Daily Current Affairs in Telugu: 2022, ఫిబ్రవరి 14 కరెంట్ అఫైర్స్
ISRO: పీఎస్‌ఎల్వీ–52 రాకెట్ ప్రయోగం విజయవంతం
పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్–52(పీఎస్‌ఎల్వీ–52) రాకెట్ ప్రయోగం విజయవంతమైందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రకటించింది. ఫిబ్రవరి 14న ఉదయం 5.59కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శ్రీహరికోటలోని సతీస్ ధవన్ స్పేస్ సెంటర్ లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగం జరిగింది. పీఎస్‌ఎల్వీ–52 ప్రయోగం ద్వారా ఆర్‌ఐశాట్–1, ఐఎన్‌ఎస్–2టీడీ, ఇన్‌స్పైర్ శాట్–1తో పాటు మరో రెండు చిన్న ఉపగ్రహాలను నింగిలోకి పంపారు. 2022 ఏడాదిలో ఇస్రో నిర్వహించిన తొలి ప్రయోగం ఇదే.
కక్ష్యలో ప్రవేశపెట్టిన ఉపగ్రహాలివే..
- వ్యవసాయం, అటవీ, నీటి వనరుల సమాచారం కోసం ఆర్‌ఐశాట్–1 ఉపగ్రహం
- భారత్, భూటాన్ సంయుక్తంగా రూపొందించిన ఉపగ్రహం ఐఎన్‌ఎస్–2టీడీ
- భూమి అయానోస్పియర్ అధ్యయనం కోసం ఇన్‌స్పైర్ శాట్–1 ఉపగ్రహం
కృషి ఫలించింది: ఇస్రో చైర్మన్
పీఎస్‌ఎల్వీ–52 రాకెట్ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ తెలిపారు. దీంతో శాస్త్రవేత్తల కృషి ఫలించిందన్నారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్–52(పీఎస్‌ఎల్వీ–52) రాకెట్ ప్రయోగం విజయవంతం
ఎప్పుడు : ఫిబ్రవరి 14
ఎవరు : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)
ఎక్కడ : సతీస్ ధవన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : ఈఓఎస్–04, ఐఎన్‌ఎస్–2టీడీ, ఇన్‌స్పైర్ శాట్–1తో పాటు మరో రెండు చిన్న ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు..
Bajaj Group: స్వాతంత్య్ర సమరయోధుడు రాహుల్ బజాజ్ ఇకలేరు
ప్రముఖ పారిశ్రామికవేత్త, స్వాతంత్య్ర సమరయోధుడు, బజాజ్ గ్రూప్ మాజీ చైర్మన్ రాహుల్ బజాజ్(83) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో నెల క్రితం పుణేలోని రూబీ హాల్ క్లినిక్ హాస్పిటల్‌లో చేరిన ఆయన ఫిబ్రవరి 12న తుదిశ్వాస విడిచారు. 1938, జూన్ 10న జన్మించిన రాహుల్.. ఢిల్లీ వర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో బీఏ (ఆనర్స్), ముంబై వర్సిటీ నుంచి న్యాయ శాస్త్రంలో డిగ్రీ, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ చేశారు.
రూ.7.2 కోట్ల నుంచి రూ.12,000 కోట్లకు..
రాహుల్ బజాజ్.. తొలుత డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా బజాజ్ గ్రూప్‌లో చేరారు. తర్వాత 30 ఏళ్ల వయసులో 1968లో బజాజ్ ఆటో సీఈవో అయ్యారు. రాహుల్ నేతృత్వంలో సంస్థ వృద్ధిబాటన పయనించింది. జపాన్ మోటార్‌సైకిల్ కంపెనీల పోటీని తట్టుకుని బజాజ్ స్కూటర్లను విదేశీ గడ్డపైనా పరుగెత్తించారు. విభిన్న ఉత్పత్తులతో అంతర్జాతీయ మార్కెట్లో బజాజ్ బ్రాండ్‌ను మెరిపించారు. ఆటోమొబైల్‌తో పాటు సాధారణ, వాహన బీమా, ఇన్వెస్ట్‌మెంట్స్, కన్సూమర్ ఫైనాన్స్, గృహోపకరణాలు, ఎలక్ట్రిక్ పరికరాలు, పవన విద్యుత్, అలాయ్, స్టెయిన్‌లెస్ స్టీల్ తదితర రంగాలకు గ్రూప్ అంచెలంచెలుగా విస్తరించింది. రాహుల్ సారథ్యంలో బజాజ్ ఆటో టర్నోవర్ రూ.7.2 కోట్ల నుంచి రూ.12,000 కోట్లకు పెరిగింది.
వరల్డ్ ఎకనమిక్ ఫోరం చైర్మన్‌గా..
రాహుల్ బజాజ్.. 2005లో బజాజ్ ఆటో బాధ్యతలను కుమారుడు రాజీవ్‌కు అప్పగించారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం, ఇంటర్నేషనల్ బిజినెస్ కౌన్సిల్, ఇండియన్ ఎయిర్‌లైన్స్ చైర్మన్‌గానూ రాహుల్ పని చేశారు. 2021 ఏప్రిల్ 30 దాకా బజాజ్ ఆటో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చైర్మన్‌గా ఉన్నారు. 2001లో ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. 2006లో రాజ్యసభకు ఎంపికయ్యారు.
1926లో ప్రారంభం..
బజాజ్ గ్రూప్ 1926లో ప్రారంభమైంది. జమ్నాలాల్ బజాజ్ ఈ సంస్థను స్థాపించారు. జమ్నాలాల్ కుమారుడు కమల్‌నయన్ బజాజ్. కమల్‌నయన్ బజాజ్ కుమారుడే రాహుల్ బజాజ్.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ పారిశ్రామికవేత్త, స్వాతంత్య్ర సమరయోధుడు, బజాజ్ గ్రూప్ మాజీ చైర్మన్ కన్నుమూత
ఎప్పుడు : ఫిబ్రవరి 12
ఎవరు : రాహుల్ బజాజ్(83)
ఎక్కడ : పుణే, మహారాష్ట్ర
ఎందుకు : వృద్ధాప్య సంబంధిత, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో..
Indo-Pacific Strategy: ఏ దేశం నుంచి భారత్‌కు పెను సవాళ్లున్నాయని అమెరికా వెల్లడించింది?
ఇండో–పసిఫిక్ ప్రాంతంతో వ్యూహాత్మక భాగస్వామ్యంపై జో బైడెన్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ఫిబ్రవరి 11న తొలి నివేదికను విడుదల చేసింది. భారత్‌కు ప్రధానంగా డ్రాగన్ దేశం చైనా నుంచి పెనుసవాళ్లు ఎదురవుతున్నాయని ఈ నివేదికలో వెల్లడించింది. వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద చైనా దుందుడుకు వైఖరి భారత్‌కు ఆందోళకరంగా పరిణమిస్తోందని పేర్కొంది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలోని ప్రభావవంతమైన దేశం భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకుంటామని తెలిపింది.
నివేదికలోని ముఖ్యాంశాలు..
- దక్షిణాసియాలో అస్థిరతకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది.
- ఆరోగ్యం, అంతరిక్షం, సైబర్‌స్పేస్ తదితర కీలక రంగాల్లో అమెరికా, భారత్ పరస్పరం సహకరించుకోవాలి. ఆర్థిక, సాంకేతిక పరిజ్ఞానం విషయంలో సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి.
- ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛా వాణిజ్యానికి తలుపులు తెరవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతంలో భారత్ ప్రబలమైన శక్తిగా ఎదిగేందుకు మద్దతిస్తాము.
- దక్షిణాసియా, హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారతే పెద్దన్న.
Germany President: జర్మనీ అధ్యక్షునిగా మరోసారి ఎన్నికైన నేత?
జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్‌మెయర్ (66) మరో ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. జర్మనీ పార్లమెంటు ఫిబ్రవరి 13న ప్రత్యేకంగా సమావేశమై ఆయన్ను మరోసారి అధ్యక్షునిగా ఎన్నుకుంది. అధికార పక్షంతో పాటు అత్యధిక విపక్షాలు కూడా ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు పలికాయి. మాజీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ హయాంలో స్టెయిన్‌మెయర్ రెండుసార్లు విదేశాంగ మంత్రిగా పని చేశారు. జర్మనీలో అధ్యక్ష పదవి లాంఛనప్రాయమైనది. ప్రస్తుతం జర్మనీ చాన్సలర్‌గా ఒలాఫ్ షోల్జ్ ఉన్నారు.
రామ్‌కుమార్ రామనాథన్ ఏ క్రీడలో ప్రసిద్ధుడు?
భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని తన కెరీర్‌లో తొమ్మిదో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్ సాధించాడు. ఫిబ్రవరి 12న ముగిసిన బెంగళూరు ఓపెన్ టోర్నీలో సాకేత్–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జంట విజేతగా నిలిచింది. హుగో గ్రెనియర్–అలెగ్జాండర్ ముల్లర్ (ఫ్రాన్స్) జోడీతో జరిగిన ఫైనల్లో సాకేత్–రామ్‌కుమార్ ద్వయం 6–3, 6–2తో గెలిచింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జర్మనీ అధ్యక్షునిగా మరో ఐదేళ్ల కాలానికి ఎన్నికైన నేత?
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఎవరు : ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్‌మెయర్ (66)
ఎందుకు : అధికార పక్షంతో పాటు అత్యధిక విపక్షాలు కూడా ఫ్రాంక్ వాల్టర్ అభ్యర్థిత్వానికి మద్దతు పలకడంతో..
Institute of Cost Accountants of India: ఐసీఏఐ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి?
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) 2022–23 సంవత్సరానికిగాను నూతన అధ్యక్షుడిగా దేవశీష్ మిత్రా, ఉపాధ్యక్షులుగా అనికేత్ సునీల్ తలాటి ఎన్నికయ్యారు. వీళ్లు ఫిబ్రవరి 12న బాధ్యతలు చేపట్టారు. మిత్రా వాణిజ్య శాస్త్రంలో మాస్టర్ డిగ్రీని పూర్తి చేశారు. అకౌంటింగ్ విభాగంలో 34 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఛార్టర్డ్ అకౌంటెంట్‌గానే కాకుండా.. కాస్ట్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీగానూ ఉన్నారు. తలాటి కామర్స్‌లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. 2014–15 ఏడాదిలో అహ్మదాబాద్ బెంచ్ ఐసీఏఐ సెక్రటరీగా, 2017–18లో వెస్ట్రన్ ఇండియా రీజనల్ కౌన్సిల్‌కు సెక్రటరీగా సేవలు అందించారు. అకౌంటింగ్ విభాగానికి సంబంధించి దేశంలో మొదటి అతి పెద్ద సంస్థ అయిన ఐసీఏఐలో 3.4 లక్షల మంది సభ్యులు, ఏడు లక్షల మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ఐసీఏఐ ప్రధాన కార్యాలయం కోల్‌కతాలో ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) 2022–23 సంవత్సరానికిగాను నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి?
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఎవరు : దేవశీష్ మిత్రా
ఎక్కడ : కోల్‌కతా, పశ్చిమ బెంగాల్
National Highways Development Authority: ప్రస్తుతం ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్‌గా ఎవరు ఉన్నారు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే రానుంది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేలా చెన్నై–సూరత్ కారిడార్‌కు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) ఇటీవల ఆమోదం తెలిపింది. దేశంలో తూర్పు, పశ్చిమ పోర్టులను అనుసంధానించే ఈ 1,461 కి.మీ. కారిడార్‌లో 320 కి.మీ. ఏపీలో నిర్మించనున్నారు. మొత్తం రూ. 50 వేల కోట్ల అంచనాతో ఆమోదించిన ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి రాచబాట పడనుంది. మరోవైపు చెన్నై–విశాఖపట్నం, ముంబై–ఢిల్లీ కారిడార్‌లతో కూడా దీనిని అనుసంధానించాలని ప్రణాళిక రూపొందించడం రాష్ట్రానికి మరింత ఉపయుక్తంగా మారనుంది. ఎన్‌హెచ్‌ఏఐ ప్రధాన కార్యలయం ఢిల్లీలో ఉంది. ప్రస్తుతం దీని చైర్మన్‌గా అల్కా ఉపాధ్యాయ ఉన్నారు.
తూర్పు, పశ్చిమాలను అనుసంధానిస్తూ..
దేశంలో తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య సరుకు రవాణాలో వ్యయ, ప్రయాసలను తగ్గించేందుకు చెన్నై–సూరత్ కారిడార్‌ను నిర్మించనున్నారు. చెన్నై నుంచి మన రాష్ట్రంలోని తిరుపతి, కడప, కర్నూలు, తెలంగాణలోని మహబూబ్‌నగర్, కర్ణాటకలో కోస్గి, రాయచూర్, మహారాష్ట్రలోని షోలాపూర్, నాసిక్ మీదుగా గుజరాత్‌లోని సూరత్ వరకు ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం కానుంది. దాంతో దక్షిణాది నుంచి సూరత్‌కు 350 కి.మీ. దూరం తగ్గడంతోపాటు 6 గంటల ప్రయాణ సమయం కలసి వస్తుంది. ఈ 1,461 కి.మీ. కారిడార్‌లో తమిళనాడులో 156 కి.మీ., ఏపీలో 320 కి.మీ., తెలంగాణలో 65 కి.మీ., కర్ణాటకలో 176 కి.మీ, మహారాష్ట్రలో 483 కి.మీ., మిగిలినది గుజరాత్‌లో నిర్మించనున్నారు. డీపీఆర్ ఖరారయ్యాక ప్రాజెక్టును చేపట్టి రెండేళ్లలో పూర్తి చేయాలన్నది ఎన్‌హెచ్‌ఏఐ లక్ష్యం.
క్విక్ రివ్యూ :
ఏమిటి : చెన్నై–సూరత్ కారిడార్‌కు ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఎవరు : జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ)
ఎందుకు : దేశంలో తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య సరుకు రవాణాలో వ్యయ, ప్రయాసలను తగ్గించేందుకు..
AP-Telangana: విభజన సమస్యలపై ఏర్పాటైన కమిటీకి ఎవరు నేతృత్వం వహించనున్నారు?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు వివాదాల పరిష్కారానికి కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్ కుమార్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఉప కమిటీని ఏర్పాటు చేసింది. ఈ త్రిసభ్య కమిటీలో ఏపీ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావులకు స్థానం కల్పించింది. కమిటీ తొలి సమావేశం ఈ నెల 17వ తేదీన ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతుందని, అజెండాలో ప్రత్యేక హోదాతో పాటు మరో 8 అంశాలు ఉన్నాయని ఇరు రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ ఫిబ్రవరి 11న తెలియజేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్ కుమార్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు వివాదాల పరిష్కారానికి..
Parliamentary Standing Committee: దేశంలోని పోలీసు దళాల్లో మహిళల శాతం?
దేశవ్యాప్తంగా పోలీసు శాఖలో మహిళల ప్రాతినిధ్యం అతితక్కువగా ఉందని కేంద్ర హోంశాఖపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ నేత ఆనంద్ శర్మ నేతృత్వంలోని ఈ స్థాయీ సంఘం ఇటీవలే తన నివేదికను పార్లమెంట్‌కు సమర్పించింది. దేశంలోని మొత్తం పోలీసు దళాల్లో మహిళలు 10.3 శాతం మాత్రమే ఉన్నారని తెలియజేసింది. పూర్తిగా మహిళా పోలీసులతో దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక పోలీసు స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ పోలీసు స్టేషన్‌లో కనీసం ముగ్గురు మహిళా ఎస్‌ఐలు, 10 మంది మహిళా కానిస్టేబుళ్లు, మహిళలతో హెల్ప్‌డెస్కు ఉండాలని వెల్లడించింది. పోలీసు శాఖలో మహిళల ప్రాతినిధ్యం 33 శాతానికి పెరగాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా రోడ్‌మ్యాప్ సిద్ధం చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఖాళీ పోస్టులను పురుçషులతో భర్తీ చేస్తున్నారని సంఘం పేర్కొంది.
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్