Free training in software courses: సాఫ్ట్‌వేర్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ

Free training in software courses

యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పంచడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా జిల్లాలో మొత్తం 8 స్కిల్‌ హబ్‌లు, 2 స్కిల్‌ కాలేజీలను ఏర్పాటు చేసింది. తక్కువ విద్యార్హతలు ఉన్నవారితో పాటు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు రాని వారికి సైతం శిక్షణ అందిస్తోంది.

జూనియర్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌, డొమెస్టిక్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌, అకౌంట్స్‌ ఎగ్జిక్యూటివ్‌, కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌, అసిస్టెంట్‌ ఎలక్ట్రీషియన్‌, ప్లంబర్‌ జనరల్‌,.. తదితర కోర్సుల్లో యువతకు శిక్షణ ఇప్పిస్తోంది. ఒక్కో హబ్‌ లో ఏడాదికి నాలుగు బ్యాచ్‌ల చొప్పున శిక్షణ ఇచ్చి, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ప్రతి బ్యాచ్‌లో 30 మంది చొప్పున 120 మంది శిక్షణ పొందుతున్నారు.

ఒక్కో హబ్‌లో రెండు రకాలుగా కనిష్టంగా 45 రోజులు గరిష్టంగా 3 నెలల పాటు శిక్షణ ఇస్తారు. ఇక్కడ శిక్షణ పొందిన వారు దేశ వ్యాప్తంగా వివిద కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ నాలుగున్నరేళ్లలో 2019 నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో మొత్తం 106 జాబ్‌ మేళాలు నిర్వహించారు. మొత్తం 14,296 మంది యువత హాజరయ్యారు. అందులో 10,173 మంది ఉద్యోగాలు పొందినట్లు డీఆర్‌డీఏ వెల్లడిస్తున్నారు.

వివిధ కోర్సుల్లో శిక్షణ

డీఆర్‌డీఏ–వైకేపీ అధ్వర్యంలో ప్రత్యేకంగా ఛిత్తూరు, తిరుపతిలలో రెండు స్కిల్‌ కాలేజీలు నడుస్తున్నాయి. ఛిత్తూరులోని టీటీడీసీలో, తిరుపతిలోని జూపార్క్‌ సమీపంలో స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ అప్లైడ్‌ న్యూట్రీషియన్‌లో స్కిల్‌ కాలేజీలు ఉన్నాయి.

తిరుపతిలో కిచెన్‌ సూపర్‌వైజర్‌, రెస్టారెంట్‌ కెప్టెన్‌ కోర్సులకు సంబంధించి ఉపాధితో కూడిన ఉచిత శిక్షణ అందిస్తున్నారు. చిత్తూరు టీటీడీసీలోని స్కిల్‌ కాలేజీలో అపోలో మెడ్‌ స్కిల్స్‌ సహకారంతో పేషెంట్‌ రిలేషన్‌ ఎగ్జిక్యూటివ్‌, పేషెంట్‌ రిలేషన్‌ డ్యూటీ మేనేజర్‌, రిటైల్‌ సేల్స్‌ సూపర్‌వైజర్‌ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ సమయంలో అభ్యర్ధులకు ఉచిత భోజన, వసతి సదుపాయాలతో పాటు స్టడీ మెటీరియల్‌, యూనిఫామ్‌ అందిస్తున్నారు.

#Tags