JEE Main 2024 Exam Dates: జేఈఈ మెయిన్స్‌ తేదీలు ఖరారు

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీలు, ట్రిపుల్‌ ఐటీ ల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్స్‌ పరీక్ష తేదీలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వెల్లడించింది.
జేఈఈ మెయిన్స్‌ తేదీలు ఖరారు

 ఈ మేరకు సెప్టెంబర్‌ 19న ప్రకటన విడుదల చేసింది. కోవిడ్‌ కాలంలో 4 దఫాలుగా నిర్వహించిన ఈ పరీక్షను 2024– 25లో మాత్రం రెండు విడతలుగానే నిర్వహిస్తున్నట్టు తెలిపింది. తొలి విడతను 2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ మధ్య చేపట్టాలని నిర్ణయించింది. రెండో దఫా జేఈఈ మెయిన్స్‌ ను ఏప్రిల్‌ 1 నుంచి 15వ తేదీ మధ్య నిర్వహించబోతున్నట్టు వెల్లడించింది. దీంతో పాటే మే 5న నేషనల్‌ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌–యూజీ), మే 15–31 తేదీల మధ్య కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సీయూఈటీ), మార్చి 11–28 మధ్య సీయూఈటీ–పీజీ, జూన్‌ 10–21 మధ్య యూజీసీ–నెట్‌ పరీక్షలను నిర్వహించేందుకు తేదీలను ఖరారు చేసింది.

చదవండి: జేఈఈ (మెయిన్స్‌ & అడ్వాన్స్‌డ్‌) - గైడెన్స్ | వీడియోస్

ఈ పరీక్షలన్నీ కంప్యూటర్‌ ఆధారంగానే ఉంటాయని పేర్కొంది. అయితే, సమగ్ర వివరాలతో కూడిన షెడ్యూల్‌ను ఎన్‌టీఏ విడుదల చేయాల్సి ఉంది. 2021 నుంచి జేఈఈ మెయిన్స్‌ పరీక్ష కోవిడ్‌ కారణంగా ఆలస్యమవుతూ వస్తోంది. గత ఏడాది మాత్రం జనవరి, ఏప్రిల్‌ నెలల్లోనే నిర్వహించారు. అయితే, తేదీల ఖరారులో మాత్రం ఆలస్యమైంది. ఈ సంవత్సరం కోవిడ్‌ కన్నా ముందు మాదిరిగానే మూడు నెలల ముందే తేదీలను వెల్లడించారు.  

మెయిన్స్‌ దరఖాస్తులు పెరిగేనా? 

కోవిడ్‌ తర్వాత దేశవ్యాప్తంగా జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీల వైపు విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో జేఈఈ మెయిన్స్‌ రాసే వారి సంఖ్య ప్రతీ సంవత్సరం తగ్గుతోంది. ఈ స్థానంలో రాష్ట్ర ఎంసెట్‌కు దరఖాస్తులు పెరుగుతున్నాయి. 2014లో జేఈఈ మెయిన్స్‌ రాసినవారి సంఖ్య 12.90 లక్షలుంటే, 2022లో ఈ సంఖ్య 9.05 లక్షలకు తగ్గింది. 2023లో మాత్రం ఈ సంఖ్య 11 లక్షలకు పెరిగింది. కోవిడ్‌ సమయంలో టెన్త్‌ పరీక్షలు లేకుండా ఉత్తీర్ణులైన వారి సంఖ్య ఎక్కువగా ఉండటం కూడా దీనికి కారణంగా చెబుతున్నారు.

☛ JEE MAIN - MODEL PAPERS | GUIDANCE | CUT-OFF RANKS-2023 | PREVIOUS PAPERS (JEE MAIN) |PREVIOUS PAPERS (JEE ADV.) | SYLLABUS | SYLLABUS (JEE ADV.) | VIDEOS

వాస్తవానికి మన రాష్ట్రం నుంచి 2014లో జేఈఈ రాసిన వారి సంఖ్య 2 లక్షల వరకూ ఉంటే, ఇప్పుడు 1.30 లక్షలకు పడిపోయింది. రాష్ట్రంలో ఎంసెట్‌ రాసేవారి సంఖ్య 2018లో 1.47 లక్షలుంటే, 2022లో ఇది 1.61 లక్షలకు పెరిగింది. కాగా, గత రెండేళ్లుగా రాష్ట్రంలో హాస్టళ్లు పూర్తిస్థాయిలో తెరుచుకోవడం, జేఈఈపై దృష్టి పెడుతున్న వారి సంఖ్య పెరగడంతో ఈ సంవత్సరం కూడా జేఈఈ రాసే వారి సంఖ్య పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

జేఈఈ మెయిన్స్‌కు విద్యార్థుల హాజరు సంఖ్య ఇలా.. 

సంవత్సరం

దరఖాస్తులు

పరీక్షకు హాజరైనవారు

2014

13,57,002

12,90,028

2015

13,56,765

12,03,453

2016

12,34,760

12,07,058

2017

11,86,454

11,22,351

2018

11,35,084

10,74,319

2019

12,37,892

11,47,125

2020

11,74,939

10,23,435

2021

10,48,012

9,39,008

2022

10,26,799

9,05,590

2023

11,62,398

11,13,325

#Tags