Paralympics: పారాలింపిక్స్‌లో భారత్‌కు ఒకే రోజు 4 పతకాలు..

పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు రెండో రోజే మన ఖాతాలో నాలుగు పతకాలు చేర్చారు.

షూటింగ్‌లో అవని లేఖరాకు స్వర్ణ పతకం, మోనా అగర్వాల్‌కు కాంస్య పతకం దక్కింది. పురుషుల షూటింగ్‌లో మనీశ్‌ నర్వాల్‌ రజతాన్ని గెలుచుకోగా.. స్ప్రింట్‌లో ప్రీతి పాల్‌ కూడా కాంస్య పతకాన్ని అందించింది. 

గత టోక్యో ఒలింపిక్స్‌లో సాధించిన స్వర్ణాన్ని సాధించిన అవని లేఖరా, వరుసగా రెండో పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన షూటర్‌గా నిలిచింది.  

ఒకే ఈవెంట్‌లో రెండు పతకాలు..
పారాలింపిక్స్‌ చరిత్రలో భారత్‌కు ఒకే ఈవెంట్‌లో తొలిసారి రెండు పతకాలు దక్కాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ స్టాండింగ్‌ ఎస్‌హెచ్‌1 ఈవెంట్‌లో అవని లేఖరా స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. జైపూర్‌కు చెందిన 22 ఏళ్ల అవని టోక్యోలో మూడేళ్ల క్రితం జరిగిన ఒలింపిక్స్‌లోనూ పసిడి పతకం గెలుచుకుంది. 

ఈ ఈవెంట్‌లో దక్షిణ కొరియాకు చెందిన యున్రీ లీ (246.8 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచి రజత పతకం గెలుచుకోగా.. భారత్‌కు చెందిన మోనా అగర్వాల్‌ (228.7 పాయింట్లు) కాంస్య పతకం సాధించింది.  

మనీశ్‌ నర్వాల్‌కు రజతం.. 
పురుషుల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో 22 ఏళ్ల మనీశ్‌ నర్వాల్‌ రజత పతకం సాధించాడు. గత ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలుచుకున్న మనీశ్‌ ఈసారి రజత పతకానికే పరిమితమయ్యాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఎస్‌హెచ్‌1లో మనీశ్‌ రెండో స్థానంలో నిలిచాడు. 

ఈ పోరులో జెంగ్డూ జో (కొరియా; 237.4 పాయింట్లు) స్వర్ణ పతకం గెలుచుకోగా.. చావో యాంగ్‌ (చైనా; 214.3)కు కాంస్యం లభించింది.   

Shaik Sadia Alma: స్వ‌ర్ణ ప‌త‌కం సాధించిన ఏపీ అమ్మాయి

కంచు మోగించిన ప్రీతి పాల్‌.. 
పారాలింపిక్స్‌ చరిత్రలో భారత్‌ తరఫున ట్రాక్‌ ఈవెంట్‌లో ప్రీత్‌ పాల్‌ తొలి పతకాన్ని అందించింది. మహిళల 100 మీటర్ల టి–35 పరుగులో ప్రీతికి కాంస్యం లభించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల ప్రీతి రేసును 14.21 సెకన్లలో పూర్తి చేసింది. ఆమెకు ఇవే తొలి పారాలింపిక్స్‌.

#Tags