భారత రాజకీయాలు - గతిశీలత
స్వాతంత్రోద్యమ కాలంలో రాజకీయాలు ప్రధానంగా అగ్రకులాలు, ధనికులు, విద్యావంతుల చుట్టూ తిరిగేవి. ఈ పరిస్థితిని మహాత్మాగాంధీ జాతీయ ఉద్యమంగా రూపాంతరం చేసినప్పటికీ, సాధారణ ప్రజలు రాజకీయాల్లో కీలకం కాలేదు. నాయకుల పిలుపుమేరకు స్పందించినప్పటికీ, అది ఎంతో సేపు నిలవలేదు. దీంతో రాజకీయాలు సాధారణ ప్రజల జీవన స్రవంతిలో భాగం కాలేదు. దీనికి బలమైన కారణం సంప్రదాయ సంస్కృతి. అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించటాన్ని మన సమాజం హర్షించదు. కులవ్యవస్థ దీన్ని మరింత బలపరిచింది. ఈ ధోరణి భారత జాతీయోద్యమంలో అతివాదానికి అవకాశమివ్వలేదు. భగత్‌సింగ్, సుభాష్‌చంద్రబోస్ వంటి నాయకులకు తగిన ప్రాముఖ్యత లభించకపోవటానికి ఇదో కారణం.
సగటు పౌరుడి ధోరణి
కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం, జాతీయోద్యమంలో దాని చురుకైన పాత్ర సగటు భారతీయున్ని అంతంతమాత్రంగానే ప్రభావితం చేసింది. ఇది పాశ్చాత్య విద్య, భావాలకు ప్రభావితులైన కొద్దిమంది ఉత్తరాది ఉన్నత వర్గాల వారికి వేదికగా మారింది. సగటు భారతీయునిలో రాజకీయ చైతన్యం తక్కువగా ఉంది. 1919, 1935 భారత ప్రభుత్వ చట్టాలు పరిమిత ఓటుహక్కు కల్పించి, సమాజంలో ఉన్నత (Elite) వర్గాలను కొంతవరకు ఊరడించాయి. అయితే జాతీయోద్యమం.. ప్రజల్లో ప్రభుత్వంపై ప్రతికూల వైఖరిని కలిగించింది. ప్రభుత్వ విధానాలను శంకించటం, శాసనోల్లంఘన, సహాయ నిరాకరణోద్యమం వంటివి బ్రిటిష్‌వారి వైఖరిలో మార్పుతెచ్చాయి. కానీ, స్వాతంత్య్రానంతరం కూడా సగటు పౌరుడు అదే ధోరణిని కనబరుస్తున్నాడు. ఇది భారత రాజకీయ సంస్కృతిలో అంతర్భాగమైంది.
స్వాతంత్య్రానంతర పరిస్థితులు
స్వాతంత్య్రం తర్వాత వయోజన ఓటుహక్కు, క్రమంతప్పని నిష్పక్షపాత ఎన్నికలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ కార్యక్రమాల అమలు ప్రజల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజకీయాలపై సానుకూల వైఖరిని కలిగించాయి. కానీ, ఇది తొలి రెండు దశాబ్దాలకే పరిమితం. కేంద్రం, రాష్ట్రాల్లో అధికారం కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ, దాని నేతలు... ప్రజలతో పోషకుడు- సేవార్థి (Patron-Client) తరహాలో వ్యవహరించారు. సగటు పౌరునికి ప్రధానంగా వెనుకబడిన, బలహీన వర్గాల ప్రజల్లో రాజకీయ చైతన్యం, సాధికారత కలిగించేందుకు ఎలాంటి చొరవ చూపలేదు. షెడ్యూల్డు కులాలు, తెగలు ఓటుబ్యాంకులుగా పనిచేశాయి. రిజర్వేషన్లు, మిగులు భూమి పంపిణీ వంటి జనాకర్షక కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు సమకూర్చాయి. అధికార పార్టీ, దాని నాయకులకు విధేయులుగా ఉండటం స్వాతంత్య్రానంతర మొదటి మూడు దశాబ్దాల్లో ఏర్పడిన రాజకీయ సంస్కృతి. రాజకీయాల్లో గతిశీలత/క్రియాశీలత అంతంతమాత్రమే!
వంశపారంపర్య రాజకీయాలు
నెహ్రూ తర్వాత స్వల్పకాలంలో ఇందిరాగాంధీ ప్రధాని కావటం, అదే పంథాలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ కుటుంబ సభ్యులకు పదవులు కట్టబెట్టడం వారసత్వ రాజకీయాలకు నాంది పలికింది. ‘కొందరికి నాయకత్వ లక్షణాలు పుట్టుకతోనే వస్తాయ’నే వాదన బహుళ ప్రచారంలోకి వచ్చింది. వ్యక్తిపూజ ఇందిరాగాంధీ హయాంలో పరాకాష్టకు చేరుకుంది. ఆమె క్రియాశీల రాజకీయాల్లో ఉన్నప్పుడే ముందు సంజయ్‌గాంధీని, ఆ తర్వాత రాజీవ్‌గాంధీని వారసులుగా ప్రకటించటం అస్తిత్వ రాజకీయాల (identity politics)కు నిదర్శనం. ఒకప్పుడు ఒక పార్టీకి పరిమితమైన ఈ జాఢ్యం, ప్రస్తుతం దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలకు విస్తరించింది.
నేరపూరిత రాజకీయాలు
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటి రెండు దశాబ్దాల కాలంలో ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు స్వాతంత్య్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్న, దేశసేవా తత్పరత కలిగినవారు. బ్యాలెట్ పెట్టెలు ఎత్తుకుపోవటం, వాటిలో నీళ్లు, సిరా పోయటం, బ్యాలెట్ పత్రాలు చించటం వంటి సంఘటనలు జరిగినా, మొత్తంమీద ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగాయి. కొందరు అభ్యర్థులు సంఘ విద్రోహశక్తుల మద్దతు పొందినప్పటికీ, అది ప్రమాదకరంగా పరిణమించలేదు. కానీ, మూడు, నాలుగు దశాబ్దాల్లో నేరపూరితులు ఎన్నికల బరిలో దిగటం పరిపాటైంది. రాజకీయ పక్షాలు వారి మద్దతు కోరటం సాధారణమైంది. ప్రస్తుత పరిస్థితిని చూస్తే కనీసం 30 శాతం ప్రజాప్రతినిధులు నేరచరిత్ర కలిగిన వారు కావటం నేరపూరిత రాజకీయాలకు అద్దంపడుతోంది. 1993, అక్టోబరు నాటి వోరా కమిటీ నివేదిక.. నేరపూరిత రాజకీయాలను ఆధార సహితంగా నిరూపించింది. నేడు ఎన్నికల్లో పాల్గొంటున్న కొందరు అభ్యర్థులు విజయం సాధించటానికి సంఘ విద్రోహశక్తుల మద్దతు తీసుకోవటాన్ని అనివార్యంగా భావిస్తున్నారు. ఇది సహజంగా రాజకీయాలపై విరక్తి, ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం సడలటం వంటి పరిణామాలకు దారితీస్తుంది.
రాజకీయాల్లో అవినీతి
సశ్చీలత, నిరాడంబరత కలిగిన లాల్‌బహదూర్‌శాస్త్రి, మొరార్జీ దేశాయ్ వంటి వారు ప్రస్తుత రాజకీయాల్లో అరుదు. ప్రస్తుత, మాజీ ముఖ్యమంత్రులు; కేంద్ర, రాష్ట్ర మంత్రులు; సీనియర్ అధికారులు, వారి కుటుంబ సభ్యులు ఎన్నో కుంభకోణాల్లో ఇరుక్కున్నారు. ఇప్పటి రాజకీయ వాతావరణంలో ‘అవినీతి ఒక జీవన విధానమైంది’. దీనికి 2జీ స్ప్రెక్టం, కామన్వెల్త్ క్రీడలు, బొగ్గు కుంభకోణాలు ఉదాహరణలు. బిలియన్ల కొద్దీ ప్రజాధనం రాజకీయ నేతల జేబుల్లోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో అన్నా హజారే నాయకత్వంలో 2011లో అవినీతి వ్యతిరేక ఉద్యమం ప్రారంభమైంది. సమాచార హక్కు చట్టం అవినీతి కార్యకలాపాలను వెలికితీసేందుకు చాలా వరకు ఉపయోగపడింది. దీన్ని విద్యావంతులు, పట్టణ ప్రాంత యువత ఆయుధంగా ఉపయోగించారు. మీడియా, సామాజిక మాధ్యమం మధ్యతరగతి ప్రజానీకాన్ని చైతన్యవంతం చేయటంలో ప్రముఖపాత్ర పోషించింది. అవినీతి వ్యతిరేక ఉద్యమానికి తలొగ్గి, యూపీఏ సర్కార్ లోక్‌పాల్ వ్యవస్థను ఏర్పాటు చేసే చట్టాన్ని పార్లమెంటులో ఆమోదింపజేసింది. కానీ, లోక్‌పాల్ వ్యవస్థ ఇప్పటికీ పనిచేయటం ప్రారంభించలేదు. ఈ ఉద్యమం పట్టణ, మధ్యతరగతి ప్రజల్లో ప్రజాస్వామ్యంపై విశ్వాసం సన్నగిల్లేలా చేసింది.
ఆమ్‌ఆద్మీ పార్టీ
అవినీతిపై పోరాటం నేపథ్యంలో ఆమ్‌ఆద్మీ పార్టీ 2012లో ఆవిర్భవించింది. బ్రష్టుపట్టిన రాజకీయ వ్యవస్థను కూలంకషంగా ప్రక్షాళిస్తామని ప్రకటించింది. దీని లక్ష్యం వ్యవస్థను మార్చటం. 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో రెండో పెద్ద రాజకీయ పక్షంగా అవతరించి, కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఆప్ 49 రోజులు మాత్రమే అధికారంలో కొనసాగింది. 2015లో జరిగిన ఎన్నికల్లో 70 స్థానాలకు, 67 స్థానాలు గెలుచుకొని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ప్రస్తుతం అధికారంలో కొనసాగుతోంది. సంప్రదాయ రాజకీయాలు; ధన, కండబలం; కుల, మత, ప్రాంతీయతత్వంతో ఎన్నికలు నడుస్తుంటే ఆమ్‌ఆద్మీ పార్టీ వీటన్నింటికీ అతీతంగా ప్రజల విశ్వాసాన్నే నమ్ముకుంది. అతి తక్కువ కాలంలో అధికారం చేపట్టింది. ఈ పరిణామం భారత రాజకీయ గతిశీలతకు చక్కని ఉదాహరణ.
వెనుకబడిన తరగతులు-చైతన్యం
మండల్ కమిషన్ సిఫార్సుల అమలు వెనుకబడిన వర్గాల రాజకీయ చైతన్యానికి దోహదపడ్డాయి. వెనుకబడిన వర్గాల నేతలు.. ‘ఓట్లు మావి, అధికారం మీదా?’ అనే నినాదాన్ని లేవనెత్తి, ప్రాంతీయ పార్టీలు స్థాపించి క్రమేపీ అనేక రాష్ట్రాల్లో అధికారం కైవసం చేసుకున్నారు. మరోవైపు కేంద్రంలో జాతీయ పార్టీలు బలహీనపడటంతో సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలు కీలకమయ్యాయి. ప్రాంతీయ పార్టీల అధినేతలు జాతీయ రాజకీయాలను తమ గుప్పిట్లోకి తీసుకోవటంలో కొంతవరకు సఫలీకృతులయ్యారు. ఈ పరిణామం బలహీన వర్గాలకు రాజకీయ సాధికారత కలిగించటంలో తోడ్పడినప్పటికీ, సంకుచిత రాజకీయాలకు ప్రాధాన్యం పెరిగింది. ఎన్నికల్లో కుల, ప్రాంతీయ ధోరణులు పెచ్చుమీరాయి. సగటు భారతీయునిలో ప్రాంతీయ, కులతత్వం పెరిగింది. అనేక సందర్భాల్లో ప్రాంతీయ, వర్గ ప్రయోజనాల పోరాటంలో జాతీయ ప్రయోజనాలు పణంగా మారాయి. రాజకీయ అనిశ్చితి, పాలనలో స్తబ్ధత నెలకొంది. ఇవి దేశ సమగ్రతను సవాలు చేసే స్థితికి చేరుకున్నాయి. ప్రస్తుతం దేశ పౌరునిలో నేను భారతీయుడననే భావన కంటే ప్రాంతీయతత్వ భావన ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
సమాఖ్య రాజకీయాలు
సంకీర్ణ ప్రభుత్వాలు, ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం పరోక్షంగా సమాఖ్య వ్యవస్థ బలపడేందుకు దోహదం చేశాయి. రాష్ట్రాలు మరింత ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తూ, కేంద్రం ఏకపక్ష విధానాలను నిరోధిస్తున్నాయి. ఈ పరిణామం సమాఖ్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు దారితీస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయంలో.. ‘సహకార, పోటీ సమాఖ్య వ్యవస్థ రూపొందుతుంది’.
ఈశాన్య సరిహద్దు రాష్ట్రాల రాజకీయాలు
ఆరు, ఏడు, ఎనిమిది దశకాల్లో ఈశాన్య సరిహద్దు రాష్ట్రాల్లో వేర్పాటువాద ధోరణి ఉద్ధృతంగా ఉండేది. ఇప్పటికీ ఆ పోకడలు ప్రస్ఫుటమవుతున్నప్పటికీ నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రాలు మినహా మిగిలిన రాష్ట్రాల్లో వేర్పాటు వాద, విప్లవ భావాలు కొంత వరకు తగ్గాయనవచ్చు. కానీ, ఈ ప్రాంత ప్రజలు జాతీయ స్రవంతితో మమేకం కావటానికి మరికొంత సమయం పడుతుంది.
ఉగ్రవాద రాజకీయాలు
దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాదం ఊపందుకుంటోంది. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో నక్సల్స్ ప్రభావం గణనీయంగా ఉంది. పారిశ్రామికీకరణ, అభివృద్ధి పేరుతో దళితులు, ఆదివాసీలు ఎంతో దోపిడీకి గురయ్యారు. దీంతో సహజంగానే వీరు అతివాద ఉద్యమాలకు ప్రభావితులయ్యారు. అటవీ సంపద, ఖనిజ సంపదలకు సహజ సంరక్షకులుగా తరతరాలుగా వ్యవహరిస్తున్న వీరికి స్థానభ్రంశం కలిగి, పుట్టిపెరిగిన చోటే కాందిశీకులయ్యారు. వీరికి పునరావాసం కల్పించటంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. దీంతో ఆయా వర్గాల నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. ప్రస్తుతం నక్సల్స్ సమస్య జాతీయ భద్రతకు పెనుసవాలుగా మారింది. దేశ జనాభాలో దాదాపు 22 శాతం ఉన్న అణగారిన వర్గాల ప్రజలు రాజకీయ స్రవంతిలో అంతర్భాగాలైనట్లు కనిపించటం లేదు.
ఏం చేయాలి?
జనాభా పెరుగుదలకు అనుగుణంగా అభివృద్ధి జరక్కపోవటం, ప్రగతి ఫలాలు సంపన్న, మధ్యతరగతి పట్టణవాసులకే అందటం దేశంలో ఎక్కువశాతం ప్రజల్లో నిరాశ, నిస్పృహలకు దారితీస్తున్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో సంక్షేమ కార్యక్రమాలను నీరుగార్చటం, పాలనా యంత్రాంగ తిరోగమనం వంటివి సగటు పౌరునిలో రాజకీయాలపై ప్రతికూల వైఖరిని ఏర్పరుస్తున్నాయి. వీటి పర్యవసానంగా హింసా రాజకీయాలు; అవినీతి, నేరచరిత రాజకీయాలు; ప్రాంతీయ, కుల, మతతత్వం బలపడుతున్నాయి. ఇవన్నీ భారత రాజకీయాల గతిశీలతకు ప్రతిబింబాలు. అయితే తోటి వర్థమాన దేశాల రాజకీయాల గతిశీలతతో పోల్చితే భారత రాజకీయాలు ఎన్నో రెట్లు మెరుగ్గా ఉన్నాయి. అవినీతి, అసమర్థత, అసమానత వంటి వాటిని అదుపులో పెడితే, భారతదేశం ప్రపంచంలో అర్థవంతమైన, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా కొనసాగడానికి ఢోకా లేదు.
- డా॥బి.జె.బి. కృపాదానం, సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ, ఆర్.సి. రెడ్డి స్టడీ సర్కిల్