Daily Current Affairs in Telugu: 2022, జ‌న‌వ‌రి 1 కరెంట్‌ అఫైర్స్‌

NTCA: 2021లో దేశవ్యాప్తంగా మరణించిన పులుల సంఖ్య?

దేశవ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా 2021 ఏడాదిలో గణనీయ సంఖ్యలో పులులు మృత్యువాత పడ్డాయి. జాతీయ పులుల పరిరక్షణ సంస్థ (ఎన్‌టీసీఏ) వెల్లడించిన లెక్కల ప్రకారం...

  • 2021 ఏడాదిలోనే 126 పులులు వివిధ కారణాలతో చనిపోయాయి. 2020 ఏడాదిలో 106 పులులు మరణించాయి. 
  • 2016లో 121 పులులు మృత్యువాత పడటమే ఇప్పటివరకు గరిష్టంగా ఉండగా, 2021 ఏడాదిలో పులుల మరణాలు ఆ మార్కును దాటేశాయి. 
  • 2021 ఏడాది పులుల మరణాలు అధికంగా మధ్యప్రదేశ్‌లో 44, మహారాష్ట్రలో 26, కర్ణాటకలో 14, తెలంగాణలో 4 , ఆంధ్రప్రదేశ్‌లో ఒకటి ఉన్నాయి.  
  • 2012 నుంచి 2020 వరకు దేశవ్యాప్తంగా మొత్తంగా 877 పులులు మరణించగా, ఇందులో అధికంగా మధ్యప్రదేశ్‌లోనే 202 మరణాలు ఉన్నాయి. 
  • 2012 నుంచి 2020 వరకు తెలంగాణలో 5, ఆంధ్రప్రదేశ్‌లో 8 పులులు మరణించాయి. 
  • చనిపోయిన పులుల్లో 55.78% టైగర్‌ రిజర్వ్‌లోనూ, మరో 31.62% రిజర్వ్‌ సరిహద్దులకు బయట చనిపోయాయి. 
  • పులుల మరణాలకు సంబంధించి 88.91% కేసులు పరిష్కారమయ్యాయి.

చ‌ద‌వండి: భార‌త్‌లో మొత్తం పులుల సంఖ్య‌?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
2021 ఏడాదిలో గణనీయ సంఖ్యలో 126 పులులు మృత్యువాత పడ్డాయి. 
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు    : జాతీయ పులుల పరిరక్షణ సంస్థ (ఎన్‌టీసీఏ)
ఎక్కడ    : దేశవ్యాప్తంగా..
ఎందుకు : వివిధ కారణాలతో..

Battery Company: బ్రిటన్‌ కంపెనీ ఫారడియన్‌ను కొనుగోలు చేసిన భారతీయ సంస్థ?

బ్రిటన్‌కు చెందిన బ్యాటరీ తయారీ సంస్థ ఫారడియన్‌ను దేశీ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కొనుగోలు చేసింది. కంపెనీ విలువను 100 మిలియన్‌ పౌండ్లుగా లెక్కగట్టి రిలయన్స్‌లో భాగమైన రిలయన్స్‌ న్యూ ఎనర్జీ సోలార్‌ (ఆర్‌ఎన్‌ఈఎస్‌ఎల్‌) ఈ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. సోడియం అయాన్‌ టెక్నాలజీ బ్యాటరీలను వేగవంతంగా మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు అదనంగా 25 మిలియన్‌ పౌండ్లు వెచ్చించనుంది. రిలయన్స్ సంస్థ డిసెంబర్ 31న ఈ విషయాలను వెల్లడించింది. 

బ్రిటన్‌లోని షెఫీల్డ్‌ కేంద్రంగా పనిచేసే ఫారడియన్‌ .. ప్రపంచంలోనే పేరొందిన బ్యాటరీ సాంకేతిక కంపెనీల్లో ఒకటి. సోడియం అయాన్‌ బ్యాటరీ టెక్నాలజీలో పలు పేటెంట్లు ఉన్నాయి. 2010లో డాక్టర్‌ జెర్రీ బార్కర్, జేమ్స్‌ క్విన్, క్రిస్‌ రైట్‌ కలిసి దీన్ని ప్రారంభించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
బ్రిటన్‌కు చెందిన బ్యాటరీ తయారీ సంస్థ ఫారడియన్‌ను కొనుగోలు చేసిన భారతీయ సంస్థ?
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు    : రిలయన్స్‌ న్యూ ఎనర్జీ సోలార్‌ (ఆర్‌ఎన్‌ఈఎస్‌ఎల్‌)  
ఎందుకు : సోడియం అయాన్‌ టెక్నాలజీ బ్యాటరీలను వేగవంతంగా మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు..

India vs Sri Lanka: ఆసియా అండర్‌–19 క్రికెట్‌ టోర్నీ చాంపియన్‌?

యూఏఈలోని దుబాయ్‌లో డిసెంబర్ 31న ముగిసిన ఆసియా అండర్‌–19 క్రికెట్‌ టోర్నీ చాంపియన్‌గా భారత్ నిలిచింది. ఫైనల్లో యువ భారత్‌ 9 వికెట్ల తేడాతో శ్రీలంక అండర్‌–19 జట్టును చిత్తు చేసింది. భారత అండర్‌–19 టీమ్‌ ఆసియా కప్‌ను గెలుచుకోవడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 38 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 106 పరుగులే చేయగలిగింది. లంక స్కోరు 33 ఓవర్లకు 74/7 ఉన్నప్పుడు వర్షం కారణంగా ఆట ఆగిపోయింది. దాంతో మ్యాచ్‌ను 38 ఓవర్లకు కుదించారు. అనంతరం ‘డక్‌వర్త్‌ లూయిస్‌’ ప్రకారం భారత్‌ లక్ష్యాన్ని 32 ఓవర్లలో 102 పరుగులుగా నిర్దేశించారు. భారత్‌ 21.3 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 104 పరుగులు చేసింది. 

వెస్టిండీస్‌ వేదికగా..
2022, జనవరి 14 నుంచి వెస్టిండీస్‌ వేదికగా అండర్‌–19 ప్రపంచకప్‌ జరుగుతుంది. జనవరి 15న తమ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో గత ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత్‌ తలపడుతుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఆసియా అండర్‌–19 క్రికెట్‌ టోర్నీ చాంపియన్‌?
ఎప్పుడు   : డిసెంబర్ 31
ఎవరు    : భారత్
ఎక్కడ    : దుబాయ్‌, యూఏఈ
ఎందుకు : ఫైనల్లో భారత జట్లు 9 వికెట్ల తేడాతో శ్రీలంక జట్టుపై విజయం సాధించినందున..

ICC Awards: క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు రేసులో ఉన్న భారతీయురాలు?

ప్రతిష్టాత్మక వార్షిక అవార్డు ఎంపిక ప్రక్రియలో భాగంగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) డిసెంబర్ 31న ‘ఉమెన్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌-2021’ నామినేషన్ల వివరాలను ప్రకటించింది. ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ ‘రాచెల్‌ హేహో ఫ్లింట్‌ ట్రోఫీ’ పేరిట ఇచ్చే ఈ అవార్డు కోసం నాలుగు పేర్లను ఐసీసీ నామినేట్‌ చేసింది. భారత స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన ఈ అవార్డు కోసం పోటీ పడుతోంది. జాబితాలో స్మృతితో పాటు బీమాంట్‌ (ఇంగ్లండ్‌), లిజెల్లి లీ (దక్షిణాఫ్రికా), గ్యాబీ లెవిస్‌ (ఐర్లాండ్‌) ఉన్నారు. 2021 ఏడాది స్మృతి 22 అంతర్జాతీయ మ్యాచ్‌లలో కలిపి 38.86 సగటుతో 855 పరుగులు చేసింది.   

సోబర్స్‌ ట్రోఫీ కోసం పాకిస్తాన్‌ నుంచి ఇద్దరు..
ఐసీసీ అవార్డుల్లో అన్నింటికంటే మేటిగా భావించే ‘మెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ నామినేషన్లను ఐసీసీ ప్రకటించింది. ‘సర్‌ గార్‌ఫీల్డ్‌ సోబర్స్‌ ట్రోఫీ’ పేరిట ఇచ్చే ఈ అవార్డు కోసం ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్, న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్, పాకిస్తాన్‌ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ మొహమ్మద్‌ రిజ్వాన్, పేస్‌ బౌలర్‌ షాహిన్‌ అఫ్రిది పోటీ పడుతున్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఉమెన్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌-2021 అవార్డు రేసులో ఉన్న భారతీయురాలు?
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు    : భారత స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన 
ఎందుకు : క్రికెట్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు..

Chairman and CEO: రైల్వే బోర్డు చైర్మన్‌గా నియమితులైన అధికారి?

రైల్వే బోర్డు చైర్మన్‌, ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈవో)గా ఈశాన్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ వినయ్‌ కుమార్‌ త్రిపాఠి నియమితులయ్యారు. 1998 బ్యాచ్ ఐఆర్ఎస్ఈఈ అధికారి అయిన వినయ్‌ నియామకానికి కేబినెట్‌ నియామకాల కమిటీ ఆమోదముద్ర వేసింది. 2022, జనవరి, 1 నుంచి జూన్‌, 31 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. పదవీ విరమణ అనంతరం ఆయన జులై 1న పునఃనియమితులై డిసెంబరు, 31 వరకు కొనసాగుతారు.

అంతర్జాతీయ జ్యులరీ ప్రదర్శన వాయిదా
‘ఇండియా ఇంటర్నేషనల్‌ జ్యువెల్లరి షో సిగ్నేచర్‌’ (ఐఐజేఎస్‌)ను వాయిదా వేస్తున్నట్టు జెమ్‌ అండ్‌ జ్యులయరీ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) ప్రకటించింది. 2022, జవనరి 6 నుంచి 9 వరకు ముంబైలోని జియో కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించాలని గతంలో జీజేఈపీసీ నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా పరిస్థితులను దృష్టిలో పెంచుకుని ఐఐజేఎస్‌ వాయిదా వేసినట్టు డిసెంబర్ 31న జీజేఈపీసీ చైర్మన్‌ కొలిన్‌షా తెలిపారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
రైల్వే బోర్డు చైర్మన్‌, ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈవో)గా నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు    : ఈశాన్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ వినయ్‌ కుమార్‌ త్రిపాఠి 
ఎందుకు : కేబినెట్‌ నియామకాల కమిటీ నిర్ణయం మేరకు..

Muziris: దేశంలో తొలి వాటర్ మెట్రోను ఎక్కడ ప్రారంభించారు?

దేశంలో తొలి వాటర్ మెట్రో(బ్యాటరీతో నడిచే బోటు) కేరళ రాష్ట్రం కొచ్చిలో ప్రారంభమైంది. వాటర్‌ మెట్రో ప్రాజెక్టులో భాగంగా డిసెంబర్ 31న కొచ్చి మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (కేఎంఆర్‌ఎల్‌) ఈ బోటును ప్రారంభించింది. బ్యాటరీతో నడిచే బోటును కేఎంఆర్‌ఎల్‌కు కొచ్చి షిప్‌యార్డు అప్పగించింది. వందమందితో ప్రయాణించే సామర్థ్యం ఉన్న ఈ బోటు 15 నిమిషాల్లోనే ఫుల్‌ ఛార్జింగు అవుతుంది. గంటకు 10 నాటికల్‌ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. పూర్తిగా ఎయిర్‌ కండీషన్డ్‌ వ్యవస్థతో ప్రయాణ సమయంలో ప్రకృతి అందాలను వీక్షించేలా దీన్ని రూపొందించారు. బోటు ఛార్జింగు అయిపోతే దానంతటదే డీజిల్‌ ఆప్షన్‌కు మారిపోతుంది. ప్రపంచంలోనే విద్యుత్తు బ్యాటరీతో నడిచే అతిపెద్ద బోటు కూడా ఇదే.   

ముజిరిస్ పేరుతో...
ప్రయాణికులు అతి తక్కువ సమయంలోనే గమ్యాలకు చేరుకునేందుకు రూ.747 కోట్ల చేపట్టిన వాటర్‌ మెట్రో ప్రాజెక్టులో భాగంగా మొత్తం 23 విద్యుత్‌ బోట్లను ఇపుడు కొచ్చి షిప్‌యార్డ్‌ రూపొందిస్తోంది. తాజాగా ప్రారంభించిన మొట్టమొదటి బోటుకు ముజిరిస్ అని పేరు పెట్టారు. 76 కి.మీ.ల పొడవుతో, 38 టెర్మినళ్లను కలుపుతూ ఈ మెట్రో ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
దేశంలో తొలి వాటర్ మెట్రో(బ్యాటరీతో నడిచే బోటు)ను ఎక్కడ ప్రారంభించారు?
ఎప్పుడు  : డిసెంబర్ 31
ఎవరు    : ఈశాన్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ వినయ్‌ కుమార్‌ త్రిపాఠి 
ఎక్కడ    : కొచ్చి, కేరళ
ఎందుకు : ప్రయాణికులు అతి తక్కువ సమయంలోనే గమ్యాలకు చేరుకునేందుకు..

Natural Disasters: తౌక్టే తుపానుతో దెబ్బతిన్న రాష్ట్రం?

2020 ఏడాది తుపాన్లు, వరదలతో తీవ్ర నష్టం వాటిల్లిన ఆరు రాష్ట్రాలకు అదనంగా రూ.3,063 కోట్ల రూపాయలను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ డిసెంబర్ 30న సమావేశమై... జాతీయ విపత్తు నిర్వహణ నిధి (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) నుంచి ఈ మొత్తాన్ని విడుదల చేయడానికి ఆమోదం తెలిపింది.

యాస్‌ తుపాన్‌ తాకిడికి గురైన రాష్ట్రం?
తౌక్టే తుపానుతో దెబ్బతిన్న గుజరాత్‌కు అత్యధికంగా రూ.1,133 కోట్లు, యాస్‌ తుపాన్‌ తాకిడికి గురైన పశ్చిమ బెంగాల్‌కు రూ.586 కోట్లు ఇవ్వనున్నారు. కర్ణాటకకు రూ. 504 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ. 600 కోట్లు, ఉత్తరాఖండ్‌కు రూ. 187 కోట్లు, అస్సాంకు రూ.51 కోట్లు కేటాయించారు. రాష్ట్రాల విపత్తు స్పందన నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) కింద ఆయా రాష్ట్రాలకు జమ చేసిన దానికి ఇది అదనమని హోంశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కింద 28 రాష్ట్రాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ, 17,747 కోట్లు విడుదల చేశామని పేర్కొంది.

ఐటీ హబ్ కు శంకుస్థాపన..
అన్నిరంగాల్లో తెలంగాణ ముందంజలో ఉందని, దేశ ఆర్థిక వ్యవస్థకు చోదకశక్తిగా నిలిచే నాలుగో రాష్ట్రం మనదేనని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. డిసెంబర్ 31న నల్లగొండలో ఐటీ హబ్, సమీకృత వెజ్‌–నాన్‌వెజ్‌ మార్కెట్‌లకు మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డిలతో కలిసి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలో నిర్మించిన ఎస్సీ, ఎస్టీ హాస్టల్‌ను ప్రారంభించారు. నల్లగొండ పట్టణ అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని.. రూ.100 కోట్లు ప్రకటించగా ఇప్పటికే రూ.30 కోట్లు విడుదల చేశామని తెలిపారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఆరు రాష్ట్రాలకు అదనంగా రూ.3,063 కోట్ల రూపాయలను విడుదల చేయాలని నిర్ణయం
ఎప్పుడు : డిసెంబర్ 30
ఎవరు    : కేంద్ర ప్రభుత్వం  
ఎందుకు : 2020 ఏడాది తుపాన్లు, వరదలతో తీవ్ర నష్టం వాటిల్లినందున..

Defence Deal: బ్రహ్మోస్‌ మిస్సైళ్లను కొనుగోలు చేయనున్న దేశం?

భారత తయారీ బ్రహ్మోస్‌ మిస్సైళ్లను ఫిలిప్పీన్స్‌ కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఇరు ప్రభుత్వాల మధ్య త్వరలో ఒక ఒప్పందం కుదరనుంది. ఫిలిప్పీన్స్‌ నేవీకి బ్రహ్మోస్‌ను అందించే ఈ ఒప్పందంపై సంవత్సరాలుగా చర్చలు సాగుతున్నాయి. తాజా ఒప్పందంతో భారత్‌– ఫిలిప్పీన్స్‌ మధ్య ద్వైపాక్షిక ఒప్పందం మరింత బలోపేతం కానుంది. ఈ ఒప్పందం విలువ దాదాపు రూ. 413 కోట్లని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకోసం ఆ దేశ బడ్జెట్‌శాఖ ఇటీవల రెండు ఎస్‌ఏఆర్‌ఓ(స్పెషల్‌ అలాట్‌మెంట్‌ రిలీజ్‌ ఆర్డర్స్‌)ను విడుదల చేసింది.  

ఫిలిప్పీన్స్‌కు అందజేయబోయే క్షిపణుల రేంజ్‌ సుమారు 290 కిలోమీటర్లు. ఇది ధ్వని వేగానికి దాదాపు 3 రెట్లు అధిక వేగంతో పయనిస్తుంది. దీన్ని సబ్‌మెరైన్లు, నౌకలనుంచి ప్రయోగించవచ్చు. ఇటీవల కాలంలో సైనిక విభాగాల ఆధునీకరణకు ఫిలిప్పీన్స్‌ పలు చర్యలు తీసుకుంటోంది. ఇండో-రష్యన్‌ జాయింట్‌ వెంచర్‌లో భాగంగా బ్రహ్మోస్‌ను అభివృద్ధి చేసిన విషయం విదితమే.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
భారత తయారీ బ్రహ్మోస్‌ మిస్సైళ్లను కొనుగోలు చేయనున్న దేశం?
ఎప్పుడు  : డిసెంబర్ 30
ఎవరు      : ఫిలిప్పీన్స్‌
ఎందుకు  : ఫిలిప్పీన్స్‌ సైనిక విభాగాల ఆధునీకరణలో భాగంగా..

Fighter Jets: జే–10సీ జెట్‌ విమానాలను కొనుగోలు చేసిన దేశం?

చైనా తయారీ జే–10సీ జెట్‌ విమానాల ఫుల్‌ స్క్వాడ్రన్‌ (25 విమానాలు)ను పాకిస్తాన్‌ కొనుగోలు చేసింది. భారత్ ఇటీవల జరిపిన రఫేల్‌ విమానాల కొనుగోలుకు బదులుగా చైనా జెట్లను కొన్నామని డిసెంబర్ 30న పాక్ మంత్రి షేక్‌ రషీద్‌ అహ్మద్‌ తెలిపారు. అన్ని రకాల వాతావరణాల్లో ప్రయాణం చేయగల ఈ జెట్‌ విమానాలు 2022, మార్చి 23న పాకిస్తాన్‌ డే రోజున కవాతులో పాల్గొంటాయని చెప్పారు. గతంలో పాక్, చైనా సంయుక్త విన్యాసాల్లో ఈ జెట్లు పాల్గొన్నాయి.

సుమారు 3.5 కోట్ల డాలర్లు..
ప్రస్తుతం పాక్‌ వద్ద యూఎస్‌ తయారీ ఎఫ్‌–16 విమానాలున్నాయి. ఇవి రఫేల్‌కు దీటు రాగలవని నిపుణుల అంచనా. అయితే వీటికన్నా మరింత మెరుగైన జెట్లను సిద్ధంగా ఉంచుకోవాలన్న ఉద్దేశంతో పాక్‌ తాజాగా చైనా జెట్లను కొనుగోలు చేసింది. వీటి ఖరీదు ఒక్కోటి సుమారు 3.5 కోట్ల డాలర్లు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
చైనా తయారీ జే–10సీ జెట్‌ విమానాల ఫుల్‌ స్క్వాడ్రన్‌ (25 విమానాలు) కొనుగోలు
ఎప్పుడు : డిసెంబర్ 30
ఎవరు    : పాకిస్తాన్‌
ఎందుకు : భారత్ ఇటీవల జరిపిన రఫేల్‌ విమానాల కొనుగోలుకు బదులుగా..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

#Tags