వివిధ జంతువుల్లో ర‌వాణా వ్యవ‌స్థలు

వానపాము
• వానపాము రవాణా వ్యవస్థలో హృదయాలు, రక్తనాళాలు, రక్తం ఉంటాయి. శరీరంలో 8 జతల పార్శ్వ హృదయాలుంటాయి.
• రక్తనాళాలు మూసుకొని ఉండే గొట్టాలు, ఇవి హృదయంతో కలిసి ఉంటాయి. వీటిలో పృష్ట రక్తనాళం, ఉదర రక్తనాళం.. ఆహార నాళానికిపైన ఒకటి, కింద ఒకటి ఉంటాయి.
• పృష్ట రక్తనాళం ప్రతి ఖండితంలో వివిధ అవయవాల నుంచి రక్తాన్ని సేకరిస్తుంది. అందుకే ఇది ముఖ్య సిరగా పనిచేస్తుంది.
• ఉదర రక్తనాళం ప్రతి ఖండితంలో రక్తాన్ని వివిధ అవయవాలకు సరఫరా చేస్తుంది. ఇది ముఖ్య ధమనిగా పనిచేస్తుంది.
• పృష్ట రక్తనాళంలో రక్తం వెనుక నుంచి ముందుకు, ఉదర నాళంలో రక్తం ముందు నుంచి వెనుకకు ప్రయాణిస్తుంది.
• రక్తంలో ఆక్సిజన్‌ను తీసుకుపోయే ప్రొటీన్ ఉంటుంది. అందుకే రక్తం ఎర్రగా ఉంటుంది. ఎర్ర రక్తకణాలు ఉండవు. తెల్లరక్తకణాలే ఉంటాయి. రక్తంలో నీరు, లవణాలు ఉంటాయి.
• శరీర కుడ్యానికి, ఆహార నాళానికి మధ్య ఉన్న శరీర కుహరద్రవం కూడా పదార్థాల రవాణాలో ప్రముఖపాత్ర వహిస్తుంది.

బొద్దింక
• బొద్దింక రవాణా వ్యవస్థలో రక్తనాళాలు ఉండవు. రక్తం శరీర కుహరంలో కోటరాల్లో ప్రవహిస్తుంది. అందుకే దీన్ని స్వేచ్ఛాయుత రక్తప్రసరణ వ్యవస్థ అంటారు.
• బొద్దింక శరీరంలో హృదయావరణ కోటరం, పర్యాంతరంగ కోటరం, ఉదర కోటరం, తలలో శిరఃకోటరం ఉంటాయి.
• బొద్దింక హృదయంలో 13 గదులుంటాయి. ఆఖరి గది మూసుకొని ఉంటుంది. మొదటి గది మహాధమని ద్వారా శిరఃకోటరంలోనికి తెరుచుకుంటుంది.
• రక్తం పక్షాకార కండరాల వల్ల చలిస్తుంది.
• బొద్దింక రక్తం తెల్లగా ఉంటుంది. ఇది ఆక్సిజన్ రవాణాలో పాత్ర వహించదు.

ఉన్నతస్థాయి జీవులు రవాణా వ్యవస్థ
• శరీర భాగాల నుంచి ఆమ్లజని రహిత రక్తం శ్వాసేంద్రియాలకు ఆమ్లజనీకరణం కోసం వెళ్తుంది.
• తక్కువస్థాయి జీవుల్లో ఇక్కడ నుంచి శరీర భాగాలకు ప్రసరణం జరుగుతుంది.
ఉదా: చేపలు.
• ఆంఫిబియా నుంచి క్షీరదాల వరకు రక్తం శ్వాసేంద్రియాల నుంచి తిరిగి గుండెకు వస్తుంది. గుండె నుంచి శరీర భాగాలకు చేరుతుంది.

చేపలు
• చేపల్లో 2 గదుల హృదయం ఉంటుంది. ఒక కర్ణిక, ఒక జఠరిక ఉంటాయి. శరీర భాగాల నుంచి చెడు రక్తం సిరాసరణి చేరి తర్వాత కర్ణిక చేరుతుంది. అక్కడ నుంచి జఠరిక, తర్వాత మొప్పలకు వెళ్తుంది. మొప్పల్లో ఆమ్లజనీకరణం తర్వాత నేరుగా శరీర భాగాలకు మంచి రక్తం చేరుతుంది.
• చేపల్లో రక్తం గుండె ద్వారా ఒక్కసారే ప్రవహిస్తుంది. అందుకే ఈ వ్యవస్థని ఏకవలయ రక్తప్రసరణ అంటారు.
• చేప హృదయాన్ని ‘జలశ్వాస హృదయం’ అంటారు. (హృదయం మొప్పలకు రక్తాన్ని పంపుతుంది కాబట్టి)

ఉభయచరాలు
• కప్ప వంటి ఉభయచరాల్లో హృదయం 3 గదులు కలిగి ఉంటుంది. రెండు కర్ణికలు, ఒక జఠరిక ఉంటాయి.
• శరీరం నుంచి మూడు మహాసిరల ద్వారా చెడు రక్తం సిరాసరణి (Sinus venosus) చేరుతుంది. సిరాసరణి నుంచి కుడి కర్ణికలోనికి వెళ్తుంది.
• పుపుస సిర ద్వారా ఆమ్లజని సహిత రక్తం ఎడమ కర్ణికకు చేరుతుంది.
• కర్ణికలు రెండూ ఒకే జఠరికలోనికి తెరుచుకుంటాయి. కాబట్టి ఆమ్లజని సహిత, ఆమ్లజని రహిత రక్తాలు జఠరికలో కలిసి మిశ్రమ రక్తంగా ఏర్పడతాయి.
• మిశ్రమ రక్తం మహాధమని ద్వారా శరీర భాగాలకు సరఫరా అవుతుంది.
• ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేస్తుంది కాబట్టి ఉభయచరాల గుండెను ‘పుపుస హృదయం’ అంటారు.
• ఉభయచరాల నుంచి అన్ని ఉన్నత స్థాయి జీవుల్లో (సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు) రక్తం రెండుసార్లు హృదయాన్ని చేరుతుంది. కాబట్టి ఈ వ్యవస్థను ‘ద్వివలయ రక్తప్రసరణ వ్యవస్థ’ అంటారు.

సరీసృపాలు
• వీటిలో రెండు కర్ణికలు, ఒక అసంపూర్తిగా విభజన చెందిన జఠరిక కలిగిన హృదయం ఉంటుంది.
• ద్వివలయ ప్రసరణ, పుపుస హృదయం సరీసృపాల్లో కన్పిస్తుంది.

పక్షులు, క్షీరదాలు
• పూర్తిగా నాలుగు గదుల హృదయం ఉంటుంది. రెండు కర్ణికలు, రెండు జఠరికలుంటాయి. వీటిలో సిరాసరణి ఉండదు.
• మహాసిరలు ప్రత్యక్షంగా కుడి జఠరిక లోనికి తెరుచుకుంటాయి.
• పుపుస హృదయం, ద్వివలయ ప్రసరణ కలిగి ఉంటాయి.

• చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, శీతల రక్త జంతువులు (Poikilothermic) రక్త ఉష్ణోగ్రత పరిసరాలను బట్టి మారుతుంది.
• పక్షులు, క్షీరదాలు, ఉష్ణ రక్త జంతువుల (Homeothermic) ఉష్ణోగ్రత పరిసరాలను బట్టి మారకుండా స్థిరంగా ఉంటుంది.

గతంలో అడిగిన ప్రశ్నలు

  1. వివిధ శరీర భాగాల నుంచి వచ్చిన రక్తంతో ప్రారంభించి క్షీరదాల హృదయంలోని నాలుగు గదుల్లో రక్తప్రసరణ సరైన క్రమం (డీఎస్సీ 2012)
    ఎ)
    ఎడమ కర్ణిక బి) కుడి కర్ణిక సి) ఎడమ జఠరిక డి) కుడి జఠరిక
    1) సి, ఎ, డి, బి
    2) ఎ, డి, బి, సి
    3) బి, ఎ, డి, సి
    4) బి, డి, ఎ, సి
  2. సరిగా జతపరచని వాటిని గుర్తించండి?(డీఎస్సీ 2012)
    ఎ) సాలమండర్- 2 గదుల గుండె
    బి) కప్ప- 3 గదుల గుండె
    సి) కట్లకట్ల- 3 గదుల గుండె
    డి) పావురం - అసంపూర్తిగా విభజన చెందిన 4 గదుల గుండె
    1) ఎ, డి
    2) ఎ, సి
    3) బి, సి
    4) బి, డి
  3. హిమోగ్లోబిన్‌లో ఉండేవి? (డీఎస్సీ 2006)
    1) వర్ణకం, ఐరన్, ఫోరిఫైరిన్
    2) హీమ్, ఫోరిఫైరిన్, వర్ణకం
    3) గ్లోబిన్, ఐరన్, హిమ్
    4) గ్లోబిన్, ఐరన్, ఫోరిఫైరిన్
  4. రెండు గదుల హృదయం గల జీవి? (డీఎస్సీ 2004)
    1) చేప
    2) కప్ప
    3) బొద్దింక
    4) వానపాము
  5. కప్పలో సిరాసరణి దేనిలోకి తెరుచు కుంటుంది? (డీఎస్సీ 2004)
    1) కుడి జఠరిక
    2) ఎడమ జఠరిక
    3) కుడి కర్ణిక
    4) ఎడమ కర్ణిక
  6. కిందివాటిలో సరైంది? (డీఎస్సీ 2004)
    1) పుపుసధమని ఆమ్లజని సహిత రక్తాన్ని ఊపిరితిత్తులకు తీసుకొని పోతుంది
    2) కుడి జఠరిక ఆమ్లజని సహిత రక్తాన్ని ఊపిరితిత్తులకు పంపుతుంది
    3) ఆమ్లజని రహిత రక్తం ఎడమ కర్ణికలోకి చేరుతుంది
    4) అన్ని శరీర భాగాల నుంచి ఆమ్లజని రహిత రక్తం కుడి కర్ణికలోనికి పంపుతుంది

సమాధానాలు

1) 4 2) 1 3) 4 4) 1 5) 3 6) 4

మాదిరి ప్రశ్నలు

  1. బొద్దింకలో రక్తాన్ని హృదయంలోనికి పంపడానికి సహాయపడేవి?
    1) వాయునాళ కండరాలు
    2) పక్షాకార కండరాలు
    3) ఉరఃకుహర కండరాలు
    4) హృదయ కండరాలు
  2. కిందివాటిలో ఏ రెండు ప్రవచనాలు సరికావు
    ఎ) కప్పలో 3 గదుల గుండె ఉంటుంది
    బి) పావురంలో 2 గదుల గుండె ఉంటుంది
    సి) కుక్కలో 4 గదుల గుండె ఉంటుంది
    డి) మొసలిలో 3 గదుల గుండె ఉంటుంది
    1) ఎ, బి
    2) బి, సి
    3) బి, డి
    4) ఎ, సి
  3. ఉభయచరాల్లో మహాసిరలు కలిసి ఏర్పాటు చేసేది?
    1) కుడి కర్ణిక
    2) ఎడమ కర్ణిక
    3) జఠరిక
    4) సిరాసరణి
  4. స్వేచ్ఛాయుత రక్తప్రసరణ వ్యవస్థలో ఏవి ఉంటాయి?
    1) రక్తనాళాలు, రక్తం
    2) మొప్పలు, రక్తం
    3) కర్ణికలు, జఠరికలు
    4) గుండె, రక్త కోటరాలు
  5. మెగాస్కోలెక్స్‌లో ఉండే పార్శ్వ హృదయాల సంఖ్య?
    1) 9 జతలు
    2) 8 జతలు
    3) 7 జతలు
    |4) 6 జతలు
  6. మిశ్రమ రక్తానికి సంబంధించి సరైన ప్రవచనం?
    1) చేప కర్ణిక, జఠరికల్లో మిశ్రమరక్తం ఉంటుంది
    2) పక్షుల సిరాసరణి ద్వారా మిశ్రమ రక్తం ప్రసారం అవుతుంది.
    3) ఉభయచరాల జఠరికలో మిశ్రమరక్తం ఏర్పడుతుంది.
    4) క్షీరదాల కర్ణికలో మిశ్రమరక్తం ఉంటుంది.
  7. ద్వి ప్రసరణ రక్తప్రసరణ వ్యవస్థ కలిగిన జీవి?
    1) బొద్దింక
    2) వానపాము
    3) కోతి
    4) కోడి
  8. వానపాములో సిరలు నిర్వహించే పనిని నిర్వర్తించే రక్తనాళం?
    1) పృష్ట రక్తనాళం
    2) ఉదర రక్తనాళం
    3) మహాధమని
    4) సిరాసరణి
  9. కిందివాటిలో ఏ రెండు జతలు సరైనవి?
    ఎ) బొద్దింక - ఎరుపు రంగు రక్తం
    బి) మొసలి- 4 గదుల గుండె
    సి) సాలమండర్- సిరాసరణి
    డి) సరీసృపాలు- ఉష్ణరక్త జంతువులు
    1) ఎ, డి
    2) బి, సి
    3) సి, డి
    4) ఎ, బి
  10. బొద్దింక రక్తప్రసరణను స్వేచ్ఛాయుత రక్తప్రసరణ వ్యవస్థగా పిలుస్తారు. ఎందుకంటే?
    1) రక్తం రక్తనాళాల్లో ప్రవహిస్తుంది
    2) ద్వి వలయ రక్తప్రసరణ జరుగుతుంది
    3) రక్తం శరీర కుహరంలో కోటరాల్లో వహిస్తుంది
    4) బొద్దింకలో గుండె భాగం ఉండదు
  11. కిందివారిలో ఎవరు తెలిపిన ప్రవచనం సరికాదు?
    1) శ్రావణ్ - చేప గుండెను జలశ్వాస హృదయం అంటారు
    2) శ్రుతి - ఉభయచరాల్లో ఏక వలయ రక్తప్రసరణ ఉంటుంది
    3) శ్రేయ- పక్షులు ఉష్ణరక్త జంతువులు
    4) శ్రావ్య - వానపాములో తెల్లరక్తకణాలే ఉంటాయి
  12. చేపల్లో ఏకవలయ రక్త ప్రసరణకు కారణం?
    1) 2 గదుల గుండె ఉండటం
    2) సిరాసరణి ఉండటం
    3) మొప్పల నుంచి రక్తం నేరుగా శరీర భాగాలకు వెళ్లడం
    4) చేపలు నీటిలో ఉండటం, శీతల రక్త జీవులు కావడం

సమాధానాలు

1) 2

2) 3

3) 4

4) 4

5) 2

6) 3

7) 3

8) 1

9) 2

10) 3

11) 2

12) 3











































#Tags