ఆంధ్రప్రదేశ్ సామాజిక, ఆర్థిక స్వరూపం-సమీక్ష
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయింది. 2015 జూన్ 6న గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం, మందడం గ్రామ సమీపంలో రాజధాని నిర్మాణానికి భూమిపూజ చేశారు. అవస్థాపన సౌకర్యాలతో ‘అమరావతి’ పేరుతో రాజధాని నగర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.
రాష్ర్ట భౌగోళిక, జనాభా,సామాజిక, ఆర్థిక ముఖ చిత్రం
రాష్ర్ట స్థూల దేశీయోత్పత్తి
- ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట మొత్తం భౌగోళిక విస్తీర్ణం 1,62,760 చదరపు కిలోమీటర్లు. విస్తీర్ణం పరంగా దేశంలో 8వ స్థానంలో ఉంది.
- 974 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరం కలిగి ఉండి, దేశంలో పొడవైన సముద్ర తీర ప్రాంతం గల రాష్ట్రాల్లో రెండో స్థానంలో (గుజరాత్ తర్వాత) ఉంది.
- అటవీ శాఖ రికార్డుల ప్రకారం అడవుల విస్తీర్ణం 34,572 చ.కి.మీ (21.58%)
- 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ర్ట మొత్తం జనాభా 4,93,86,799. ఇందులో గ్రామీణ ప్రాంత జనాభా 3,47,76,389 (70.4%) కాగా పట్టణ ప్రాంత జనాభా 1,46,10,410 (29.6%)
- గ్రామీణ ప్రాంత జనాభా ఎక్కువ శాతం ఉన్న జిల్లా శ్రీకాకుళం (83.8%)
- పట్టణ ప్రాంత జనాభా ఎక్కువ శాతం ఉన్న జిల్లా విశాఖపట్నం (58.9%)
- 2011 లెక్కల ప్రకారం దేశ జనాభాలో 4.10% కలిగి ఉండి 10వ స్థానంలో ఉంది.
- 2001-11లో రాష్ర్ట జనాభా పెరుగుదల రేటు 9.21% మాత్రమే. ఇదే కాలంలో దేశ జనాభా పెరుగుదల రేటు 17.72%.
- 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ర్ట జన సాంద్రత 304. దేశ జనసాంద్రత 368.
- 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ర్టంలో ప్రతి 1000 మంది పురుషులకు 996 మంది స్త్రీలు ఉండగా జాతీయ స్థాయిలో ఈ నిష్పత్తి 1000:943.
- దేశ అక్షరాస్యత 73% కాగా రాష్ర్ట అక్షరాస్యత 67.35%. రాష్ర్టంలో పురుషుల అక్షరాస్యత 80.9%, స్త్రీల అక్షరాస్యత 64.6%. అక్షరాస్యత ఎక్కువ శాతం ఉన్న జిల్లా పశ్చిమగోదావరి (74.6%), తక్కువ శాతం ఉన్న జిల్లా విజయనగరం (58.9%)
- నేలల స్వభావం ప్రధానంగా మూడు రకాల (ఇసుక, ఒండ్రుమట్టి, బంకమట్టి) మిశ్రమాలను కలిగి ఉంటుంది.
- భూమి వినియోగంలో నికర సేద్యం కింద ఉన్న భూమి 62.35 లక్షల హెక్టార్లు (38.31%)
- అడవుల కింద ఉన్న భూమి 36.63 లక్షల హెక్టార్లు (22.51%)
- బీడు భూముల కింద ఉన్న భూమి 14.01 లక్షల హెక్టార్లు (8.61%)
- వ్యవసాయేతర వినియోగం కింద ఉన్న భూమి 20.02 లక్షల హెక్టార్లు (12.30%)
- వ్యవసాయానికి పనికిరాని భూమి 13.51 లక్షల హెక్టార్లు (9.97%).
రాష్ర్ట స్థూల దేశీయోత్పత్తి
- రాష్ర్ట ఆర్థిక ప్రగతిని అంచనా వేయడానికి ఉపయోగించే ప్రధాన సాధనం రాష్ర్ట స్థూల దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ). దీని ద్వారా రాష్ర్ట ఆర్థికాభివృద్ధి ఏ మేరకు, ఏ దిశలో, ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. 2011-12 ఆధార సంవత్సరంగా కేంద్ర గణాంకాల కార్యాలయం; గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ (మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ -ఎంవోఎస్‌పీఐ)తో సమానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం జీఎస్‌డీపీ అంచనాలను రూపొందించింది. దీన్ని ప్రస్తుత, ఆధార సంవత్సర ధరల్లో రూపొందిస్తారు. ఆధార సంవత్సర ధరల్లో రూపొందించడం వల్ల వాస్తవ అభివృద్ధి తెలుస్తుంది. ఇలా లెక్కించడాన్ని స్థిర ధరల్లో అంచనాలు అంటారు. దీని ద్వారా వివిధ సంవత్సరాల్లో రాష్ర్ట స్థూల దేశీయోత్పత్తిలో వచ్చే మార్పులను తెలుసుకొని అభివృద్ధి తీరుతెన్నులను పోల్చడానికి వీలవుతుంది.
- రాష్ర్టంలో 2015-16కి (ముందస్తు అంచనాలు) ప్రస్తుత ధరల్లో స్థూల రాష్ర్ట సమకూరిన విలువ(జీఎస్‌వీఏ)ను రూ. 6,03,376 కోట్లుగా అంచనా వేశారు.
- రాష్ర్టంలో 2015-16కి నిలకడ (స్థిర) ధరల్లో స్థూల రాష్ర్ట సమకూరిన విలువను రూ. 4,93,641 కోట్లుగా అంచనా వేశారు.
- రాష్ర్ట వృద్ధి రేటు 2015-16లో 10.5% కాగా జాతీయ వృద్ధి రేటు 7.3% మాత్రమే.
- 2015-16లో నిలకడ (స్థిర) ధరల్లో స్థూల రాష్ర్ట సమకూరిన విలువలో రంగాల వారీగా వృద్ధి రేట్లు.. వ్యవసాయ రంగం 8.4%, పారిశ్రామిక రంగం 11.3%, సేవల రంగం 11.39%.
- రాష్ర్ట తలసరి ఆదాయం ప్రస్తుత ధరల్లో 2014-15లో రూ.95,689 కాగా 2015-16 నాటికి రూ.1,07,532కు పెరిగి 12.38% వృద్ధి నెలకొంది.
- 2015-16లో పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం రూ.44,423 కోట్లు కాగా పన్నేతర ఆదాయం రూ.5,341 కోట్లు. కేంద్ర ప్రభుత్వం నుంచి బదిలీ అయిన నిధులు రూ. 40,104 కోట్లు. ఇందులో ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులు రూ. 30,116 కోట్లు.
- 2015-16లో రాష్ర్ట ప్రభుత్వ మొత్తం వ్యయం 1,06,425 కోట్లు కాగా ఇందులో రెవెన్యూ వ్యయం 93,521 కోట్లు.
- కొత్త రాజధాని నిర్మాణం కోసం 2014-15లో 6,520 కోట్లు కేటాయించగా 2015-16లో 12,559 కోట్లు కేటాయించారు.
- రాష్ర్టంలో ప్రజా పంపిణీలో భాగంగా 2015 నవంబర్ 30 నాటికి 28,953 చౌక దుకాణాలు పనిచేస్తున్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 24,355; పట్టణ ప్రాంతాల్లో 4,598 పనిచేస్తున్నాయి.
- ఒక్కో చౌక దుకాణానికి సగటున 450 రేషన్ కార్డులు ఉండగా సుమారు 1,725 మందికి ఒక చౌక దుకాణం ఉంది. ప్రతి 2000 మందికి ఒక చౌక దుకాణం ఉండాలనే కేంద్ర ప్రభుత్వ సూచన కంటే ఇది మెరుగైన స్థితి.
- ప్రస్తుతం 119.79 లక్షల కుటుంబాలకు కేవలం రూపాయికి 5 కిలోల బియ్యం చొప్పున ప్రతి నెలా 1.82 లక్షల టన్నులను రాష్ర్ట ప్రభుత్వం పంపిణీ చేస్తోంది.
- ఆహార ధాన్యాల కింద సాగయ్యే భూమి 2014-15లో 39.63 లక్షల హెక్టార్లు కాగా 2015-16లో 41.30 లక్షల హెక్టార్లకు పెరిగింది. వృద్ధి 4.21%.
- 2014-15లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 160.03 లక్షల టన్నులు కాగా 201516లో 137.56 లక్షల టన్నులుగా అంచనా వేశారు. అంటే ఉత్పత్తి 14.04% తగ్గింది.
- 2014-15లో పప్పు ధాన్యాల ఉత్పత్తి 9.5 లక్షల మెట్రిక్ టన్నులు కాగా 201516లో 12.65 లక్షల మెట్రిక్ టన్నులుగా అంచనా వేశారు. అంటే ఉత్పత్తి 33% పెరిగింది.
- 2014-15లో నూనెగింజల ఉత్పత్తి 5.91 లక్షల మెట్రిక్ టన్నులు కాగా 201516లో 8.69 లక్షల మెట్రిక్ టన్నులుగా అంచనా వేశారు. అంటే ఉత్పత్తి 47% పెరిగింది.
- 2012 పశు సంపద గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని 126.65 లక్షల కుటుంబాల్లో 62.54 కుటుంబాలు(49.38%) పశు సంపద, అనుబంధ కార్యకలాపాల్లో ఉన్నాయి.
- ఆంధ్రప్రదేశ్.. గుడ్ల ఉత్పత్తిలో 2వ స్థానం, మాంసం ఉత్పత్తిలో 4వ స్థానం, పాల ఉత్పత్తిలో 6వ స్థానంలో ఉంది.
- 2015-16 స్థూల రాష్ట్ర సమకూరిన విలువలో రూ.49,361 కోట్లు(8.85%) పశు సంపద ద్వారా లభిస్తుందని అంచనా.
- చేపలు, రొయ్యల ఉత్పత్తి 2005-06లో 8.14 లక్షల టన్నులు కాగా 2014-15 నాటికి 19.78 లక్షల టన్నులకు పెరిగింది.
- 2015-16లో ఉపాధ్యాయుల సంఖ్య ప్రాథమిక పాఠశాలల్లో 1,08,200 మంది. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 61,663 మంది. ఉన్నత పాఠశాల్లో 3,489 మంది ఉన్నారు.
- రాష్ట్రంలో 444 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 8 వృత్తి విద్య జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటితోపాటు 1819 ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి.
- రాష్ట్రంలో 146 డిగ్రీ కళాశాలలు, ఒక ఓరియంటల్ కళాశాల, 141 ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాలలు ఉన్నాయి.
- ప్రస్తుతం ఉన్న నీటి ప్రాజెక్టుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్.. 512.040 టీఎంసీల కృష్ణా జలాలను, 308.703 టీఎంసీల గోదావరి జలాలను వాడుకోవడానికి వీలుంది.
- 2015 డిసెంబర్ 22 నాటికి రాష్ట్రంలో రోడ్లు, భవనాల శాఖ నిర్వహణలో 46,869.60 కి.మీ పొడవైన రోడ్లున్నాయి. రాష్ట్రం ద్వారా వెళ్లే 24 జాతీయ రహదారుల పొడవు 4,913.60 కి.మీ.
#Tags