Career in Maths: మెరిసే కెరీర్‌కు మ్యాథ్స్.. మ్యాథమెటిక్స్ నైపుణ్యంతో అనేక కెరీర్ అవకాశాలు
నేడు అన్ని రంగాల్లోనూ టెక్నాలజీ ఆధారిత కార్యకలాపాలు ఊపందుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా టెక్ రంగంలో కీలకంగా భావించే కోడింగ్, ప్రోగ్రామింగ్, అల్గారిథమ్‌లు సమర్థవంతంగా చేయాలంటే.. మ్యాథమెటిక్స్ నైపుణ్యాలు ఎంతో కీలకంగా మారుతున్నాయి.
సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌గా పేర్కొనే సీ, సీ++, జావా, పైథాన్ వంటి లాంగ్వేజెస్‌లో రాణించేందుకు మ్యాథమెటిక్స్ స్కిల్స్ తప్పనిసరి. గణితంపై పట్టుంటే సాఫ్ట్‌వేర్ రంగంలో ఎంతో కీలకంగా భావించే ప్రోగ్రామర్స్, డెవలపర్స్, అప్లికేషన్స్ వంటి వాటికి సంబంధించిన విధులను రాణించే సామర్థ్యం లభిస్తుంది.
మూడు విభాగాలు
- మ్యాథమెటిక్స్‌ను ముఖ్యంగా మూడు భాగాలుగా వర్గీకరిస్తున్నారు. అవి.. అప్లయిడ్ మ్యాథమెటిక్స్, ప్యూర్ మ్యాథ్స్, మ్యాథమెటికల్ ఫిజిక్స్. అప్లయిడ్ మ్యాథమెటిక్స్ పూర్తిగా రీసెర్చ్ ఓరియెంటేషన్‌తో ఉంటుంది. సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ విభాగాల్లో వాస్తవ సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు మార్గంగా అప్లయిడ్ మ్యాథమెటిక్స్ నిలుస్తోంది.
- ప్యూర్ మ్యాథ్స్ అనేది పూర్తిగా నెంబర్ థియరీగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ నైపుణ్యాలతో ఫైనాన్స్, క్రిప్టోగ్రఫీ వంటి రంగాల్లో అడుగు పెట్టే అవకాశం ఉంది.
- మ్యాథమెటికల్ ఫిజిక్స్‌లో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌ల మధ్య అంతర్గత సమ్మేళనం ఉంటుంది. క్వాంటమ్ థియరీ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి విభాగాల్లో ఇది ఎంతో కీలకంగా మారుతోంది.
కొలువులకు మార్గాలు
- బ్యాచిలర్ డిగ్రీలో మ్యాథమెటిక్స్‌తోపాటు డేటా అనాలిసిస్, డేటా సైన్స్ వంటి సర్టిఫికేషన్స్ పూర్తి చేసుకుంటే సాఫ్ట్‌వేర్ రంగంలోనూ కొలువు సొంతం చేసుకోవచ్చు.
- మ్యాథమెటిక్స్ పీజీ అర్హతతో జూనియర్ లెక్చరర్స్ ఉద్యోగాలతోపాటు ప్రైవేట్ రంగంలోనూ పలు జాబ్స్ అందుబాటులో ఉన్నాయి.
- గణితంలో పీహెచ్‌డీ పట్టాతో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, హరీశ్‌చంద్ర రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఇస్రో, సెంట్రల్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్, హోమీ భాభా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ వంటి సంస్థల్లో రీసెర్చ్ విభాగంలో శాస్త్రేవేత్తలుగా కొలువులు సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా డీఆర్‌డీఓ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలలోనూ మ్యాథమెటిక్స్ పీహెచ్‌డీ ఉత్తీర్ణులకు అవకాశాలు లభిస్తున్నాయి. అదే విధంగా బోధన విభాగంలో ప్రొఫెసర్ హోదాలను సొంతం చేసుకోవచ్చు.
చదవండి: Andesri State Anthem: పాఠ్యపుస్తకాల్లో అందెశ్రీ రాష్ట్ర గీతం
మ్యాథ్స్‌తో టాప్ జాబ్స్
ప్రస్తుత జాబ్ మార్కెట్ పరిస్థితుల్లో మ్యాథమెటిక్స్ నిపుణులకు అందుబాటులో ఉన్న టాప్ కెరీర్ మార్గాలు..
క్రిప్టో గ్రాఫర్
నేడు అన్ని వ్యాపారాల్లోనూ ఇంటర్నెట్ ఆధారిత కార్యకలాపాలు సాగుతున్నాయి. కీలకమైన సమాచారాన్ని భద్రపర్చాల్సిన ఆవశ్యకత నెలకొంది. దీంతో రక్షిత సమాచార వ్యవస్థను రూపొందించడానికి క్రిప్టోగ్రాఫర్స్ అవసరమవుతున్నారు. ముఖ్యంగా డేటా సెక్యూరిటీకి సంబంధించి పలు ప్రోగ్రామ్‌లు రూపొందించడానికి మ్యాథమెటిక్స్ నైపుణ్యాలు కీలకంగా మారుతున్నాయి. ఫలితంగా క్రిప్టో విభాగంలో మ్యాథ్స్ నిపుణులకు కొలువులు లభిస్తున్నాయి.
స్టాటిస్టిషియన్
కంపెనీలు డేటా అనాలిసిస్, డేటా కంపేరిజన్ వంటి విభాగాల్లో స్టాటిస్టిక్స్‌తోపాటు మ్యాథమెటిక్స్ నైపుణ్యాలు ఉన్న వారిని నియమించుకుంటున్నాయి. డేటాను ఒక క్రమ పద్ధతిలో అమర్చడానికి, లోపాలు లేకుండా చూడడానికి మ్యాథమెటిక్స్ నిపుణుల అవసరం ఏర్పడుతోంది. ముఖ్యంగా ఫార్మా, ఫైనాన్స్, టెక్నాలజీ విభాగాల్లో వీరు ఉద్యోగాలు సొంతం చేసుకునే వీలుంది.
మెషీన్ లెర్నింగ్ ఇంజనీర్
మ్యాథమెటిక్స్ స్కిల్స్ ఉన్న వారు మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్లుగానూ కొలువుదీరే అవకాశం ఉంది. ముఖ్యంగా భారీ స్థాయిలో ఉండే డేటా షీట్స్‌ను నిర్వహించడానికి, మెషీన్ లెర్నింగ్ మోడల్స్ రూపొందించడానికి, వాటికి సంబంధించి కోడ్స్, అల్గారిథమ్స్ రాయడానికి మ్యాథమెటిక్స్ నిపుణుల అవసరం ఏర్పడుతోంది. దీంతో..అల్జీబ్రా,కాలిక్యులస్, ప్రాబబిలిటీ అంశాల్లో నైపుణ్యాలున్న వారికి మెషీన్ లెర్నింగ్ ఇంజనీర్స్‌గా ఉద్యోగాలు లభిస్తున్నాయి.
యాక్చుయేరియల్ సైంటిస్ట్
ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో.. బీమా పాలసీల రూపకల్పన, ప్రీమియం నిర్ధారణ వంటి అంశాల్లో మ్యాథమెటిక్స్ నిపుణుల అవసరం ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్రాబబిలిటీ, కాలిక్యులస్ స్కిల్స్‌తోపాటు ప్రాబ్లమ్ సాల్వింగ్, అనలిటికల్ నైపుణ్యాలుంటే యాక్చుయేరియల్ సైంటిస్ట్‌గా కొలువులు సొంతం చేసుకోవచ్చు.
ఆపరేషన్ రీసెర్చ్ అనలిస్ట్
వ్యాపార కార్యకలాపాలు, వ్యూహాల వృద్ధికి ఆపరేషనల్ రీసెర్చ్ అనలిస్ట్‌ల సేవలు తప్పనిసరిగా మారుతున్నాయి. మ్యాథమెటికల్ టెక్నిక్స్ ఉపయోగించి సప్లై చైన్ మేనేజ్‌మెంట్, ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్, డిస్ట్రిబ్యూషన్ వంటి విభాగాల్లో కార్యకలాపాలు సజావుగా సాగేలా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
డేటా సైంటిస్ట్
గణితంపై పట్టుంటే.. మ్యాథమెటికల్, స్టాటిస్టికల్ టూల్స్ సమ్మేళనంగా ఉండే కీలకమైన డేటా అనలిస్ట్ జాబ్స్ సొంతం చేసుకోవచ్చు. నిర్దేశిత డేటాను విశ్లేషించి.. దాని ఆధారంగా కంపెనీలు తీసుకోవాల్సిన నిర్ణయాలపై నివేదిక ఇవ్వడం డేటా సైంటిస్ట్ట్‌ల ప్రధాన విధిగా ఉంటుంది.
అల్గారిథమ్ ఇంజనీర్స్
మ్యాథ్స్‌పై పట్టుంటే ప్రస్తుత టెక్ యుగంలో సాఫ్ట్‌వేర్ సంస్థలతోపాటు ఇండస్ట్రీ 4.0 టెక్నాలజీస్‌తో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీల్లో అల్గారిథమ్ ఇంజనీర్స్‌గానూ అడుగు పెట్టొచ్చు. డేటాను వినియోగించి వాస్తవ పరిస్థితులను విశ్లేషించడం.. దానికి సంబంధించిన నివేదికలు ఇవ్వడం వంటి విధులు అల్గారిథమ్స్ ఇంజనీర్’్స నిర్వర్తించాల్సి ఉంటుంది.
మార్కెట్ రీసెర్చర్స్
వ్యాపార ప్రపంచంలో కస్టమర్లు, పోటీ దారుల డేటాను విశ్లేషించి.. తమ కంపెనీ లక్ష్యాలకు అనుగుణంగా నివేదికలు రూపొందించడం, సర్వేలు నిర్వహించడం, మార్కెట్ ట్రెండ్స్‌ను ఎప్పటికప్పుడు విశ్లేషించడం వంటి విధులు మార్కెట్ రీసెర్చర్స్ నిర్వర్తించాల్సి ఉంటుంది.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
అకడమిక్ మార్గాలు
మ్యాథమెటిక్స్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులు బ్యాచిలర్స్ నుంచి పీహెచ్‌డీ వరకూ.. పలు కోర్సులు అభ్యసించే అవకాశం ఉంది. మ్యాథమెటిక్స్ కోర్సులు, వాటిని అందిస్తున్న ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్ వివరాలు..
- చెన్నై మ్యాథమెటికల్ ఇన్‌స్టిట్యూట్: కోర్సులు: బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ. ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా అడ్మిషన్ లభిస్తుంది.
- ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్: కోర్సులు: బీఎస్సీ మ్యాథమెటిక్స్(ఆనర్స్), ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్, పీహెచ్‌డీ(మ్యాథమెటిక్స్). ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే రాత పరీక్షలో ర్యాంకు ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
- ఐఐఎస్‌సీ–బెంగళూరు: బీటెక్ (మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్). జేఈఈ –అడ్వాన్స్‌డ్ ర్యాంకు ఆధారంగా అడ్మిషన్ పొందొచ్చు.
- ఐఐటీ–ఖరగ్‌పూర్: ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్. ఐఐటీ–జామ్ స్కోర్ ఆధారంగా ప్రవేశం లభిస్తుంది. ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ(మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్)లో జేఈఈ–అడ్వాన్స్‌డ్ ర్యాంకు ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు.
- ఐఐటీ–కాన్పూర్: మ్యాథమెటిక్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్ సైన్స్‌లో బీఎస్ డిగ్రీ, బీఎస్–ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ. జేఈఈ–అడ్వాన్స్‌డ్ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్‌లో ఐఐటీ–జామ్ స్కోర్ ఆధారంగా అడ్మిషన్ లభిస్తుంది.
- టీఐఎఫ్‌ఆర్: ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ పీహెచ్‌డీ ప్రోగ్రామ్. ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్‌లో ర్యాంకు ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశానికి గేట్, జెస్ట్, సీఎస్‌ఐఆర్–యూజీసీ నెట్ స్కోర్లను పరిగణనలోకి తీసుకుంటారు.
- ఐఐటీ–చెన్నై: ఎమ్మెస్సీ (మ్యాథమెటిక్స్). ఐఐటీ–జామ్ స్కోర్ ఆధారంగా ప్రవేశం లభిస్తుంది. ఎంటెక్ (ఇండస్ట్రియల్ మ్యాథమెటిక్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్)లో గేట్ స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.