AP EAPCET 2024 Counselling: మొదటి దశ సీట్ల కేటాయింపులో 1,17,136 ఇంజనీరింగ్‌ సీట్లు భర్తీ!

సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశా­లకు నిర్వహించిన ఏపీఈఏపీ సెట్‌–2024 కౌన్సెలింగ్‌లో తొలివిడత సీట్ల కేటాయింపును పూర్తి చేసినట్లు సాంకేతిక విద్యాశాఖ సంచాలకులు, ప్రవేశాల కన్వీనర్‌ డాక్టర్‌ బి.నవ్య బుధవారం తెలిపారు.

విద్యార్థులు ఈ నెల 22 లోపు కళాశాలల్లో రిపోర్టు చేయాలని సూచించారు. అయితే ఈ నెల 19 నుంచే తరగతులు ప్రారంభమ­వుతాయన్నారు. ఏపీఈ ఏపీసెట్‌లో అర్హత సాధించిన 1,86,031 మందిలో తొలి విడత కౌన్సెలింగ్‌ కోసం 1,28,619 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని చెప్పారు. ధ్రువపత్రాల తనిఖీ అనంతరం 1,28,065 మంది అర్హత సాధించారన్నారు.

మొత్తం 245 ఇంజనీరింగ్‌ కళాశాలల్లో 1,36,660 సీట్లు ఉండగా, 1,17,136 సీట్లు భర్తీ అయ్యాయని, మిగిలిన 19,524 సీట్లను రెండో విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తామన్నారు. ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌ కోటాలకు సంబంధించి మెరిట్‌ జాబితా రానందున ఈ సీట్లను చివరిగా భర్తీ చేస్తామని వివరించారు.