Teaching & Non-Teaching Staff: ప్రైవేటు స్కూళ్ల సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం కృషి.. ఆన్‌లైన్‌లో వేతనాల చెల్లింపు..
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఉద్యోగ భద్రత, ఆర్థిక ప్రయోజనాలు, సదుపాయాలను వర్తింపజేసేందుకు పటిష్ట చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని అన్–ఎయిడెడ్ (ప్రైవేటు) పాఠశాలల యాజమాన్య ప్రతినిధులతో ఇటీవల విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ నిర్వహించిన సమావేశంలో తీసుకున్న విధాన నిర్ణయాలపై ఈనెల 22న విద్యాశాఖ సమగ్ర ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న నిబంధనలు ఇకపై ప్రైవేటు పాఠశాలల్లోనూ తప్పకుండా అమలు చేయాల్సి ఉంది. అకడమిక్ క్యాలండర్‌ను విధిగా పాటించాలి.
16 వేల మందికి ప్రయోజనం
ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి ప్రతినెలా వేతనాలను బ్యాంకు ఖాతాల ద్వారా ఆన్‌లైన్‌లోనే చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,200 ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 16 వేల మంది బోధన, బోధనేతర సిబ్బంది పని చేస్తున్నారు. కార్పొరేట్ పాఠశాలలు ఆన్‌లైన్‌లోనే వేతనాలు చెల్లిస్తుండగా, చిన్నతరహా కాన్వెంట్లు, బడ్జెట్ పాఠశాలలు నగదు రూపంలోనే చెల్లిస్తున్నాయి. ఈ పద్ధతికి ప్రభుత్వం స్వస్తి పలికింది. దీనివల్ల అన్ని ప్రైవేటు పాఠశాలలు సిబ్బంది సంఖ్య, వేతన వివరాలపై ప్రభుత్వానికి కచ్చితమైన వివరాలు ఇచ్చే ఆస్కారముంది. దీంతోపాటు పీఎఫ్, ఈఎస్‌ఐ కల్పించాలని సర్కారు స్పష్టం చేసింది. ఆరోగ్య బీమా వర్తింపునకూ ఆదేశాలిచ్చింది. ముందస్తు సమాచారం లేకుండా ఉద్యోగం నుంచి తొలగించేందుకు అవకాశం లేకుండా చర్యలు చేపట్టింది. క్యాజువల్ లీవ్‌లనూ వర్తింపజేయాలని స్పష్టం చేసింది. విధి నిర్వహణలో ప్రమాదాల బారిన పడిన సిబ్బందికి యాజమాన్యం నష్ట పరిహారాన్ని చెల్లించాలని ఉత్తర్వులిచ్చింది. ఈ నిర్ణయాలను అమలు పర్చే బాధ్యతను ఆర్జేడీ, డీఈఓలకు అప్పగించింది.
గతంలోనే వినతులు
ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న వారికి పీఎఫ్, ఈఎస్‌ఐ, ఆరోగ్య బీమా వర్తింపజేయాలని బోధన, బోధనేతర సిబ్బంది గతంలో పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించారు. దీనిపై సమగ్ర అధ్యయనం చేసిన ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాలపై ప్రైవేటు పాఠశాలల సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ (అప్సా), ఏపీ అన్–ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (అపుస్మా) ప్రతినిధులు స్వాగతిస్తున్నారు.
ప్రైవేటు స్కూళ్ల సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం కృషి ఆన్‌లైన్‌లో వేతనాల చెల్లింపు, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు నిబంధనల మేరకు సెలవులు, ఆరోగ్య బీమా వర్తింపునకు నిర్ణయం ఇటీవల యాజమాన్య సంఘాల సమావేశంలో స్పష్టీకరణ హర్షం వ్యక్తం చేస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయులు స్వాగతిస్తున్న యాజమాన్యాలు స్వాగతిస్తున్నాం
ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది సంక్షేమం దిశగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నాం. ఆన్‌లైన్‌లో వేతనాల చెల్లింపు వల్ల అకౌంటబిలిటీ పెరుగుతుంది. ఖర్చుపై సమగ్ర వివరాలు ఉంటాయి.
– కన్న మాస్టారు, అపుస్మా గుంటూరు నగర అధ్యక్షుడు
ఉపాధ్యాయుల సంక్షేమానికి చర్యలు
ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేస్తాం. సిబ్బంది సంక్షేమానికి చర్యలు చేపడతాం. ఇప్పటికే పలు పాఠశాలల్లో ఉన్న పీఎఫ్, ఈఎస్‌ఐ విధానాన్ని అన్ని పాఠశాలలకు వర్తింపజేస్తాం. ఆన్‌లైన్‌లో వేతన చెల్లింపులతోపాటు సెలవులను అమలు చేస్తాం.
– మేకల రవీంద్రబాబు, అప్సా రాష్ట్ర కోశాధికారి