Panchayat Secretary Duties in AP : ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీ సెక్రటరీ ఉండాల్సిందే.. బాధ్యతలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఏపీ గ్రామ పంచాయతీలు, సచి­వా­లయాల మధ్య మరింత సమన్వ­యం తెస్తూ పాలనాపరంగా రాష్ట్ర ప్రభు­త్వం నిర్ణయం తీసుకుంది.

ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేకంగా ఒక పంచాయతీ కార్యదర్శి అందుబాటులో ఉండేలా ప్రస్తు­తం గ్రామ సచివాలయాల్లో గ్రేడ్‌–5 పంచా­యతీ కార్యదర్శుల హోదాలో పని చే­స్తు­న్న వారికి అవకాశం కల్పించనుంది. మి­గి­లిన నాలుగు కేటగిరీ పంచాయతీ కార్య­దర్శుల తరహాలోనే వారికి డీడీవో అధికారాలను కల్పించనున్నారు. గ్రేడ్‌–5 పంచాయ­తీ కార్య­దర్శులు ప్రస్తుతం పనిచేస్తున్న చోట ఆయా పంచాయతీల బాధ్యతలను అప్పగించనున్నారు. 

గ్రామ సచివాలయాలతో పాటు..

2019లో సచివాలయాల వ్యవస్థ ఏర్పాటుకు ముందు గ్రామ పంచాయతీల్లో గ్రేడ్‌ 1,2,3,4 కేటగిరీ పంచాయతీ కార్యదర్శులు మాత్రమే విధులు నిర్వహించారు. చిన్నవైతే మూడు నాలుగు పంచాయతీలకు కలిపి ఒకే  కార్యదర్శి బాధ్యతలు నిర్వహించేవారు. పంచాయతీరాజ్‌ శాఖ దీన్ని క్లస్టర్‌ పంచాయతీ విధానంగా వ్యవహరిస్తోంది. ప్రతి రెండు వేల జనాభాకు ఒక సచివాలయం చొప్పున సచివాలయాల వ్యవస్థతోపాటు గ్రేడ్‌–5 పంచాయతీ కార్యదర్శుల నియామకాన్ని కూ­డా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. నాటి నుంచి గ్రేడ్‌–1 పంచాయతీ కార్యదర్శి మొదలు కొత్తగా నియమితులైన గ్రేడ్‌–5 పంచాయతీ కార్యదర్శి వరకు ఆయా సచివాలయాల్లో కార్యదర్శి హోదాలోనే విధులు నిర్వహిస్తున్నారు. సచివాలయాల ద్వారా అందజేసే 545 రకాల ప్రభుత్వ సేవలతో సహా ప్రతి కార్యక్రమాన్ని వారికే అప్పగించారు. పంచాయతీ వ్యవస్థకు సంబంధించిన కార్యకలాపాలు మాత్రం పాత క్లస్టర్‌ విధానంలోనే కొనసాగుతున్నాయి.  

సచివాలయాల ఏర్పాటు సమయంలో గ్రేడ్‌–5 పంచాయతీ కార్యదర్శులకు మిగిలిన నాలుగు కేటగిరీ ఉద్యోగుల మాదిరిగానే జాబ్‌­చార్టు నిర్ధారించినా ప్రొబేషన్‌ ఖరారు కానందున పంచాయతీ బిల్లులు తయారీ లాంటి డీడీవో అధికారాలను మాత్రం పూర్తి స్థాయిలో అప్పగించలేదు.ఇప్పుడు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్‌ ఖరారు ప్రక్రి­య పూర్తయిన నేపథ్యంలో గ్రేడ్‌–5 పంచాయ­తీ కార్యదర్శులకు కూడా 1–4 గ్రేడ్‌ కేటగిరీ పంచాయతీ కార్యదర్శుల తరహాలోనే అన్ని రకా­ల డీడీవో అధికారాలు దక్కుతాయి. తద్వారా ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేకంగా ఒక కార్యదర్శిని కేటాయించడం ద్వారా పంచాయతీల కార్యకలాపాల నిర్వహణలో వేగం పెరిగే అవకాశం ఉంటుంది.

సచివాలయ కార్యదర్శిగానూ, పంచాయతీ కార్యదర్శిగానూ ఒక్కరే..

ప్రభుత్వ తాజా నిర్ణయంతో గ్రేడ్‌–1 మొదలు గ్రేడ్‌–5 పంచాయతీ కార్యదర్శులకు అదనపు అధికారాలు దక్కడంతో పాటు సర్పంచ్‌లకు కూడా మరిన్ని అధికారాలు లభించే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. పంచాయతీ రెగ్యులర్‌ ఉద్యోగుల (010 పద్దు ఉద్యోగులు) నెలవారీ జీతాల బిల్లులను ప్రతిపాదించే అధికారం కార్యదర్శులతో పాటు సర్పంచ్‌లకు ఉమ్మడిగా మేకర్, చెక్కర్‌ హోదాలో లభించనుంది. రాష్ట్రంలో 500 పైబడి జనాభా ఉండే ప్రతి గ్రామ పంచాయతీకీ సచివాలయ కార్యదర్శిగానూ, పంచాయతీ కార్యదర్శిగానూ ఒక్కరే కొనసాగనున్నా­రు. ఆయా పంచాయతీల పరిమాణాన్ని బట్టి కార్యదర్శులకు బాధ్యతలు కేటాయిస్తారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నెలకొల్పిన సచివాలయాల వ్యవస్థ ద్వారా కొత్తగా ఉద్యోగాలు పొందిన వేలాది మంది గ్రేడ్‌–5 పంచాయతీ కార్యదర్శులు తమ కు చిన్న పంచాయతీల బాధ్యతలు కూడా అప్పగించాలని చాలా కాలంగా కోరుతున్నారు. ఇప్పుడు వారికి కోరిక నెరవేరుతుండటంతో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

#Tags