Skip to main content

తెలుగునాట బౌద్ధ సంస్కృతి

గౌతమ బుద్ధుడు క్రీ.పూ.563లో కపిలవస్తు నగరంలో జన్మించి, 80 ఏళ్లు జీవించినట్లు తెలుస్తోంది. అర్థరహిత కర్మకాండను, వర్ణ వ్యత్యాసాలను, పూజా విధానాన్ని బుద్ధుడు ఏమాత్రం సమర్థించలేదు. బుద్ధుడు ‘కర్మ’ సూత్రాన్ని ఒప్పుకొన్నాడు. ‘కర్మ’ మానవుని మరణానంతరం కూడా వెంటాడుతూనే ఉంటుందన్నాడు. ‘కర్మ’కు కారణమైన ‘కోరికను’ త్యజించడం ద్వారా మనిషి నిర్వాణాన్ని పొందగలడని బౌద్ధమతం చెబుతోంది.
బుద్ధుడు నాలుగు ఆర్య సూత్రాలు చెప్పాడు. అవి..
 1. దుఃఖం
 2. దుఃఖ కారణం
 3. దుఃఖ నివారణ
 4. దుఃఖ నివారణ మార్గం.
 
దుఃఖాన్ని నివారించాలంటే దానికి కారణమైన కోరిక (కామం)ను త్యజించాలని, అందుకు ‘అష్టాంగ మార్గాన్ని’ అవలంబించాలని బుద్ధుడు ప్రబోధించాడు. అందులో ఎనిమిది సూత్రాలున్నాయి. అవి..
 1. సమ్యక్ వాక్
 2. సమ్యక్ క్రియ 
 3. సమ్యక్ జ్ఞానం 
 4. సమ్యక్ శ్రమ 
 5. సమ్యక్ ఆలోచన
 6. సమ్యక్ ధ్యానం
 7. సమ్యక్ నిశ్చయం
 8. సమ్యక్ దృష్టి.
 
 ఈ ఎనిమిది సూత్రాలను అర్థం చేసుకొని, ఆచరించడం ద్వారా మనిషి మనశ్శాంతి, దాని ద్వారా ఉన్నత జ్ఞానాన్ని, దాని ద్వారా నిర్వాణాన్ని పొందగలడని బుద్ధుని తాత్విక బోధ చెబుతుంది.
 
 పురావస్తు అవశేషాలు
 తెలుగు ప్రాంతంలో బౌద్ధ మతం బుద్ధుని కాలం నుంచే ప్రాచుర్యం పొందినట్లు పురావస్తు అవశేషాలు, అశోకుని ధర్మశాసనాలు, బౌద్ధ సాహిత్యం - జాతక కథలు, చైనా యాత్రికులు -ఫాహియాన్, హ్యుయాన్‌త్సాంగ్, ఇత్సింగ్ యాత్రాకథనాల వల్ల తెలుస్తోంది.
 
తెలుగు నేలపై సుమారు 100 బౌద్ధ స్థలాలను పురావస్తు శాస్త్రజ్ఞులు గుర్తించారు. భట్టిప్రోలు, అమరావతి, నాగార్జునకొండ, ఘంటసాల, జగ్గయ్యపేట, ఆదుర్రు, శాలిహుండం, రామతీర్థం, బావికొండ, తొట్లకొండ, చందవరం, ధూళికట్ట, ఫణిగిరి, కొండాపూర్, నేలకొండపల్లి, బుద్ధున్నకొండ, శంకరం, కోటిలింగాల మొదలైన ప్రాంతాల్లో స్థూపాలు, చైత్యగృహాలు, విహారాలు, సంఘారామాలు వంటి అవశేషాలు లభ్యమయ్యాయి. వాటి ఆధారంగా క్రీ.పూ 3, 4 శతాబ్దాల నుంచి, క్రీ.శ. 4, 5 శతాబ్దాల వరకు కోస్తా తీరంలో శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు, తెలంగాణలో ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, ఖమ్మం జిల్లాల్లో బౌద్ధం విస్తరించిందని చెప్పవచ్చు.
 
 క్రీ.పూ 250 ప్రాంతానికి చెందిన శిలాశాసనాలు అశోకుని కాలానికి చెందిన బ్రాహ్మీలిపి, ప్రాకృత భాషలో లభించాయి. క్రీ.పూ 256 నాటి అశోకుని 13వ శిలాశాసనం ఆంధ్రులు మౌర్య సామ్రాజ్యంలో నివసించే వారని, పేర్కొంది. అశోకుని శిలాశాసనాలు కర్నూలు జిల్లాలో ఎర్రగుడి, రాజుల మందగిరిలో లభించాయి. ఇవి కాకుండా గుంటూరు జిల్లాలోని అమరావతి, భట్టిప్రోలు, ధాతుకరండ శాసనాలు క్రీ.పూ. 3వ శతాబ్దం నాటికే బౌద్ధం ఆంధ్రదేశంలో విస్తరించింది అనడానికి నిదర్శనాలు. కోస్తా తీరాంధ్రంలో లభించిన శాసనాల్లో ‘సద’ అని పదం కల్గిన రాజుల పేర్లు తెలుస్తున్నాయి. క్రీ.పూ.3వ శతాబ్ది నాటి భట్టిప్రోలు శాసనంలో ‘కుబేరక’ అనే రాజు పేరు ఉంది. శాతవాహన రాజు వేయించిన ‘వాసిష్టీపుత్ర పులోమావి’ అమరావతి శాసనం, గౌతమీపుత్ర యజ్ఞశ్రీ చినగంజాం శాసనం, సివమకసద అమరావతి శాసనం, నాగార్జున కొండ శాసనాలు, కళింగ ఖారవేలుని హాతిగుంఫ శాసనం, వేల్పూరు సదరాజుల శాసనాలు బౌద్ధ మతానికి చెందినవే.
 
ఆంధ్రుల నివాసం గురించి బౌద్ధ జాతక కథల్లో వివరణ ఉంది. ‘భీమసేన జాతకం’ ఆంధ్ర పదాన్ని ప్రస్తావిస్తుంది. ‘సెరివణిజ’ జాతకం ‘తెలివాహన’ నదిపై ఉన్న ‘ఆంధ్రనగరి’ (అమరావతి)ని ప్రస్తావించింది. అది కృష్ణానది ఒడ్డున ఉన్న నగరమేనని చరిత్రకారులు నిర్ధరించారు. అమరావతి స్థూపంలో బుద్ధుని ధాతువులు నిక్షిప్తమై ఉన్నట్లు ‘మంజుశ్రీ మూలకల్పం’లో ఉంది. ‘వజ్రాలదిన్నె’ వద్ద బుద్ధుని దంతాన్ని నిక్షేపించి, అశోకుడు ఒక స్థూపాన్ని నిర్మించినట్లు ‘దీపవంశ’ బౌద్ధ గ్రంథం ప్రస్తావిస్తోంది. ఫెర్గూసన్ పండితుడు ‘వజ్రాలదిన్నె’ను ధాన్యకటకంతో పోల్చాడు. కృష్ణానది ముఖ ద్వారంలో ఉన్న ‘మబెరిక’  (భట్టిప్రోలు)లో ‘బుద్ధ ధాతువు’పై స్థూపం నిర్మించినట్లు ‘దీపవంశం’ గ్రంథం పేర్కొంటోంది. ‘సుత్తనిపాతం’  బౌద్ధ వ్యాఖ్యానంలో ‘అసక-ములక’ ప్రాంతాలను ‘ఆంధ్ర జనపదాలుగా’ గుర్తించారు. సుత్తనిపాతంలో ‘బావరి’ అనే కోసల దేశపు బ్రాహ్మణుడు అసక-ములక ప్రాంతాల సరిహద్దుల్లో గోదావరి నది ఒడ్డున ఆశ్రమం నిర్మించుకొని ఆంధ్రులకు విద్యాబోధన చేసినట్లు వివరిస్తోంది. బావరి బుద్ధుని సమకాలికుడే. ‘బౌద్ధ విమానవస్తు’ భాష్యం ప్రకారం బుద్ధుని ప్రధాన శిష్యుడు ‘కాత్యాయనుడు’ ‘అసక-ములక’ ప్రాంతాల్లో బౌద్ధ ధర్మాన్ని బోధించాడు. బావరి శిష్యులు, ఆంధ్ర బౌద్ధ భిక్షువులు ఉజ్జయిని, కోశాంబి, శ్రావస్తి, కపిలవస్తు, వైశాలి నగరాలను సందర్శించినట్లు తెలుస్తోంది. వీరందరినీ  అప్పుడు అంధకులు అనేవారు. త్రిపీఠకాల్లో ‘మహావగ్గ’ ప్రకారం శ్రావస్తి నగరానికి దగ్గరలో ‘అంధకవనం’, రాజగృహానికి దగ్గరలో ‘అంధకవింద’ విహారాలు నిర్మించినట్లు తెలుస్తోంది. వీటిని బహుశా ఆంధ్రులు నిర్మించి ఉంటారని ప్రఖ్యాత చారిత్రక పరిశోధకుడు బి.ఎస్.ఎల్. హనుమంతరావు అభిప్రాయపడ్డారు. బౌద్ధ భిక్షువులు ధాన్యకటకం (అమరావతి)లో ‘వంద నామగోష్టి’గా ఏర్పడినట్లు శాసన ఆధారం. బౌద్ధ మతాచార్యులు నిర్వహించిన మూడో సంగీతి (సదస్సు)లో అంధకులు ప్రముఖ పాత్ర వహించారని ‘కథావస్తు’ గ్రంథం పేర్కొంటోంది. ఉత్తర భారతదేశ మౌర్యరాజుల ప్రోత్సాహంతో ‘థేరవాద మహా సాంఘికులు’ బౌద్ధ మత ప్రచారం కోసం ఆంధ్రదేశంతోపాటు, కాశ్మీరం, గాంధారం, అపరాంత, వనవాసి, మహిష మండలం, తామ్రపర్ణి, మహారక, సువర్ణభూమి వంటి ప్రాంతాలకు వెళ్లారు. బౌద్ధులు ‘సింహగోష్టిగా’ ఏర్పడినట్లు భట్టిప్రోలు శాసనం పేర్కొంటోంది.
 
బౌద్ధ శిల్పకళ
ఆనాటి బౌద్ధ  కళాకారులు విశిష్ట శాస్త్రీయ శిల్పకళకు నాంది పలికారు. అందువల్లే బౌద్ధ యుగపు శిల్పకళా రీతి ప్రపంచ చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. నాటి కళాసృష్టి మూడు దశలుగా సాగింది. వర్ణచిత్రాల రూపంలో బౌద్ధ జాతక కథల్ని అజంతా, ఎల్లోరా, పితల్‌కోరా ప్రాంతాల్లోని విహారాల్లో చిత్రించారు. అమరావతి, నాగార్జునకొండ, గోలి, భట్టిప్రోలు, జగ్గయ్యపేట బౌద్ధ క్షేత్రాల్లో స్థూపాలు, చైత్యాలు నిర్మించి మనోహరమైన శిల్పంతో అలంకరించారు. కొండలను తొలచి, ఆ గుహల్లో బుద్ధుని ప్రతిమలు, చైత్య - సంఘారామాలు నిర్మించారు. ఈ గుహలు తెలుగు నేలపై కనిపిస్తాయి.
 
కోటిలింగాల వద్ద అవశేషాలు
కరీంనగర్ జిల్లా కోటిలింగాల వద్ద గోదావరి తీరంలో రాతి స్థూపం అవశేషాలు లభించాయి. కోటిలింగాలకు రెండు మైళ్ల దూరంలో ‘పూస’ గ్రామం వద్ద రెండు ‘బౌద్ధ ఆరామాల’ అవశేషాలను కనుగొన్నారు. అదే జిల్లాలో ‘ధూళికట్టలో’ మరొక స్థూపం బయటపడింది. ఇది క్రీ.పూ.200 నాటిదని నిర్ధరించారు.
 
‘ఫణిగిరి’ బౌద్ధ అవశేషాలు
నల్గొండ జిల్లా సూర్యాపేటకు ‘ఫణిగిరి’ గ్రామం 35 కి.మీ. దూరంలో ఉంది. ఈ గ్రామానికి ఆనుకొని ఉన్న చిన్న కొండపై బౌద్ధ సంఘారామాలు బయల్పడ్డాయి. ఫణిగిరికి దగ్గరలోనే గాజులబండ, వర్ధమానుకొండ, అర్వపల్లి, తిరుమలగిరి గ్రామాలు బౌద్ధ అవశేషాలకు ప్రసిద్ధిచెందాయి. నిజాం కాలంలో 1942-43లో, ఆ తర్వాత 2001-2003ల్లో ఇక్కడ పురావస్తు శాఖ తవ్వకాలు జరిపింది. మహాస్థూపం, ప్రార్థనా మందిరం, మూడు విహారాలు, రెండు చైత్యగృహాలు, బ్రాహ్మీలిపి శాసనాలు, అనేక శిల్పాలు బయల్పడ్డాయి. ఇవి శాతవాహనులు, ఇక్ష్వాకుల కాలానికి చెందినవి. ఫణిగిరిలో మహాతలవర, శాతవాహన, ఇక్ష్వాక రాజులకు సంబంధించిన నాణేలు బయల్పడ్డాయి. ఫణిగిరిలో బౌద్ధం క్రీ.పూ.మొదటి శతాబ్దం నుంచి క్రీ.శ.మూడో శతాబ్దం వరకూ విలసిల్లినట్లు తెలుస్తోంది. ఫణిగిరిలో మహాస్థూపం, చైత్యగృహం, బుద్ధుని పాదాలు, మాంధాత జాతక శిల్పం, టెర్రాకోట ప్రతిమలు, క్రీ.శ.3వ శతాబ్దానికి చెందిన ఎహూవలశాంతమూలుడి (ఇక్ష్వాకురాజు) శాసనం లభించాయి.
Published date : 24 Sep 2016 01:24PM

Photo Stories