Entrance Test: 5వ తరగతి ప్రవేశాలు.. పరీక్ష తేదీ ఇదే..

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: సాంఘిక సంక్షేమ గురుకులాల్లో వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నెల 11న 5వ తరగతి ప్రవేశాలకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్‌ వాణిశ్రీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 10 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, పరీక్షకు 3,771 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు హాల్‌టికెట్‌ ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని పరీక్షకు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

పాలమూరును ప్రథమ స్థానంలో నిలుపుదాం
హన్వాడ: వచ్చే పదో తరగతి ఫలితాల్లో పాలమూరు జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపుదామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మండలంలోని వేపూర్‌లో జరిగిన విద్యాయాత్రలో భాగంగా 2డీ, 3డీ డిజిటల్‌ కంటెంట్‌ స్టడీ మెటీరీయల్‌ను ఆవిష్కరించారు. అనంతరం హన్వాడ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన బోరు మోటారును డీఈఓ రవీందర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ పాఠశాలలో వసతులు కల్పించడం తమవంతు అని, సక్రమంగా విద్యా బోధన చేయడం ఉపాధ్యాయుల బాధ్యత అన్నారు. డిజిటల్‌ కంటెంట్‌ స్టడీ మెటీరియల్‌ క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ఎలా వినియోగిస్తారో విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఎమ్మెల్యే వివరించారు. పదో తరగతి చదువే.. భవిష్యత్‌కు పునాది వేస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రతి విద్యార్థి పుస్తకాలతోపాటు వార్తాపత్రికలు చదివే అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్రధానంగా హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో సైతం ప్రావీణ్యం సంపాదించుకోవాలని, అప్పుడే ఎక్కడికి వెళ్లినా రాణించగలమన్నారు. త్వరలో ప్రభు త్వం మెగా డీఎస్సీ ద్వారా టీచర్‌ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టనుందని చెప్పారు. కార్యక్రమంలో సీఎంఈ బాలుయాదవ్‌, ఎంపీపీ బాలరాజు, ఎంఈఓ రాజునాయక్‌, ఎంపీటీసీ సభ్యు డు వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.
 

#Tags