Five Government Medical Colleges: నాడు–నేడు ద్వారా ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభం

నాడు–నేడు ద్వారా ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభం
Five Government Medical Colleges: నాడు–నేడు ద్వారా ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభం

అమరావతి: రాష్ట్రంలో కొత్తగా మరో ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు 2024–25 విద్యా సంవత్సరంలో ప్రారంభం కాను­న్నాయి. ఈ దిశగా సీఎం జగన్‌ ప్రభుత్వం చేప­ట్టిన కసరత్తు తుది దశకు చేరుకుంది. పాడేరు, పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదన­పల్లెలో కొత్తగా వైద్య కళాశాలలను ప్రారంభించి ఒక్కో చోట 150 చొప్పున 750 ఎంబీబీఎస్‌ సీట్లు అదనంగా రాబట్టేలా వైద్య శాఖ కసరత్తు చేస్తోంది. ఈమేరకు జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) త్వరలో ఐదు చోట్ల ఇన్‌స్పెక్షన్‌ నిర్వహించే అవకాశం ఉన్నట్లు వైద్య శాఖ వర్గాలు తెలిపాయి. 

తనిఖీలు పూర్తయిన అనంతరం ఆయా కళాశాలలకు అనుమతులు మంజరు కానున్నాయి. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని జిల్లాగా చేయడంతో పాటు అన్ని జిల్లాల్లో సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలను పేదలకు అందుబాటులోకి తెస్తూ 17 కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు సీఎం జగన్‌ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 2023–24లో నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, విజయనగరం వైద్య కళాశాలలను ఇప్పటికే ప్రారంభించారు. ఒక్కో చోట 150 చొప్పున మొత్తం 750 ఎంబీబీఎస్‌ సీట్లను అదనంగా అందుబాటులోకి తెచ్చారు.

Also Read : TS EAMCET 2024 Counselling Dates

ఎన్‌ఎంసీ నిబంధనలకు అనుగుణంగా
ఐదు చోట్ల ఎన్‌ఎంసీ నిబంధనలకు అనుగుణంగా వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులను అభివృద్ధి చేస్తున్నారు. వైద్య కళాశాలకు 222, బోధనాస్పత్రికి 484 చొప్పున 3,530 పోస్టులను మంజూరు చేశారు. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్, ఎస్పీఎం, జనరల్‌ మెడిసిన్, గైనిక్, పీడియాట్రిక్స్‌ విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లతో పాటు నర్సింగ్, మెడికల్, నాన్‌ మెడికల్, అడ్మినిస్ట్రేషన్‌ పోస్టులను మంజూరు చేసి భర్తీ కూడా చేపట్టారు. 

ఈ కళాశాలలన్నీ మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఉన్నందున పోస్టులన్నీ భర్తీ చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. భవిష్యత్తులో ప్రారంభించే 7 వైద్య కళాశాలలకు ఈ తరహా ఇబ్బందులు తలెత్తకుండా ఫ్యాకల్టీకి అదనపు ప్రోత్సాహకాలు కల్పించారు. పాడేరు, మార్కాపురం, పార్వతీపురం, పిడుగురాళ్ల, పెనుకొండ కాలేజీల్లో ఫ్యాకల్టీకి బేసిక్‌పై 50 శాతం ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. మైదాన ప్రాంతాల్లోని పులివెందుల, మదనపల్లె, ఆదోని, అమలాపురం, బాపట్ల, పాలకొండ, నర్సీపట్నం కళాశాలల్లో బేసిక్‌పై 30 శాతం ప్రోత్సాహకాన్ని అందించనున్నారు.  

రూ.8,480 కోట్లతో మెడికల్‌ కాలేజీలు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాడు–నేడు ద్వారా రూ.16 వేల కోట్లతో వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసింది. ఇందులో రూ.8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతేడాది ఐదు కొత్త మెడికల్‌ కాలేజీలను ప్రారంభించింది. ఈ ఏడాది మరో ఐదు ప్రారంభం కానున్నాయి. మిగిలిన ఏడు వచ్చే ఏడాది ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. ఈమేరకు ఏడు చోట్ల ప్రభుత్వాస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేసేందుకు వీలుగా పడకల సంఖ్య పెంచుతూ వైద్య శాఖ నిర్ణయం తీసుకుంది.  

#Tags