AICTE: ఏఐసీటీఈ పరిధిలోకి ఆ కోర్సులు తీసుకురావొద్దు
రాజానగరం: ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) పరిధిలోకి బీబీఏ, బీసీఏ, బీహెచ్‌ఎం డిగ్రీ కోర్సులు రాకుండా చూడాలని ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య కె.పద్మరాజును యూనివర్సిటీ ఎఫిలేటెడ్ కాలేజ్ మెనేజ్‌మెంట్ అసోసియేషన్ సభ్యులు కోరారు.
యూనివర్సిటీలో మంగళవారం సమావేశమైన అసోసియేషన్ సభ్యులు ఈ విషయమై చర్చించారు. పై కోర్సులను ఏఐసీటీఈ పరిధిలోకి తీసుకురావాలనుకోవడాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. అనంతరం వీసీని కలుసుకుని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీనివల్ల రాబోయే రోజులలో డిగ్రీ కాలేజీల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని, యూనివర్సిటీలు కూడా తమ సార్వభౌమాధికారాన్ని కోల్పోతాయన్నారు. వీసీని కలిసిన వారిలో అసోసియేషన్ రాష్ట్ర సభ్యులు గంధం నారాయణరావు, యూనివర్సిటీ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి, అధ్యక్షులు కేవీఆర్‌ఎన్ నరసింహరావు, మల్లిడి అనంతరెడ్డి, సాంబశివరావు, గంగిరెడ్డి, సత్యనారాయణ, గణేష్ చౌదరి, బర్ల సత్యనారాయణ ఉన్నారు.
#Tags