడు. పండరంగడు వేయించిన అద్దంకి శాసనం తెలుగు భాషలో వేసిన పద్యశాసనంగా గుర్తింపు పొందింది.

గుణగ విజయాదిత్యుడు రాష్ట్రకూట రాజైన రెండో కృష్ణుణ్ని జయించి, అతడి రాజ చిహ్నమైన పాళీధ్వజం, గంగా-యమున తోరణ చిహ్నాలను స్వాధీనం చేసుకున్నాడు. ఇతడు బిరుదాంకప్రోలు (ప్రస్తుత బిక్కవోలు-తూర్పుగోదావ రి జిల్లా)లో గోలింగేశ్వర, చంద్రశేఖర, రాజరాజ ఆలయాలు నిర్మించాడు. ఇతడి తల్లి శీలమహాదేవి రాష్ట్రకూట రాజు ఇంద్రభట్టారకుడి కుమార్తె. రాష్ట్రకూటరాజు అమోఘవర్షుడు, గుణగ విజయాదిత్యుడి మధ్య కంబం గ్రామం (కర్నూలు జిల్లా) లింగావల్లి వద్ద యుద్ధం జరిగింది. అందులో గుణగ విజయాదిత్యుడు ఓడి, అమోఘవర్షుడికి సామంతుడయ్యాడు. అమోఘవర్షుడి మరణానంతరం తిరిగి మూడో విజయాదిత్యుడు (గుణగ విజయాదిత్యుడు) స్వతంత్రుడ య్యాడు.

మొదటి చాళుక్య భీముడు (క్రీ.శ 892-922)
ఇతడు వేంగిని 30 ఏళ్లు పాలించాడు. కన్నడ కవి పంపడు రచించిన విక్రమార్జున విజయం, ముదిగొండ చాళుక్యుల శాసనాలు, బెజవాడ, అత్తిలి, కశింకోటల్లో వేయించిన శాసనాలు ఇతడి చరిత్రకు ముఖ్య ఆధారాలు. చాళుక్య భీముడు వేములవాడ రాజు బద్దెగ చేతిలో ఓడిపోయాడు. తర్వాత సంధిచేసుకుని రాజ్యాన్ని పొందాడు. మొదటి చాళుక్య భీముడు సామర్లకోట సమీపంలో చాళుక్య భీమేశ్వరాలయం, ద్రాక్షారామంలో భీమేశ్వరాలయం నిర్మించాడు. ఈ రెండూ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి. ఇతడు సామర్లకోట సమీపంలో స్వంధారామం (చాళుక్య భీమపురం) నగరాన్ని నిర్మించాడు. ఇతడి ఆస్థానంలోని గాంధర్వ విద్యా ప్రవీణురాలైన చల్లవ (చెల్లాంబిక)కు అత్తిలి గ్రామానికి చెందిన రెండు ఖండికల భూమిని దానం చేశాడు. బెజవాడ ఇంద్రకీలాద్రి పర్వత శాసనం తెలుగు భాషలో వేయించాడు. ఈ శాసనం ఇత డిని ‘చాళుక్యభీమ సర్వలోకాశ్రయ విష్ణువర్ధన మహారాజ’ అని పేర్కొంది. మొదటి చాళుక్యభీముని పట్టాభిషేకం ఏప్రిల్ 14, 892న విష్ణువర్ధనుడు పేరుతో జరిగింది. ఇతడి సామంత రాజైన చాద్రవుడు (చట్టప్ప) బెజవాడ ఇంద్రకీలాద్రిపై పార్థీశ్వర దేవాలయం నిర్మించాడు. మాలతీ మాధవం రచయిత భవభూతి ఇతడికి సమకాలికుడనే ప్రస్తావన శాసనాల్లో ఉంది.

నాలుగో విజయాదిత్యుడు
కొల్లాభిగండడు అనే పేరుతో 6 నెలలు పాలించాడు. క ళింగపై దాడి చేసి వీరజనగరం (కళింగ) యుద్ధంలో మరణించాడు. ఇతడి తర్వాత వేంగి రాజ్యం కోసం అనేక యుద్ధాలు జరిగాయి. పన్నెండేళ్ల కాలంలో ఆరు మంది రాజలు పాలించారు.

మొదటి అమ్మరాజు (రాజమహేంద్ర)
నాలుగో విజయాదిత్యుడి కుమారుడు. ఏడేళ్లు పాలించాడు. క్రీ.శ.927లో గోదావరి నది ఒడ్డున రాజమహేంద్రపురం(రాజమండ్రి) నిర్మించాడు. తర్వాత తూర్పు చాళుక్యులకు రాజమహేంద్రవరమే రాజధాని అయిందని చరిత్రకారుల అభిప్రాయం. దీనికి ఆధారాలు లేవు.

విమలాదిత్యుడు (క్రీ.శ.1011-1018)
ఈయన ఏడేళ్లు పాలించాడు. మొదటి రాజరాజచోళుని కుమార్తె కుందవైని పెళ్లి చేసుకున్నాడు. ఆమె ద్వారా రాజరాజు, రెండో భార్య మేలవదేవి ద్వారా విజయాదిత్యుడు జన్మించారు. రాజరాజే రాజరాజ నరేంద్రుడిగా తెలుగు వారికి సుపరిచితుడు. విమలాదిత్యుడికి సర్వలోకాశ్రయుడు, రాజమార్తాండుడు, ముమ్మిడి భీముడు అనే బిరుదులున్నాయి. మంత్రి వజ్జయ ప్రగ్గడకు రణస్థిపూడి గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చాడు. రామతీర్థం (విజయనగరం జిల్లా) శాసనం ప్రకారం విమలాదిత్యుడు జైన మతాభిమాని. జైన మతాన్ని స్వీకరించిన మొదటి తూర్పుచాళుక్య రాజు. త్రికాలయోగి సిద్ధాంత దేవుడు అనే జైన మతాచార్యుడు ఇతడి గురువని శాసనాలు వివరిస్తున్నాయి.

రాజరాజనరేంద్రుడు (క్రీ.శ. 1019-1060)
వేంగి చాళుక్యుల వంశంలో రాజరాజ నరేంద్రుడు విశేష ఖ్యాతి గడించాడు. ఇతడి పరిపాలనంతా యుద్ధాలతోనే గడిచింది. సవతి తమ్ముడు విజయాదిత్యుడితో వారసత్వ పోరు సాగించాడు. ఒక సందర్భంలో విజయాదిత్యుడు వేంగిని ఆక్రమించ గా, రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రవరానికి పారిపోయి, అక్కడి నుంచి పాలన సాగించాడు. కళ్యాణీ చాళుక్య రాజైన మొదటి సోమేశ్వరుడితో కలిదిండి వద్ద యుద్ధం చేశాడు. రాజేంద్రచోళుడి కుమార్తె అమ్మంగదేవిని వివాహమాడాడు. ఇతడి కాలంలోనే ఆంధ్ర - ద్రావిడ సమ్మేళనం జరిగింది. రాజరాజనరేంద్రుడు తెలుగు భాషకు, కులోత్తుంగ చోళుడు తమిళభాషకు అధిక ప్రాధాన్యమిచ్చారు. రాజరాజ నరేంద్రుడి కాలంలోనే నన్నయ విద్యాధికారిగా ఉంటూ, సంస్కృత మహాభారతంలోని ఆది, సభాపర్వాలను ఆంధ్రీకరించాడు. అరణ్య పర్వం సగభాగం మాత్రమే అనువదించాడు. నన్నయకు ఆదికవి, విద్యాదైతుడు, వాగనుశాసనుడు అనే బిరుదులున్నాయి. సంస్కృతంలో ఆంధ్ర శ బ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథం రచించాడు. తెలుగులో ఇంద్రవిజయం, చాముండేశ్వర విలాసం రాశాడు. రాజరాజ నరేంద్రుడి ఇష్టదైవం ద్రాక్షారామ భీమేశ్వరుడు. మహాభారత తెలుగు అనువాదంలో సహాయపడిన నారాయణభట్టుకి నందంపూడి గ్రామాన్ని అగ్రహారంగా దానం చేశాడు. నందంపూడి రచయిత పావులూరి మల్లనకు నవఖండవాడ గ్రామాన్ని దానం చేశాడు. నందంపూడి శాసనాన్ని నన్నయ రచించాడు. నన్నయభట్టు ఉభయభాషా కావ్యరచనా శోభితుడిగా, నారాయణభట్టు వాఙ్మయ దురంధరుడుగా పేరుగాంచారు.

కులోత్తుంగచోళుడు (క్రీ.శ 1070 -1120)
రాజరాజనరేంద్రుడి మరణానంతరం వేంగి, కళింగ రాజ్యాల్లో అలజడి ప్రారంభమైంది. రాజరాజ నరేంద్రుడి సవతి తమ్ముడు విజాయాదిత్యుడు రాజ్యాన్ని ఆక్రమించాడు. అతడి కుమారుడు శక్తివర్మ వేంగి రాజ్యాధిపతి అయ్యాడు. తర్వాత పశ్చిమ చాళుక్య రాజు విక్రమార్కుడు వేంగి, కళింగ రాజ్యాలపై దాడిచేసి శక్తివర్మను హతమార్చాడు. అనంతరం చోళరాజైన వీర రాజేంద్రుడు వేంగి రాజులతో వివాహ సంబంధాలు పెట్టుకున్నాడు. దాని ఫలితంగా తన కుమార్తె మధురాంతకిని, రాజరాజనరేంద్రుడి కుమారుడైన రాజేంద్రుడికిచ్చి వివాహం చేశాడు. ఈ వేంగి చాళుక్య రాకుమారుడు రాజేంద్రుడు కులోత్తుంగ చోళుడు అనే బిరుదుతో తంజావూరు కేంద్రంగా వే ంగి చాళుక్య - చోళ సింహాసనం అధిరోహించాడు. కులోత్తుంగుడి కాలంలో తెలుగు దేశానికి ద్రావిడ, బ్రాహ్మణులు అధిక సంఖ్యలో వలసవచ్చారు. దీని ప్రభావంతో తెలుగు భాషలోకి అనేక తమిళ పదాలు వచ్చిచేరాయి.
Published date : 08 Sep 2016 11:37AM

Photo Stories