AP Grama Ward Volunteers : గ్రామ/వార్డు వలంటీర్లను తక్షణమే విధుల్లోకి.. నెలకు రూ.10 వేలు... ?
ఇటీవల రాష్ట్ర మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి వలంటీర్లను విధుల్లోకి తీసుకొనేది లేదని బహిరంగంగానే ప్రకటించిన విషయం తెల్సిందే. దీనికి నిరసనగా కొన్నివేల మంది వలంటీర్లు నిరసన వ్యక్తం చేశారు.
విశ్వాస ఘాతుకమని..
ఇచ్చిన హామిని నెరవేర్చాలని కోరుతూ.. నవంబర్ 22వ తేదీన (శుక్రవారం) రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు ధర్నా నిర్వహించారు. విశాఖ జీవీఎంసీ గాంధీపార్కులో జరిగిన కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు మణి మాట్లాడుతూ.. చంద్రబాబు చెప్పిన మాటకు పూర్తి భిన్నంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ లేదని ప్రకటించడం విశ్వాస ఘాతుకమని దుయ్యబట్టారు. తక్షణం వలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలన్నారు.
ఏపీ ప్రజా గ్రామ వార్డు వలంటీర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంధం దీప్తి మాట్లాడుతూ.. కరోనా సమయంలో ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా అప్పటి సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలకు సేవలందించామని గుర్తు చేశారు. చాలామంది కరోనా రోగుల్ని ఆస్పత్రులకు తీసుకెళ్లి, మెరుగైన వైద్యం అందించామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తమ బతుకులు నడి రోడ్డు మీదికి వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. వలంటీర్లకు న్యాయం చేయకపోతే విజయవాడలో ధర్నా చేస్తామని హెచ్చరించారు.
ప్రభుత్వం కక్షసాధింపు..
ఇచ్చిన హామీ మేరకు వార్డు, గ్రామ వలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని ఏపీ వలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జంగాల చైతన్య డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి వలంటీర్లను విధుల్లోకి తీసుకొనేది లేదని చేసిన ప్రకటనకు నిరసనగా శుక్రవారం వలంటీర్లతో కలసి చిలకలూరిపేటలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ఉన్న వలంటీర్లను కొనసాగిస్తూ వాళ్లకు ఉద్యోగ భద్రత కలిగిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంతోపాటు ఐదు నెలల బకాయిలు చెల్లించి రూ.10 వేల గౌరవవేతనం ఇచ్చేలా చర్యలు చేపట్టాలని, రాజకీయ ఒత్తిళ్లతో రాజీనామా చేసిన వలంటీర్లను కొనసాగేలా మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరారు.
మా ఉద్యోగం మాకు ఇవ్వండి.. లేదా...?
మా ఉద్యోగం మాకు ఇవ్వండి.. మాకు రాజకీయ రంగు పూయకండి..ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అదేశాలను తు.చ. తప్పకుండా పాటించడమే మా పని.. గత సర్కార్‌లోను ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చడంలో వారధిలాగానే పనిచేశాం అంటూ వలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని గుర్తుచేస్తున్నట్లు చెప్పారు.