Skip to main content

శాతవాహనులు

శాతవాహనులు ప్రప్రథమంగా దక్షిణాపథ రాజకీయ చరిత్రకు శ్రీకారం చుట్టారు. ఉత్తర-దక్షిణ దేశాల మధ్య సాంస్కృతిక వారధిని నిర్మించారు. సుమారు 33 మంది శాతవాహన రాజులు ప్రతిష్ఠానపురం, అమరావతిలను రాజధానులుగా చేసుకొని, నాలుగున్నర శతాబ్దాల పాటు పాలించారు. దీంతో భారతదేశ చరిత్రలో సుదీర్ఘ కాలం పాలించిన రాజవంశంగా శాతవాహనులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆధారాల ప్రకారం వీరి పాలన క్రీ.పూ.271లో ఆరంభమై, క్రీ.శ.174లో అంతమైంది.
ఆంధ్ర శబ్దం ప్రథమంగా ఐతరేయ బ్రాహ్మణంలో కన్పిస్తుంది. మత్స్య, వాయు, విష్ణు, భాగవతాది పురాణాల్లో సైతం ఆంధ్రుల ప్రస్తావన ఉంది. బౌద్ధ సాహిత్యమైన భీమసేన జాతకం ఆంధ్ర పదాన్ని ప్రస్తావిస్తే, సెరివణిజ జాతకం ఆంధ్ర నగరిని పేర్కొంది. వీటితోపాటు అశోకుడి 13వ శిలాశాసనం కూడా ఆంధ్రుల గురించి ప్రస్తావించింది. గ్రీకు రచయిత మెగస్తనీస్ ఇండికా గ్రంథంలో ఆంధ్రులకు 30 కోటలతో గొప్ప సైనిక బలముందని పేర్కొన్నాడు. ప్లినీ.. లాటిన్ భాషలో రచించిన ‘నేచురల్ హిస్టరీ’లో మెగస్తనీస్ పేర్కొన్న అంశాలనే ఉటంకించాడు. అజ్ఞాత రచయిత రచించిన ‘పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రిన్ సీ’ గ్రంథం శాతవాహనుల విదేశీ వాణిజ్య వివరాలను తెలుపుతోంది.

జన్మస్థలం
  • శాతవాహనుల జన్మస్థలానికి సంబంధించి చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి.
  • పురాణాల్లో పేర్కొన్న ఆంధ్ర భృత్యులు, శాతవాహనులు ఒకరేనని ఆర్.జి. భండార్కర్ అభిప్రాయపడగా, పి.టి.శ్రీనివాస అయ్యంగార్, కె. గోపాలాచారి, పులస్కర్ వంటి వారి వాదనలో శాతవాహనుల తొలి నివాసం మహారాష్ర్టలోని నాసిక్ ప్రాంతం. వి.ఎన్.సుక్తాంకర్ అభిప్రాయంలో బళ్లారి ప్రాంతం శాతవాహనుల ప్రథమ నివాసం. శాతవాహనులు గోదావరి, కృష్ణా మండల వాసులని, అశోకుడి మరణానంతరం స్వతంత్రులై, పశ్చిమాన నాసిక్ వరకు రాజ్యాన్ని విస్తరించారని వి.ఎ.స్మిత్, రాయ్ చౌదరీ, ఆర్.జి.భండార్కర్, ఎం.రామారావు, గుర్తి వెంకట్రావు వంటి చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. శాతవాహనుల జన్మభూమి విదర్భ ప్రాంతమని వాసుదేవ విష్ణుమిరాసీ పేర్కొన్నారు. శాతవాహనుల ప్రాచీన రాజధాని శ్రీకాకుళమని (కృష్ణాజిల్లా), ఆ తర్వాత ధాన్యకటకం (అమరావతి), ప్రతిష్ఠానపురం (పైఠాన్) రాజధానులుగా పాలించారని డాక్టర్ ఎల్.డి.బార్నెట్ అభిప్రాయపడ్డారు. శాతవాహనుల తొలి రాజధాని ధాన్యకటకం అని భండార్కర్ పేర్కొన్నారు.
శాతవాహనుల చరిత్రకు ఆధారాలు
 1. మత్స్య, వాయు, బ్రహ్మాండ, భాగవత పురాణాలు.
 2. శర్వవర్మ రాసిన సంస్కృత వ్యాకరణ గ్రంథం- కాతంత్ర వ్యాకరణం.
 3. ప్రాకృత భాషలో హాలుడు రచించిన గాథాసప్తశతి.
 4. ఆచార్య నాగార్జునుడు సంస్కృత భాషలో రచించిన సుహృల్లేఖ, ప్రజ్ఞాపారమిత వంటి గ్రంథాలు.
 5. మెగస్తనీస్ (గ్రీకు రచయిత) ఇండికా.
 6. టోలమీ రచించిన ‘ఎ గైడ్ టు జాగ్రఫీ’
 7. హ్యుయాన్‌త్సాంగ్ రచించిన సీయూకీ
 8. అజ్ఞాత రచయిత ‘పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రిన్ సీ’
 9. ఎర్రగుడి, రాజుల మందగిరి (కర్నూలు జిల్లా), మస్కి (రాయచూర్)ల్లో అశోకుడు వేయించిన శిలా శాసనాలు.
 10. మొదటి శాతకర్ణి భార్య ‘నాగానిక’ వేయించిన నానాఘట్ శాసనం.
 11. గౌతమీ పుత్ర శాతకర్ణి తల్లి ‘గౌతమీ బాలశ్రీ’ వేయించిన నాసిక్ శిలా శాసనం.
 12. రెండో శాతకర్ణి సమకాలికుడైన కళింగాధిపతి ఖారవేలుడు వేయించిన హాతిగుంఫా శిలాశాసనం (ఒడిశా).
 13. శక రాజైన రుద్రదమనుడు మొదటిసారిగా సంస్కృత భాషలో వేయించిన గిర్నార్ శాసనం.

ఇవన్నీ శాతవాహనుల చరిత్రకు ప్రధాన మూలాధారాలు. ఇవి కాకుండా పురావస్తు అవశేషాలు, స్థూపాలు, చైత్య గృహాలు, విహారాలు, నాణేలు ముఖ్య ఆధారాలు. శాతవాహనులు, అశోకుడు వేయించిన శాసనాలు ప్రాకృత భాష బ్రాహ్మీలిపిలో ఉన్నాయి.

రాజ్య స్థాపన
శ్రీముఖుడు (సీముకుడు) స్వతంత్ర శాతవాహన రాజ్యాన్ని స్థాపించాడు. క్రీ.పూ.271 నుంచి 248 (23 ఏళ్లు) వరకు పాలించాడు. శ్రీముఖుడు సౌరాష్ర్ట పాలకుడైన మహారథి త్రనకైరోను ఓడించి అతడి కుమార్తె నాగానికను, తన కుమారుడైన మొదటి శాతకర్ణికిచ్చి వివాహం చేశాడు. శ్రీముఖుడి నాణేలు కరీంనగర్ జిల్లా కోటిలింగాల ప్రాంతంలో లభ్యమయ్యాయి. సంగారెడ్డి, కొండాపూర్ (మెదక్ జిల్లా) కర్ణాటకలోని సన్నతి, మహారాష్ర్టలోని నెవాస, జున్నార్, అకోల ప్రాంతాల్లో శ్రీముఖుని నాణేలు దొరికాయి.

మొదటి శాతకర్ణి
శ్రీముఖుడి తర్వాత అతడి సోదరుడు కృష్ణుడు రాజ్యపాలన చేశాడు. అనంతరం మొదటి శాతకర్ణి రాజ్యానికొచ్చాడు. ఇతని భార్య నాగానిక వేయించిన నానాఘట్ శాసనం.. మొదటి శాతకర్ణిని ‘ఏకవీరుడు’, శూరుడు, దక్షిణాపథపతిగా వర్ణించింది. రెండు అశ్వమేథ యాగాలు,  ఒక రాజసూయ యాగం చేసిన తొలి శాతవాహన రాజుగా  మొదటి శాతకర్ణికి గుర్తింపు ఉంది. బ్రాహ్మణులకు ‘కార్షాపణలు’ (వెండి నాణేలు) దానం చేశాడు. మాళ్వా, ఉజ్జయిని, విదిశ (మధ్యప్రదేశ్) ప్రాంతాల వరకు రాజ్యాన్ని విస్తరించి.. అప్రతిహతచక్ర అనే బిరుదు పొందాడు. మొదటి శాతకర్ణి బలవంతుడైన పుష్యమిత్ర శుంగను ఓడించి, దానికి గుర్తుగా ఉజ్జయిని పట్టణ గుర్తు ఉన్న నాణేలను ముద్రించాడు.

రెండో శాతకర్ణి
ఇతడు శాతవాహన వంశంలో ఆరో రాజు. క్రీ.పూ. 184 నుంచి 128 (56 ఏళ్లు) వరకు పాలించాడు. కణ్వ వంశంలో చివరి వాడైన సుశర్మను ఓడించి పాటలీపుత్రాన్ని జయించాడు. దీనికి నిదర్శనంగా రెండో శాతకర్ణి నాణేలు పాటలీపుత్రంలోని ‘కుహ్రయ’ వద్ద లభించాయి. రెండో శాత   కర్ణి ఖారవేలుడి చేతిలో ఓడాడని, ఖారవేలుడి మరణానంతరం కళింగను జయించాడని తెలుస్తోంది. ఇతడు సాంచీ స్థూపానికి దక్షిణ తోరణాన్ని    నిర్మించాడు.

శాతవాహన రాజుల్లో 13వ వాడు కుంతల శాతకర్ణి. ఇతడి కాలంలోనే ప్రాకృత భాష స్థానంలో సంస్కృతం రాజభాషగా మారింది.  నాణేలపై పాటలీపుత్ర చిహ్నాన్ని ముద్రించాడు.

హాలుడు
శాతవాహన రాజుల్లో హాలుడు 17వ రాజు. ఏడాది మాత్రమే రాజ్యమేలాడు. హాలుడు  ప్రాకృత భాషలో 700 శృంగార గాథలను గాథాసప్తశతి పేరుతో రచించాడు. ఇతనికి ‘కవి వత్సలుడు’ అనే బిరుదు ఉంది. కుతూహలుడు రాసిన లీలావతి పరిణయం కావ్యం ప్రకారం హాలుడు సింహళ రాజకుమారిని గోదావరి తీరంలోని ద్రాక్షారామంలో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. వాత్సాయన కామసూత్ర, రాజశేఖరుడి కావ్య మీమాంస గ్రంథాలు హాలుడిని ప్రస్తావించాయి.

గౌతమీపుత్ర శాతకర్ణి
క్రీ..శ.62 నుంచి 86 వరకు పాలించిన 23వ శాతవాహన రాజు గౌతమీపుత్ర శాతకర్ణి.  ఇతను శాతవాహన రాజుల్లో అగ్రగణ్యుడు, గొప్ప విజేత. తల్లి గౌతమీ బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనం (ప్రాకృతం) ఇతడి విజయాలను విశదీకరిస్తోంది. శాతవాహన రాజుల్లో పేరుకు ముందు తల్లి పేరును పెట్టుకొనే సంప్రదాయం గౌతమీ పుత్ర శాతకర్ణితోనే ప్రారంభమైంది. శక, శాతవాహనుల మధ్య సముద్ర వ్యాపారం కోసం జరిగిన పోరాటంలో శక రాజైన నహపాణుడ్ని హతమార్చి ‘క్షవరాటవంశ నిరవశేషకార’ అనే బిరుదు పొందాడు. తాను అధికారంలోకి రావడానికి గుర్తుగా క్రీ.శ.78లో శాలివాహన శకాన్ని ప్రారంభించాడు. శకరాజుల్లో నహపాణుడు గొప్ప దండయాత్రికుడిగా పేరు పొందాడు. అతని రాజ్యం కతియవాడ్ (గుజరాత్), ఉత్తర, దక్షిణ మహారాష్ర్ట, కొంకణ ప్రాంతాల వరకు విస్తరించింది. నహపాణుడి రాజధాని మిన్నగార. ఇది ఉజ్జయినీ-బ్రోచ్‌ల మధ్య ఉంది. జోగల్‌తంబి (మహారాష్ర్ట) ప్రాంతంలో 13,270 నహపాణుడి వెండి నాణేలు లభ్యమయ్యాయి. గౌతమీపుత్ర శాతకర్ణి నాణేలు ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి, చేబ్రోలు, మాచర్ల, గోలి, మాడుగుల ప్రాంతాల్లో లభించాయి. విజయపురి (నాగార్జున కొండ) వద్ద ఇతడి కాలం నాటి టంకశాల బయల్పడింది. గౌతమీపుత్ర శాతకర్ణికి ఏకబ్రాహ్మణ, ఆగమనిలయ, క్షత్రియ దర్పమాన మర్ధన, త్రిసముద్రతోయ పీతవాహన, ఏకశూరుడు, ధనకటకస్వామి అనే బిరుదులున్నాయి.

శాతవాహనులు ఆంధ్రదేశ ప్రాదేశిక మనుగడను కాపాడినప్పటికీ రాజకీయ పరమైన సమస్యలను అధిగమించలేకపోయారు. వీరికి సమకాలికులైన శక (పశ్చిమ దిశ), ఉత్తరదిశలోని శుంగ, ఛేది (తూర్పు) రాజ వంశాలు వీరికి  సమస్యాత్మకంగా పరిణమించాయి. ఫలితంగా రాజధానిని ప్రతిష్ఠానపురం నుంచి అమరావతికి మార్చవలసి వచ్చింది.
Published date : 21 Jul 2016 04:27PM

Photo Stories