మళ్లీ ప్రొఫెసర్‌గానే కొనసాగుతా..టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి

సాక్షి, హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ చైర్మన్ బాధ్యతల నుంచి ఈనెల 17న తప్పుకున్న తర్వాత తిరిగి ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగుతానని ఘంటా చక్రపాణి తెలిపారు.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన టీఎస్‌పీఎస్సీకి తొలి చైర్మన్‌గా ఆరేళ్ల కాలాన్ని పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. చైర్మన్ బాధ్యతల అనంతరం తాను బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో సోషియాలజీ ప్రొఫెసర్‌గా చేరనున్నట్లు వెల్లడించారు. తన ఆరేళ్ల చైర్మన్ పదవీకాలంలో ప్రభుత్వం 39,952 పోస్టుల భర్తీకి అనుమతులివ్వగా.. అందులో 36,758 పోస్టుల భర్తీకి 108 నోటిఫికేషన్లు జారీ చేశానన్నారు. 35,724 ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ పూర్తయినట్లు చెప్పారు. టీఎస్‌పీఎస్సీకి అంతర్జాతీయ స్థాయిలో పేరు వచ్చేలా కృషి చేశామని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రతి కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో చేసి దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం గర్వంగా ఉందని అన్నారు.