APPSC Group 1 Ranker 2022 Success Stories : తొలి ప్రయత్నంలోనే.. గ్రూప్-1 ఉద్యోగాలు కొట్టారిలా.. మేము ఇలా చదివాం..
వీరు చిన్నప్పటి నుంచి కష్టపడి బాగా చదువుకున్నారు.. సివిల్స్ సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.. ఆ దిశగా అడుగులు వేస్తూనే.. వివిధ పోటీ పరీక్షల్లో సత్తా చాటుతూ తమను తాము నిరూపించుకుంటున్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్–1 పరీక్షల్లో విజయం సాధించి, ఉన్నతోద్యోగాలకు ఎంపికయ్యారు ఆ యువకులు. ఈ నేపథ్యంలో ఈ యువకుల సక్సెస్ స్టోరీ మీకోసం..
డెంటిస్టుగా ప్రాక్టీస్ చేస్తూనే..
స్థానిక విద్యుత్ నగర్‌కు చెందిన మోకన వెంకట కృష్ణ చైతన్య 2018లో భీమవరంలోని ఓ ప్రైవేటు కాలేజీలో బీడీఎస్ పూర్తి చేశారు. డెంటిస్టుగా కాకినాడ, హైదరాబాద్‌లో ప్రాక్టీస్ చేశారు. హైదరాబాద్‌లో ఉంటూండగానే సివిల్స్ రాసి, ఐపీఎస్ అధికారి కావాలనే లక్ష్యంతో డెంటిస్టుగా ప్రాక్టీస్ చేస్తూనే సివిల్స్ కోచింగ్‌పై దృష్టి సారించారు. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్(సీఏపీఎఫ్)లో కీలక అసిస్టెంట్ కమాండెంట్ పోస్టు త్రుటిలో చేజారింది.
ఏపీపీఎస్సీ గ్రూప్–1 పరీక్షలు రాసి, ఇంటర్వ్యూలో విజయం సాధించి, డీఎస్పీగా ఎంపికయ్యారు. తన శ్రమకు కుటుంబ సహకారం ఎంతో ఉందని, అక్కలు అనుపమ, సంఘమిత్ర తోడ్పాటు మరువలేనిదని ఈ సందర్భంగా చైతన్య అన్నారు. ఆయన తండ్రి మోహనరావు విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి. తల్లి సుజాత గృహిణి. డీఎస్పీగా ఎంపికవడం తనకు ఎంతో మనోధైర్యాన్నిచ్చిందని చైతన్య తెలిపారు. సివిల్స్ ప్రిలిమ్స్‌లో ఎంపికై న చైతన్య.. త్వరలో మెయిన్స్ రాయనున్నారు.
గ్రూప్–1లో ఐదో ర్యాంక్.. డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం..
గ్రూప్–1 పరీక్షల్లో ముమ్మిడివరం మండలం అనాతవరం గ్రామానికి చెందిన మిమ్మిర్తి భానుప్రకాష్‌రెడ్డి ఐదో ర్యాంక్ సాధించి డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు అర్హత సాధించాడు. అనాతవరం సర్పంచ్ చిరంజీవి, శాంతకుమారి దంపతుల కుమారుడైన భానుప్రకాష్‌రెడ్డి ఒకటి నుంచి 5వ తరగతి వరకూ స్థానిక ప్రైవేటు స్కూల్లో చదివాడు. పెద్దాపురం జవహర్ నవోదయ విద్యాలయలో 6 నుంచి 12వ తరగతి వరకూ చదువుకున్నాడు. హైదరాబాద్‌లో బీఏ డిగ్రీ పూర్తి చేసి, సివిల్స్‌కు ఢిల్లీలో శిక్షణ తీసుకున్నారు.
ఏపీపీఎస్సీ గ్రూప్–1 పరీక్షలు రాసి ఐదో ర్యాంక్ సాంధించి, డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. భానుప్రకాష్‌రెడ్డిని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు. భవిష్యత్తులో ఐఏఎస్ సాధించి కలెక్టర్ కావడమే తన లక్ష్యమని భానుప్రకాష్‌రెడ్డి చెప్పారు.
తొలి ప్రయత్నంలోనే..
గ్రూప్– 1 ఫలితాల్లో కాకినాడకు చెందిన గుత్తుల జయకృష్ణ తొలి ప్రయత్నంలోనే వైద్య, ఆరోగ్య శాఖలో లే సెక్రటరీ ఉద్యోగం సాధించారు. ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదివిన ఆయన.. నాలుగేళ్లుగా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూనే గ్రూప్–1లో 21వ ర్యాంక్‌తో ఆయన ఈ విజయం సాధించారు. జయకృష్ణ భార్య సుప్రజ ప్రభుత్వ వైద్యురాలు కాగా, తండ్రి భీమశంకరరావు విజయవాడలోని బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్‌లో జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్నారు.
తొలి ప్రయత్నంలోనే విజయం సాధించడం సంతోషంగా ఉందని, సివిల్స్ సాధించి ప్రజలకు సేవ చేయాలనేది తన లక్ష్యమని జయకృష్ణ అన్నారు. కోచింగ్‌తో పాటు సొంతంగా నోట్స్ తయారు చేసుకుని ప్రిపేర్ అయ్యానని, రోజువారీ విషయాలపై సమగ్ర అవగాహన కలిగి ఉండటం విజయానికి ఒక కారణమని చెప్పారు.