General Essay: విశ్వదాభి రామ వినుర వేమ.. అంటే ఏంటో తెలుసా..? వేమన జయంతి సందర్భంగా ఈ కథనం...

‘విశ్వదాభిరామ వినుర వేమ’ అనే మాట వినని తెలుగువారు ఉండరు. వానకు తడవనివారు, ఒక వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి. అంత ప్రఖ్యాతి గాంచిన మహాకవి యోగి వేమనకు సొంత రాష్ట్రంలో తగిన గౌరవం దక్కటం లేదనే భావన ఇక తొలగిపోనుంది.

యోగి వేమన జయంతిని రాష్ట్ర  ప్రభుత్వం ఏటా జనవరి 19న అధికారికంగా జరపనుంది. 

తెలుగువారికి ఎంతో సారస్వత సేవ చేసిన బ్రిటిష్‌ అధికారి సీపీ బ్రౌన్‌ తోనే వేమన పద్యాలు వెలుగులోకి వచ్చాయి. పామరులకు కూడా అర్థమయేలా పద్యాలు చెప్పి, మెప్పించిన కవి వేమన. ఆటవెలదిలో అద్భుతమైన కవిత్వం, అనంత విలువలు గల సలహాలు, సూచనలు, తెలుగు సంగతులు ఇమిడ్చిన మహానుభావుడు వేమన.

యవ్వనంలో వేశ్యాలోలుడిగా వ్యవహరించినా, కొంతకాలానికి విరక్తి చెంది, తపస్సు చేసి యోగిగా మారారు. సమాజానికి హితబోధ చేస్తూ వేలాది పద్యాలు చెప్పారు. చివరకు కడప దగ్గరి పామూరు కొండ గుహలో శార్వరి నామ సంవత్సరం శ్రీరామనవమి నాడు సమాధి చెందారు. కదిరి తాలూకాలోని కటారుపల్లెలోని వేమన సమాధి ప్రసిద్ధి చెందినది. వేమన జీవితకాలం 1652–1730గా పరిశోధకులు చెబుతారు.  

వేమన పద్యాలు లోక నీతులు. పద్యాలన్నిటినీ ఆటవెలది చంధస్సులోనే చెప్పాడు. సామాజిక చైతన్యం ఆ పద్యాల లక్షణం. సమాజంలో ఆయన సృజించని అంశం లేదు. అన్ని సమస్యలను భిన్న కోణాల్లోంచి దర్శించి, ఆ దర్శన వైశిష్ట్యాన్ని తన పద్యాలలో ప్రదర్శించారు. కుటుంబ వ్యవస్థలోని లోటుపాట్లు, మతం పేరిట దోపిడీలను ఎలుగెత్తటమే కాకుండా విగ్రహారాధనను నిరసించారు. 

కుహనా గురువులు, దొంగ సన్యాసుల దోపిడీలు...ఒకటేమిటి? ప్రతి సామాజిక అస్తవ్యస్తతపైన తన కలాన్ని ఝళిపించారాయన. ఎంతో లోతైన భావాన్ని కూడా సరళమైన భాషలో చక్కటి ఉదాహరణలతో హృదయానికి హత్తుకునేలా చెప్పాడు. సాధారణంగా మొదటి రెండు పాదాల్లోనూ నీతిని ప్రతిపాదించి మూడో పాదంలో దానికి తగిన సామ్యం చూపాడు. ‘విశ్వదాభిరామ వినుర వేమ’ అనే మకుటంలో విశ్వద అంటే విశ్వకారకుడికి, అభిరామ అంటే ప్రియమైన వాడని, అంటే సృష్టికర్తకు ప్రియమైన వేమా, వినుము అని అర్థం చెప్పారు పండితులు. బ్రౌను మహాశయుడు ఇదే అర్థంతో వేమన పద్యాలను ఇంగ్లిష్‌లోకి అనువదించారు.  

తెలుగువారిలో వేమన కీర్తిని అజరామరం చేయటానికి కృషి చేసినవారు కట్టమంచి రామలింగారెడ్డి. రాష్ట్రంలో పలుచోట్ల వేమన జయంతి ఉత్సవాలు, సంఘాల ఏర్పాటును సాధించారు. కొమర్రాజు వేంకట లక్ష్మణరావు, వేటూరి ప్రభాకరశాస్త్రి వేమనను సంస్కర్తగా ప్రస్తుతించారు. ఆరుద్ర ‘మన వేమన’ పుస్తకాన్ని రచించారు. డాక్టర్ ఎన్‌ .గోపి, బంగోరె వంటి కవులు, రచయితలు వేమన రచనలపై పరిశోధనలు చేశారు. ప్రముఖ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావుచే కేంద్ర సాహిత్య అకాడమీ వేమన జీవిత చరిత్రను రాయించి 14 భాషల్లోకి అనువదింపజేసింది. ఆంగ్ల, ఐరోపా భాషలన్నింటిలోకి, అన్ని ద్రావిడ భాషల్లోకి వేమన పద్యాలు అనువాదమయ్యాయి. 

ఐక్యరాజ్యసమితి యునెస్కో విభాగం, ప్రపంచ భాషా కవుల్లో గొప్పవారిని ఎంపిక చేసే సందర్భంలో వేమనను ఎన్నుకుని, ఆ రచనలను పలు భాషల్లోకి అనువదింపజేశారు. వేమన జీవిచరిత్ర, యోగి వేమన (1947), యోగి వేమన (1988), శ్రీవేమన చరిత్ర (1986) పేర్లతో సినిమాలుగా ప్రజలను ఆలరించాయి. ఇంతటి కీర్తిని పొందిన వేమన జయంతికి పొరుగునున్న కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏటా తగిన నిధులను కేటాయిస్తూ, తాలూకా, జిల్లా, రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తోంది.

 

మైసూర్‌ మహారాజ సంస్థాన్‌ ఏనాడో వేమన ప్రాశస్త్యాన్ని గుర్తించింది. తెలుగు రాష్ట్రాల్లో వేమనకు, ఆయన సాహిత్యానికి తగిన ప్రచారం, గౌరవాన్ని కల్పించటం లేదనేది నిష్టూరసత్యం. దీనిని పరిగణనలోకి తీసుకున్న ఏపీ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీచేసింది.
 
ఆ కాలం పరిస్థితుల ప్రకారం వేమనను గొప్ప హేతువాదిగా ప్రశసించింది సాహితీలోకం. సమాజంలో ప్రబలంగా పాతుకుపోయిన ఆచారాలు, మూఢనమ్మకాలను ఆ రోజుల్లో అంత నిశితంగా ఎత్తిచూపటానికి ఎంతటి ధైర్యం కావాలో చెప్పనవసరం లేదు. 

వేమన పద్యాలు వందల సంవత్సరాల వరకు గ్రంథస్థం కాలేదు. కేవలం సామాన్యుల నాల్కలపైనే నడయాడుతూ వచ్చాయి. 1731లో ఫాదర్‌ లెగాక్‌ తొలిసారిగా వేమన పద్యాలు సేకరించాడని పరిశోధకుల భావన. 1816లో ఒక ఫ్రెంచి మిషనరీ, తర్వాత ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌లు వేమన పద్యాలెన్నింటినో సేకరించారు. తాను వేమనను కనుగొన్నాని బ్రౌన్‌ సాధికారికంగా ప్రకటించుకున్నారు. 
    
వందలాది పద్యాలను సేకరించి వాటిని లాటిన్, ఇంగ్లిష్‌ భాషల్లోకి అనువదించారు. అలాగే హెన్నీ బ్లూచాంస్‌ (1897), విలియమ్‌ హోవర్డ్‌ కాంబెల్‌ (1920), జీయూ పోప్, సీఈ గోవర్‌ వంటి ఆంగ్ల సాహితీవేత్తలు, వేమనను లోకకవిగా కీర్తించారు. 

మహాకవి పేరిట విశ్వవిద్యాలయం..
ఆ మహాకవి పేరిట దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి కడప జిల్లాలో యోగి వేమన విశ్వవిద్యాలయాన్ని నిర్మించి అనేక కోర్సులతో విద్యను అందించడంతోపాటు వేమన జీవితం మరుగున పడకుండా భావితరాలకు అందించడం విశేషం.

#Tags