Intermediate Students: ఇంటర్మీడియెట్ విద్యార్థులకు సువర్ణావకాశం
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ విద్యార్థులకు బంగారు భవిష్యత్‌ను అందించేలా రాష్ట్ర ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచన చేస్తోందని ఇంటర్మీడియెట్ విద్య జిల్లా వృత్తివిద్యాధికారి(డీవీఈఓ) కోట ప్రకాశరావు తెలిపారు. ఆయన శుక్రవారం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటర్మీడియెట్‌లో 75 శాతం మార్కులు సాధించిన వారు ఐటీ రంగంలో ఉద్యోగాలు పొందేందుకు అవకాశం కల్పించేలా ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టిందని తెలిపారు. విద్యార్థులకు ఉద్యోగ అవకాశాల కోసం హెచ్‌సీఎల్ టెక్‌బితో ఏపీ ఇంటర్ బోర్డ్ ఒప్పందం కుదుర్చుకుందన్నారు. ప్రభుత్వం రూపొందించిన సరికొత్త ప్రణాళికను విద్యార్థులకు వివరించి వారిని చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత వివిధ యాజమాన్యాల పరిధిలో పనిచేస్తున్న కళాశాల ప్రిన్సిపాల్స్‌దేనని స్పష్టం చేశారు. ఉద్యోగం చేస్తూ ఉన్నత చదువులు చదువుకునే అవకాశం కూడా కల్పించడం ఈ ఒప్పందంలో కీలకాంశమని చెప్పారు.
Also Read : Intermediate Study Material
జిల్లాలో 2022–23లో ఇంటర్ పూర్తి చేసిన వారికి, 2023–24(ఈ ఏడాది) విద్యాసంవత్సరంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఇందుకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి కలిగినవారు ఈ నెలాఖరులోగా సంబంధిత ఆన్‌లైన్ వెబ్‌పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ల పక్రియ పూర్తి చేయాలని సూచించారు. మొదటి క్యాట్ ఎగ్జామ్, తర్వాత ఇంగ్లిష్ వర్సంట్ పరీక్ష, చివరిగా ఇంటర్వ్యూ నిర్వహిస్తారన్నారు. ఈ మూడింటిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఒక ఏడాదిపాటు శిక్షణ ఇవ్వనున్నారని తెలిపారు. ఈ ఏడాది కాలంలో ఏడో నెల నుంచి నెలకు రూ.10 వేల స్టైఫండ్ అందిస్తారని చెప్పారు. విద్యార్థులు రెండు విభాగాల్లో ఉద్యోగాలు పొందవచ్చన్నారు. ఇంటర్ ఎంపీసీ, ఎంఈసీ విద్యార్థులు ఐటీ రంగంలోనూ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఐసీ, ఒకేషనల్ కోర్సులు చదివిన వారికి అడ్మినిస్ట్రేటివ్‌కు సంబంధించి డీపీఓ విభాగంలో ఉద్యోగాలను కంపెనీ ద్వారా కల్పించనున్నారని తెలిపారు. రిజిస్ట్రేషన్ల గడువుకు సమ యం తక్కువగా ఉండటంతో, వివిధ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని డీవీఈఓ విజ్ఞప్తి చేశారు.