Engineering Counselling: ఆన్‌లైన్‌లో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్
గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీ ఈఏపీ సెట్–2023 ద్వారా ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. ఈఏపీ సెట్‌లో ర్యాంకు సాధించిన విద్యార్థులు ధ్రువపత్రాల పరిశీలనకు భౌతికంగా హెల్ప్‌లైన్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయిన విద్యార్థులు ఆగస్టు 3 నుంచి ఆన్‌లైన్‌లో వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవాల్సి ఉంది. దీనికోసం ఎస్‌ఈటీఎస్.ఎస్‌సీహెచ్‌ఈ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌కు లాగిన్ కావాలి. ఆప్షన్ల నమోదుకు 8వ తేదీ వరకు అవకాశం ఉంది. 9వ తేదీలోపు ఆప్షన్లు మార్చుకోవచ్చు. 12న సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 40 ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు 22,290 సీట్లు అందుబాటులో ఉన్నాయి. సీటు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకుని ఆగస్టు 13, 14వ తేదీల్లో కళాశాలల్లో రిపోర్టు చేయాలి. 16న కళాశాలల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి. గుంటూరు శివారు నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్, ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంతోపాటు నరసరావుపేటలోని జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటివద్ద ఆన్‌లైన్ సదుపాయం లేని విద్యార్థులు వెబ్ ఆప్షన్ల నమోదుకు ఈ హెల్ప్‌లైన్ కేంద్రాలకూ వెళ్లవచ్చు.
AP EAPCET 2023 Counselling: విద్యార్థులు ఏ బ్రాంచ్‌ను ఎంచుకోవాలి? ఏ కళాశాలలో చదివితే మంచిది?