ఆగష్టు 2019 జాతీయం
టైమ్ జాబితాలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ
టైమ్ ప్రపంచంలోనే గొప్పవైన, తక్షణమే వెళ్లి ఆస్వాదించదగిన ప్రాంతాలు-100 జాబితాలో భారత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, సోహో హౌస్‌లకు చోటు లభించింది. ఈ జాబితాను ఆగస్టు 22న టైమ్ మేగజీన్ విడుదల చేసింది. స్టాట్యూ ఆఫ్ యూనిటీ (ఐక్యతా విగ్రహం)పేరుతో నిర్మించిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం గుజరాత్‌లోని కేవడియాలో నర్మదా నది నడిబొడ్డున ఉంది. ఆసియాలోనే మొట్టమొదటి సారిగా ముంబైలో ఏర్పాటైన ఘనత సోహో హౌస్ సొంతం. సముద్ర తీరంలో 11 అంతస్తుల భవనంలో ఏర్పాటైన ఈ క్లబ్‌లో ఒక లైబ్రరీ, చిన్న సైజు సినిమా హాలు, రూఫ్‌టాప్ బార్, స్విమ్మింగ్‌పూల్ ఉన్నాయి. 200 కళాత్మక వస్తువులు ఈ ప్రైవేట్ క్లబ్ ప్రత్యేకతలు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టైమ్ జాబితాలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, సోహో హౌస్‌కు చోటు
ఎప్పుడు : ఆగస్టు 22
ఎవరు : టైమ్ మేగజీన్
అమల్లోకి కనీస వేతనాల చట్టం
జాతీయ స్థాయిలో 50 కోట్ల మందికి కనీస వేతనం అందేలా కేంద్రప్రభత్వం తీసుకొచ్చిన ‘వేతనాల చట్టం- 2019’ అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ఆగస్టు 23న కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ చట్టం ప్రకారం వర్తక సంఘాలు, ఉద్యోగులు, రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో వేతనాలు నిర్ణయమవుతాయి. కనీస వేతనాల చట్టం, వేతన చెల్లింపు చట్టం, బోనస్ చెల్లింపు చట్టం, సమాన ప్రతిఫలం చట్టం స్థానంలో వేతనాల కోడ్ -2019 అమల్లోకి వచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమల్లోకి వేతనాల చట్టం- 2019
ఎప్పుడు : ఆగస్టు 23
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
కన్నన్ శ్రేష్టి జయంతి వేడుకల్లో వెంకయ్య
తమిళనాడు రాజధాని చెన్నైలోని కొరుక్కుపేటలో ఆగస్టు 24న నిర్వహించిన కన్నన్ శ్రేష్టి 150వ జయంతి వేడుకల్లో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నన్ శ్రేష్టి, సీతమ్మ గార్ల విగ్రహాలను, కన్నన్ శ్రేష్టి స్మారకార్థం పోస్టల్ స్టాంప్‌ను వెంకయ్య ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఉన్నతమైన ఆశయాలతో, సాంకేతిక విధానాలతో దేశం ముందుకు సాగుతోందని వ్యాఖ్యానించారు.
ధర్మమూర్తి రావు బహదూర్ కలవల కన్నన్ శ్రేష్టి చారిటీస్, చెన్నై ఆధ్వర్యంలో జరిగిన కన్నన్ శ్రేష్టి జయంతి వేడుకల్లో తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, తమిళనాడు మంత్రి జయకుమార్, చారిటీస్ అధ్యక్షుడు వెంకటేశ పెరుమాళ్, మేనేజింగ్ ట్రస్టీ కన్నయ్య శెట్టి తదితరులు పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కన్నన్ శ్రేష్టి 150వ జయంతి వేడుకలు
ఎప్పుడు : ఆగస్టు 24
ఎవరు : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై అమిత్ షా సమీక్ష
మావోయిస్టుల ప్రభావం ఉన్న 10 రాష్ట్రాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులపై, వామపక్ష తీవ్రవాదంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆగస్టు 26న ఢిల్లీలో సమీక్ష సమావేశం నిర్వహించారు. మావోయిస్టుల ఏరివేతకు తీసుకుంటున్న చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఈ సమావేశంలో సమీక్షించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితోపాటు ఇతర రాష్ట్రాల సీఎంలు నితీష్ కుమార్ (బిహార్), నవీన్ పట్నాయక్ (ఒడిశా), యోగి ఆదిత్యనాథ్ (యూపీ), కమల్‌నాథ్ (మధ్యప్రదేశ్), రఘుబర్ దాస్ (జార్ఖండ్), భూపేష్ భఘేల్ (ఛత్తీస్‌గఢ్), ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై అమిత్ షా సమీక్ష
ఎప్పుడు : ఆగస్టు 26
ఎవరు : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
ఎక్కడ : ఢిల్లీ
రూపాయికే సువిధా న్యాప్కిన్
మహిళల ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఇకపై శానిటరీ న్యాప్కిన్‌లను రూపాయికే అందజేయనున్నట్లు కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడ ఆగస్టు 26న వెల్లడించారు. గతంలో నాలుగు ప్యాడ్లు ఉన్న ప్యాకెట్ ధర 10 రూపాయలకు లభించేది. ఇకపై అది రూ. 4కే లభించనుంది. కేంద్రం ఆగస్టు 27 నుంచి పర్యావరణహిత శానిటరీ న్యాప్‌కిన్‌లను విడుదల చేస్తోంది. సువిధా బ్రాండ్ పేరుతో ఉన్న ఈ న్యాప్‌కిన్లు దేశవ్యాప్తంగా 5,500 జన్ ఔషధి కేంద్రాలలో లభిస్తాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రూపాయికే సువిధా న్యాప్కిన్
ఎప్పుడు : ఆగస్టు 26
ఎవరు : కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడ
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : మహిళల ఆరోగ్య సంరక్షణలో భాగంగా
పెర్‌ఫార్మెన్స్ ఆడిట్‌లో మహారాష్ట్రకు అగ్రస్థానం
దేశవ్యాప్తంగా 35 బోర్డులు, కమిటీల్లో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నిర్వహించిన ‘పెర్‌ఫార్మెన్స్ ఆడిట్’లో మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అగ్రస్థానంలో నిలచింది. 82.93 పాయింట్లతో మహారాష్ట్ర మొదటిస్థానంలో నిలవగా 82.72 పాయింట్లు తెలంగాణ రెండో స్థానం సాధించింది. ఈ వివరాలను ఆగస్టు 27న సీపీసీబీ విడుదల చేసింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు సీపీసీబీ ఈ ఆడిట్‌ను నిర్వహించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీపీసీబీ నిర్వహించిన పెర్‌ఫార్మెన్స్ ఆడిట్‌లో అగ్రస్థానం
ఎప్పుడు : ఆగస్టు 27
ఎవరు : మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి
ఎక్కడ : దేశవ్యాప్తంగా
న్యూఢిల్లీలో యూఎన్‌సీసీడీ సదస్సు
దేశ రాజధాని న్యూఢిల్లీలో సెప్టెంబర్ 2 నుంచి 13వ తేదీ వరకు యునెటైడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిసెర్టిఫికేషన్ (యూఎన్‌సీసీడీ) సదస్సు జరగనుంది. ఐక్యరాజ్యసమితి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్) 14 ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించనున్నట్లు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆగస్టు 27న తెలిపారు.
సదస్సు సందర్భంగా మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం..
- సుమారు 200 దేశాలకు చెందిన 3 వేల మంది ప్రతినిధులు, 100 మంది మంత్రులు పాల్గొననున్న ఈ సదస్సులో భూ ఎడారీకరణను ఎదుర్కోవటానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.
- దేశవ్యాప్తంగా 2030 నాటికి సుమారు 50 లక్షల హెక్టార్ల బీడు భూములను తిరిగి సారవంతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
- దేశంలోని భూమిలో సుమారు 29 శాతం బీడుబారిపోయింది.
- డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది.
ఏమిటి : సెప్టెంబర్ 2 నుంచి 13వ తేదీ వరకు యూఎన్‌సీసీడీ సదస్సు
ఎప్పుడు : ఆగస్టు 27
ఎవరు : కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్
ఎక్కడ : న్యఢిల్లీ
ఎందుకు : భూ ఎడారీకరణను ఎదుర్కోవటానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు
ఎన్‌ఎస్‌టీఎల్ స్వర్ణోత్సవాల్లో వెంకయ్య
జాతీయ నావికా సమర శాస్త్ర, సాంకేతిక ప్రయోగశాల (ఎన్‌ఎస్‌టీఎల్) స్వర్ణోత్సవాల్లో భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌టీఎల్‌లోని మహాపాత్ర మానస్ ఆడిటోరియంలో ఆగస్టు 28న నిర్వహించిన కార్యక్రమంలో వెంకయ్య మాట్లాడారు. అనంతరం జూబ్లీ పోస్టల్ కవర్‌ను ఆవిష్కరించారు. ఎన్‌ఎస్‌టీఎల్ రూపొందించిన ‘సహాయక్-ఎన్‌జీ సిస్టమ్’ను భారత నావికాదళానికి అప్పగించారు. అలాగే ఎన్‌ఎస్‌టీఎల్ టెక్నికల్ ఎగ్జిబిషన్‌ను వెంకయ్య ప్రారంభించారు.
ఎన్‌ఎస్‌టీఎల్ స్వర్ణోత్సవాల్లో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) చైర్మన్ డాక్టర్ జి.సతీష్‌రెడ్డి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఎన్‌ఎస్‌టీఎల్ ఉంది. ప్రస్తుతం ఈ సంస్థ డెరైక్టర్‌గా డాక్టరు ఓఆర్ నందగోపన్ ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ నావికా సమర శాస్త్ర, సాంకేతిక ప్రయోగశాల (ఎన్‌ఎస్‌టీఎల్) స్వర్ణోత్సవాలు
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
దేశవ్యాప్తంగా 75 కొత్త వైద్య కళాశాలలు
దేశవ్యాప్తంగా 75 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఢిల్లీలో ఆగస్టు 28న సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ (సీసీఈఏ) వైద్య కళాశాలల పెంపుతో పాటు మరికొన్ని నిర్ణయాలను తీసుకుంది. 75 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుతో ప్రస్తుతమున్న ఎంబీబీఎస్ సీట్లకు మరో 15,700 సీట్లు పెరగ నున్నాయి.
కేబినెట్ మరికొన్ని నిర్ణయాలు
- 2021-22 విద్యా సంవత్సరం నాటికి కొత్త వైద్య కళాశాలలను అందుబాటులోకి తీసుకురావాలి. ఈ కాలేజీలను జిల్లా ఆసుపత్రులతోపాటు 200/300 పడకలున్న ఆసుపత్రులకు అటాచ్ చేయాలి. ఇందుకోసం రూ.24,375కోట్లు ఖర్చవుతాయి.
- వచ్చే మార్కెటింగ్ సంవత్సరం (2019, అక్టోబర్‌లో ప్రారంభం)లో 60లక్షల మిలియన్ల చక్కెరను ఎగుమతి చేసేందుకు సంబంధించిన రూ.6,286కోట్ల సబ్సిడీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా చక్కెర మిల్లుల్లో ఉన్న మిగులు ఉత్పత్తిని వదిలించుకోవడంతోపాటు.. రైతుల బకాయిలు చెల్లించేందుకు ఈ చర్య ఉపయోగపడనుంది.
- ఢిల్లీలో ఇంటర్నేషనల్ కొయిలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్‌ఫ్రాస్టక్చ్రర్ (సీడీఆర్‌ఐ) సచివాలయ కార్యాలయం ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
- 2019, సెప్టెంబర్ 23న న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో సీఆర్‌డీఐ ఏర్పాటును ప్రధాని మోదీ అధికారికంగా ప్రకటించనున్నారు. సీఆర్‌డీఐ కోసం రూ.480కోట్ల నిధిని ఏర్పాటుచేసేందుకు కూడా కేబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.
- ఔషధ మొక్కల పెంపకం, పరిశోధన తదితర అంశాల్లో సహకారానికి పెరూ దేశంతో, సంప్రదాయ వైద్యంపై గయానా, గాంబియా దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు అంగీకారం తెలిపింది.
- బొగ్గు మైనింగ్, కాంట్రాక్టు తయారీ రంగాల్లోకి నూరు శాతం ఎఫ్‌డీఐలను కేబినెట్ ఆహ్వానించింది. అలాగే, డిజిటల్ మీడియాలో ఇప్పటి వరకు ఎఫ్‌డీఐలకు అవకాశం లేకపోగా, ఇకపై 26 శాతం వరకు ఎఫ్‌డీఐలను స్వీకరించేందుకు అనుమతించింది.
ఏమిటి : 75 కొత్త వైద్య కళాశాలలు
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎక్కడ : దేశవ్యాప్తంగా
బీపీఆర్‌డీ వ్యవస్థాపక దినోత్సవంలో అమిత్ షా
ఢిల్లీలో ఉన్న పోలీస్ పరిశోధన, అభివృద్ధి సంస్థ (బీపీఆర్‌డీ) 49వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆగస్టు 28న నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా క్రిమినల్ కేసుల్లో నేర నిర్థారణ శాతం చాలా తక్కువగా ఉందన్నారు. పోలీసులు అనుమానితుల పట్ల థర్డ్ డిగ్రీని ప్రయోగించడం, ఫోన్ల ట్యాపింగ్ లాంటి పురాతన విధానాలు నేరాలను అరికట్టడంలో ఆశించిన ఫలితాలను ఇవ్వలేవని చెప్పారు. దర్యాప్తులో పోలీసులు ఫోరెన్సిక్ ఆధారాలను వినియోగించుకోవాలని సూచించారు. నేర శిక్షా స్మృతి, భారతీయ శిక్షా స్మృతిని సవరించడంపై చర్చల ప్రక్రియను ప్రారంభించాలన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పోలీస్ పరిశోధన, అభివృద్ధి సంస్థ (బీపీఆర్‌డీ) 49వ వ్యవస్థాపక దినోత్సవం
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : కేంద్ర హోంమంత్రి అమిత్ షా
ఎక్కడ : న్యూఢిల్లీ
పాఠశాలల కోసం శగున్ వెబ్‌సైట్ ప్రారంభం
పాఠశాల స్థాయి విద్యను మరింత బలోపేతం చేసేందుకు రూపొందించిన ‘శగున్’ అనే వెబ్‌సైట్ (http://seshagun.gov.in/) ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ నిశాంక్ ఆగస్టు 28న ఢిల్లీలో ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 15 లక్షల పాఠశాలలను అనుసంధానం చేశారు. విద్యకు సంబంధించిన సమాచారాన్ని ఈ పోర్టల్ ద్వారా ఆ పాఠశాలలకు అందిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాఠశాలల కోసం శగున్ వెబ్‌సైట్ ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ నిశాంక్
ఎక్కడ : ఢిల్లీ
ఎందుకు : పాఠశాల స్థాయి విద్యను మరింత బలోపేతం చేసేందుకు
ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ప్రసంగం
ప్రధాని మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
- దేశం ఎదుర్కొంటున్న వేలాది సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పుడు భారత్‌కు ఎంతో బలమైన ప్రభుత్వం ఉంది.
- దేశంలోని ప్రతి ఇంటికీ పైపుల ద్వారా నీరు అందించేందుకు తమ ప్రభుత్వం రాబోయే కొన్నేళ్లలో రూ. 3.5 లక్షల కోట్లను ఖర్చు చేయనుంది.
- రాబోయే ఐదేళ్లలో ఏకంగా వంద లక్షల కోట్ల రూపాయలను మౌలిక వసతుల రంగంలో పెట్టి, ఆర్థిక వ్యవస్థ ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది.
- ఒక దేశం, ఒకే కార్డు వ్యవస్థతో ఒకే కార్డుతో దేశంలో ఎక్కడైనా ప్రయాణాలకు చెల్లింపులు చేసే వ్యవస్థను తమ ప్రభుత్వం తీసుకొచ్చింది.
- జనాభాను నియంత్రించేందుకు కేంద్రంతోపాటు రాష్ట్రాలు కూడా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
- త్రివిధ దళాలకు కలిపి కొత్తగా ఓ అధిపతిని నియమిస్తాం. సీడీఎస్ (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్)గా నియమితులయ్యే వ్యక్తి ఆర్మీ, వాయుసేన, నౌకాదళం.. మూడింటికి కలిపి సంయుక్త అధిపతిగా ఉంటారు.
- జమ్మూ కశ్మీర్, లదాఖ్ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చాల్సిన, వారి కలలకు కొత్త రెక్కలను ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. 370వ అధికరణం రద్దవ్వడంతో ఇప్పుడు భారత్ ఒక దేశం, ఒకే రాజ్యాంగంగా మారింది.
- ఏడాదికి దాదాపు 2 కోట్ల మంది భారతీయులు విదేశాలకు విహారయాత్రలకు వెళ్తున్నారు. వారంతా 2022 నాటికి దేశంలోనే కనీసం 15 పర్యాటక కేంద్రాలను సందర్శించాలి.
- ప్రస్తుతం జమిలి ఎన్నికల ప్రస్తావన వస్తుండటం శుభపరిణామం. ‘ఒక దేశం, ఒక ఎన్నిక’ అంశంపై అన్ని భాగస్వామ్య పక్షాల్లో చర్చలు జరగాలి.
- అక్టోబరు 2 నుంచి ఒకసారి వాడి పారేసే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నుంచి దేశానికి విముక్తి కల్పించాలి.
మిజో పుంచీకు భౌగోళిక గుర్తింపు
మిజోరంకు చెందిన రెండు వస్త్రోత్పత్తులు తావ్‌లోహ్‌పున్, మిజో పుంచీలకు భౌగోళిక గుర్తింపు (జీఐ) ట్యాగ్ లభించింది. అలాగే కేరళలోని తిరూరు తమలపాకు, తమిళనాడులోని ప్రసిద్ధ పళని దేవస్థానం ప్రసాదమైన పంచామృతాని కూడా జీఐ ట్యాగ్ లభించింది.
ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య శాఖ ఆగస్టు 16న ప్రకటించింది.
- తావ్‌లోహ్‌పున్(చేతితో నేయబడిన ఓ రకమైన వస్త్రం)ను మిజోరం రాష్ట్రమంతటా ఉత్పత్తి చేస్తుంటారు. ఇక మిజో పూంచీ అనే శాలువను, మిజో సంప్రదాయ పండుగల సందర్భాల్లో నృత్యాల్లో ధరిస్తుంటారు.
- తిరూరు తమలపాకు రకాన్ని కేరళలోని మలప్పురం జిల్లా వ్యాప్తంగా పలు తాలూకాల్లో పండిస్తుంటారు. ఈ తమలపాకులో పలు ఔషధ లక్షణాలతోపాటు కొంత మేర ఉత్తేజాన్ని కూడా ఇస్తుంది.
- పళనిలో దండయుతపాణి స్వామికి అభిషేక సేవలో వినియోగించే పంచామృతాన్ని అరటిపండు, బెల్లం, ఆవు నెయి్య, తేనె, యాలకులు కలిపి చేస్తారు. ఎటువంటి రసాయన ప్రిజర్వేటివ్‌లు (పదార్థం పాడవకుండా ఉంచేందుకు) కలపకుండా సహజ పద్ధతుల్లో చేయడం దీని ప్రత్యేకత. తమిళనాడులోని ఓ దేవాలయానికి చెందిన ప్రసాదానికి ఈ గుర్తింపు లభించడం ఇదే మొదటిసారి.
- జీఐ ట్యాగ్ వల్ల ఆయా ఉత్పత్తులకు మరింత గుర్తింపుతోపాటు మంచి ధర కూడా లభిస్తుంది. భౌగోళిక మూలాలు, నాణ్యత, వాటికి ఉన్న ప్రత్యేకతలను జీఐ ట్యాగ్ తెలియజేస్తోంది.
పోఖ్రాన్‌ను సందర్శించిన రాజ్‌నాథ్
రాజస్తాన్‌లోని పోఖ్రాన్(1974, 1998 అణుపరీక్షలు నిర్వహించిన ప్రాంతం)ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆగస్టు 16న సందర్శించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. ‘భారత్‌ను అణ్వస్త్ర శక్తిగా మార్చాలన్న అటల్‌బిహారీ వాజ్‌పేయి దృఢసంకల్పానికి ఈ ప్రాంతం ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. అణ్వస్త్రాలను ఇతరులపై మొదటగా ప్రయోగించరాదన్న సిద్ధాంతానికి భారత్ ఇప్పటికీ గట్టిగా కట్టుబడింది. కానీ భవిష్యత్‌లో ఎదురయ్యే పరిస్థితులను బట్టి ఇది మారొచ్చు’అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు వాజ్‌పేయి వర్థంతి సందర్భంగా రాజ్‌నాథ్ ఆయనకు నివాళులు అర్పించారు.
స్టాండింగ్ కమిటీలో సీఎం వైఎస్ జగన్
రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాల దర్యాప్తు, సలహాల కోసం ఉద్దేశించిన అంతర్రాష్ట్ర మండలి స్టాండింగ్ కమిటీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి చోటు లభించింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షుడిగా ఉండే 13 మందితో కూడిన స్టాండింగ్ కమిటీకి తాజాగా నలుగురు ముఖ్యమంత్రులు నామినేట్ అయ్యారు. వారిలో నవీన్‌పట్నాయక్ (ఒడిశా), నితీశ్‌కుమార్ (బిహార్), అమరేందర్ సింగ్ (పంజాబ్)లతో పాటుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ఉన్నారు.
అంతర్రాష్ట్ర మండలి స్టాండింగ్ కమిటీ
అధ్యక్షుడు : కేంద్ర హోం మంత్రి అమిత్ షా
సభ్యులు :
- నవీన్‌పట్నాయక్ (ఒడిశా సీఎం)
- నితీశ్‌కుమార్ (బిహార్ సీఎం)
- అమరేందర్ సింగ్ (పంజాబ్ సీఎం)
- వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(ఆంధ్రప్రదేశ్ సీఎం)
- శర్బానంద్ సోనోవాల్ (అసోం సీఎం)
- విజయ్ రూపాణీ (గుజరాత్ సీఎం)
- దేవేంద్ర ఫడ్నవిస్ (మహారాష్ట్ర సీఎం)
- యోగి ఆదిత్యనాథ్ (ఉత్తర ప్రదేశ్ సీఎం)
- నిర్మలా సీతారామన్ (కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి)
- నరేంద్ర సింగ్ తోమర్ (కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ మంత్రి)
- తావర్ చంద్ గెహ్లోత్ (కేంద్ర సామజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి)
- గజేంద్రసింగ్ షెకావత్ (కేంద్ర జలశక్తి శాఖ మంత్రి)
ఏమిటి : అంతర్రాష్ట్ర మండలి స్టాండింగ్ కమిటీలో చోటు
ఎప్పుడు : ఆగస్టు 16
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
అత్తివరదరాజస్వామి ఉత్సవాలు ముగింపు
తమిళనాడులోని కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయంలో నిర్వహించిన అత్తివరదరాజస్వామి ఉత్సవాలు ఆగస్టు 17న ముగిశాయి. ఆగస్టు 17న రాత్రి పది గంటల సమయంలో వరదరాజస్వామి అనంత సరస్సులోకి ప్రవేశించారు. 2019, జూలై 1న అత్తివరదర్ ఉత్సవాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. 40 సంవత్సరాలకు ఒక్కసారి 48 రోజులపాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అత్తివరదరాజస్వామి ఉత్సవాలు ముగింపు
ఎప్పుడు : ఆగస్టు 17
ఎక్కడ : వరదరాజ పెరుమాళ్ ఆలయం, కాంచీపురం, తమిళనాడు
సీఏపీఎఫ్ పదవీ విరమణ వయసు పెంపు
అన్ని రకాల కేంద్ర సాయుధ పోలీసు బలగాల(సీఏపీఎఫ్) పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 19న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్ పోలీస్ ఫోర్స్, సహస్త్ర సీమా బల్ అధికారులు ఇకపై 57 ఏళ్లకు బదులుగా 60 ఏళ్లకు పదవీ విరమణ చేయనున్నారు. ఈ నాలుగు బలగాల్లో కానిస్టేబుల్ నుంచి కమాండెంట్ (సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సమాన హోదా) స్థాయి అధికారుల పదవీ విరమణ వయసు ప్రస్తుతం 57 ఏళ్లుగా ఉంది.
అన్ని కేంద్ర బలగాలకూ ఒకే రిటైర్మెంట్ వయసు ఉండేట్లు చూడాలని ఢిల్లీ హైకోర్టు ఇటీవల ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీఏపీఎఫ్ పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంపు
ఎప్పుడు : ఆగస్టు 19
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
సరళ్ ర్యాంకులలో కర్ణాటకకు అగ్రస్థానం
కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ ఆగస్టు 21న విడుదల చేసిన స్టేట్ రూఫ్‌టాప్ అట్రాక్టివ్‌నెస్ ఇండెక్స్ (సరళ్) ర్యాంకులలో కర్ణాటక రాష్ట్రం 78.8 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ ర్యాంకులలో 72.2 స్కోరుతో తెలంగాణ రెండో స్థానంలో నిలవగా, 66.1 స్కోరుతో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానం దక్కించుకుంది. రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను ఆకర్షించడంలో రాష్ట్రాలకున్న అవకాశాలను మదించి ఈ ర్యాంకులను రూపొందించారు.
సోలార్ రూఫ్‌టాప్ ప్రాజెక్టుల అమలుకు సంబంధించి వినియోగదారుల అనుభవం విషయంలో తెలంగాణ అగ్రస్థానం సాధించిందని టీఎస్‌ఎస్పీడీసీఎల్ యాజమాన్యం తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్టేట్ రూఫ్‌టాప్ అట్రాక్టివ్‌నెస్ ఇండెక్స్ (సరళ్) ర్యాంకులలో అగ్రస్థానం
ఎప్పుడు : ఆగస్టు 21
ఎవరు : కర్ణాటక
జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
ప్రధాని మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
- జమ్మూకశ్మీర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. శాంతియుత, సురక్షిత, సమృద్ధ కశ్మీర్ తమ లక్ష్యం.
- స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. కళ, క్రీడ, సాంస్కృతిక రంగాల్లో వారి నైపుణ్యాలకు అంతర్జాతీయ ఖ్యాతి కల్పిస్తాం.
- కశ్మీర్‌ను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ వల్ల రాష్ట్రానికి గానీ, రాష్ట్ర ప్రజలకు గానీ ఎలాంటి ప్రయోజనం కలగలేదు. ఉగ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని రాష్ట్రంలో విస్తరించేందుకు పాకిస్తాన్‌కు మాత్రం ఈ నిబంధనలు బాగా ఉపయోగపడ్డాయి.
- కశ్మీర్‌లో గత 3 దశాబ్దాల్లోనే అమాయకులైన 42 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీర్‌లో కొత్త యుగం ప్రారంభమైంది. దీంతో జనసంఘ్ వ్యవస్థాపక నేత శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్, మాజీ ప్రధాని వాజ్‌పేయి, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ల స్వప్నం సాకారమైంది.
- జమ్మూకశ్మీర్ భారత దేశ శిరస్సు, ఈ ప్రాంతాభివృద్ధి మనందరి బాధ్యత.
- జమ్మూకశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగించబోము. కొన్నాళ్ల తరువాత రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తాం.
- కశ్మీరీల ఆశలు, ఆకాంక్షలు, స్వప్నాలను సాకారం చేసేందుకు అంతా కలసిరావాలి.
- కశ్మీర్‌లో షూటింగ్‌లు చేయడమే కాకుండా, స్టూడియోలు, థియేటర్లు నిర్మించాలని బాలీవుడ్, తెలుగు, తమిళ, ఇతర సినీ పరిశ్రమల వారికి విజ్ఞప్తి చేస్తున్నా. తద్వారా స్థానికులకు ఉపాధి లభిస్తుంది.
- లదాఖ్‌కే ప్రత్యేకమైన సేంద్రియ ఉత్పత్తులు, ఔషధ మొక్కలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించేలా చేస్తాం.
- కశ్మీర్ సహా దేశవ్యాప్తంగా అన్ని చట్టాలు అమలవుతాయి. 1.5 కోట్ల రాష్ట్ర ప్రజలకు ఆ ప్రయోజనాలు అందుతాయి.
- ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఉద్యోగులు, పోలీసులకు లభిస్తున్న సౌకర్యాలు జమ్మూకశ్మీర్‌లోని ఉద్యోగులకూ కూడా లభిస్తాయి.
- ఐఐటీ, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక సంస్థలను ఏర్పాటు చేస్తాం.
- జమ్మూకశ్మీర్‌లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. కొత్త ప్రభుత్వం ఏర్పడాలి.ఇకపై ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయి. వంశ పాలనకు ఇక చరమగీతమే. మీ(స్థానికుల) నుంచే ప్రజా ప్రతినిధులు వస్తారు.
- 1947 తరువాత పాక్ నుంచి ఇక్కడికి వలస వచ్చినవారు ఇన్నాళ్లూ ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. ఇకపై వారికి ఆ అవకాశం లభిస్తుంది.
- క్రీడల్లో ఆసక్తి, అభినివేశం ఉన్న యువత కోసం శిక్షణ కేంద్రాల ఏర్పాటు, స్పోర్‌ట్స అకాడమీల ఏర్పాటు ఉంటుంది. స్థానిక యువత క్రీడానైపుణ్యాలు ఆదరణ పొందాలి.
- చేతి కళలు, వృత్తి నైపుణ్యాల ఆధారంగా స్థానికులకు ఉపాధి అవకాశం లభిస్తుంది. ఇక్కడి కళాకృతులు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అయ్యేలా కృషి చేయాలి.
- రాష్ట్రంలో పంచాయతీ వ్యవస్థ అద్భుతంగా ఉంది. పంచాయతీ సభ్యులు, ముఖ్యంగా మహిళలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. వారికి కేంద్రం నుంచి ఇకపై మరింత మద్దతు లభిస్తుంది. నిధులు అందుతాయి.
జాతీయ మెడికల్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
జాతీయ మెడికల్ బిల్లు-2019కు రాష్ట్రపతి ఆమోదం తెలిపారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఆగస్టు 8న తెలిపారు. ఈ బిల్లుకు సంబంధించి త్వరలోనే గెజిట్ వెలువడుతుందని, ఆ తర్వాత ఎన్‌ఎంసీ బిల్లుకు సంబంధించిన నియమ నిబంధనలను రూపొందిస్తారని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ అంతా ఆర్నెల్లలోపులోనే ముగుస్తుందని చెప్పారు. విద్యార్థుల భారాన్ని, వైద్య విద్య ఖర్చులను తగ్గించేదిగాను, వారికి నాణ్యమైన వైద్య విద్యను అందించేలా తద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా ఈ ఎన్‌ఎంసీ బిల్లు రూపొందించామన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ మెడికల్ బిల్లు-2019కు ఆమోదం
ఎప్పుడు : ఆగ స్టు 8
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
జమ్మూకశ్మీర్ పునర్వ్యస్థీకరణ బిల్లుకు ఆమోదం
జమ్మూ కశ్మీర్‌ను రెండుగా విభజించి, కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చే ‘జమ్మూ కశ్మీర్ పునర్వ్యస్థీకరణ బిల్లు-2019’కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆగస్టు 9న ఆమోదం తెలిపారు. దీంతో ఇప్పటికే పార్లమెంటులో పాసయిన ఈ బిల్లు ఇప్పుడు చట్టంగా మారింది. ఈ చట్టం భారత తొలి ఉపప్రధాని, తొలి హోం మంత్రి సర్దార్ పటేల్ జయంతి రోజైన అక్టోబర్ 31 నుంచి అమలవుతుందని కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్ జారీ చే సింది. దీంతో 2019, అక్టోబర్ 31 నుంచి జమ్మూ కశ్మీర్, లదాఖ్‌లు కేంద్రపాలిత ప్రాంతాలు(యూటీ)గా అవతరించనున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జమ్మూ కశ్మీర్ పునర్వ్యస్థీకరణ బిల్లు-2019కు ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
కిసాన్ మాన్-ధన్ యోజన ప్రారంభం
కేంద్ర ప్రభుత్వం 2019-20 బడ్జెట్‌లో ప్రకటించిన ప్రధాన మంత్రి కిసాన్ మాన్-ధన్ యోజన (పీఎం-కేఎంవై)కు పేర్ల నమోదు ఆగస్టు 9న ప్రారంభమైంది. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ... జమ్మూకశ్మీర్, లదాఖ్ సహా దేశ వ్యాప్తంగా అర్హులైన రైతులందరికీ ఈ పథకం వర్తిస్తుందన్నారు.
మంత్రి తెలిపిన వివరాల ప్రకారం...
- పీఎం-కేఎంవైలో చేరిన రైతులకు 60 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత నెలకు రూ.3వేల చొప్పున పింఛను లభిస్తుంది.
- అయిదు ఎకరాలు (రెండు హెక్టార్ల) లోపు భూమి కలిగిన రైతులు పీఎం-కేఎంవైకు అర్హులు.
- సభ్యులుగా చేరేవారి వయస్సు ప్రాతిపదికగా నెలకు రూ.55 నుంచి 200 వరకు చెల్లించాల్సి ఉంటుంది.
- కామన్ సర్వీస్ కేంద్రాల్లో ప్రాథమికంగా పేర్లను నమోదు చేసుకునేందుకు అయ్యే రూ.30 వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది.
- ప్రతి సభ్యుడు చెల్లించే మొత్తానికి సమాన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం పింఛను పథకానికి జమ చేస్తుంది.
- 60 ఏళ్లు వచ్చిన తర్వాత ప్రతినెలా రూ.3వేల చొప్పున పింఛను వస్తుంది.
- పథకంలో చేరిన తర్వాత కనీసం అయిదేళ్ల వరకూ క్రమం తప్పకుండా నెలవారీ విరాళాన్ని చెల్లించాలి.
ఏమిటి : ప్రధాన మంత్రి కిసాన్ మాన్-ధన్ యోజన (పీఎం-కేఎంవై) ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 9
ఎందుకు : రైతులకు 60 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత నెలకు రూ.3వేల చొప్పున పింఛను అందించేందుకు
గిన్నిస్ రికార్డ్స్‌లో యూపీ ప్రభుత్వ కార్యక్రమం
క్విట్ ఇండియా ఉద్యమం జరిగి 77 ఏళ్లయిన సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 9న నిర్వహించిన మొక్కల పంపిణీ కార్యక్రమంకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు లభించింది. ఈ గిన్నిస్ రికార్డు పత్రాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు గిన్నిస్ అధికారులు అందజే శారు. మొక్కల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఏకకాలంలో 66వేల మొక్కలను యూపీ ప్రభుత్వం పంపిణీ చేసింది.
ఇన్‌క్రెడిబుల్ ఇండియాకు వైల్డ్ లైఫ్ థీమ్
అంతర్జాతీయంగా పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో భారత ప్రభు త్వం ఏర్పాటుచేసిన ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా ’ కార్యక్రమానికి ‘వైల్డ్ లైఫ్’ను ఇతివృత్తంగా ఎంచుకోనున్నట్లు కేంద్ర పర్యాటక మంత్రి ప్లహాద్ పటేల్ ఆగస్టు 11న వెల్లడించారు. డిస్కవరీ చానల్‌లో ప్రసారమయ్యే ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ కార్యక్రమంలో ఇటీవల ప్రధాని మోదీ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం 180కి పైగా దేశాల్లో ఆగస్టు 12న ప్రసారం కానుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇన్‌క్రెడిబుల్ ఇండియాకు ఇతివృత్తంగా వైల్డ్ లైఫ్ ఎంపిక
ఎప్పుడు : ఆగస్టు 11
ఎవరు : కేంద్ర పర్యాటక మంత్రి ప్లహాద్ పటేల్
లిజనింగ్ లెర్నింగ్ లీడింగ్ పుస్తకావిష్కరణ
భారత ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడి రెండేళ్ల పయనంలో సాగిన పర్యటనలు, సందేశాలు, ఉపదేశాలు, కార్యక్రమాలతో కూడిన ‘లిజనింగ్ లెర్నింగ్ లీడింగ్’ పుస్తకావిష్కరణ ఆగస్టు 11న తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగింది. సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ నేతృత్వంలో రూపొందించిన ఈ పుస్తకాన్ని హోం మంత్రి అమిత్‌షా ఆవిష్కరించారు. తొలి ప్రతిని వెంకయ్య అందుకున్నారు. ఈ సందర్భంగా ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని అమిత్ షా ప్రస్తావిస్తూ జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించి వేస్తామని స్పష్టం చేశారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్, సీఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, ప్రముఖ నటుడు రజనీకాంత్ పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : లిజనింగ్ లెర్నింగ్ లీడింగ్ పుస్తకావిష్కరణ
ఎప్పుడు : ఆగస్టు 11
ఎవరు : కేంద్ర హోం మంత్రి అమిత్‌షా
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
బయోడీజిల్ పథకం ప్రారంభం
వాడేసిన వంటనూనె నుంచి ఉత్పత్తి చేసిన బయోడీజిల్‌ను కొనుగోలు చేసే బయోడీజిల్ కొనుగోలు పథకాన్ని ప్రభుత్వరంగ ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ప్రారంభించాయి. ప్రపంచ బయోడీజిల్ దినోత్సవ సందర్భంగా పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఆగస్టు 10న అధికారికంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ బయోడీజిల్ పథకం కింద... 100 పట్టణాల్లో వినియోగించిన మిగిలిన వంట నూనె నుంచి బయోడీజిల్ ఉత్పత్తి చేసే ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి కలిగిన వారి నుంచి దరఖాస్తులను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఆహ్వానించనున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బయోడీజిల్ కొనుగోలు పథకం ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు : కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రదాన్
కర్ణాటకలో అమిత్ షా ఏరియల్ సర్వే
కర్ణాటక, మహారాష్ట్రల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆగస్టు 11న ఏరియల్ సర్వే నిర్వహించారు. కర్ణాటక సీఎం యడియూరప్పతో కలిసి బెళగావి, బాగల్‌కోటే, ఇతర వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా స్పందిస్తూ.. ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయన్నారు.
వరదల కారణంగా 201 మంది మృతి
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. వరదలు, కొండచరియలు, గోడలు విరిగిపడటం తదితర కారణాలతో ఆగస్టు 11నాటికి కేరళలో 72 మంది చనిపోగా, మధ్యప్రదేశ్‌లో 32 మంది మహారాష్ట్రలో 35 మంది, గుజరాత్‌లో 31 మంది, కర్ణాటకలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 201కు చేరుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏరియల్ సర్వే
ఎప్పుడు : ఆగస్టు 11
ఎక్కడ : కర్ణాటక, మహారాష్ట్రల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో
ఏడు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు జరిమానా
మానవ హక్కుల కోసం ప్రత్యేకంగా కోర్టులను ఏర్పాటు చేసే అంశం గురించి నివేదిక ఇవ్వడంలో విఫలమయ్యాయంటూ ఏడు రాష్ట్రాలకు వేర్వేరుగా రూ.లక్ష వరకూ సుప్రీంకోర్టు జరిమానా విధించింది. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాల్సిందిగా 2018 ఏడాదిలో సూచించినప్పటికీ ఏర్పాటు చేయకపోవడం వల్లే జరిమానా విధించినట్లు జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ బీఆర్ దవైల ధర్మాసనం తెలిపింది. ఈ కేసు ఆగస్టు 13న వాదనలకు రాగా కనీసం తమ రాష్ట్రాల తరపున లాయర్లు కూడా హాజరుకాకపోవడంతో రాజస్తాన్. ఉత్తరాఖండ్‌లకు లక్ష జరిమానా విధించింది. తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఒడిశా, మేఘాలయ, మిజోరాంలకు రూ.50 వేల చొప్పున పెనాల్టీ విధించింది.
మానవ హక్కుల చట్టం 1993 ప్రకారం ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక లాయర్‌ను నియమించాలని 2018లో సుప్రీం సూచించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏడు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు జరిమానా
ఎప్పుడు : ఆగస్టు 13
ఎవరు : రాజస్తాన్. ఉత్తరాఖండ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఒడిశా, మేఘాలయ, మిజోరాం
ఎందుకు : మానవ హక్కుల కోసం ప్రత్యేకంగా కోర్టులను ఏర్పాటు చేసే అంశం గురించి నివేదిక ఇవ్వడంలో విఫలమైనందుకు
స్వాతంత్య్ర దినోత్సవ వీడియో విడుదల
73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘వతన్’ పేరుతో రూపొందించిన వీడియో సంగీతాన్ని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఢిల్లీలో ఆగస్టు 13న విడుదల చేశారు. దూరదర్శన్, ప్రసార భారతి సంయుక్తంగా రూపొందించిన ఈ వీడియో దేశభక్తిని రగిలిస్తుందని జవదేకర్ పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవానికి మరింత వన్నె తెస్తుందన్నారు. సాయుధ దళాల గౌరవార్థం, అమరవీరులకు నివాళిగా వతన్‌ను రూపొందించినట్లు దూరదర్శన్, ప్రసార భారతి పేర్కొన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్వాతంత్య్ర దినోత్సవ వీడియో వతన్ విడుదల
ఎప్పుడు : ఆగస్టు 13
ఎవరు : కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్
ఎక్కడ : ఢిల్లీ
జమ్మూకశ్మీర్‌లో పెట్టుబడిదారుల సదస్సు
జమ్మూకశ్మీర్‌లో పెట్టుబడులు పెట్టేలా పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు శ్రీనగర్‌లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించనున్నట్లు జమ్మూక శ్మీర్ అధికార యంత్రాంగం ఆగస్టు 13న తెలిపింది. 2019, అక్టోబర్ 12 నుంచి మూడు రోజులపాటు ఈ సదస్సు జరగనుందని వెల్లడించింది. సదస్సుకు సంబంధించి దేశంలోని ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో చేపట్టనున్న రోడ్డు షోలను త్వరలో గవర్నర్ ప్రారంభిస్తారని పరిశ్రమల ముఖ్య కార్యదర్శి నవీన్ చౌధురి తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అక్టోబర్ 12 నుంచి పెట్టుబడిదారుల సదస్సు
ఎప్పుడు : ఆగస్టు 13
ఎవరు : జమ్మూకశ్మీర్ పరిశ్రమల ముఖ్య కార్యదర్శి నవీన్ చౌధురి
ఎక్కడ : శ్రీనగర్, జమ్మూకశ్మీర్
వైద్యుల రక్షణకు ముసాయిదా రూపకల్పన
విధుల్లో ఉన్న వైద్యులు, ఆరోగ్య నిపుణులపై దాడి చేసే వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష పడేందుకు వీలు కల్పించే బిల్లు ముసాయిదాను రూపొందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ ఆగస్టు 13న తెలిపారు.
ఈ ముసాయిదా ప్రకారం...
- వెద్యులు, వైద్యసేవా నిపుణులను తీవ్రంగా గాయపరిచిన వారికి మూడు నుంచి పదేళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు జరిమానా విధించవచ్చు.
- ఆస్పత్రిపై దాడి చేసి నష్టం కలిగించిన వారికి ఆరు నెలల నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ.50వేల నుంచి 5లక్షల వరకు జరిమానా విధించవచ్చు.
ఏమిటి : వైద్యుల రక్షణకు ముసాయిదా రూపకల్పన
ఎప్పుడు : ఆగస్టు 13
ఎవరు : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్
ఎందుకు : విధుల్లో ఉన్న వైద్యులు, ఆరోగ్య నిపుణులపై దాడి చేసే వారికి జైలు శిక్ష పడేందుకు
స్వచ్ఛ్ సర్వేక్షణ్ గ్రామీణ్ ప్రారంభం
దేశాన్ని ఓడీఎఫ్‌గా మార్చే ప్రక్రియలో భాగంగా ‘స్వచ్ఛ్ సర్వేక్షణ్ గ్రామీణ్-2019’ను కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ ఆగస్టు 14న న్యూఢిల్లీలో ప్రారంభించారు. దేశంలోని సుమారు 700 జిల్లాల్లోని 17వేల గ్రామాల్లో ఈ సర్వేను నిర్వహించనున్నారు. ఈ సర్వే ద్వారా ఘన వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై దృష్టి సారించనున్నారు. స్వచ్ఛ్ సర్వేక్షణ్ గ్రామీణ్ ద్వారా గ్రామాలను బహిరంగ మల విసర్జన రహితంగా (ఓడీఎఫ్‌గా) మార్చే దిశగా ముందడుగు వేశామని మంత్రి షేకావత్ తెలిపారు. 2018లో నిర్వహించిన మొదటి దఫా సర్వేను దేశవ్యాప్తంగా ఉన్న 6వేల గ్రామాల్లో నిర్వహించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సర్వేక్షణ్ గ్రామీణ్-2019 ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 14
ఎవరు : కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్రసింగ్ షేకావత్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : దేశాన్ని ఓడీఎఫ్‌గా మార్చే ప్రక్రియలో భాగంగా
ప్రధాని మోదీ నేతృత్వంలో అంతర్రాష్ట్ర మండలి
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అంతర్రాష్ట్ర మండలిని కేంద్ర ప్రభుత్వం మరోసారి ఏర్పాటుచేసింది. ఆరుగురు కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు/పాలనాధికారులు కూడా ఈ మండలిలో సభ్యులుగా ఉంటారు. మరో 10 మంది కేంద్ర మంత్రులు మండలిలో శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. రాజ్యాంగంలోని 263వ అధికరణం ప్రకారం అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేస్తారు. రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలపై విచారణ జరిపి, సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత అంతర్రాష్ట్ర మండలికి ఉంటుంది. అంతర్రాష్ట్ర మండలి స్థాయీ సంఘాన్ని కూడా కేంద్రం మరోసారి ఏర్పాటు చేసింది.
పళని పంచామృతానికి జీఐ గుర్తింపు
తమిళనాడులో ప్రసిద్ధి చెందిన పళని పంచామృతానికి జీఐ గుర్తింపు లభించింది. ఈ విషయాన్ని జియోగ్రాఫిక్ ఇండెక్షన్ డిప్యూటీ రిజిస్ట్రార్ చిన్న రాజ్ ఆగస్టు 14న వెల్లడించారు. తమిళనాడులోని దిండుగల్ జిల్లా పళనిలో ఉన్న దండాయుధపాణి స్వామి(సుబ్రహ్మణ్యస్వామి) ఆలయంలో పళని పంచామృతాన్ని తయారుచేస్తారు. సహజ సిద్ధంగా ఐదు రకాల వస్తువులతో ఈ ప్రసాదం తయారు చేస్తారు. అరటి, బెల్లం, ఆవు నెయి్య, స్వచ్ఛమైన తేనె, కర్జూరం వంటి వాటితో సిద్ధం చేస్తున్న ఈ పంచామృతం కొనుగోలుకు భక్తులు బారులు తీరుతుంటారు. పళని అంటే పంచామృతం అని అర్థం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పళని పంచామృతానికి జీఐ గుర్తింపు
ఎప్పుడు : ఆగస్టు 14
ఎవరు : జియోగ్రాఫిక్ ఇండెక్షన్ డిప్యూటీ రిజిస్ట్రార్ చిన్న రాజ్
ఎక్కడ : దండాయుధపాణి స్వామి ఆలయం, పళని, దిండుగల్, తమిళనాడు
కమాండోస్ ఫర్ రైల్వే సేఫ్టీ ప్రారంభం
రైళ్ల భద్రత కోసం కమాండోస్ ఫర్ రైల్వే సేఫ్టీ (కోరాస్) యూనిట్‌ను కేంద్ర రైల్వే, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆగస్టు 14న ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కోరాస్ కమెండోలకు అంతర్జాతీయ శిక్షణ ఇవ్వాల్సిందిగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్)కు సూచించినట్లు తెలిపారు. కోరాస్ యూనిట్‌ను మొదట ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో మోహరించనున్నట్లు వెల్లడించారు. కశ్మీర్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలు, తీవ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా ఉండే ఛత్తీస్‌గఢ్, ఒడిశా, బెంగాల్, జార్ఖండ్, బిహార్ రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కమాండోలు భవిష్యత్‌లో సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కమాండోస్ ఫర్ రైల్వే సేఫ్టీ (కోరాస్) యూనిట్ ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 14
ఎవరు : కేంద్ర రైల్వే, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : రైళ్ల భద్రత కోసం
జాతినుద్దేశించి రాష్ట్రపతి కోవింద్ ప్రసంగం
73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆగస్టు 14న జాతినుద్దేశించి ప్రసంగించారు. రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేయడం, జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టడం వల్ల ఆ రాష్ట్ర ప్రజలు అత్యంత భారీ ప్రయోజనాలను పొందుతారని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు. మిగతా దేశ పౌరులంతా ఏయే హక్కులు, ప్రయోజనాలు, సౌకర్యాలను పొందుతున్నారో.. ఆ లాభాలను ఇకపై జమ్మూ కశ్మీర్, లదాఖ్ ప్రజలు కూడా పొందగలన్నారు. తక్షణ ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ ఇటీవలే పార్లమెంటు ఆమోదం పొందిన చట్టం తదితరాలు జమ్మూ కశ్మీర్‌లోని ఆడబిడ్డలకు కూడా న్యాయం అందిస్తాయన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతినుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగం
ఎప్పుడు : ఆగస్టు 14
ఎందుకు : 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా
సమర్థ్ పథకం కింద 16 రాష్ట్రాలతో ఒప్పందం
యువత, మహిళలకు శిక్షణనిచ్చి వారి సామర్థ్యాలు పెంపొందించి జౌళి రంగంలో ఉపాధి కల్పించేందుకు సమర్థ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 16 రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ నే తృత్వంలో ఢిల్లీలో ఆగస్టు 14న నిర్వహించిన సదస్సులో ఈ ఒప్పందం జరిగింది. జౌళి రంగంలో వివిధ విభాగాల్లో 2020నాటికి 10 లక్షల మందిని నిపుణులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంగా ఈ ఒప్పందం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు కూడా ఈ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ 12 వేల మందికి, తెలంగాణ 1440 మందికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సమర్థ్ పథకం కింద 16 రాష్ట్రాలతో ఒప్పందం
ఎప్పుడు : ఆగస్టు 14
ఎవరు : కేంద్రప్రభుత్వం
ఎందుకు : యువత, మహిళలకు శిక్షణనిచ్చి వారి సామర్థ్యాలు పెంపొందించి జౌళి రంగంలో ఉపాధి కల్పించేందుకు
దివాలా స్మృతి బిల్లుకు లోక్‌సభ ఆమోదం
బిల్లులోని ప్రతిపాదనలు
- ఐబీసీ పరిధిలోకి వచ్చిన కేసులను 330 రోజుల్లోగా పరిష్కరించాలి.
- కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్‌పీ) ప్రారంభమైన తర్వాత 330 రోజుల్లోగా కేసు పూర్తి కావాలి.
- రుణ పరిష్కార ప్రణాళిక ఒకసారి ఆమోదం పొందిన తర్వాత కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వివిధ అధికారిక సంస్థలు కూడా దానికి కట్టుబడి ఉండాలి.
- ఈ బిల్లు ద్వారా గృహ కొనుగోలుదారులకు మరిన్ని హక్కులు సంక్రమించనున్నాయి.
ఏమిటి : దివాలా స్మృతి సవరణల బిల్లు (2019)కి ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : లోక్‌సభ
మెడికల్ కమిషన్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత వైద్య మండలి(ఎంసీఐ) స్థానంలో జాతీయ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ)ను ఏర్పాటు చేసే బిల్లుకు రాజ్యసభ ఆగస్టు 1న ఆమోదం తెలిపింది. ‘ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం 1956’కు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన ఈ బిల్లును మూజువాణి ఓటుతో రాజ్యసభ ఆమోదించింది. లోక్‌సభలో ఇప్పటికే ఈ బిల్లు ఆమోదం పొందినప్పటికీ.. తాజాగా రెండు సవరణలకు లోక్‌సభ ఆమోదం తెలపాల్సి ఉన్న నేపథ్యంలో మరోసారి ఈ బిల్లు లోక్‌సభకు వెళ్లనుంది.
తాజా బిల్లు ద్వారా వైద్య విద్యారంగంలో పారదర్శకత ఏర్పడుతుందనీ, అనవసరమైన తనిఖీల ప్రహసనం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దేశవ్యాప్తంగా వైద్యవిద్యలో ఏకీకృత విధానాలను తీసుకొచ్చేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది.
బిల్లులోని ముఖ్యాంశాలు
- ఇప్పటివరకు అమల్లో ఉన్న ఎంసీఐకి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. వందమందికిపైగా సభ్యులు ఉండే ఇందులో 70 శాతం మందిని ఎన్నుకుంటారు. ఇక కొత్తగా వచ్చిన ఎన్‌ఎంసీలో 25 మందే సభ్యులుగా ఉంటారు. వారిలో అత్యధికుల్ని కేంద్రమే నామినేట్ చేస్తుంది.
- కేంద్రం నియమించిన ఏడుగురు సభ్యులతో కూడిన సెర్చ్ కమిటీ ఎన్‌ఎంసీ చైర్ పర్సన్ పేరుని, తాత్కాలిక సభ్యుల పేర్లను సిఫారసు చేస్తుంది.
- కొత్త కమిషన్‌లో 8 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల్లో నలుగురు వైద్య విద్యకు సంబంధించిన వివిధ బోర్డుల అధ్యక్షులు ఉంటారు. మరో ముగ్గురిని ఆరోగ్యం, ఫా ర్మా, హెచ్‌ఆర్‌డీ శాఖలే సిఫారసు చేస్తాయి.
- ఎంసీఐ సమావేశం కావాలంటే వందమందికిపైగా ఉన్న సభ్యుల్లో 15 మంది హాజరైతే సరిపోయేది. వారు తీసుకున్న నిర్ణయాలు చెల్లుబాటు అయ్యేవి. జాతీయ వైద్య కమిషన్‌కు సంబంధించి 25 మందిలో 13 మంది హాజరైతేనే కీలక నిర్ణయాలు తీసుకోగలరు.
- ఎన్‌ఎంసీ సభ్యులందరూ విధిగా తమ ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించాలి.
- ఎంసీఐ కాలపరిమితి అయిదేళ్లయితే ఎన్‌ఎంసీ కాలపరిమితి నాలుగేళ్లు. తాత్కాలిక సభ్యులు రెండేళ్లకి ఒకసారి మారతారు.
- కమిషన్ చైర్మన్‌ను, అందులో సభ్యుల్ని తొలగించే అధికారం పూర్తిగా కేంద్రానిదే.
- ఎంబీబీఎస్, మెడికల్ పీజీకి సంబంధించి అన్ని ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిట్లీ 50 శాతం సీట్లలో ఫీజుల నియంత్రణ కమిషన్ చేతుల్లోనే ఉంటుంది.
- దేశంలోని హోమియో, యునాని, ఆయుర్వేదం కోర్సులు చదివిన వారు కూడా ఒక బ్రిడ్‌జ కోర్సు ద్వారా అల్లోపతి వైద్యాన్ని చేయవచ్చు.
- వైద్య విద్యలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి, మెడికల్ ప్రాక్టీస్ అనుమతికి సంబంధించి ఎంబీబీఎస్ చివరి ఏడాది నిర్వహించే పరీక్షనే అర్హతగా పరిగణిస్తారు. దీనిని నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్ట్స్) పేరుతో నిర్వహిస్తారు. విదేశాల్లో వైద్యవిద్య అభ్యసించిన విద్యార్థులు భారత్‌లో ప్రాక్టీస్ చేయాలంటే స్క్రీనింగ్ టెస్ట్‌కి హాజరుకావాలి. ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో వైద్యవిద్యనభ్యసించాలంటే ఇకపై నీట్‌తో పాటు గా నెక్ట్స్ పరీక్ష కూడా రాయాల్సి ఉంటుంది.
ఏమిటి : జాతీయ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : రాజ్యసభ
ఎందుకు : భారత వైద్య మండలి(ఎంసీఐ) స్థానంలో ఎన్‌ఎంసీను ఏర్పాటు చేసేందుకు
పోక్సో బిల్లుకు పార్లమెంటు ఆమోదం
‘లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ (పోక్సో) (సవరణ) బిల్లు-2019’ని పార్లమెంటు ఆగస్టు 1న ఆమోదించింది. ఈ బిల్లును రాజ్యసభ జూలై 29నే ఆమోదించగా, లోక్‌సభలో బిల్లు ఆగస్టు 1న పాసయ్యింది. మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ ఈ బిల్లును ఆమోదం కోసం ప్రవేశపెడుతూ చిన్నారులపై నేరాలను లింగభేదం లేకుండా ఒకేలా చూసేందుకు ఈ బిల్లును తెచ్చామన్నారు. దేశంలో 43 కోట్ల మంది చిన్నారులు ఉన్నారనీ, లింగభేదం లేకుండా వారందరికీ న్యాయపరంగా అదనపు భద్రతను ఈ బిల్లు కల్పిస్తుందని తెలిపారు.
బిల్లులోని ముఖ్యాంశాలు...
- చిన్నారులపై లైంగిక దాడులకు సంబంధించి అత్యంత అరుదైన కేసుల్లో దోషులకు మరణ శిక్ష విధించవచ్చు
- చిన్నారులతో నీలి చిత్రాలు’ (చైల్డ్ పోర్నోగ్రఫీ)కి ఈ బిల్లులో నిర్వచనం కూడా చేర్చి, మరిన్ని ఎక్కువ దుశ్చర్యలను నేరం కిందకు వచ్చేలా చేశారు.
- చిన్నారులపై అత్యాచారాలతోపాటు మైనర్లపై లైంగికదాడులకు పాల్పడే వారినీ కఠినంగా శిక్షించవచ్చు.
- పోక్సో చట్టంలోని 2,4,5,6,9,14,15,34,42,45 సెక్షన్లను సవరించారు.
ఏమిటి : లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ (పోక్సో) (సవరణ) బిల్లు-2019 ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : లోక్‌సభ
ప్రభుత్వ ప్రాజెక్టుగా ముంబై-పుణే హైపర్‌లూప్
ముంబై-పుణె మధ్య నిర్మించనున్న హైపర్‌లూప్‌ను ప్రభుత్వ మౌలిక వసతి ప్రాజెక్టుగా ప్రకటించే ప్రతిపాదనకు మహారాష్ట్ర మంత్రివర్గం ఆగస్టు 1న ఆమోదం తెలిపింది. దీంతో ఈ ప్రాజెక్టుకు అనుమతులు సత్వరంగా లభించనున్నాయి. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నుంచి పుణెలోకి వాకాడ్ వరకు నిర్మించే ఈ హైపర్‌లూప్ అందుబాటులోకి వస్తే, ముంబై-పుణె మధ్య 117.5 కి.మీ. దూరాన్ని కేవలం 23 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. రూ.70 వేల కోట్ల వ్యయంతో, రెండు దశల్లో ఈ ప్రాజెక్టును పుణె మహానగరాభివృద్ధి సంస్థ చేపడుతోంది. తొలి దశలో పుణె మహానగర పరిధిలోనే 11.8 కిలోమీటర్లపాటు హైపర్‌లూప్‌ను రూ. 5 వేల కోట్ల వ్యయంతో నిర్మించి, ప్రయోగాత్మకంగా పరీక్షిస్తారు. అంతా సవ్యంగా ఉంటే రెండో దశలో మిగతా దూరం మొత్తం హైపర్‌లూప్‌ను నిర్మిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రభుత్వ ప్రాజెక్టుగా ముంబై-పుణే హైపర్‌లూప్
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : మహారాష్ట్ర మంత్రివర్గం
యూపీ నుంచి ఢిల్లీకి ఉన్నావ్ కేసు బదిలీ
ఉన్నావ్ అత్యాచార ఘటనకు సంబంధించి నమోదైన మొత్తం ఐదు కేసులనూ ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీకి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ఆగస్టు 1న ఆదేశించింది. అలాగే బాధితురాలికి తక్షణమే రూ. 25 లక్షల తాత్కాలిక పరిహారం అందజేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని నిర్దేశించింది. జూలై 28న ఉన్నావ్ అత్యాచార బాధితురాలి కారును ట్రక్కు ఢీకొట్టిన ఘటనపై దర్యాప్తును వారం రోజుల్లోనే పూర్తి చేయాలని కూడా సీబీఐకి సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అలాగే ఉన్నావ్ అత్యాచర ఘటన ప్రధాన కేసు విచారణను ప్రారంభించిన నాటి నుంచి 45 రోజుల్లోపే పూర్తి చేయాలని కూడా సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ట్రిపుల్ తలాక్‌కు రాష్ట్రపతి ఆమోదం
ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణించే ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు-2019కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జూలై 31న ఆమోదం తెలిపారు. ఈ బిల్లును జూలై 25న లోక్‌సభ, 30న రాజ్యసభ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 21 నుంచి కొనసాగుతోన్న ఆర్డినెన్స్ స్థానంలో ఈ చట్టం అందుబాటులోకి రానుంది. ఇకపై ఫోన్, ఎస్సెమ్మెస్, వాట్సాప్ లేదా ఇతర ఏ మార్గంలో తలాక్ చెప్పినా అది నేరమే. ఈ చట్టం ప్రకారం తలాక్ చెల్లదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు-2019కు ఆమోదం
ఎప్పుడు : జూలై 31
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఢిల్లీలో కరెంట్ ఫ్రీ పథకం
ఢిల్లీలో నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగం ఉన్న ప్రజలు ఇకపై కరెంట్ బిల్లు చెల్లించాల్సిన పనిలేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆగస్టు 1న ప్రకటించారు. 201 నుంచి 400 యూనిట్ల వినియోగం ఉన్న వాళ్లు సగం విద్యుత్ బిల్లు చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. విద్యుత్ సబ్సిడీల కోసం ఢిల్లీ సర్కారు ఏటా రూ.2వేల కోట్లు భరించనుంది. 2020 ఏడాదిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టానికి ఆమోదం
చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (సవరణ)-2019 బిల్లు(ఉపా)కు రాజ్యసభ ఆగస్టు 2న ఆమోదం తెలిపింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం-1967 సవరిస్తూ ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు అనుకూలంగా 147 ఓట్లు, వ్యతిరేకంగా 42 ఓట్లు పడ్డాయి. ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే ఉగ్ర చర్యలతో సంబంధమున్న ఏ వ్యక్తిని అయినా సరే ఉగ్రవాదిగా ప్రకటించడంతోపాటు, అతని ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (సవరణ)-2019 బిల్లు(ఉపా)కు ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : రాజ్యసభ
జలియన్ వాలాబాగ్ బిల్లుకు ఆమోదం
జలియన్ వాలాబాగ్ నేషనల్ మెమోరియల్ చట్టం-1951 (సవరణ)బిల్లుకు లోక్‌సభ ఆగస్టు 2న మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం జలియన్ వాలాబాగ్ నేషనల్ మెమోరియల్ కమిటీలో కాంగ్రెస్ అధ్యక్షుడు ట్రస్టీగా ఉండేందుకు ఇకపై వీలుండదు. ప్రస్తుతం జలియన్ వాలాబాగ్ నేషనల్ మెమోరియల్ కమిటీలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు, పంజాబ్ ముఖ్యమంత్రి, పంజాబ్ గవర్నర్ సభ్యలుగా ఉన్నారు.
మరోవైపు దేశంతోపాటు విదేశాల్లో ఉగ్ర సంబంధ కేసులపైనా దర్యాప్తు చేపట్టే అధికారం ఎన్‌ఐఏకు ఇస్తూ కేంద్ర హోం శాఖ ఆగస్టు 2న ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం భారతీయులు, భారత్ ఆస్తులపై ఉగ్రదాడులు, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, ఆయుధాల రవాణా, తయారీ, దొంగనోట్లకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తు చేపట్టే అధికారం ఎన్‌ఐఏకు ఉంటుంది. ఇలాంటి కేసుల విచారణకు ఢిల్లీలో ప్రత్యేక కోర్టును కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జలియన్ వాలాబాగ్ నేషనల్ మెమోరియల్ చట్టం-1951 (సవరణ)బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : లోక్‌సభ
వేతన కోడ్‌కు రాజ్యసభ ఆమోదం
దేశ వ్యాప్తంగా వివిధ సంస్థల్లో పనిచేసే ప్రతి కార్మికుడికీ కనీస వేతనం అందించేందుకు వీలు కల్పించే వేతనాల కోడ్ -2019 బిల్లును రాజ్యసభ ఆగస్టు 2న ఆమోదించింది. సభలో ఈ బిల్లుకు అనుకూలంగా 85 మంది, వ్యతిరేకంగా 8 మంది ఓటేశారు. వేతనాలు, బోనస్‌లకు సంబంధించిన వివిధ నిబంధనలు, సమస్యలకు పరిష్కారం చూపుతూ ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది. ఈ బిల్లు చట్ట రూపం దాల్చితే దేశ వ్యాప్తంగా ఉన్న 50 కోట్ల మంది కార్మికులకు లాభం కలుగుతుందని కార్మిక మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ సభలో తెలిపారు.
కనీస వేతనాల చట్టం, వేతన చెల్లింపు చట్టం, బోనస్ చెల్లింపు చట్టం, సమాన ప్రతిఫలం చట్టం స్థానంలో వేతనాల కోడ్ -2019 అమల్లోకి రానుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కోడ్ -2019 బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : రాజ్యసభ
ఎందుకు : దేశ వ్యాప్తంగా వివిధ సంస్థల్లో పనిచేసే ప్రతి కార్మికుడికీ కనీస వేతనం అందించేందుకు
అయోధ్య కేసులో మధ్యవర్తిత్వం విఫలం
అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదా కేసులో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎఫ్‌ఎంఐ ఖలీఫుల్లా నేతృత్వంలోని త్రిసభ్య మధ్యవర్తిత్వ కమిటీ విఫలమైంది. ఈ మేరకు ఆగస్టు 2న సుప్రీంకోర్టుకు కమిటీ తన నివేదికను సమర్పించింది. క్లిష్టమైన అయోధ్య సమస్యకు హిందూ, ముస్లిం వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించడం లేదని నివేదికలో కమిటీ పేర్కొంది.
తామే విచారణ చేపడతాం...
రాజకీయంగా సున్నితమైన అయోధ్యకేసుకి మధ్యవర్తిత్వ కమిటీ పరిష్కారం చూపనందున ఇక ఈ కేసును తామే ప్రతి రోజూ విచారిస్తామని సుప్రీంకోర్టు ఆగస్టు 2న వెల్లడించింది. ఈ కేసుపై ఆగస్టు 6 నుంచి బహిరంగంగా విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తెలిపింది. జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్‌ఏ నజీర్‌లు ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు.
మధ్యవర్తిత్వం సాగిన తీరు...
- అయోధ్యలో వివాదంలో ఉన్న 2.77 ఎకరాల భూమిని నిర్మోహి అఖాడా, రామ్ లల్లా, సున్నీ వక్ఫ్ బోర్డ్‌లకు సమానంగా పంచుతూ 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది.
- ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 14 అప్పీళ్లు దాఖలయ్యాయి.
- వీటిని విచారించిన ధర్మాసనం మధ్యవర్తిత్వానికి ఒక అవకాశం ఇవ్వాలని భావించింది.
- 2019, మార్చి 8న జస్టిస్ ఎఫ్‌ఎంఐ ఖలీఫుల్లా నేతృత్వంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది, మధ్యవర్తిత్వంలో పేరొందిన శ్రీరామ్ పంచు సభ్యులుగా త్రిసభ్య మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేసింది.
- అయోధ్యకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని ఫైజాబాద్‌లో మధ్యవర్తిత్వ కార్యకలాపాలు నిర్వహించాలని, ఇవన్నీ రహస్యంగా జరగాలని కమిటీని కోర్టు ఆదేశించింది.
- ఎనిమిది వారాల్లో నివేదిక సమర్పించాలని సూచించింది.
- జులై 18 వరకు జరిగిన పురోగతిపై కమిటీ మధ్యంతర నివేదిక సమర్పించింది. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నివేదికలోని వివరాలన్నీ రహస్యంగానే ఉంటాయని స్పష్టం చేసింది.
- పరిష్కారం కనుగొనే దిశగా చర్చలు ఆశాజనకంగా సాగుతున్నాయనీ, మరికొంత సమయం కావాలని కమిటీ కోరడంతో, ఆగస్టు 15 వరకు కోర్టు గడువిచ్చింది.
- ఎలాంటి పరిష్కారం లభించకపోవడంతో ఆ విషయాన్ని పేర్కొంటూ కమిటీ ముందుగానే నివేదికను సమర్పించింది.
అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత
అమర్‌నాథ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ఆగస్టు 2న అనూహ్య ప్రకటన చేసింది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు అమర్‌నాథ్ యాత్ర లక్ష్యంగా దాడి చేసేందుకు ఆ దేశ ఆర్మీ సహాయంతో కుట్రలు పన్నుతున్నారని కచ్చితమైన సమాచారం వచ్చినట్లు భారత ఆర్మీ హెచ్చరించింది. యాత్ర సాగే మార్గాల్లో ఆయుధాలు, పేలుడు పదార్థాలను సైన్యం గుర్తించింది. దీంతో యాత్రికులు, పర్యాటకులు కశ్మీర్ నుంచి ఉన్నపళంగా వెనక్కు వెళ్లిపోవాలని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం సూచించింది. జూలై 1న మొదలైన అమర్‌నాథ్ యాత్ర ఆగస్టు 15న ముగియాల్సి ఉంది. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌లో గవర్నర్ పాలన నడుస్తుండటం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం
ఎందుకు : ఉగ్రదాడి జరిగే అవకాశం ఉండటంతో
కలాం తపాల స్టాంపులు ఆవిష్కరణ
హైదరాబాద్‌లోని భారత డైనమిక్ లిమిటెడ్ (బీడీఎల్)లో ఆగస్టు 2న నిర్వహించిన ఆ సంస్థ స్వర్ణ జయంతి ఉత్సవాల్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీడీఎల్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన మాజీ రాష్ట్రపతి, దివంగత నేత అబ్దుల్ కలాం విగ్రహంతోపాటుగా కలాం తపాల స్టాంపులు, మిస్సైల్ నమూనాలను మంత్రి ఆవిష్కరించారు. అలాగే ఇబ్రహీంపట్నంలోని జలనిధిని ఇక్కడ్నుంచే రిమోట్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. దేశంలో బీడీఎల్ అతి పెద్ద రక్షణ సంస్థ అని, అబ్దుల్ కలాం ప్రేరణతోనే ఈ రక్షణ సంస్థ సాధ్యమైందని వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అబ్దుల్ కలాం తపాల స్టాంపులు ఆవిష్కరణ
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
ఎక్కడ : భారత డైనమిక్ లిమిటెడ్ (బీడీఎల్), హైదరాబాద్
సరోగసీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
కమర్షియల్ సరోగసీ విధానాన్ని నిషేధించేందుకు రూపొందించిన ‘సరోగసీ (రెగ్యులేషన్) బిల్లు-2019’కి లోక్‌సభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటు ద్వారా ఆగస్టు 5న బిల్లు పాసైంది. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో చట్టబద్ధమైన సరోగసీ బోర్డులు ఏర్పాటు చేసేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది.
బిల్లులోని ముఖ్యాంశాలు..
- చట్టబద్ధంగా వివాహం జరిగి ఐదేళ్లు నిండిన భారతీయ దంపతులు మాత్రమే సరోగసీ ద్వారా పిల్లలను పొందేందుకు అర్హులు.
- సరోగసీ ద్వారా పిల్లలను పొందాలనుకునే దంపతులు తమ సమీప బంధువులు ద్వారా మాత్రమే పిల్లలను కనాలి.
- నిస్వార్థ సేవల ద్వారా బంధువుల సాయం తీసుకోవాలి.
- సరోగసీ ద్వారా పుట్టిన బిడ్డను.. సదరు బిడ్డ తల్లిదండ్రులు ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోకూడదు.
ఏమిటి : సరోగసీ (రెగ్యులేషన్) బిల్లు-2019కి ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : లోక్‌సభ
ఎందుకు : కమర్షియల్ సరోగసీ విధానాన్ని నిషేధించేందుకు
ట్రాన్స్ జెండర్స్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ట్రాన్స్ జెండర్స్‌కు ఆర్థిక, సామాజిక, విద్య విషయంలో సాధికారత కల్పించేందుకు ఉద్దేశించిన ‘ట్రాన్స్ జెండర్ పర్సన్స్ (హక్కుల రక్షణ) బిల్లు- 2019’ను లోక్‌సభ ఆగస్టు 5న మూజువాణి ఓటుతో ఆమోదించింది. దేశంలో ఉన్న 4.80 లక్షల మంది ట్రాన్స్ జెండర్ల హక్కులు కాపాడటానికి జాతీయ అథారిటీని ఏర్పాటు చేయడానికి ఈ బిల్లు ఉపకరిస్తుంది. మరోవైపు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 31(30+1) నుంచి 34(33+1)కు పెంచేందుకు సంబంధించిన బిల్లును కూడా లోక్‌సభ ఆమోదించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ట్రాన్స్ జెండర్ పర్సన్స్ (హక్కుల రక్షణ) బిల్లు- 2019కు ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : లోక్‌సభ
ఎందుకు : ట్రాన్స్ జెండర్స్‌కు ఆర్థిక, సామాజిక, విద్య విషయంలో సాధికారత కల్పించేందుకు
370వ అధికరణ రద్దుకు ఆమోదం
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేసే తీర్మానాన్ని, జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2019ను రాజ్యసభ ఆగస్టు 5న ఆమోదించింది. 370వ అధికరణాన్ని రద్దు చేయడం కోసం రాష్ట్రపతి సంతకంతో నోటిఫికేషన్ విడుదలైన అనంతరం హోం మంత్రి అమిత్ షా ఈ రెండు తీర్మానాలను సభలో ప్రవేశపెట్టారు. అలాగే జమ్మూకశ్మీర్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల బిల్లును సభ ముందుంచారు. తీర్మానం, రిజర్వేషన్ల బిల్లును మూజువాణి ఓటుతో రాజ్యసభ ఆమోదించింది. పునర్వ్యవస్థీకరణ బిల్లుపై మాత్రం ఓటింగ్ నిర్వహించగా అనుకూలంగా 125 ఓట్లు, వ్యతిరేకంగా 61 ఓట్లు వచ్చాయి.
జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2019 ప్రకారం జమ్ముకశ్మీర్‌ను అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా, లదాఖ్ ప్రాంతాన్ని అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 370వ అధికరణ రద్దుకు ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : రాజ్యసభ
దేశంలో అతిపెద్ద యూటీగా జమ్మూ కశ్మీర్
ఆర్టికల్ 370 రద్దుతో రాష్ట్రాల విభజన తర్వాత దేశంలో వైశాల్యపరంగా అతి పెద్ద కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ)గా జమ్మూకశ్మీర్ అవతరించనుంది. జమ్మూకశ్మీర్ తర్వాత లదాఖ్ రెండో స్థానంలో ఉండనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లు-2019 ప్రకారం జమ్ముకశ్మీర్‌ను అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా, లదాఖ్ ప్రాంతాన్ని అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేస్తారు. దీంతో దేశంలో యూటీల సంఖ్య తొమ్మిదికి పెరగనుంది. అదే సమయంలో రాష్ట్రాల సంఖ్య 28కి తగ్గనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో అతి పెద్ద కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ)
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : జమ్ముకశ్మీర్
ఆర్టికల్ 370 రద్దుకు పార్లమెంటు ఆమోదం
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేసే తీర్మానాన్ని, జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2019ను పార్లమెంటు ఆగస్టు 6న ఆమోదించింది. తీర్మానం, బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగస్టు 6న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. తీర్మానం ఆమోదంపై ఓటింగ్ నిర్వహించగా, అనుకూలంగా 351 ఓట్లు, వ్యతిరేకంగా 72 ఓట్లు పడ్డాయి. ఒక సభ్యుడు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఈ తీర్మానం, బిల్లును ఆగ స్టు 5న లోక్‌సభ ఆమోదించింది.
జమ్మూకశ్మీర్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల బిల్లును మాత్రం లోక్‌సభ నుంచి అమిత్ షా వెనక్కు తీసుకుంటూ, ఈ రిజర్వేషన్లు కేంద్రపాలిత ప్రాంతాల్లో వాటంతట అవే అమలవుతాయని అన్నారు. రాజ్యసభ నుంచి కూడా బిల్లును వెనక్కు తీసుకుంటామన్నారు. తీర్మానం, బిల్లు ఆమోదం పొందిన అనంతరం లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
కాళోజీ విశ్వవిద్యాలయానికి ఎంసీఐ గుర్తింపు
కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ఆగస్టు 6న గుర్తింపునిచ్చింది. దీంతో వర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో చదివే ఎంబీబీఎస్, ఎండీ, సూపర్ స్పెషాలిటీ మెడికల్ విద్యార్థులందరికీ ఈ వర్సిటీ పేరు మీదే సర్టిఫికెట్లు జారీ కానున్నాయి. రాష్ట్ర విభజన జరిగాక 2016-17 వైద్య విద్యా సంవత్సరం నుంచి కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ ఉనికిలోకి వచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి గుర్తింపు
ఎప్పుడు : ఆగస్టు 6
ఎవరు : మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)
వినియోగదారుల రక్షణ బిల్లుకు ఆమోదం
వినియోగదారులకు మరిన్ని హక్కులు కల్పించేందుకు ఉద్దేశించిన కన్జ్యూమర్ ప్రొటెక్షన్ బిల్లు-2019ను ఆగస్టు 6న రాజ్యసభ ఆమోదించింది. కేంద్ర ఆహారం, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి పాశ్వాన్ మాట్లాడుతూ... వినియోగదారుల ఫిర్యాదులపై తక్షణ, సులభ పరిష్కారమే ఈ బిల్లు అంతిమ లక్ష్యమన్నారు. రాష్ట్రపతి ఆమోదంతో ఈ బిల్లు చట్టంగా మారితే 1986 నాటి వినియోగదారుల చట్టం రద్దవుతుంది. ఈ బిల్లును లోక్‌సభ జూలై 30 ఆమోదించింది.
ఈ బిల్లు ప్రకారం...
- వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు వీలుగా ‘వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ మరియు ఫోరంలు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఏర్పాటుకానున్నాయి.
- వినియోగదారుల హక్కుల పరిరక్షణ, అమలు, ప్రోత్సాహం లక్ష్యంగా సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(సీసీపీఏ) రూపుదాల్చనుంది.
- వినియోగదారుల ఫిర్యాదులపై నిర్ణీత కాల పరిమితిలోగా పరిష్కారం, వివాదాలకు మధ్యవర్తిత్వం అవకాశం కలుగుతుంది.
- సురక్షితంకాని వస్తువుల తయారీ కంపెనీలపై రూ.10 లక్షల వరకు జరిమానా విధింపు. బాధ్యులకు రెండేళ్ల వరకు జైలు శిక్ష.
- ఇంటి నుంచి కూడా ఫిర్యాదు చేసే సౌలభ్యం ఉంటుంది.
ఏమిటి : కన్జ్యూమర్ ప్రొటెక్షన్ బిల్లు-2019కు ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 6
ఎవరు : రాజ్యసభ
ఎందుకు : వినియోగదారులకు మరిన్ని హక్కులు కల్పించేందుకు
ఆర్టికల్ 370 రద్దుపై ఉత్తర్వులు
జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణం రద్దయినట్లు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రకటించారు. ఈ అంశానికి సంబంధించిన తీర్మానాన్ని పార్లమెంటు ఉభయసభలు ఆమోదించిన అనంతరం, ఆగస్టు 6న రాష్ట్రపతి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. 2019 ఆగస్టు 6 నుంచి ఆర్టికల్ 370లోని అన్ని నిబంధనలూ రద్దవుతున్నాయని రాష్ట్రపతి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆర్టికల్ 370 రద్దుపై ఉత్తర్వులు
ఎప్పుడు : ఆగస్టు 7
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
పార్లమెంటులో 32 బిల్లులకు ఆమోదం
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో రెండోసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన 2019 పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో మొత్తం 32 బిల్లులకు పార్లమెంటు ఆమోదం లభించింది. జూన్ 17 నుంచి ఆగస్టు 7 వరకు జరిగిన ఈ సమావేశాల్లో లోక్‌సభ 35 బిల్లులకు ఆమోదం తెలపగా... రాజ్యసభ 32 బిల్లులను ఆమోదించింది.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు – 2019
| 17వ లోక్‌సభ మొదటి సమావేశాలు | 249వ రాజ్యసభ సమావేశాలు |
సెషన్ పూర్తికాలం | జూన్ 17-ఆగస్టు 6 | జూన్ 20-ఆగస్టు7 |
సభ జరిగిన రోజులు | 37 | 35 |
సభ కొనసాగిన సమయం | 280 గంటలు | 195 గంటలు |
వాయిదాలు, ఇతర కారణాలతోవృథా అయిన సమయం | 0 | 19.12 గంటలు |
అదనపు సమయం | 70.42 గంటలు | దాదాపు 28 గంటలు |
సభ సఫలమైన శాతం | 125 | 104.92 |
మౌఖిక సమాధానాలు లభించిన నక్షత్రం గుర్తు ప్రశ్నలు | 183 | 151 |
ఆమోదం పొందిన బిల్లులు | 35 | 32 |