AP EAPCET - 2022: పరీక్షల వివరాలు
జూలై 8 వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు, 11, 12 తేదీల్లో బైపీసీ స్ట్రీమ్ పరీక్షలు ఉంటాయి. రోజుకు రెండు సెషన్లుగా ఉ.9 గంటల నుంచి మ.12 వరకు, మ.3 నుంచి 6 వరకు ఈ పరీక్షలు కంప్యూటర్ ఆధారితంగా జరుగుతాయి. వీటిని సజావుగా పూర్తిచేయించేందుకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి, ఉన్నత విద్యాశాఖ ఇప్పటికే అన్ని జాగ్రత్తలు తీసుకున్నాయి.
చదవండి: AP EAPCET - 2022: విజయానికి అనురించాల్సిన వ్యూహాలు... ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం!
మూడు లక్షల మంది దరఖాస్తు
ఇక రాష్ట్రవ్యాప్తంగా 3,00,084 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు రిజిస్టర్ అయి దరఖాస్తులు సమర్పించారు. ఉ.7.30 నుంచి 9 గంటల వరకు, మ.1.30 నుంచి 3 గంటల వరకు అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి వివరించారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే..
✦ నిర్ణీత సమయానికి ఒక్క నిముషం ఆలస్యమైనా ప్రవేశానికి అనుమతించరు.
✦ విద్యార్థులు మాస్కులు ధరించి రావాలి. బ్లాక్ లేదా బ్లూ బాల్‌పెన్ను, చిన్న బాటిల్‌తో పాటు శానిటైజర్‌ను మాత్రమే అనుమతిస్తారు.
✦ రఫ్‌వర్కు పత్రాలను పరీక్ష కేంద్రాల్లోనే సమకూరుస్తారు.
✦ ఎలక్ట్రానిక్ పరికరాలనూ అనుమతించరు.
✦ బయోమెట్రిక్ ద్వారా విద్యార్థుల వివరాలను పరిశీలిస్తారు. కాబట్టి ఎవరూ చేతివేళ్లకు మెహిందీ, లేదా సిరా లేకుండా చూసుకోవాలి.
✦ విద్యార్థులు హాల్‌టిక్కెట్‌తో పాటు అధికారిక ఫొటో గుర్తింపు కార్డు, ఒక పాస్‌పోర్టు సైజ్ ఫొటో తీసుకురావాలి.
✦ పరీక్ష కేంద్రంలో అప్లికేషన్ నింపి ఫొటోను అతికించి దాన్ని ఇన్విజిలేటర్లకు అప్పగించాలి. అలా అప్పగించని వారి ఫలితాలు విత్‌హెల్డ్‌లో పెడతారు.
చదవండి: AP EAPCET: కంప్యూటర్ సైన్స్ టాప్.. ఇతర కొత్త కోర్సుల్లో సీట్ల కేటాయింపు పూర్తి వివరాలు
పరీక్షా విధానం ఇలా..
ఏపీ ఈఏపీ సెట్‌లో ప్రతి సెషన్ మూడుగంటల పాటు జరుగుతుంది. మొత్తం 160 ప్రశ్నలుంటాయి. ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో 80 ప్రశ్నలు మేథమెటిక్స్‌లో, 40 ప్రశ్నలు ఫిజిక్స్, 40 ప్రశ్నలు కెమిస్ట్రీలో ఉంటాయి. అన్నింటికీ ఒకే వెయిటేజీ ఉంటుంది. అలాగే, అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌లో 160 మార్కులలో 80 ప్రశ్నలు బయాలజీలో, (40 బోటనీ, 40 జువాలజీ), 40 ప్రశ్నలు ఫిజిక్స్, 40 ప్రశ్నలు కెమిస్ట్రీలో ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ ఉండదు. సమాధానామివ్వని ప్రశ్నలపై మూల్యాంకనం ఉండదు.
చదవండి: ఎంసెట్ స్టడీమెటీరియర్, సిలబస్, మోడల్‌పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ కోసం క్లిక్ చేయండి
25 శాతం మార్కులొస్తేనే అర్హత
ఈ ప్రవేశ పరీక్షలో అభ్యర్థులకు 25 శాతం మార్కులు వస్తే ర్యాంకులకు, కౌన్సెలింగ్‌కు అర్హులవుతారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ అభ్యర్థులకు క్వాలిఫైయింగ్ మార్కుల్లేవు. వారికి కేటాయించిన సీట్లను ఆ కేటగిరీ వారితోనే భర్తీచేస్తారు. పరీక్షలు ఆన్‌లైన్‌లో పలు సెషన్లలో జరగనున్నందున నార్మలైజేషన్ పద్ధతిలో మార్కులను ప్రకటించనున్నారు.
చదవండి: ఎంసెట్: మోడల్ పేపర్లు | ప్రివియస్ పేపర్స్ | ప్రాక్టీస్ ప్రశ్నలు
అవాంతరాల్లేకుండా నిర్వహణకు ఏర్పాట్లు
పరీక్ష సమయంలో సాంకేతిక సమస్యలకు ఆస్కారంలేకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే ఎంత సమయం ఆలస్యమైందో ఆ మేరకు అదనపు సమయాన్ని ఇస్తారు. హాల్ టికెట్లను కాలేజీల్లో అడ్మిషన్లు పూర్తయ్యే వరకు భద్రపర్చుకోవాలి. సందేహాలుంటే ‘ఏపీఈఏపీసీఈటీ2022హెచ్‌ఈఎల్‌పీడీఈఎస్‌కె ఃజీమెయిల్.కామ్‌కు తెలియజేయవచ్చు. లేదా 08554–234311 లేదా 08554–232248 నెంబర్లలో సంప్రదించవలసి ఉంటుంది.