Skip to main content

వేంగి చాళుక్యుల పాలనాంశాలు

క్రీ.శ.6వ శతాబ్దం నుంచి పదో శతాబ్దం వరకు సుమారు నాలుగు శతాబ్దాల పాటు పిఠాపురం, పెదవేగి రాజధానులుగా చేసుకొని వేంగి చాళుక్యులు ఆంధ్రదేశాన్ని పాలించారు. ఈ యుగంలోనే ఆంధ్రదేశం ప్రాచీన యుగం నుంచి తొలి మధ్య యుగంలోకి ప్రవేశించింది. రాష్ట్రకూటులు, కల్యాణీ చాళుక్యులు, చోళులు, పల్లవులు, సమకాలీన రాజ్యాల తాకిడిని తట్టుకొని తూర్పు చాళుక్యులు రాజకీయ సుస్థిరతను సాధించారు. వీరి కాలంలో ఆర్థిక, సాంఘిక, మత, సాంస్కృతిక రంగాల్లో విశేష అభివృద్ధి జరిగింది.
పాలనా విశేషాలు
శాసనాలు, సాహిత్యం ద్వారా వీరి పాలనా విశేషాలు తెలుస్తున్నాయి. వీరు పశ్చిమ ప్రాంత బాదామీ చాళుక్యుల పాలనా పద్ధతులను అనుసరించారు. నాటి సమకాలీన రాజ్యాలైన రాష్ట్రకూటులు, కళ్యాణీ చాళుక్యులు, పల్లవులు, చోళుల పాలనాంశాలను జోడించి వీరు పాలన సాగించారు. పాలనలో రాజు నిరంకుశుడు. రాజ్యాధికారం వంశపారంపర్యంగా జ్యేష్ట పుత్రుడికి సంక్రమించేది. శాసనాల ప్రకారం రాజ్య పాలన ‘సప్తాంగాలు’ (ఏడు విభాగాలు), పద్దెనిమిది తీర్థాల (కార్యాలయాల) ద్వారా జరిగేది.

సప్తాంగాలు
రాజ్య పాలనలో మంత్రి, పురోహితుడు, సేనాపతి, యువరాజు, దేవారిక, ప్రధానుడు (ముఖ్యుడు), అధ్యక్షుడు (కార్యాలయ అధిపతి), రాజ ప్రాసాదంలో పాలనను 72 నియోగాలు నిర్వహించేవి. నియోగాల అధిపతిని నియోగాధికృతుడు అని పిలిచేవారు. ఈ విషయం చాళుక్య మొదటి అమ్మరాజు వేయించిన శాసనం ద్వారా తెలుస్తోంది. పఠవర్ధన కుటుంబం రాజప్రాసాద పాలన నిర్వహించేదని అమ్మరాజు శాసనం పేర్కొంటోంది. రాజ్యాన్ని విషయాలు (రాష్ట్రాలు), నాడులు (కొట్టాలు, జిల్లాలు), గ్రామాలుగా విభజించేవారు. వారగోష్టి (సభా సమావేశాలు) నిర్వహించేవారు. విషయాల అధిపతిని నియోగ వల్లభుడు అని పిలిచేవారు. సర్వ లోకాశ్రయుడు వేయించిన చందలూరు శాసనం ప్రకారం నాడుల అధిపతిని నియోగికా వల్లభుడు అని వ్యవహరించేవారు. ఉదా: కమ్మనాడు (ఒంగోలు, బాపట్ల ప్రాంతం), పాకనాడు (కందుకూరు, నెల్లూరు ప్రాంతాలు), రేనాడు (కడప, రాయలసీమ), వెలనాడు (తెనాలి, గుంటూరు), పల్నాడు (మాచర్ల ప్రాంతం). నాడులను గ్రామాలుగా విభజించారు. గ్రామాధిపతిని గ్రామేయిక, గ్రామిణి, ఊర్గపుండ అని వివిధ పేర్లతో పిలిచేవారు. గ్రామ పాలనలో సుంకాలను వసూలు చేసే వారిని మన్నేయులు అని పిలిచేవారు. గ్రామాల్లో తగవులను పంచవర (గ్రామసభ) ద్వారా పరిష్కరించేవారు.

సైనిక పాలన
సైనికాధికారిని సంధి విగ్రహాధికారి, మహా సామంతాధిపతిగా పిలిచేవారు. రాజ్య రక్షణలో సేనను హస్తిపకులు (ఏనుగులు), అశ్వికులు (గుర్రాలు), పదాతులు (సైన్యం)గా విభజించారు. బాణాలు, తోమరాలు వీరి ఆయుధాలు. యుద్ధ సమయంలో ఏనుగులకు సారాయి పట్టించేవారు. గుర్రాలకు కవచాలు తొడిగేవారు. యుద్ధ భూమికి మహిళలు కూడా వెళ్లేవారు. యుద్ధానికి భయపడి యుద్ధభూమి నుంచి వెనుదిరిగే వారికి స్త్రీ వేషం వేయించి ఊరేగించేవారు.

రెవెన్యూ పాలన
భూమిని వివిధ తరగతులుగా విభజించేవారు. భూసారాన్ని బట్టి పన్నులు విధించేవారు. పన్నులు లేని భూమిని ఉంబాలీ అని పిలిచేవారు. భూమి శిస్తు అరిపన్ను, సిద్ధాయి అనే పేర్లతో ఉండేది. యువరాజు వ్యక్తిగత ఖర్చుల కోసం దేవరాచపన్ను, సైన్య నిర్వహణ కోసం పడమేరిపన్ను, సంధి విగ్రహాధి పన్నులు వసూలు చేసేవారు. గొడుగులు తయారుచేసే వారిపై ‘కొదెన’ అనే పన్ను వేసేవారు. పశువుల పచ్చికబయళ్లపై పుల్లరి పన్ను విధించేవారు. భూమిని రాజకోల, రాజమానకోలతో కొలిచేవారు. భూమి ప్రమాణాలు ఖండిక, పుట్టి, కుంచం, తూములుగా ఉండేవి. ద్రవ్య చెలామణీలో గ్యద్యాణాలు, మాడలు (బంగారు నాణేలు), రూకలు (వెండి నాణేలు) ఉండేవి. రాగి నాణేలను చిన్నం అని పిలిచేవారు. భూమి పన్నుతో సమానంగా వ్యాపారస్తుల నుంచి హెజ్జుంక (లేదా) పెర్జుంక పన్నులు విధించేవారు. పన్నులు వసూలు చేసే అధికారిని సుంకాధిరావు, సుంకం కైకొండుదేవ, పెర్జుంకడకనివార అని పిలిచేవారు. వర్తక శ్రేణులను నకరాలు అనేవారు. నకరం (వర్తక శ్రేణి) ప్రధాన కేంద్రంగా పెనుగొండ (పశ్చిమ గోదావరి జిల్లా) ఉండేది. సమాజంలో వర్తకుల తర్వాత వృత్తి పనివారైన తెలకలి వారి (నూనె తీసేవారి)కి అధిక గౌరవం ఉండేది. ఆనాడు దేశీయ కొండ పట్టణం (మోటుపల్లి - ప్రకాశం జిల్లా), కులోత్తుంగచోళ పట్టణం (విశాఖపట్నం), చోళ పాండ్యపురం (ఘంటసాల-కృష్ణా జిల్లా), మచిలీపట్నం ప్రధాన రేవు కేంద్రాలుగా ఉండేవి. పశ్చిమాసియా, బర్మా, శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాలతో వర్తక వ్యాపారాలు జరిగేవి.

1/6వ వంతు భూమిశిస్తు వసూలు చేసేవారు. తూర్పు చాళుక్యుల పాలన, ద్రవ్య వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ తర్వాతి కాలంలో వచ్చిన కాకతీయులు, రెడ్డి రాజులకు మార్గదర్శకమైంది.

సామాజిక పరిస్థితులు
తూర్పు చాళుక్యుల కాలంలో చైనా యాత్రికుడు హ్యుయాన్‌త్సాంగ్ ఆంధ్ర దేశంలో పర్యటించాడు. భూములు సారవంతమైనవని, ప్రజలు నల్లగా, కఠిన స్వభావంతో ఉండేవారని, బౌద్ధమతం క్షీణ దశకు వచ్చి, హిందూ మతంలో దేవుళ్ల పూజా విధానాలు పెరిగాయని పేర్కొన్నాడు. సమాజంలో కుల వ్యవస్థ వేళ్లూనుకుంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కులాలు స్పష్టంగా ఏర్పడ్డాయి. బ్రాహ్మణులు అధిక గౌరవం పొందారు. బ్రాహ్మణులు తొలిసారిగా వైదికులు, నియోగులుగా విభజితమయ్యారు. పూజలు, యజ్ఞాలు, యాగాలు నిర్వహించే పురోహిత వర్గం వైదికులు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు చేసేవారు నియోగులు. ఇవే కాకుండా ప్రాంతాల వారీగా బ్రాహ్మణుల్లో వెలనాటులు, కమ్మ బ్రాహ్మణులు తదితర శాఖలు ఏర్పడ్డాయి. తమిళ ప్రాంతం నుంచి వచ్చి ఆంధ్ర దేశంలో స్థిరపడిన బ్రాహ్మణులు ఆరామ ద్రావిడులుగా గుర్తింపు పొందారు. ఆంధ్ర దేశంలో వైశ్యులు పెనుగొండ ముఖ్య కేంద్రంగా వర్తక వ్యాపారాలు చేసేవారు. నకరాలు పేరుతో వర్తక శ్రేణులుగా ఏర్పడ్డారు. 16వ శతాబ్దంలో రాసిన వైశ్య పురాణం ప్రకారం కన్యకాపరమేశ్వరి వీరి ఇష్టదైవం. వీరు అనేక దేవాలయాలకు దాన ధర్మాలు చేశారు.

చాళుక్యుల కాలంలో 18 ఉప కులాలు (అష్టాదశ వర్గాలు) ఏర్పడ్డాయి. విశ్వ కర్మలు (వడ్రంగులు) పంచాణం అనే ఐదు చేతివృత్తుల వారిగా (కాసే, కంచేరి, కంసాలి, వడ్రంగి, విశ్వకర్మలు) ఏర్పడ్డారు. వీరికి సంఘంలో గౌరవ మర్యాదలుండేవి. వీరు రాగి రేకులపై శాసనాలు కూడా లిఖించేవారు. సమాజంలో స్త్రీలకు గౌరవం ఉన్నా బాల్య వివాహాలు, బహుభార్యత్వం, స్త్రీని ఒక భోగ వస్తువుగా పరిగణించడం వంటివి ఉండేవి. దేవదాసీ విధానం అమల్లోకి వచ్చింది. మాన్యగార, పటేలు, గౌండ అనే గ్రామాధికారులుండేవారు. కోలాటాలు, గేయ నాటకాలు ఆనాటి సమాజంలో ప్రధాన వినోదాలు. చాళుక్య సోమేశ్వరుడు రచించిన అభిలషితార్థ చింతామణి గ్రంథం ఈ విషయాలను ప్రస్తావించింది.

సాహిత్య వికాసం
గుణగ విజయాదిత్యుడి కాలంలో తొలిసారిగా తెలుగు వచనం శాసనాల్లో కనిపిస్తుంది. జయసింహ వల్లభుడు వేయించిన విప్పర్ల శాసనంలో కూడా తొలి తెలుగు వచనం ఉంది. బెజవాడ యుద్ధమల్లుడి శాసనంలో మధ్యక్కర ప్రయోగం ఉంది. రాజరాజ నరేంద్రుడి కాలంలో నారాయణభట్టు సహకారంతో సంస్కృత మహాభారతాన్ని నన్నయభట్టు తెలుగులో అనువదించడం ప్రారంభించాడు. సంస్కృతంలో మహావీరాచార్యుడు రచించిన గణిత సార సంగ్రహం గ్రంథాన్ని పావులూరి మల్లన తెలుగులోకి అనువదించాడు. ఆంధ్రశబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథాన్ని నన్నయ భట్టు తెలుగులో రచించాడు. పాల్కురికి సోమనాథుడు బసవపురాణం, పండితారాధ్య చరిత్ర రచించాడు. పండితారాధ్యుడు రచించిన శివతత్వసారం తొలి శతకాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. వేములవాడ భీమ కవి కవిజనాశ్రయం, రాఘవ పాండవీయం వంటి గ్రంథాలు రచించాడు.

మత పరిస్థితులు
శాసనాల ప్రకారం బ్రాహ్మణులు హిరణ్యగర్భ, బహుసువర్ణ వ్రతాలను ఉన్నత కులాల వారి కోసం జరిపేవారు. పులకేశిన్-1 బహుసువర్ణ, సువర్ణగర్భ, అగ్నిష్టోమ, అశ్వమేధ, వాజపేయ, పౌండరీక వంటి యజ్ఞయాగాలు చేశాడు. తత్ఫలితంగా రాజులు బ్రాహ్మణులకు పన్నులు లేని గ్రామాలు, భూములను దానం చేసేవారు. శ్రీ పృథ్వీవల్లభ సత్యాశ్రయుడు వేయించిన మారుటూరు శాసనం ఆంధ్ర దేశంలో తొలిసారిగా లభ్యమైంది. దీని ప్రకారం వేంగి చాళుక్యులు, ఆంధ్రా బ్రాహ్మణుల దాన వివరాలు తెలుస్తున్నాయి. తూర్పు చాళుక్య రాజైన జయసింహ వల్లభుడు పల్లవుల ఆధీనంలో ఉన్న నెల్లూరు ప్రాంత బోయ కొట్టాలను జయించి, ఆటవిక తెగలను బ్రాహ్మణ సమాజంలోకి తీసుకురావడంతో బోయలు బ్రాహ్మణ పూజారులుగా ఏర్పడ్డారు. ఆగమాలు, పురాణాలు, దర్శనాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు, వేదాంగాలు, యోగ, న్యాయ, వైశేషిక వంటి అంశాలు ప్రధానంగా అధ్యయనం చేశారు. బ్రాహ్మణులు ద్వివేదులు, త్రివేదులు, చతుర్వేదులుగా ఏర్పడ్డారు. ఉన్నత విద్యను అభ్యసించడానికి ఘటికలు అనే సంస్థలు ఏర్పడ్డాయి. 14 రకాల విద్యలను ఘటికల్లో అభ్యసించేవారు. జయసింహ వల్లభుడి నిడమర్రు శాసనం ప్రకారం గుంటూరు జిల్లా కంతేరు వద్ద ఉన్న అసనపురంలో ఘటిక ఉన్నట్లు తెలుస్తోంది. కడప, కర్నూలు ప్రాంతాల్లో ఘటికలుండేవి. వీటిలో శ్రవణం, మననం, ధారణం పద్ధతుల్లో విద్యాభ్యాసం జరిగేది. మతం పరంగా బౌద్ధం ప్రాధాన్యం కోల్పోయింది. జైన మతం కొంతమేరకు వర్ధిల్లింది. కుబ్జ విష్ణువర్ధనుడి భార్య అయ్యణ మహాదేవి, రాజరాజ నరేంద్రుడి తండ్రి విమలాదిత్యుడు జైన మతాన్ని ఆదరించినట్లు తెలుస్తోంది. విజయవాడ, సిద్ధవటం, ఆర్యావటం, రామతీర్థం కేంద్రాలుగా జైనం వర్ధిల్లింది.

వేంగి చాళుక్యుల కాలంలో శైవ మతం గొప్ప ఆదరణ పొందింది. రాజులు పరమ బ్రాహ్మణ్య, పరమ మహేశ్వర, పరమ భాగవత వంటి బిరుదులు ఆపాదించుకున్నారు. క్రీ.శ.8వ శతాబ్దం నాటికి శైవ మత శాఖైన పాశుపతం ఆంధ్ర దేశంలో ప్రవేశించింది. పాశుపత శాఖతోపాటు కాలాముఖ శాఖ ఏర్పడింది. రెండో అమ్మరాజు వేయించిన తాడికొండ, బెజవాడ శాసనాలు అమరావతి, బెజవాడల్లో కాలాముఖులు ప్రాచీన దేవాలయాల్లో సింహ పరిషత్తు గోష్టులు నిర్వహించేవారని పేర్కొంటున్నాయి. రెండో పులకేశి ఆలంపురంలో సుదర్శనాచార్యుడి వద్ద శివ మండల దీక్ష తీసుకున్నాడు. కర్మ రాష్ట్రం (కమ్మ రాష్ట్రం) నుంచి రెండు వందల మంది బ్రాహ్మణులు తమిళనాడుకు వలస పోయారు. క్రీ.శ.7వ శతాబ్దంలో ఈ బ్రాహ్మణులు నందివర్మ, పల్లవ మల్లరాజు నుంచి అనేక భూదానాలు పొందారు. చతుర్వేదులు, త్రివేదులు, షడంగవాదులు, కర్మవాదులు అనే బ్రాహ్మణ శాఖలు ఏర్పడ్డాయి. మతానికి దేవాలయం ప్రధాన కేంద్రమైంది.

దేవుళ్లను ఊరేగించడం, జాతరలు జరపడం తొలిసారిగా వేంగి చాళుక్యుల కాలంలో వచ్చింది. బెజవాడ యుద్ధమల్లుడి శాసనం ప్రకారం చేబ్రోలు నుంచి బెజవాడ వరకు మహాసేనుడి ఊరేగింపు, జాతర జరిగింది. పురాణ దేవుళ్లను ఆరాధించే స్మార్థ విధానం ఈ యుగంలో ప్రారంభమైంది. శివుడు, విష్ణువు, సూర్యుడు, గణపతి, శక్తి అనే ఐదుగురు దేవుళ్లను పూజించడం ప్రాధాన్యం సంతరించుకుంది. శ్రీశైలం, ఆలంపురం, త్రిపురాంతకం ప్రాంతాల్లో కాపాలికులు అనే శైవులు ప్రాధాన్యం సంతరించుకున్నారు.
Published date : 08 Sep 2016 11:40AM

Photo Stories