Commonwealth Games: కామన్వెల్త్‌ క్రీడల నుంచి హాకీ, రెజ్లింగ్, బ్యాడ్మింటన్‌ సహా 9 క్రీడాంశాలు తొలగింపు!!

మరో రెండేళ్లలో జరగబోయే కామన్వెల్త్‌ క్రీడలు భారత శిబిరాన్ని ఇప్పటి నుంచే నిరాశలో ముంచేశాయి.

భారత క్రీడాకారులు పతకాలు కచ్చితంగా గెలిచే క్రీడాంశాలను ఆతిథ్య దేశం స్కాట్లాండ్‌ తొలగించింది. గ్లాస్గోలో 2026లో జరిగే ప్రసిద్ధ కామన్వెల్త్‌ పోటీలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత పరిమితంగా పదే పది క్రీడాంశాలతో మమ అనిపించేందుకు ఆర్గనైజింగ్‌ కమిటీ సిద్ధమైంది. 

గత బర్మింగ్‌హామ్‌ 2022 కామన్వెల్త్‌ గేమ్స్‌ను 19 క్రీడాంశాలతో నిర్వహించారు. ఇప్పుడు ఇందులో 9 క్రీడాంశాలకు కోత పెట్టారు. హాకీ, క్రికెట్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, టేబుల్‌ టెన్నిస్, స్క్వాష్, రిథమిక్‌ జిమ్నాస్టిక్స్, డైవింగ్, బీచ్‌ వాలీబాల్‌ క్రీడలను తప్పించారు.  

బడ్జెటే ప్రతిబంధకమా? 
నిజానికి 2026 క్రీడలు ఆ్రస్టేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో జరగాలి. అయితే అంచనాలను మించిపోతున్న బడ్జెట్‌ కారణంతో విక్టోరియా వైదొలగింది. దీంతో నిర్వహణకు గ్లాస్గో (స్కాట్లాండ్‌) ముందుకొచ్చిం ది. అయితే ఈ దేశం కూడా వేల సంఖ్యలో వచ్చే అథ్లెట్లు, అధికారులు వారికి కల్పించాల్సిన వసతులు, సదుపాయాల గురించి పెద్ద కసరత్తే చేసింది.

Archery World Cup: ఆర్చరీ వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో ఐదోసారి దీపిక కుమారికి రజతం

అధిక సంఖ్యలో క్రీడాంశాల్ని నిర్వహించాలంటే వేదికల సంఖ్య కూడా పెంచాలి. అంటే అక్కడికి అథ్లెట్లు, అధికారిక గణాన్ని తరలించేందుకు రవాణా (లాజిస్టిక్స్‌) తదితర అంశాలన్నీ పరిగణనలోకి తీసుకొని భారీ ఖర్చుల్ని తగ్గించుకోవాలనే నిర్ణయానికి వచ్చిం ది. ఓ పరిమిత బడ్జెట్‌తో నిర్వహించేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకుంది. అందుకే 11 మందితో బరిలోకి దిగే పలు టీమ్‌ ఈవెంట్లతో పాటు మొత్తం 9 క్రీడాంశాలను తొలగించేసింది. 

కామన్వెల్త్‌ గేమ్స్‌ సమాఖ్య నియమావళి ప్రకారం ఆతిథ్య వేదికకు ఆ వెసులుబాటు ఎప్పటి నుంచో ఉంది. దీన్ని అనుసరించి కేవలం నాలుగే వేదికల్లో పది క్రీడాంశాలను నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. తద్వారా స్కాట్లాండ్‌ ప్రభుత్వం మోపెడు ఖర్చును తగ్గించి అనుకున్న బడ్జెట్‌లోపే  ఈవెంట్‌ ను నిర్వహించాలనుకుంటుంది.  

ఆడించే 10 క్రీడాంశాలు ఇవే... 
అథ్లెటిక్స్, స్విమ్మింగ్, ఆరి్టస్టిక్‌ జిమ్నాస్టిక్స్, ట్రాక్‌ సైక్లింగ్, నెట్‌బాల్, బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్,  జూడో, లాన్‌ బౌల్స్, 3్ఠ3 బాస్కెట్‌బాల్‌ క్రీడాంశాలతోనే గ్లాస్గో ఈవెంట్‌ జరుగుతుంది.  అథ్లెటిక్స్,  స్విమ్మింగ్, ట్రాక్‌ సైక్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్, లాన్‌ బౌల్స్‌ క్రీడాంశాల్లో దివ్యాంగ అథ్లెట్ల కోసం కూడా పోటీలు ఉంటాయి. గ్లాస్గో కామన్వెల్త్‌ గేమ్స్‌  2026 జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు జరుగుతాయి. 

T20 World Cup: మహిళల టీ20 ప్రపంచకప్‌ విజేత న్యూజిలాండ్.. ఇదే తొలిసారి.. ప్రైజ్‌మనీ ఎంతంటే..

తొలగించిన క్రీడాంశాలు.. 
హాకీ, క్రికెట్‌ టీమ్‌ ఈవెంట్లతో పాటు బ్యాడ్మింటన్, రెజ్లింగ్, టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ), స్క్వాష్, రిథమిక్‌ జిమ్నాస్టిక్స్, డైవింగ్, బీచ్‌ వాలీబాల్‌ క్రీడలను గ్లాస్గో నిర్వాహక కమిటీ పక్కన బెట్టింది.

2022 బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ గెలిచిన పతకాలు 
రెజ్లింగ్‌ (12), వెయిట్‌లిఫ్టింగ్‌ (10), అథ్లెటిక్స్‌ (8), టేబుల్‌ టెన్నిస్‌ (7), బ్యాడ్మింటన్‌ (6), జూడో (3), బాక్సింగ్‌ (7), హాకీ (2), లాన్‌ బౌల్స్‌ (2), స్క్వాష్‌ (2), క్రికెట్‌ (1), పారా పవర్‌లిఫ్టింగ్‌ (1). 

#Tags