Single Room-Five Classes: ఒకే గది.. ఐదు తరగతులు

బాల్కొండ: కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులను అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు.

ఇందుకు నిదర్శనం మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలనే. ఈ బడిలో 27 మంది విద్యార్థులు కనీస వసతులు లేకుండా విద్యను అభ్యసిస్తున్నారు. ఐదు తరగతుల విద్యార్థులు ఒకే గది, వరండాలో చదవాల్సిన దుస్థితి నెలకొంది. బాల్కొండ మండల కేంద్రంలో ఉర్దూ మీడియం పాఠశాల నిర్మించి ఏళ్లు గడుస్తున్నా నేటికీ వసతులు కరువయ్యాయి.

ఈ పాఠశాలలోని చిన్న గదిలో సుమారు 27 మంది విద్యార్థులు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్నారు. అంతేకాకుండా ఇదే గదిలో పాఠశాల కార్యాలయం, స్టోర్‌ రూం కూడా కొనసాగుతోంది. గతంలో పాఠశాలకు సొంత భవనం లేకపోవడంతో గతంలో ఉర్దూ మీడియం, ప్రాథమికోన్నత పాఠశాల మండల కేంద్రంలోని ఓ భవనంలో కొనసాగేది.

చదవండి: బాలలు.. కరాటే వీరులు

ప్రభుత్వం ఉర్దూ మీడియం పాఠశాలకు భవనం కేటాయించడంతో రెండేళ్ల క్రితం పనులు పూర్తయి అందుబాటులోకి వచ్చింది. కానీ ఒకే గది కేటాయించడంతో ఐదు తరగతుల నిర్వహణకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

తరగతి గదుల కొరతతో తల్లితండ్రులు, గ్రామస్తులు తమ పిల్లలను పాఠశాలకు సరిగా పంపడం లేదు. ఉపాధ్యాయులు సైతం తరగతుల నిర్వహణ ఇబ్బందిగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలకు అదనపు తరగతులు కేటాయించి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం

ఉర్దూ మీడియం పాఠశాలలో తరగతి గదుల కొరత గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. గతంలో వేరే పాఠశాలలో కలిపాం. సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం.

– రాజేశ్వర్‌, ఎంఈఓ, బాల్కొండ.

#Tags