Xi Jinping: చైనా అధ్యక్షుడిగా, సీఎంసీ చైర్మన్‌గా మూడోసారి ఎన్నికైన జిన్‌పింగ్
జిన్‌పింగ్ ఎన్నికకు చైనా పార్లమెంట్ మార్చి 10వ తేదీ ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది. ఆయన చైనా అధ్యక్షుడిగా, అత్యంత శక్తివంతమైన సెంట్రల్ మిలటరీ కమిషన్(సీఎంసీ) చైర్మన్‌గా మరో ఐదేళ్లపాటు పదవుల్లో కొనసాగుతారు. ఒకవైపు అమెరికా, యూరోపియన్ యూనియన్(ఈయూ)తో ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతుండడం, మరోవైపు చైనా ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్న తరుణంలో జిన్‌పింగ్ వరుసగా మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన జీవితకాలం ఇదే పదవిలో కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకోసం పార్టీ రాజ్యాంగాన్ని 2018లో సవరించారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ ( 05- 11 ఫిబ్రవరి 2023 )
ఉపాధ్యక్షుడిగా హన్ జెంగ్
జిన్‌పింగ్‌ను మరోసారి దేశాధ్యక్షుడిగా, సీఎంసీ చైర్మన్‌గా నియమిస్తూ అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) చేసిన ప్రతిపాదనను రబ్బర్ స్టాంప్ పార్లమెంట్‌గా ముద్రపడిన నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్(ఎన్‌పీసీ) లాంఛనంగా ఆమోదించింది. పార్లమెంట్‌లోని 2,952 మంది సభ్యులు అంగీకారం తెలిపారు. చైనాలో ఒక నాయకుడు మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఇదే ప్రథమం. జిన్‌పింగ్ కంటే ముందు పనిచేసిన అధ్యక్షులంతా రెండు పర్యాయాలే(10 సంవత్సరాలు) పదవీలో కొనసాగారు. చైనా మాజీ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు హన్ జెంగ్‌ను ఉపాధ్యక్షుడిగా ఎన్‌పీసీ నియమించింది. గత ఏడాది అక్టోబర్ జరిగిన కమ్యూనిస్ట్ పార్టీ ప్లీనరీలో జిన్‌పింగ్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా మళ్లీ ఎన్నుకున్న సంగతి తెలిసిందే. మావో జెడాంగ్ తర్వాత చైనా కమ్యూనిస్ట్ పార్టీకి మూడోసారి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైజిన్‌పింగ్ రికార్డుకెక్కారు.
దూకుడు పెంచుతారా?
జిన్‌పింగ్ చేతిలో ప్రస్తుతం మూడు శక్తివంతమైన పదవులు ఉన్నాయి. ఎలాంటి ఆటంకాలు లేకుండా మరోసారి కుర్చీ దక్కడంతో జిన్‌పింగ్ దూకుడు పెంచే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా. పొరుగు దేశం భారత్‌పై ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. ఇరు దేశాల నడుమ ఉద్రిక్తతలు పెచ్చరిల్లే ప్రమాదం ఉందంటున్నారు. సెంట్రల్ కేబినెట్(స్టేట్ కౌన్సిల్)కు నేతృత్వం వహిస్తున్న చైనా ప్రధాని (ప్రీమియర్) లీ కెకియాంగ్ పదవీ కాలం ముగిసింది. ఆయన స్థానంలో జిన్‌పింగ్‌కు సన్నిహితుడైన లీ కియాంగ్‌ను శనివారం ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది.