Daily Current Affairs in Telugu: 2022, ఫిబ్రవరి 15 కరెంట్‌ అఫైర్స్‌

Security Concerns: ఏ దేశానికి చెందిన 54 యాప్‌లపై భారత్‌ నిషేధం విధించింది?

దేశ భద్రతకు, ప్రైవసీకి ప్రమాదంగా మారుతున్నాయంటూ మరో 54 చైనా మొబైల్‌ యాప్‌లను ఫిబ్రవరి 14న కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. కేంద్ర హోం శాఖ సిఫార్సు మేరకు ఐటీ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ శాఖ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ‘‘ఈ యాప్స్‌ యూజర్ల తాలూకు వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేస్తున్నాయని, ఎప్పటికప్పుడు శత్రు దేశపు సర్వర్లకు పంపుతున్నాయి. తద్వారా దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి సమస్యగా మారాయి. దేశ రక్షణకు కూడా ముప్పుగా తయారయ్యాయి’’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గెరెనా ఫ్రీ ఫైర్‌–ఇల్యుమినేట్, టెన్సెంట్‌ ఎక్స్‌రివర్, నైస్‌వీడియో బైదు, వివా వీడియో ఎడిటర్, బ్యూటీ కెమెరా: స్వీట్‌ సెల్ఫీ హెచ్‌డీ, మ్యూజిక్‌ ప్లేయర్, మ్యూజిక్‌ ప్లస్, వాల్యూమ్‌ బూస్టర్, వీడియో ప్లేయర్స్, యాప్‌లాక్, మూన్‌చాట్, బార్‌కోడ్‌ స్కానర్‌–క్యూఆర్‌ కోడ్‌స్కాన్‌ వంటి యాప్‌లు నిషేధిత జాబితాలో ఉన్నాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
చైనాకి చెందిన 54 మొబైల్‌ యాప్‌లపై నిషేధం
ఎప్పుడు : ఫిబ్రవరి 14
ఎవరు    : భారత్‌
ఎందుకు : దేశ భద్రతకు, ప్రైవసీకి ప్రమాదంగా మారుతున్నాయని..

National Cricket Academy: కొత్త ఎన్‌సీఏకు ఎక్కడ శంకుస్థాపన చేశారు?

భారత క్రికెట్‌కు భవిష్యత్‌ కేంద్రంగా నిలిచే కొత్త జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)కి బోర్డ్‌ ఆఫ్‌ కంట్రోల్‌ ఫర్‌ క్రికెట్‌ ఇన్‌ ఇండియా(బీసీసీఐ) అంకురార్పణ చేసింది. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నగర శివార్లలో సువిశాల స్థలంలో కొత్త ఎన్‌సీఏను బోర్డు నిర్మించనుంది. దీనికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం ఫిబ్రవరి 14న జరిగింది. బీసీసీఐ బోర్డు అధ్యక్ష, కార్యదర్శులు గంగూలీ, జై షాలతో పాటు ఆఫీస్‌ బేరర్లు అరుణ్‌ ధుమాల్, జయేశ్‌ జార్జ్, ఎన్‌సీఏ హెడ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

చిన్నస్వామి స్టేడియం ఏ నగరంలో ఉంది?
2000 సంవత్సరం నుంచి బెంగళూరు నగరం మధ్యలో ఉన్న చిన్నస్వామి స్టేడియం ప్రాంగణంలోనే ఎన్‌సీఏ కొనసాగుతోంది. అక్కడ పరిమిత సౌకర్యాల మధ్యనే అకాడమీ కొనసాగింది. కొత్తగా నిర్మించబోయే ఎన్‌సీఏలో ప్రపంచస్థాయి అత్యుత్తమ సౌకర్యాలతో పాటు దేశవాళీ మ్యాచ్‌లు కూడా నిర్వహించగలిగే మూడు పెద్ద మైదానాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఏడాదిలోగా ఎన్‌సీఏ నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) నిర్మాణానికి శంకుస్థాపన
ఎప్పుడు : ఫిబ్రవరి 14
వరు    : బీసీసీఐ బోర్డు అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ
ఎక్కడ    : బెంగళూరు, కర్ణాటక

Broadband Services: జియో స్పేస్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసిన సంస్థలు?

డిజిటల్‌ సేవల దిగ్గజం జియో ప్లాట్‌ఫామ్స్‌ (జేపీఎల్‌) దేశీయంగా ఉపగ్రహ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులను అందించడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా లగ్జెంబర్గ్‌కు చెందిన ఎస్‌ఈఎస్‌ సంస్థతో జట్టు కట్టింది. ఈ రెండు సంస్థలు కలిసి జియో స్పేస్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ పేరిట జాయింట్‌ వెంచర్‌ సంస్థను (జేవీ) ఏర్పాటు చేశాయి. ఇందులో జేపీఎల్‌కు 51 శాతం, ఎస్‌ఈఎస్‌కు 49 శాతం వాటాలు ఉంటాయని ఫిబ్రవరి 14న ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఎస్‌ఈఎస్‌కి చెందిన శాటిలైట్‌ డేటా, కనెక్టివిటీ సర్వీసులను జాయింట్‌ వెంచర్‌ సంస్థ భారత్‌లో అందిస్తుంది.

100 జీబీపీఎస్‌ వేగంతో..
మారుమూల ప్రాంతాలు, వ్యాపారాలు, ప్రభుత్వ సంస్థలు, వినియోగదారులు మొదలైన వర్గాలన్నింటినీ కొత్త డిజిటల్‌ భారత్‌కు అనుసంధానించడానికి అదనంగా ఉపగ్రహ కమ్యూనికేషన్స్‌ సర్వీసులు తోడ్పడగలవని జియో డైరెక్టర్‌ ఆకాశ్‌ అంబానీ పేర్కొన్నారు. ఎస్‌ఈఎస్‌ భాగస్వామ్యంతో 100 జీబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌ అందించవచ్చని, ఈ మార్కెట్‌లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి జియోకి ప్రస్తుతమున్న నెట్‌వర్క్‌ దోహదపడగలదని చెప్పారు. వివిధ కక్ష్యల్లోని ఉపగ్రహాల నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని జేవీ సంస్థ దేశీయంగా, ప్రాంతీయంగా శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందిస్తుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
జియో స్పేస్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ పేరిట జాయింట్‌ వెంచర్‌ సంస్థ ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 14
ఎవరు    : జియో ప్లాట్‌ఫామ్స్‌ (జేపీఎల్‌), ఎస్‌ఈఎస్‌ సంస్థ 
ఎందుకు : భారత్‌లో వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించేందుకు..

Air India CEO & MD: ఎయిరిండియా సీఈవోగా నియమితులైన వ్యక్తి?

విమానయాన సంస్థ ఎయిరిండియా సీఈవో, ఎండీగా టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌ మాజీ చైర్మన్‌ ఎల్కర్‌ ఐజు నియమితులయ్యారు. ఎయిరిండియా బోర్డ్‌ సోమవారం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుందని ఫిబ్రవరి 14న టాటా సన్స్‌ ప్రకటించింది. 2022, ఏప్రిల్‌ 1 లేదా ముందస్తుగా ఎల్కర్‌ కొత్త బాధ్యతలు స్వీకరిస్తారని పేర్కొంది.

గ్లాన్స్‌లో జియో రూ. 1,500 కోట్ల పెట్టుబడులు
మొబైల్‌ లాక్‌ స్క్రీన్‌ కంటెంట్‌ అందించే గ్లాన్స్‌ ప్లాట్‌ఫామ్‌లో జియో ప్లాట్‌ఫామ్స్‌ 17 శాతం వాటాలు కొనుగోలు చేయనుంది. ఇందుకోసం 200 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 1,500 కోట్లు) వెచ్చించనుంది. ఆసియా మార్కెట్లో ఎదుగుదలతో పాటు అమెరికా, బ్రెజిల్, మెక్సికో, రష్యా తదితర అంతర్జాతీయ మార్కెట్లలోకి కూడా విస్తరించేందుకు గ్లాన్స్‌ ఈ నిధులను ఉపయోగించుకోనుంది.

షిప్‌రాకెట్‌ చేతికి గ్లాకస్‌ సప్లై చైన్‌..
వ్యాపార సంస్థలకు పంపిణీ, సేల్స్‌ రిటర్న్‌ల నిర్వహణ మొదలైన సర్వీసులను అందిస్తోన్న ‘‘గ్లాకస్‌ సప్లై చెయిన్‌ సొల్యూషన్స్‌’’లో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసినట్లు ఈ–కామర్స్‌ షిప్పింగ్‌ ప్లాట్‌ఫాం సంస్థ షిప్‌రాకెట్‌ వెల్లడించింది. ట్రేడర్లు, రిటైలర్లు, బ్రాండ్లు .. ఉత్పత్తుల నిల్వ, ప్యాకేజింగ్‌ వంటి అంశాలపరంగా ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు రెండు సంస్థల భాగస్వామ్యం ఉపయోగపడగలదని తెలిపింది. గ్లాకస్‌ను 2015లో వివేక్‌ కల్రా, నితిన్‌ ధింగ్రా, మన్‌దీప్‌ కన్వల్, జయంత్‌ మహతో కలిసి ప్రారంభించారు.

Andhra Pradesh High Court: ఏడుగురు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా ఎంపికైన న్యాయమూర్తులు ఫిబ్రవరి 14న ప్రమాణం చేశారు. నూతన న్యాయమూర్తులు కొనకంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, తర్లాడ రాజశేఖర్, సత్తి సుబ్బారెడ్డి, చీమలపాటి రవి, వడ్డిబోయన సుజాత చేత ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా ప్రమాణం చేయించారు. ఈ ఏడుగురి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 26కి చేరింది.

జస్టిస్‌ కొనకంటి శ్రీనివాసరెడ్డి
1966 జూన్‌ 3న జన్మించారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. అనేక కీలక కేసుల్లో వాదనలు వినిపించారు. 2019లో రాష్ట్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా నియమితులై ఇటీవలి వరకు ఆ పోస్టులో కొనసాగారు.

జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు
1967 జూలై 1న జన్మించారు. శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు,  ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎంఎల్‌ పూర్తి చేశారు. హైకోర్టులో ఆంధ్ర ప్రాంత మునిసిపాలిటీలకు, మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా స్టాండింగ్‌ కౌన్సిల్‌గా వ్యవహరించారు.

జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌
1964 మే 28న జన్మించారు. ఏసీ కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా, నాగార్జున వర్సిటీ నుంచి మాస్టర్‌ లా పొందారు. సుప్రీం కోర్టులో పలు ప్రభుత్వ రంగ సంస్థలకు న్యాయవాదిగా, రాజ్యసభ సెక్రటేరియట్, రాజ్యసభ టెలివిజన్‌కు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా ఉన్నారు. నాగాలాండ్‌ ప్రభుత్వం తరఫున కేసులు వాదించారు. 

జస్టిస్‌ తర్లాడ రాజశేఖరరావు
1967 ఆగస్టు 3న జన్మించారు. విశాఖపట్నం ఎన్‌బీఎం కాలేజీలో బీఎల్‌ చదివారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ వీవీఎస్‌ రావు న్యాయవాదిగా ఉన్న సమయంలో ఆయన వద్ద జూనియర్‌గా వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. ఆ తరువాత సొంతంగా ప్రాక్టీస్‌ చేశారు. 

జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి
1970 ఫిబ్రవరి 5న జన్మించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ చదివారు. తొలుత తాడేపల్లిగూడెంలో, 1997లో హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) స్టాండింగ్‌ కౌన్సిల్‌గా వ్యవహరించారు. 

జస్టిస్‌ రవి చీమలపాటి
1967 డిసెంబర్‌ 4న జన్మించారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ సంబంధిత కేసులు వాదించారు. పంచాయతీరాజ్‌ శాఖ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా, వివిధ ప్రభుత్వ సంస్థలకు, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు న్యాయవాదిగా వ్యవహరించారు. 

జస్టిస్‌ వడ్డిబోయన సుజాత
1966 సెప్టెంబర్‌ 10న జన్మించారు. ఎంఏ (పొలిటికల్‌ సైన్స్‌), ఎంఏ (సైకాలజీ), ఎల్‌ఎల్‌ఎం చదివారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌కు ప్యానెల్‌ అడ్వొకేట్‌గా, హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీకి న్యాయవాదిగా వ్యవహరించారు. ఇటీవలి వరకు హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా వ్యవహరించారు.

Dubao Expo 2020: రాష్ట్రంలోని ఏ జిల్లాలో కాజస్‌ ఈ మొబిలిటీ పరిశ్రమ ఏర్పాటు కానుంది?

దుబాయ్‌ ఎక్స్‌పో–-2020లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మూడు ఎంఓయూలు కుదుర్చుకుంది. వీటిలో రెండు గవర్నమెంట్‌ టూ బిజినెస్‌ (జీ2బీ), మరొకటి బిజినెస్‌ టూ బిజినెస్‌ (బీ2బీ) ఒప్పందాలు చేసుకుంది. ఇలా పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి నేతృత్వంలో అధికారుల బృందం పర్యటన దుబాయ్‌లో కొనసాగుతోంది. తాజాగా కుదిరిన ఒప్పంద వివరాలు ఇలా.. 

  • లండన్‌కు చెందిన కాజస్‌ ఈ మొబిలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థతో రూ.3 వేల కోట్ల విలువైన (జీ 2 బీ) ఒప్పందం జరిగింది. ప్రజా రవాణాకు సంబంధించి డీజిల్‌ వాహనాలను తీర్చిదిద్దే ఈ పరిశ్రమను వైఎస్సార్‌ జిల్లా జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌లో ఏర్పాటుచేయనున్నారు.
  • అలాగే, రిటైల్‌ వ్యాపారంలో గ్రాంట్‌ హైపర్‌ మార్కెట్‌ బ్రాండ్‌ పేరుతో 25 ఏళ్లుగా సత్తా చాటుతున్న రీజెన్సీ గ్రూప్‌తో కూడా ప్రభుత్వం జీ 2 బీ ఒప్పందం చేసుకుంది. రూ.150 కోట్ల విలువైన 25 రిటైల్‌ ఔట్‌లెట్‌ల ఏర్పాటుకు ఈ రీజెన్సీ గ్రూప్‌ముందుకొచ్చింది. అనంతపురం, కడప, మదనపల్లి, చిత్తూరు, నెల్లూరు, హిందూపురం, ప్రాంతాలలో పంపిణీ కేంద్రాలు, స్పైసెస్‌ అండ్‌ పల్సెస్‌ ప్యాకేజీ యూనిట్‌లు ఏర్పాటు దిశగా ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. 
  • ఇక విశాఖలోని ఫ్లూయెంట్‌ గ్రిడ్‌ అనే ఎస్సార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రూప్‌లో భాగమైన ట్రోయో జనరల్‌ ట్రేడింగ్‌ సంస్థతో బీ టూ బీ ఒప్పందం జరిగింది.

Andhra Pradesh: రాష్ట్ర నూతన డీజీపీగా నియమితులైన ఐపీఎస్‌ అధికారి?

ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌ రెడ్డి నియమితులయ్యారు. 1992 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ డీజీగా పనిచేస్తున్నారు. గతంలో విజయవాడ సీపీగా.. విశాఖ పోలీస్‌ కమిషనర్‌గా ఆయన పనిచేశారు. హైదరాబాద్‌ వెస్ట్‌జోన్‌ ఐజీగా, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా పనిచేశారు. కీలక కేసుల్లో ముఖ్య భూమిక పోషించారు. సర్వీస్‌లో జాతీయస్థాయిలో  రాజేంద్రనాథ్‌రెడ్డి గుర్తింపు పొందారు. ప్రస్తుత డీజీపీ గౌతం సవాంగ్‌ను బదిలీ చేస్తూ జీఏడీకి రిపోర్ట్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఏపీ భవన్‌ చీఫ్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా ప్రవీణ్‌ ప్రకాశ్‌
ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఢిల్లీలోని ఏపీ భవన్‌  చీఫ్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా ఆయనను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఫిబ్రవరి 14న  ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఐపీఎస్‌ అధికారి భావనా సక్సేనాను ఆ బాధ్యతల నుంచి రిలీవ్‌ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

National Statistical Office: 2022 జనవరిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఎంత శాతంగా నమోదైంది?

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) రెపో రేటు నిర్ణయానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్‌ (సీపీఐ) ద్రవ్యోల్బణం 2022, జనవరిలో ఏకంగా 6.01 శాతంగా (2021 ఇదే నెల ధరలతో పోల్చి) నమోదయ్యింది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) ఫిబ్రవరి 14న విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 2–6 శాతం శ్రేణి ఎగువ పరిమితికన్నా ఇది(6.01 శాతం) ఎక్కువ. గడచిన ఏడు నెలల్లో ఈ స్థాయి రిటైల్‌ ద్రవ్యోల్బణం (2021 జూన్‌లో 6.26 శాతం) నమోదుకావడం ఇదే తొలిసారి. 2021 జనవరిలో 4.06 శాతం నమోదైంది.

ఆర్‌బీఐ అంచానాలు ఇలా..
రిటైల్‌ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగటున 5.3 శాతంగా కొనసాగుతుందని, 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 4.5 శాతానికి దిగివస్తుందని ఆర్‌బీఐ ఇటీవల అంచనా వేసింది. కాగా, డిసెంబర్‌ 2021 ద్రవ్యోల్బణాన్ని కూడా 5.59 శాతం నుంచి ఎగువముఖంగా 5.66 శాతంగా గణాంకాల కార్యాలయం సవరించింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్‌ (సీపీఐ) ద్రవ్యోల్బణం 2022, జనవరిలో 6.01 శాతంగా నమోదైంది.
ఎప్పుడు : ఫిబ్రవరి 14
ఎవరు    : జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) 
ఎక్కడ    : భారత్‌
ఎందుకు : ముడి చమురు ధరల హెచ్చుతగ్గుల వంటి అనేక ప్రతికూల అంశాల కారణంగా..

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2022, ఫిబ్రవరి 14 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

#Tags