62 DSPs Transferred Across The State- భారీగా డీఎస్పీల బదిలీలు..హాట్‌ టాపిక్‌గా మారిన వరుస ఉత్తర్వులు

సాక్షి, హైదరాబాద్‌:తెలంగాణలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతూనే ఉంది.ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు వివిధ శాఖల్లోని పలువురు అధికారులను ట్రాన్స్‌ఫర్ చేయగా.. తాజాగా పోలీసు శాఖలో మరోసారి పెద్ద ఎత్తున బదిలీలు జరిగాయి. ఫిబ్రవరి 18న 62 మంది డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది.

వరుస బదిలీలు
అయితే సివిల్‌ డీఎస్పీల పోస్టింగ్‌లు మారుస్తూ జరిగిన వరుస బదిలీలు మాత్రం చర్చనీయాంశమయ్యాయి. ఈ నెల 12న ఏకంగా 110 మంది సివిల్‌ డీఎస్పీలు, 14వ తేదీన మరో 95మంది, 15న మరో 26 మంది సివిల్‌ డీఎస్పీలను బదిలీ చేశారు.


ఆ తర్వాత ఈనెల 17న వెల్లడైన ఉత్తర్వుల్లోనూ మరో 62 మంది సివిల్‌ డీఎస్పీలను బదిలీ చేశారు. ప్రతిశాఖలోనూ బదిలీల ప్రక్రియ అత్యంత సహజమే అయినా, ఒకసారి ఇచ్చిన పోస్టింగ్‌ మారుస్తూ...లేదంటే అప్పటికే ట్రాన్స్‌ఫర్‌ చేసిన వారిని తిరిగి అక్కడే కొనసాగి స్తున్నట్టు పేర్కొంటూ వరుస ఉత్తర్వులు వెలువడుతుండటం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. 

‘పట్టు’నిలుపుకుని.. ‘అనుకూల’పోస్టింగ్‌లు 
కొందరు అధికారులు బదిలీ అయినా తమ ‘పట్టు’నిలుపుకొని తిరిగి అదే స్థానాల్లో కొనసాగుతున్నారు. మరికొందరు బదిలీ అయిన స్థానంలో చేరకముందే రోజుల వ్యవధిలోనే ‘అనుకూల’పోస్టింగ్‌లు తెచ్చుకుంటున్నారన్న ప్రచా రం జరుగుతోంది.

ఒకే సారి పెద్ద సంఖ్యలో బదిలీ జరిగినప్పుడు కొద్దిమేర పోస్టింగ్‌ల్లో మార్పులు సహజమే కానీ గత మూడు రోజుల్లో విడుదల చేసిన పోస్టింగ్‌ ఉత్తర్వులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని పోలీసు వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. 

ఎప్పుడు ఎక్కడికో అనే ఆందోళనలో కొందరు 
ఒక రోజు వచ్చిన ఆర్డర్‌ కాపీలో ఉన్న పోస్టింగ్‌లు ఆ తర్వాతి బదిలీ ఉత్తర్వులు వచ్చే సరికి మారిపోతుండడం కొంతమందిని మాత్రం కలవరానికి గురి చేస్తోంది. ఎప్పుడు ఎక్కడికి బదిలీ అవుతామో..అక్కడి నుంచి మళ్లీ ఎక్కడికి మారుస్తున్నారో అన్న గందరగోళం నెలకొందని కొందరు అధికారులు వాపోతున్నారు.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగిన వారికే మళ్లీ కీలకస్థానాల్లో పోస్టింగ్‌లు దక్కుతున్నాయన్న చర్చ జరుగుతోంది. ‘పోలీసులపై రాజకీయ పెత్తనం ఉండబోదు’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల ఐపీఎస్‌ ఆఫీసర్ల గెట్‌ టు గెదర్‌లో చెప్పినా, వాస్తవ పరిస్థితి మాత్రం అలా లేదని కొందరు వాపోతున్నారు.

#Tags