G20 Summit: బ్రిటన్‌ ప్రధాని కియర్‌ స్టార్మతో భేటీ అయిన మోదీ..

జీ20 శిఖరాగ్ర సదస్సు నవంబర్ 18, 19వ తేదీ బ్రెజిల్‌లోని రియో డిజనిరోలో జ‌రిగింది.

బ్రిటన్, భారత్‌ మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై నెలకొన్న అనుమానాలకు తెర పడింది. దీనిపై చర్చలను పునఃప్రారంభిస్తామని బ్రిటన్‌ ప్రధాని కియర్‌ స్టార్మర్‌ స్పష్టం చేశారు. బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అనంతరం ఆయన ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. జీ20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా నేతలిద్దరూ సమావేశమయ్యారు. 
 
బ్రిటన్లో లేబర్‌ పార్టీ గెలుపుతో ఎఫ్‌టీఏ భవితవ్యం అయోమయంలో పడటం తెలిసిందే. దానికి నేతలిద్దరూ తాజాగా తెర దించారు. పరస్పరం లాభసాటిగా ఉండేలా ఎఫ్‌టీఏ విధివిధానాలు రూపొందుతాయని ఆశాభావం వెలిబుచ్చారు. బెల్‌ఫాస్ట్, మాంచెస్టర్‌ నగరాల్లో నూతన కాన్సులేట్లు తెరవాలని నిర్ణయించారు. పరారీలో ఉన్న వ్యాపారవేత్తలు విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీలను అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని స్టార్మర్‌కు మోదీ విజ్ఞప్తి చేశారు.

మెరుగైన భవితకు కృషి 
మెరుగైన భవిష్యత్తు కోసం చర్యలు చేపట్టాల్సిందిగా జీ20 సభ్య దేశాలకు మోదీ పిలుపునిచ్చారు. సదస్సులో రెండో రోజు సుస్థిరాభివృద్ధి, ఇంధన రంగంలో మార్పులపై ఆయన ప్రసంగించారు. అభవృద్ధి చెందుతున్న దేశాలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం సంపన్న దేశాల బాధ్యత అని గుర్తు చేశారు. 

G20 Summit: జీ20 శిఖరాగ్ర సదస్సులో మోదీ ప్రసంగించిన అంశాలు ఇవే..

పర్యావరణ సవాళ్లను కలసికట్టుగా ఎదుర్కోవడం మానవాళి మనుగడకు చాలా కీలకమని అభిప్రాయపడ్డారు. గాజాకు మరింత మాన వతా సాయం అందించాలని, ఉక్రెయిన్‌ యుద్ధానికి తెర పడాలంటూ సదస్సు డిక్లరేషన్‌ విడుదల చేసింది. వీటితో పాటు పలు అంశాలపై న‌వంబ‌ర్ 19వ తేదీ సదస్సు చివరి రోజు ఉమ్మడి తీర్మానం చేసే అవకాశముంది. 

ఈ దేశాధినేతలతో మోదీ భేటీలు
ఆతిథ్య దేశం బ్రెజిల్‌ అధ్యక్షుడు లులా డసిల్వాతో పాటు పలువురు దేశాధినేతలతో మోదీ వరుస భేటీలు జరిపారు. ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ (ఫ్రాన్స్‌), గాబ్రియెల్‌ బోరిక్‌ ఫోంట్‌ (చిలీ), జేవియర్‌ మెయిలీ (అర్జెంటీనా), జార్జియా మెలోనీ (ఇటలీ), ప్రబోవో సుబియాంటో (ఇండొనేసియా), పెడ్రో శాంచెజ్‌ (స్పెయిన్‌), అబ్దెల్‌ ఫతా ఎల్‌ సిసీ (ఈజిప్ట్‌), యూన్‌ సుక్‌ యోల్‌ (దక్షిణ కొరియా), జోనాస్‌ గర్‌ స్టోర్‌ (నార్వే), లూయీస్‌ మాంటెనెగ్రో (పోర్చుగీస్‌), లారెన్స్‌ వాంగ్‌ (సింగపూర్‌), యూరోపియన్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ ఉర్సులా వాండర్‌ లియన్, అంతర్జాతీయ ద్రవ్య నిధి డిప్యూటీ ఎండీ గీతా గోపీనాథ్‌ తదితరులు వీరిలో ఉన్నారు.

Asia-Pacific Conference: ఢిల్లీలో ‘ఆసియా–పసిఫిక్‌ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ జర్మన్‌ బిజినెస్‌’ సదస్సు

#Tags