FIFA World Cup 2022 History : ఫిఫా వరల్డ్‌కప్ వెనుక ఉన్న కథ ఇదే.. ఇప్పటి వరకు విజేతలుగా నిలిచిన జట్లు ఇవే..
సెనెగల్‌వాడితో, మొరాకో ప్లేయర్‌తో కొత్తగా బాదరాయణ సంబంధం కలుపుకుందాం.. బైసైకిల్ కిక్ చూపించిన వాడే మనకు బాస్.. బంతిని మెరుపుకంటే వేగంగా తీసుకెళ్లి గోల్ చేయించేవాడే మన దృష్టిలో మొనగాడు..
Top-5 Football Legends : అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన.. టాప్–5 స్టార్స్ వీరే..!
29 రోజుల పాటు ఆ దేశం, ఈ దేశం అని లేకుండా మనందరం ఫుట్‌బాల్ పక్షమే. బరిలోకి దిగే 11 మందిలో సగం పేర్లు తెలియకపోయినా పర్లేదు.. బంతి ఎటు వెళితే మన కళ్లు అటు వైపు.. ఎవరూ చెప్పకుండానే కాళ్లలో కదలికలు సాగుతుంటాయి.. అలా అలా నడుస్తూ బంతి లేని చోట కూడా సరదాగా అలా కిక్ కొట్టేసిన ఫీలింగ్ వచ్చేస్తుంటుంది. కోట్లలో ఒకడిగా మనమూ ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌గా మారిపోదాం.. వరల్డ్ కప్ వినోదాన్ని ఆస్వాదిద్దాం..!
ఎప్పటిలాగే యూరోప్ జట్లు..
కాలక్రమంలో మరో నాలుగేళ్లు గడిచిపోయాయి. ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ రూపంలో మరో విశ్వ క్రీడా సంరంభం మొదలుకానుంది. 2018లో రష్యా వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ విజేతగా నిలిచింది. ఈసారి కూడా 32 జట్లు టైటిల్ బరిలో నిలిచాయి. ఎప్పటిలాగే యూరోప్ జట్లు ఫేవరెట్స్‌గా కనిపిస్తున్నాయి. యూరోప్ దేశాలకు దక్షిణ అమెరికా దేశాలైన అర్జెంటీనా, బ్రెజిల్ నుంచి మళ్లీ పోటీ వస్తుందనడంలో సందేహం లేదు.
FIFA World Cup 2022 : ఫిఫా వరల్డ్‌కప్ వల్ల ఇంత భారీగా ఆదాయం వస్తుందా..!
మూడుసార్లు ఫైనల్ చేరి మూడుసార్లూ ఓడిపోయిన..
తొలిసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న ఖతర్ తొలి రౌండ్ దాటగలిగితే అదే గొప్ప ఫలితంలా భావించాలి. 1966లో ఒకేఒక్కసారి ప్రపంచకప్ సాధించిన ఇంగ్లండ్ ఆ తర్వాత ఒక్కసారీ ఫైనల్ చేరలేకపోయింది. గతంలో మూడుసార్లు ఫైనల్ చేరి మూడుసార్లూ ఓడిపోయిన నెదర్లాండ్స్ తొలిసారి ట్రోఫీని అందుకుంటుందో లేదో వేచి చూడాలి. ఫుట్‌బాల్ అనేది టీమ్ గేమ్. ప్రైవేట్ లీగ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న ఎంతో మంది స్టార్ ఆటగాళ్లు ప్రపంచకప్ వచ్చేసరికి తమ జాతీయ జట్టును గెలిపించలేకపోతున్నారు. జట్టులో ఒకరిద్దరు కాకుండా జట్టు మొత్తం రాణిస్తేనే ఆశించిన ఫలితం లభిస్తుంది.
వీరి కల ఫలించేనా.. లేదా..?
లయెనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో.. ఆధునిక ఫుట్‌బాల్లో సూపర్ స్టార్లు. చాంపియన్స్ లీగ్‌తో పాటు ఇతర క్లబ్ టోర్నీలలో తమ ఆటతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంటారు. సాధించిన రికార్డులు, కీర్తి కనకాదులకు లెక్కే లేదు. కానీ వీరిద్దరి కెరీర్‌లో ఒకే ఒక లోటు తమ జాతీయ జట్టు తరపున ప్రపంచ కప్ గెలవలేకపోవడం. పోర్చుగల్ తరపున రొనాల్డో, అర్జెంటీనా తరపున మెస్సీ ఒక్క వరల్డ్ కప్ విజయంలోనూ భాగం కాలేకపోయారు. 2014లో ఫైనల్ వరకు వచ్చిన మెస్సీ జట్టుకు ఆఖరి మెట్టుపై అదృష్టం కలసి రాకపోగా... రొనాల్డో అంత చేరువగా కూడా ఎప్పుడూ రాలేకపోయాడు. వీరిద్దరూ ఆఖరిసారిగా ప్రపంచ కప్ బరిలోకి దిగబోతున్నారు. ఈ సారైనా వీరు తమ జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషిస్తారా లేక ఎప్పుడూ కప్ గెలవలేకపోయిన దిగ్గజాల జాబితాలో చోటుతో ఆటను ముగిస్తారా చూడాలి.
కనీసం ఒక్కసారైనా..
గత 92 ఏళ్లలో ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు ఆదరణ ఆకాశమంత ఎత్తుకు పెరిగిపోయింది. ప్రస్తుతం ‘ఫిఫా’ పరిధిలో 211 సభ్య దేశాలు ఉన్నాయి. వీటిలో 80 దేశాలు వరల్డ్ కప్‌కు కనీసం ఒక్కసారైనా అర్హత సాధించాయి. 13 దేశాలు ఫైనల్ వరకు చేరగా, ఎనిమిది మాత్రమే విజేతలుగా నిలిచాయి. ప్రపంచకప్ టోర్నీ ముగిసిన ఏడాది తర్వాతే వచ్చే ప్రపంచకప్ కోసం క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు మొదలు అవుతాయి. దాదాపు మూడేళ్లపాటు ఈ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి.
1978 వరకు 16 జట్లు.. 1982 నుంచి 2002 వరకు 24 జట్లు పోటీపడ్డాయి. 2006 నుంచి తాజా ప్రపంచకప్ వరకు 32 జట్లు ప్రధాన టోర్నీలో బరిలో ఉన్నాయి. ప్రపంచకప్‌లో పాల్గొనే దేశాల సంఖ్యపై ఖండాలవారీగా ‘ఫిఫా’ స్లాట్‌లు కేటాయిస్తుంది. ప్రస్తుతం ఆసియా నుంచి 5... ఆఫ్రికా నుంచి 5... యూరోప్ నుంచి 13... ఉత్తర, మధ్య అమెరికా, కరీబియన్ దీవుల నుంచి 4... దక్షిణ అమెరికా నుంచి 4 స్లాట్‌లు ఉన్నాయి. ఆతిథ్య దేశం ఖతర్ ఆసియా నుంచి కావడంతో ఈసారి ఆసియా స్లాట్‌ల సంఖ్య ఆరు అయింది. 2026 ప్రపంచకప్‌ను 48 జట్లతో నిర్వహించాలని ‘ఫిఫా’ నిర్ణయం తీసుకుంది. దాంతో ఈ స్లాట్‌లలో మార్పు చేర్పులు ఉంటాయి.
ఆసియా దేశాల్లో..
ప్రపంచకప్‌కు ఆదరణ పెంచేందుకు ‘ఫిఫా’ ఆసియా దేశాల్లో ఆటను ప్రోత్సహించే ప్రయత్నం చేసింది. 1938లో ఇండోనేసియా.. వరల్డ్ కప్ ఆడిన తొలి ఆసియా జట్టుగా నిలిచింది. మొత్తం 12 ఆసియా జట్లు ఇప్పటి వరకు టోర్నీలో పాల్గొన్నాయి. 2002లో దక్షిణ కొరియా అత్యుత్తమంగా నాలుగో స్థానంలో నిలిచిన ఆసియా జట్టుగా నిలిచింది. మరోవైపు 13 ఆఫ్రికా దేశాలు కూడా ఈ మెగా టోర్నీలో భాగంకాగా.. కామెరూన్, సెనెగల్, ఘనా మాత్రమే క్వార్టర్ ఫైనల్‌కు చేరడం అత్యుత్తమ ప్రదర్శన. ఏ ఆఫ్రికా జట్టూ ఒక్కసారి కూడా సెమీఫైనల్ చేరలేదిప్పటి వరకు.
ప్రపంచకప్ వెనుక కథ..
1930లో మొదలైన ఫుట్‌బాల్ ప్రపంచకప్.. చాంపియన్స్‌కు ఇచ్చే ట్రోఫీ ఒకసారి మారింది. 1930 నుంచి 1970 వరకు ఒకే రకమైన ట్రోఫీని ఇచ్చారు. మొదట్లో దీనిని ‘విక్టరీ’ పేరుతో పిలిచేవారు. ఆ తర్వాత ఈ ట్రోఫీకి ‘ఫిఫా’ మాజీ అధ్యక్షుడు ‘జూల్స్ రిమెట్’ పేరు పెట్టారు. 3.8 కిలోల బరువు, 35 సెంటీమీటర్ల ఎత్తు ఉండే ఈ ట్రోఫీని వెండితో తయారు చేసి బంగారు పూత పూశారు. టోర్నీ విజేతలకు దీని ‘రెప్లికా’ను మాత్రమే ఇచ్చేవారు.
అయితే 1970లో బ్రెజిల్ మూడోసారి టైటిల్ గెలిచిన తర్వాత నిబంధనల ప్రకారం ‘ఒరిజినల్ ట్రోఫీ’ని బ్రెజిల్‌కు ఇవ్వాల్సి వచ్చింది. దాంతో 1974లో ‘ఫిఫా’ కొత్త ట్రోఫీని రూపొందించింది. రెండు చేతులు గ్లోబ్‌ను మోస్తున్నట్లుగా ఉండే చిత్రంతో ఇది తయారైంది. దీని ఎత్తు 36.5 సెంటీమీటర్లు. బరువు 5 కిలోలు. దీనిని 18 క్యారెట్ల బంగారంతో తయారు చేశారు. దిగువ భాగంలో విజేతల జాబితా ఉంటుంది. ప్రస్తుతం నిబంధనల ప్రకారం ఈ ట్రోఫీని ఎవరికీ శాశ్వతంగా ఇవ్వరు. విజేతకు అదే తరహాలో ఉండే కంచు ట్రోఫీని మాత్రం అందజేస్తారు.
ఆరుసార్లు ఆతిథ్య జట్టుకు అందలం..
ఇప్పటివరకు 21 సార్లు ప్రపంచకప్ టోర్నీ జరిగింది. ఆరుసార్లు ఆతిథ్య జట్టు (1930లో ఉరుగ్వే; 1934లో ఇటలీ; 1966లో ఇంగ్లండ్; 1974లో పశ్చిమ జర్మనీ; 1978లో అర్జెంటీనా; 1998లో ఫ్రాన్స్) విశ్వవిజేతగా అవతరించింది.
‘ఫైవ్ స్టార్’ బ్రెజిల్..
ఇప్పటి వరకు 13 దేశాలు మాత్రమే ఫైనల్‌కు చేరుకోగా... అందులో ఎనిమిది దేశాలు ప్రపంచ చాంపియన్స్‌గా నిలిచాయి. అత్యధికంగా బ్రెజిల్ జట్టు ఐదుసార్లు (1958, 1962, 1970, 1994, 2002) విజేతగా నిలిచింది. జర్మనీ (1954, 1974, 1990, 2014), ఇటలీ (1934, 1938, 1982, 2006) దేశాలు నాలుగుసార్లు ట్రోఫీని సాధించాయి. అర్జెంటీనా (1978, 1986), ఫ్రాన్స్ (1998, 2018), ఉరుగ్వే (1930, 1950) రెండుసార్లు విశ్వవిజేతగా నిలిచాయి. ఇంగ్లండ్ (1966), స్పెయిన్ (2010) ఒక్కోసారి ప్రపంచ చాంపియన్ అయ్యాయి.
పాపం.. నెదర్లాండ్స్.. ఈ సారైన..
ప్రపంచకప్ చరిత్రలో దురదృష్ట జట్టు ఏదంటే నెదర్లాండ్స్ అని చెప్పవచ్చు. ఎంతోమంది స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ కీలక పోరులో తడబడటం నెదర్లాండ్స్‌కు అలవాటుగా మారింది. దాంతో ఇప్పటివరకు 10 సార్లు ప్రపంచకప్‌లో పాల్గొని మూడుసార్లు (1974, 1978, 2010) ఫైనల్ చేరినా ఈ జట్టు ఒక్కసారీ ట్రోఫీని ముద్దాడలేకపోయింది. హంగేరి (1938, 1954), చెక్ రిపబ్లిక్ (1934, 1962) రెండుసార్లు... స్వీడన్ (1958), క్రొయేషియా (2018) ఒక్కోసారి ఫైనల్‌కు చేరి ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాయి.
ప్రతిభకు పట్టం..
ప్రపంచకప్ మొత్తం నిలకడగా రాణించిన క్రీడాకారులకు పురస్కారాలు అందజేస్తారు. అందులో ముఖ్యమైనవి..
గోల్డెన్ బాల్: టోర్నీలో ఉత్తమ ప్లేయర్‌కు అందించే అవార్డు. రెండో ఉత్తమ ప్లేయర్‌కు ‘సిల్వర్ బాల్’... మూడో ఉత్తమ ప్లేయర్‌కు ‘బ్రాంజ్ బాల్’ అందజేస్తారు.
గోల్డెన్ బూట్: టోర్నీలో అత్యధిక గోల్స్ సాధించిన ప్లేయర్‌కు అందజేస్తారు. రెండో స్థానంలో నిలిచిన వారికి ‘సిల్వర్ బూట్’.. మూడో స్థానంలో నిలిచిన వారికి ‘బ్రాంజ్ బూట్’ ఇస్తారు.
గోల్డెన్ గ్లవ్: టోర్నీలో ఉత్తమ గోల్‌కీపర్‌కు అందించే పురస్కారం.
ఏఏ గ్రూప్‌లో ఎవరంటే..
☛ గ్రూప్ ‘ఎ’: ఖతర్, ఈక్వెడార్, సెనెగల్, నెదర్లాండ్స్.
☛ గ్రూప్ ‘బి’: ఇంగ్లండ్, ఇరాన్, అమెరికా, వేల్స్.
☛ గ్రూప్ ‘సి’: అర్జెంటీనా, మెక్సికో, పోలాండ్, సౌదీ అరేబియా.
☛ గ్రూప్ ‘డి’: ఫ్రాన్స్, డెన్మార్క్, ఆస్ట్రేలియా, ట్యునీషియా.
☛ గ్రూప్ ‘ఇ’: జర్మనీ, స్పెయిన్, జపాన్, కోస్టారికా.
☛ గ్రూప్ ‘ఎఫ్’: బెల్జియం, క్రొయేషియా, కెనడా, మొరాకో.
☛ గ్రూప్ ‘జి’: బ్రెజిల్, సెర్బియా, కామెరూన్, స్విట్జర్లాండ్.
☛ గ్రూప్ ‘హెచ్’: పోర్చుగల్, ఘనా, ఉరుగ్వే, దక్షిణ కొరియా.
ఫుట్‌బాల్ ప్రపంచకప్ విజేతలు వీరే..
సంవత్సరం | దేశం |
1930 | ఉరుగ్వే |
1934 | ఇటలీ |
1938 | ఇటలీ |
1950 | ఉరుగ్వే |
1954 | పశ్చిమ జర్మనీ |
1958 | బ్రెజిల్ |
1962 | బ్రెజిల్ |
1966 | ఇంగ్లండ్ |
1970 | బ్రెజిల్ |
1974 | పశ్చిమ జర్మనీ |
1978 | అర్జెంటీనా |
1982 | ఇటలీ |
1986 | అర్జెంటీనా |
1990 | పశ్చిమ జర్మనీ |
1994 | బ్రెజిల్ |
1998 | ఫ్రాన్స్ |
2002 | బ్రెజిల్ |
2006 | ఇటలీ |
2010 | స్పెయిన్ |
2014 | జర్మనీ |
2018 | ఫ్రాన్స్ |
2022 అర్జెంటీనా
అత్యధిక గోల్స్ చేసిన టాప్–10 జట్లు ఇవే..
జట్టు | గోల్స్ |
బ్రెజిల్ | 229 |
జర్మనీ | 226 |
అర్జెంటీనా | 137 |
ఇటలీ | 128 |
ఫ్రాన్స్ | 120 |
స్పెయిన్ | 99 |
ఇంగ్లండ్ | 91 |
ఉరుగ్వే | 87 |
హంగేరి | 87 |
నెదర్లాండ్స్ | 86 |
ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. భారత్ మాత్రం..
లక్షల్లో జనాభా ఉన్న చిన్నచిన్న దేశాలు కూడా ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీకి అర్హత సాధించి తమ ప్రత్యేకతను చాటుకుంటుంటే.. 130 కోట్ల జనాభా ఉన్న భారత్ మాత్రం ఏనాడూ ఈ మెగా టోర్నీకి అర్హత సాధించలేకపోయింది. ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ 106వ స్థానంలో ఉంది. క్రికెట్ ఆదరణ పెరిగాక మన దేశంలో ప్రాభవం కోల్పోయిన ఎన్నో ఆటల్లో ఫుట్‌బాల్ కూడా ఒకటి.
ప్రతి నాలుగేళ్లకు ప్రపంచకప్‌లో ఒక్క కొత్త జట్టయినా గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంటే భారత ఫుట్‌బాల్లో మాత్రం కదలిక కనిపించదు. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) ఇండియన్ సూపర్ లీగ్, ఐ–లీగ్ తదితర టోర్నీలతో రకరకాల ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తున్నా ఆశించిన ఫలితం మాత్రం కనిపించడంలేదు.
FIFA World Cup : ఫిఫా చరిత్రలో మరిచిపోలేని ఐదు వివాదాలు ఇవే..
1950, 60వ దశకాల్లో భారత జట్టు ఆసియాలోని అత్యుత్తమ ఫుట్‌బాల్ టీమ్‌లలో ఒకటిగా నిలిచింది. 1951, 1962 ఆసియా క్రీడ్లలో స్వర్ణాలు సాధించిన మన జట్టు 1956 మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలవడం మన అత్యుత్తమ ఘనత. అయితే 1970 నుంచి మన తిరోగమనం వేగంగా సాగింది. అప్పుడప్పుడు దక్షిణాసియా (శాఫ్) దేశాల పోటీల్లో మెరుపులు మినహా మిగతాదంతా శూన్యమే. బైచుంగ్ భూటియా, సునీల్ ఛెత్రి తదితర స్టార్లు మాత్రమే వ్యక్తిగత ప్రదర్శనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగలిగారు.
FIFA World Cup 2022 : 1950లో గోల్డెన్ చాన్స్‌ను వదులుకున్న భారత్.. ఇంతకు ఆ ఏడాది ఏమైందంటే..?
మస్కట్, అధికారిక బంతి, పాటలు..
టోర్నమెంట్ అధికారిక మస్కట్ ‘లాయిబ్’. ఇది అరబిక్ పదం... ‘నిష్ణాతుడైన ఆటగాడు’ అని అర్థం. ఈ ఏప్రిల్ 1న మస్కట్‌ను ఆవిష్కరించిన అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) వెబ్‌సైట్‌లో లాయిబ్ గురించి ఇలా రాసింది.. ‘లాయిబ్ యువతలో స్ఫూర్తి నింపుతుంది. అదెక్కడుంటే అక్కడ హుషారు, ఆత్మవిశ్వాసం అంతకంతకూ పెరుగుతాయి’ అని! సృజన, ఆలోచనలతోనే వ్యక్తుల సంకల్పం పెరుగుతుందని తెలిపింది.
అధికారిక బంతి ‘అల్ రిహ్లా’ :
మస్కట్ కంటే ముందు మార్చి 30న టోర్నీలో వాడే అధికారిక బంతి ‘అల్ రిహ్లా’ని ఆవిష్కరించింది. అరబిక్‌లో ‘అల్ రిహ్లా’ అంటే ప్రయాణం. ఖతర్ సంస్కృతి, నిర్మాణశైలి, పడవలు, పతాకం నుంచి ప్రేరణ పొందాలనే ఉద్దేశంతో ఆ పేరును ఖరారు చేశారు. మన్నికకే ప్రాధాన్యమిచ్చి ప్రత్యేకమైన జిగురు, సిరాలతో రూపొందించిన తొలి అధికారిక బంతి ఇది.
FIFA World Cup History : ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీని దేనితో.. ఎలా తయారు చేస్తారంటే..?