Daily Current Affairs in Telugu: 2022, ఫిబ్రవరి 18 కరెంట్ అఫైర్స్
Minister Raj Kumar Singh: గ్రీన్ హైడ్రోజన్ విధానం తొలి భాగం ఆవిష్కరణ
పర్యావరణ అనుకూలమైన హరిత హైడ్రోజన్ ఉత్పత్తిని 2030 నాటికి 5 మిలియన్ టన్నుల స్థాయికి పెంచుకోవాలని కేంద్రం నిర్దేశించుకుంది. ఇందుకోసం ఉపయోగించే పునరుత్పాదక విద్యుత్ పంపిణీపై పాతికేళ్ల పాటు అంతర్‌రాష్ట్ర చార్జీల నుంచి మినహాయింపు లభించనుంది. జాతీయ హైడ్రోజన్ విధానం తొలి భాగాన్ని ఫిబ్రవరి 17న న్యూఢిల్లీలో ఆవిష్కరించిన సందర్భంగా కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్ ఈ విషయాలు తెలిపారు. హరిత హైడ్రోజన్, అమోనియాల వినియోగం పెరిగితే పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు.
సాధారణంగా వివిధ ఉత్పత్తుల తయారీ కోసం చమురు రిఫైనరీలు మొదలు, ఉక్కు ప్లాంట్ల వరకూ చాలా సంస్థలకు హైడ్రోజన్ అవసరమవుతుంది. ప్రస్తుతం సహజ వాయువు లేదా నాఫ్తా వంటి శిలాజ ఇంధనాల నుంచి దీన్ని ఉత్పత్తి చేస్తున్నారు. అయితే, ఈ ప్రక్రియలో కర్బన ఉద్గారాలు వెలువడి కాలుష్య కారకంగా మారుతున్నందున పర్యావరణ అనుకూలమైన పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి హరిత హైడ్రోజన్, అమోనియా ఉత్పత్తిపై దృష్టి పెడుతున్నారు. ఇందులో భాగంగానే తాజా విధానాన్ని రూపొందించినట్లు మంత్రి రాజ్ కుమార్ సింగ్ తెలిపారు. రెండో విడతలో దశలవారీగా ప్లాంట్లు హరిత హైడ్రోజన్, హరిత అమోనియా వినియోగించడాన్ని తప్పనిసరి చేయనున్నట్లు చెప్పారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : గ్రీన్ హైడ్రోజన్ విధానం తొలి భాగం ఆవిష్కరణ
ఎప్పుడు : ఫిబ్రవరి 17
ఎవరు : కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : పర్యావరణ అనుకూలమైన పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి హరిత హైడ్రోజన్, అమోనియా ఉత్పత్తిపై దృష్టి పెట్టేందుకు..
Singapore: ఫెయిర్‌ప్రైస్ సీఈవోగా నియమితులైన భారత సంతతి వ్యక్తి?
సింగపూర్‌లోని సూపర్‌మార్కెట్ ఫుడ్ చెయిన్ ఆపరేటర్ ఫెయిర్‌ప్రైస్ గ్రూప్‌నకు సీఈవోగా భారత సంతతికి చెందిన విపుల్ చావ్లా నియమితులయ్యారు. ప్రస్తుత సీఈవో సియా కియాన్ పెంగ్ నుంచి 2022, ఏప్రిల్ 5న ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ఫెయిర్‌ప్రైస్ గ్రూప్, దాని మాతృ సంస్థ నేషనల్ ట్రేడ్స్ యూనియన్ కాంగ్రెస్ (ఎన్‌టీయూసీ) ఎంటర్‌ప్రైజ్ ఈ మేరకు ఫిబ్రవరి 17న ఒక ప్రకటన విడుదల చేశాయి. ఎన్‌టీయూసీ అనుసంధానంగా పనిచేసే ఫెయిర్‌ప్రైస్ గ్రూప్ వార్షికాదాయాలు దాదాపు 3 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయి.
పిజ్జా హట్ ప్రెసిడెంట్‌గా..
విపుల్ చావ్లా ప్రస్తుతం పిజ్జా హట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. వినియోగ ఉత్పత్తులు, ఆహార సర్వీసులు వంటి విభాగాలకు సంబంధించి పలు ఫార్చూన్ 500 కంపెనీల్లో ఆయన వివిధ హోదాల్లో పని చేశారు. 2018 నుంచి పిజ్జా హట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్‌గా .. 100 పైగా దేశాల్లో సంస్థ కార్యకలాపాలు పర్యవేక్షించారు. ముంబైలోని ఎస్‌పీ జైన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్‌లో మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో ఆయనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫెయిర్‌ప్రైస్ గ్రూప్ సీఈవోగా నియమితులైన భారత సంతతి వ్యక్తి?
ఎప్పుడు : ఫిబ్రవరి 17
ఎవరు : విపుల్ చావ్లా
ఎక్కడ : సింగపూర్
ఎందుకు : ఫెయిర్‌ప్రైస్ గ్రూప్ నిర్ణయం మేరకు..
Unified Payments Interface: భారత వెలుపల యూపీఐని అమలు చేయనున్న తొలి దేశం?
భారత్ రూపొందించిన ఏకీకృత చెల్లింపుల విధానం(యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్–యూపీఐ) నేపాల్‌లో అమల్లోకి రానుంది. ఇది ఆ దేశ డిజిటల్ ఎకానమీని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించగలదని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఫిబ్రవరి 17న ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో భారత వెలుపల యూపీఐని అమలు చేసే తొలి దేశం నేపాల్ అవుతుందని పేర్కొంది. నేపాల్ సర్వీసులు అందించేందుకు ఎన్‌పీసీఐ అంతర్జాతీయ విభాగం ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ (ఎన్‌ఐపీఎల్), గేట్‌వే పేమెంట్స్ సర్వీస్ (జీపీఎస్), మనం ఇన్ఫోటెక్ చేతులు కలిపినట్లు వివరించింది. యూపీఐను ఎన్‌పీసీఐ రూపొందించింది. ఎన్‌పీసీఐ ప్రధాన కార్యాలయం భారత ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత వెలుపల ఏకీకృత చెల్లింపుల విధానం(యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్–యూపీఐ)ను అమలు చేయనున్న తొలి దేశం?
ఎప్పుడు : ఫిబ్రవరి 17
ఎవరు : నేపాల్
ఎక్కడ : నేపాల్
ఎందుకు : డిజిటల్ ఎకానమీని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించగలదని..
FM Nirmala Sitharaman: జీ20 ఆర్థికమంత్రుల సమావేశం నేతృత్వం వహిస్తోన్న దేశం?
ఇండోనేషియా నేతృత్వంలో ఫిబ్రవరి 17, 18 తేదీలలో జరుగుతున్న జీ20 ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల మొదటి వర్చువల్ ప్యానల్ సమావేశాన్ని ఉద్దేశించి ఫిబ్రవరి 17న భారత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రసంగం చేశారు. ప్రపంచ ఆర్థిక రికవరీకి వీలుగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు వ్యాక్సిన్ల పంపిణీ తగిన సమాన స్థాయిలో వేగంగా జరగాలని ఆమె పిలుపునిచ్చారు. జీ20 జాయింట్ ఫైనాన్స్, హెల్త్ టాస్క్ ఫోర్స్ కార్యాచరణ ఈ దిశలో పురోగమించలని అన్నారు. ద్రవ్యోల్బణం, సరఫరాల సమస్యలు, కొత్త వేరియెంట్ల భయాలు వంటి అంశాలుసహా అంతర్జాతీయ ఆర్థిక అవుట్‌లుక్‌కు సంబంధించి ఆర్థికమంత్రి పలు అంశాలను సమావేశంలో ప్రస్తావించారు.
జీ–20 సభ్యదేశాలు..
జీ–20(గ్రూప్ ఆఫ్ 20) అనేది ప్రపంచంలోని 20 అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల కూటమి. ఇందులో 19 దేశాలు, యూరోపియన్ యూనియన్ (ఈయూ)కు సభ్యత్వం ఉంది. సభ్యదేశాలు ఇవే..
- అర్జెంటీనా
- ఆస్ట్రేలియా
- బ్రెజిల్
- కెనడా
- చైనా
- ఫ్రాన్స్
- జర్మనీ
- భారత్
- ఇండోనేషియా
- ఇటలీ
- జపాన్
- మెక్సికో
- రష్యా
- సౌదీ అరేబియా
- దక్షిణ కొరియా
- దక్షిణాఫ్రికా
- టర్కీ
- యునెటైడ్ కింగ్‌డమ్
- యునెటైడ్ స్టేట్స్
- యూరోపియన్ యూనియన్
Andhra Pradesh: 51 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
ఆంధ్రప్రదేశ్ రహదారుల చరిత్రలో ఓ చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమయ్యింది. కేంద్ర ఉపరితల రవాణా శాఖ.. రాష్ట్రంలో 1,380 కిలోమీటర్ల మేర చేపట్టిన 51 జాతీయ రహదారుల ప్రాజెక్టులలో 20 ప్రాజెక్టులు పూర్తి కాగా, మరో 31 ప్రాజెక్టులకు భూమి పూజ నిర్వహించారు. కృష్ణా జిల్లా, విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఫిబ్రవరి 17న నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రిమోట్ కంట్రోల్ ద్వారా సంయుక్తంగా ప్రారంభోత్సవం, భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. విజయవాడలోని బెంజి సర్కిల్ రెండో ఫ్లైఓవర్‌ను మంత్రి గడ్కరీ, సీఎం జగన్ ప్రారంభించారు.
Dubai Expo 2020: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం అమెరికా సంస్థ?
దుబాయ్ ఎక్స్‌పో–2020లో పెట్టుబడులను ఆకర్షిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 17న మరో రెండు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. అల్యూమినియం కాంపోజిట్ ప్యానల్స్‌ను తయారుచేసే అమెరికాకు చెందిన అలుబాండ్ గ్లోబల్ సంస్థ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. రూ.1,500 కోట్ల పెట్టుబడితో అల్యూమినియం కాయిల్స్, ప్యానల్ తయారీ యూనిట్‌ను ఈ సంస్థ ఏర్పాటుచేయనుంది. దుబాయ్ ఎక్స్‌పోలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సమక్షంలో ఈ ఒప్పంద కార్యక్రమం జరిగింది.
షరాఫ్ గ్రూపు కూడా..
షిప్పింగ్, లాజిస్టిక్, సప్లై చైన్ రంగాల్లో విస్తరించి ఉన్న షరాఫ్ గ్రూపు(యూఏఈకి చెందిన çసంస్థ) కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోర్టు ఆథారిత సేవల రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. రూ.500 కోట్ల పెట్టుబడితో రెండు లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో గిడ్డంగులు, ప్యాకింగ్ యూనిట్లు, డిస్‌ప్లే యూనిట్లు, సరుకు రవాణాకు తగిన రైల్ సైడింగ్ వంటి సౌకర్యాలతో ఈ లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేయనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దుబాయ్ ఎక్స్‌పో–2020లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో వేర్వేరుగా ఒప్పందం చేసుకున్న సంస్థలు?
ఎప్పుడు : ఫిబ్రవరి 17
ఎవరు : అలుబాండ్ గ్లోబల్ సంస్థ, షరాఫ్ గ్రూపు
ఎందుకు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి..
Andhra Pradesh: పద్మశ్రీ అవార్డీ ఆశావాది ప్రకాశరావు కన్నుమూత
అరుదైన అవధాన ప్రక్రియలో అనంతపురం జిల్లా కీర్తిని జాతీయస్థాయికి తీసుకెళ్లిన సీనియర్ సాహితీవేత్త, ప్రముఖ పద్యకవి, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఆశావాది ప్రకాశరావు(78) కన్నుమూశారు. అనంతపురం జిల్లా పెనుకొండలో కుమార్తె వద్ద ఉంటున్న ఆయన.. ఫిబ్రవరి 17న గుండెపోటుకు గురై, తుదిశ్వాస విడిచారు. 2021 సంవత్సరానికిగాను సాహిత్యం, విద్య రంగంలో పద్మశ్రీ అవార్డునందుకున్న ఆశావాది ప్రకాశరావు.. వివిధ ప్రక్రియల్లో 65కుపైగా సాహితీ గ్రంథాలను రచించారు. ఆయన సాహిత్యంపై రెండు తెలుగు రాష్ట్రాలలో పలువురు పరిశోధక విద్యార్థులు పీహెచ్‌డీలు పొందారు.
రాయలసీమలోని అనంతపురం జిల్లా, శింగనమల మండలం, పెరవలి గ్రామంలో జన్మించిన ఆశావాది ప్రకాశరావు.. బాల్యంలోనే ఆశువుగా కవిత్వం చెప్పి అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను మెప్పించారు. అనంతర కాలంలో ఉపాధ్యాయుడిగా, ప్రిన్సిపాల్‌గా వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగరీత్యా ఎక్కువ కాలం పెనుకొండ ప్రాంతంలో పనిచేసి అక్కడే స్థిరపడ్డారు. వేలాదిమంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. వివిధ రాష్ట్రాల్లో 170కి పైగా అవధానాలు చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ పద్యకవి, సాహితీవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత
ఎప్పుడు : ఫిబ్రవరి 17
ఎవరు : డాక్టర్ ఆశావాది ప్రకాశరావు(78)
ఎక్కడ : పెనుకొండ, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : గుండెపోటు కారణంగా..
Energy and Environment Foundation: గ్లోబల్ సీఎస్‌ఆర్ పురస్కారాన్ని అందుకున్న సంస్థ?
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్‌సీసీఎల్) సామాజిక బాధ్యతతో చేపడుతున్న సేవలకు గుర్తింపుగా ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ‘ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంట్ ఫౌండేషన్’ (ఈఈఎఫ్) గ్లోబల్ సీఎస్‌ఆర్ పురస్కారాన్ని అందజేసింది. ఈ విషయాన్ని ఫిబ్రవరి 17న సింగరేణి యాజమాన్యం తెలిపింది. సింగరేణి సంస్థ సీఎస్‌ఆర్ కార్యక్రమాలను ప్రశంసిస్తూ ప్లాటినమ్ విభాగంలో మొదటి బహుమతిని అందజేసినట్టు పేర్కొంది. ఫిబ్రవరి 17న జరిగిన 12వ అంతర్జాతీయ పెట్రో కోల్ సదస్సు–2022లో సింగరేణి సంస్థ డైరెక్టర్ ఎన్.బలరామ్ ఆన్‌లైన్‌లో స్వీకరించారు.
మాలి నుంచి ఫ్రాన్స్ బలగాలు వెనక్కి
పశ్చిమ ఆఫ్రికా దేశం మాలి నుంచి దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఫ్రాన్స్, యురోపియన్ యూనియన్(ఈయూ) సైనిక బలగాలు స్వదేశాలకు తిరిగి రానున్నాయి. మాలిలో ఇస్లామిక్ ఉగ్రవాదులను తుదముట్టించేందుకు ఫ్రాన్స్, ఈయూ సంకీర్ణ సేనలు మాలికి వచ్చాయి. ‘మాలి సైనికపాలకులు.. ఇస్లామిక్ ఉగ్రవాదులపై పోరులో తీవ్ర నిర్లక్ష్యం కనబరుస్తున్నారు. ప్రభుత్వ మద్దతు లేనిదే ఉగ్రవాదంపై విజయం సాధ్యంకాదు’ అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ వ్యాఖ్యానించారు.
మాలి..
రాజధాని: బమాకో; కరెన్సీ: పశ్చిమ ఆఫ్రికా సీఎఫ్‌ఏ ఫ్రాంక్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంట్ ఫౌండేషన్ (ఈఈఎఫ్) నుంచి గ్లోబల్ సీఎస్‌ఆర్ పురస్కారాన్ని పొందిన సంస్థ?
ఎప్పుడు : ఫిబ్రవరి 17
ఎవరు : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్‌సీసీఎల్)
ఎందుకు : సామాజిక బాధ్యతతో చేపడుతున్న సేవలకు గుర్తింపుగా..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్